NEET UG 2024 Notification: నీట్ యూజీ-2024 పరీక్ష వివరాలు.. సిలబస్ మార్పులు, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- నీట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- మే 5న దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహణ
- సిలబస్‌లో పలు మార్పులు
ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో కొత్త సిలబస్
నీట్ యూజీ కొత్త సిలబస్‌ను ఎన్‌టీఏ, నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. తాజా సిలబస్‌ను పరిశీలిస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి మొత్తం 18 చాప్టర్లను తొలగించారు. అదే విధంగా.. కొన్ని అంశాలను జోడించారు. విద్యార్థులు ఈ మార్పులను గుర్తించి.. మారిన సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ర్యాంకుల నిర్ధారణలోనూ మార్పులు
ఎన్‌టీఏ.. నీట్-యూజీ ర్యాంకుల నిర్ధారణ విధానంలోనూ ఈ ఏడాది మార్పులు చేసింది. ముఖ్యంగా ఇద్దరు అభ్యర్థులకు ఒకే స్కోర్ వచ్చిన సందర్భంలో ఆ ఇద్దరిలో టాపర్‌ను గుర్తించడానికి అనుసరించే ఫార్ములాలో మార్పులు చేసింది. మొదట బయాలజీలో ఎక్కువ మార్కులు పొందిన వారిని టాపర్‌గా గుర్తిస్తారు. ఇక్కడ కూడా టై ఏర్పడితే.. తర్వాత వరుసగా కెమిస్ట్రీలో, అనంతరం ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థిని గుర్తించి.. ఇద్దరిలో ఒకరికి టాప్ స్కోర్ ఇస్తారు.
చదవండి: NEET UG 2024 Notification: నీట్ యూజీ-2024 పరీక్షకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేది ఇదే
మే 5న పరీక్ష
నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్నారు. అంటే..ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక.. నీట్ పరీక్ష తేదీకి నెల రోజులకు పైగా సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పూర్తిగా నీట్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఈ ఏడాది నీట్ నిర్వహణకు పరీక్ష కేంద్రాలను కూడా పెంచారు. గత ఏడాది 499 సెంటర్లలోనే పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్యను 554కు పెంచారు. దీనివల్ల విద్యార్థులకు సమీప ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాల కేటాయింపునకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పరీక్ష స్వరూపం
నీట్-యూజీ పరీక్షను నాలుగు సబ్జెక్ట్‌లలో మొత్తం 720 మార్కులకు నిర్వహిస్తారు. ఫిజిక్స్‌లో.. సెక్షన్ ఏ 35 ప్రశ్నలు-140 మార్కులు, సెక్షన్ బీ 15 ప్రశ్నలు-40 మార్కులు; కెమిస్ట్రీలో.. సెక్షన్ ఏ 35 ప్రశ్నలు-140 మార్కులు, సెక్షన్ బీ 15 ప్రశ్నలు-40 మార్కులు; బోటనీలో.. సెక్షన్ ఏ 35 ప్రశ్నలు-140 మార్కులు, సెక్షన్ బీ 15 ప్రశ్నలు-40 మార్కులు; జువాలజీలో.. సెక్షన్ ఏ 35 ప్రశ్నలు-140 మార్కులు, సెక్షన్ బీ 15 ప్రశ్నలు-40 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పెన్ పేపర్ విధానంలో ఓఎంఆర్ షీట్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ప్రతి సబ్జెక్ట్‌లోనూ సెక్షన్-బిలోని 15 ప్రశ్నలకు గాను పది ప్రశ్నలకు సమాధానాలిస్తే సరిపోతుంది. పరీక్షకు అందుబాటులో ఉండే సమయం మూడు గంటల ఇరవై నిమిషాలు.
ప్రతి సబ్జెక్ట్‌లో 130 టార్గెట్
నీట్‌లో మంచి స్కోర్ సాధించి.. మెడికల్ సీటు సొంతం చేసుకునేందుకు విద్యార్థులు.. ప్రతి సబ్జెక్ట్‌లోనూ 180 మార్కులకు గాను కనీసం 130 మార్కులు సాధించేలా కృషి చేయాలి. మొత్తంగా 720 మార్కులకు గాను 450 మార్కుల నుంచి 500 మార్కులు స్కోర్ చేసేలా ప్రిపరేషన్ సాగిస్తే..డాక్టర్ కల సాకారం చేసుకోవచ్చు.
రివిజన్‌కు ప్రాధాన్యం
నీట్‌కు ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షలు పూర్తయిన తర్వాత వీలైనంత మేరకు రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి.
షార్ట్ నోట్స్ కీలకం
ప్రిపరేషన్ సమయంలోనే విద్యార్థులు షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఈ షార్ట్ నోట్స్‌లో.. కీలక భావనలు, కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు ఉండేలా చూసుకుంటే.. వేగంగా పునశ్చరణ చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఆయా అంశాలకు సంబంధించి ప్రశ్నలు చదువుతున్నప్పుడు వెంటనే రెడీ రెకనర్‌గా షార్ట్ నోట్స్‌ను వినియోగించుకోవచ్చు.
మాక్ టెస్ట్‌లు
అభ్యర్థులకు ఉపకరించే మరో వ్యూహం..మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం. ప్రతి రోజు మోడల్ టెస్ట్‌లు రాయడం, అదే విధంగా వారానికి ఒక మాక్ టెస్ట్‌కు హాజరు కావడం వంటి వ్యూహాలు అనుసరించాలి. ఫలితంగా.. డైరెక్ట్ కొశ్చన్స్∙ఎక్కువగా అడుగుతున్న నీట్‌లో మంచి స్కోర్ సాధించే ఆస్కారం లభిస్తుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి 9
- నీట్ తేదీ: 2024, మే 5 (మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 వరకు)
- ఫలితాల వెల్లడి: 2024, జూన్ 14
- వెబ్‌సైట్: https://neet.ntaonline.in/, https://exams.nta.ac.in/NEET
సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్ ఇలా
ప్రాక్టీస్‌తో ఫిజిక్స్‌లో స్కోర్
నీట్ అభ్యర్థులు ఫిజిక్స్ విషయంలో ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
కెమిస్ట్రీ.. కాన్సెప్ట్స్, రివిజన్
నీట్‌లో విద్యార్థులు సులభంగా భావించే సబ్జెక్ట్.. కెమిస్ట్రీ. ఇందులో స్కోర్ కోసం.. కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీలకు కొంత వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి నిరంతరం పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి.
బోటనీ
బోటనీకి సంబంధించి ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాప్యులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన (సమవిభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయో మాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీ ప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టిపెట్టాలి.
జువాలజీ
జువాలజీ సబ్జెక్ట్‌లో రాణించేందుకు విద్యార్థులు హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనెటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతో పాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. అదేవిధంగా.. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదివితే ఉపయుక్తంగా ఉంటుంది.
Tags
- NEET UG 2024 Notification
- NEET UG 2024
- NTA NEET UG 2024 Exam Date
- MBBS Courses
- Medical courses
- NEET UG Preparation Tips
- NEET UG 2024 Exam Details
- neet ug 2024 syllabus change
- New Syllabus
- NEET UG New Syllabus
- National Medical Commission
- National Testing Agency
- Mock Tests
- NEET Mock Tests
- Careers
- Education News
- latest notifications
- Sakshi Bhavitha
- NEET-UG Updates
- Competitive Exams
- sakshieducation notifications