Skip to main content

NEET UG Notification 2025 : నీట్ యూజీ-2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ఈ సారి చేసిన కీల‌క మార్పులు ఇవే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ యూజీ (NEET UG 2025) పరీక్షకు నోటిఫికేషన్‌ను విడుద‌ల చేశారు.
NEET UG Notification 2025

ఈ నీట్‌ యూజీ పరీక్షకు అర్హులైన విద్యార్థులు మార్చి 7వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 4వ తేదీన నీట్ యూజీ పరీక్షను నిర్వహించ‌నున్నారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు తో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో ఒకే షిఫ్టులో ఈ పరీక్ష జరగనుంది.

నీట్‌ యూజీ పరీక్ష విధానంలో కీల‌క మార్పులు ఇవే...
నేషనల్‌ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) యూజీ పరీక్ష విధానంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక మార్పులు చేసింది. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన... ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానంతో పాటు అదనపు సమయం కేటాయింపునకు ఎన్టీఏ స్వస్తి పలికింది. నీట్‌ యూ­జీ–2025 పరీక్ష 180 ప్రశ్నలతోనే ఉంటుందని ఒక ప్రకటనలో ఎన్టీఏ వెల్లడించింది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 45 చొప్పున, బయాలజీ(బోటనీ, జువాలజీ)లో 90 ప్రశ్నలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ 180 ప్రశ్నలకు విద్యార్థులు 180(మూడు గంటలు) నిమిషాల్లో జవాబులు రాయాల్సి ఉంటుంది. 

ఎన్టీఏ తాజా నిర్ణయంతో ఇకపై..
2021–22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన నీట్‌లో ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్ట్‌నూ సెక్షన్‌–ఏ, బీ అని రెండు భాగాలుగా విభజించారు. సెక్షన్‌–ఏలోని అన్ని ప్రశ్నలకు... బీలో 15కు గాను 10 ప్రశ్నలకు జవాబులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు. దీంతో 200 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉండేది. అదనంగా 20 ప్రశ్నలను చేర్చడంతో విద్యార్థులకు 20 నిమిషాల అదనపు సమయం కూడా ఇచ్చారు. ఎన్టీఏ తాజా నిర్ణయంతో ఇకపై సెక్షన్‌–బీ విధానం ఉండదు. అదనంగా 20 ప్రశ్నలను ప్రవేశపెట్టడంతో విద్యార్థులు 200 ప్రశ్నలు చదివి... సరైన వాటిని గుర్తించాల్సి వచ్చేది. ఈ విధానం నష్టాన్ని కూడా కలగజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Published date : 11 Feb 2025 08:57AM

Photo Stories