Skip to main content

NEET PG Merit List: నీట్‌ పీజీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. మెరిట్‌ లిస్ట్ కోసం క్లిక్ చేయండి

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ జాప్యం తరువాత ఎట్టకేలకు నీట్‌ పీజీ అడ్మిషన్లకు రాష్ట్ర మెరిట్‌ జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది.
NEET PG Merit List

హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని తెలంగాణలో ఎంబీబీఎస్‌ చేసిన స్థానికేతరులను ‘లోకల్‌ ఏరియా’కింద పరిగణిస్తూ 3,314 మందిని పీజీ కౌన్సెలింగ్‌కు అర్హులుగా ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 281 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పీజీ అడ్మిషన్లకు అర్హులుగా యూనివర్సిటీ తెలిపింది. అదే సమయంలో తక్కువ పర్సంటైల్‌తో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన 30 మంది విదార్థులను కౌన్సెలింగ్‌కు అనర్హులుగా ప్రకటించింది.

ఈ మెరిట్‌ జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే శనివారం (28వ తేదీ) సాయంత్రం 4 గంటలలోపు ‘ knrpgadmissions@gmail.com’ మెయిల్‌ ఐడీకి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులకు బలం చేకూర్చే పత్రాలను కూడా అదేరోజు సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదులు పరిశీలించిన తరువాత తుది మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటించనున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.  

చదవండి: Medical Courses Admissions : ఎంబీబీఎస్‌, బీడీఎస్, బీఎస్సీ ప్ర‌వేశాల‌కు మ‌రో అవ‌కాశం.. ఎలా అంటే...?

స్థానికత వివాదంతో ఆలస్యం 

నీట్‌ పీజీ అడ్మిషన్లలో తెలంగాణ విద్యార్థులకే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్‌ నిబంధనల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గత పదేళ్లుగా స్థానికేతరులకు కొనసాగిన 15 శాతం నాన్‌ లోకల్‌ కోటాను తొలగించడంతో పాటు స్థానికతకు సంబంధించి కొన్ని నిబంధనలను జతచేస్తూ అక్టోబర్‌ 28న జీవో 148, 149లను తీసుకొచ్చింది.

రాష్ట్రంలో మెడికల్‌ పీజీ అడ్మిషన్‌ పొందాలంటే ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సులు తప్పనిసరిగా తెలంగాణలో చదవి ఉండాలని, అలాగే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తెలంగాణలో చదివినవారే అర్హులు అయ్యే విధంగా నిబంధనలు చేర్చింది. వీటిని సవాల్‌ చేస్తూ 94 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా పడింది. డిసెంబ‌ర్ 17న హైకోర్టు ఈ వివాదంపై తీర్పునిస్తూ 148, 149 జీఓలను కొట్టి వేసింది.

మెరిట్‌ లిస్ట్ కోసం: https://www.knruhs.telangana.gov.in/all-notifications/

ప్రెసిడెన్షియల్‌ రూల్స్‌–1974 ప్రకారం ఎంబీబీఎస్‌ తెలంగాణలో చదివిన వారంతా పీజీ అడ్మిషన్లలో లోకల్‌ కోటా కింద అర్హులేనని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో మెరిట్‌ జాబితాను ప్రకటించలేదు. ఈలోపు జాతీయ స్థాయిలో నీట్‌ ప్రవేశాల ప్రక్రియ రెండు రౌండ్లు ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వచ్చే నెల 7వ తేదీన వాదనలు జరిగే అవకాశం ఉండడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. యూనివర్సిటీ తాత్సారంపై విమర్శలు వెల్లువెత్తాయి.  

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే.. 

నీట్‌ పీజీ మెరిట్‌ లిస్టు ఆలస్యంతో జాతీయస్థాయి ప్రవేశాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఐఎంఏతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే వర్సిటీ నీట్‌ పీజీ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. దీంతో ఎంసీసీ ద్వారా జాతీయస్థాయిలోని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉన్న ర్యాంకర్లు దరఖాస్తు చేసేందుకు వెసులుబాటు లభించింది. ఇప్పటికే ఎంసీసీ అడ్మిషన్లకు మూడో రౌండ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

తెలంగాణ స్టేట్‌ మెరిట్‌ లిస్టు ద్వారా జాతీయ స్థాయి కళాశాలల్లో ప్రవేశాలు పొందేవారికి ఇది ఉపయోగపడనుంది. కాగా, తెలంగాణలోని ప్రభుత్వ పీజీ మెడికల్‌ కళాశాలల్లో 2,708 పీజీ వైద్య విద్య సీట్లు ఉన్నట్లు జాతీయ వైద్య మండలి ఇటీవల వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 1,500 వరకు ఉన్నాయి. ఇందులో సగం సీట్లు సెంట్రల్‌ పూల్‌కు వెళితే మిగిలే సీట్ల కోసం తెలంగాణలో ఎంబీబీఎస్‌ చేసిన విద్యార్థులు పోటీ పడాల్సి ఉంటుంది.  

సుప్రీం తీర్పును అనుసరించే ప్రవేశాల ప్రక్రియ  
నీట్‌ పీజీ అడ్మిషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మెరిట్‌ లిస్టు విడుదల చేశాం. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత తదనుగుణంగా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తాం. శనివారం సాయంత్రం 4 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించి, తరువాత తుది మెరిట్‌ లిస్ట్‌ ప్రకటిస్తాం.  
– కరుణాకర్‌ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వీసీ   

Published date : 28 Dec 2024 12:00PM

Photo Stories