Skip to main content

‘NEET’గా.. నెగ్గేద్దాం ఇలా.. సబ్జెక్ట్‌ వారీగా ప్రిపరేషన్‌ ఇలా..

నీట్‌–యూజీ.. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–అండర్‌ గ్రాడ్యుయేట్‌! ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష!! ఇందులో ఉత్తమ ర్యాంకుతో రాష్ట్ర స్థాయిలో.. అదే విధంగా జాతీయ స్థాయిలో వైద్య సీట్ల కోసం పోటీ పడే అవకాశం లభిస్తుంది. దీంతో ఈ ఎంట్రన్స్‌లో మంచి మార్కుల కోసం ఇంటర్మీడియెట్‌ బైపీసీ విద్యార్థులు తీవ్రంగా కృషి చేస్తుంటారు. పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ.. తాజాగా నీట్‌–యూజీ–2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. నీట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
NEET 2025 Preparation Tips   Benefits of NEET  Subject-wise Preparation Tips

దేశంలోని అన్ని మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశానికి నీట్‌–యూజీ స్కోర్‌ను∙ప్రామాణికంగా పరిగణిస్తుండడంతో ఈ పరీక్షకు ఏటేటా పోటీ పెరుగుతోంది. ఆల్‌ ఇండియా కోటా పేరిట దేశంలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో 15 శాతం సీట్లను, రాష్ట్రాల స్థాయిలో హెల్త్‌ యూనివర్సిటీల పరిధిలోని సీట్లను, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేట్‌ వర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో నీట్‌ స్కోర్‌ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు. అదే విధంగా ఆయుష్‌ కోర్సులుగా పిలిచే బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్‌ తదితర కోర్సులకు కూడా నీట్‌ స్కోర్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు.

ఛాయిస్‌ తొలగింపు

నీట్‌–యూజీ–2025 పరీక్ష మళ్లీ పాత విధానంలోనే నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. కోవిడ్‌ కారణంగా 2021 నుంచి గత ఏడాది వరకు పార్ట్‌–ఎ, పార్ట్‌–బిలుగా పరీక్ష నిర్వహించారు. తాజాగా పార్ట్‌–బిలో కల్పించిన ఛాయిస్‌ విధానాన్ని తొలగించారు. అంటే అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. అదే విధంగా పరీక్షను పెన్‌–పేపర్‌ విధానంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

అర్హత

ఇంటర్మీడియెట్‌ బైపీసీ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

720 మార్కులకు పరీక్ష

నీట్‌ యూజీ పరీక్ష మొత్తం నాలుగు సబ్జెక్ట్‌లలో 180 ప్రశ్నలు–720 మార్కులకు జరుగుతుంది. ఫిజిక్స్‌లో 45 ప్రశ్నలు–180 మార్కులు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నలు–180 మార్కులు, బోటనీలో 45 ప్రశ్నలు–180 మార్కులు, జువాలజీలో45 ప్రశ్నలు–180 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. పరీక్షను పెన్‌–పేపర్‌ విధానంలో ఓఎంఆర్‌ షీట్‌ ఆధారంగా నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంటుంది. పరీక్షకు అందుబాటులో ఉండే సమయం మూడు గంటలు.

సమయం సద్వినియోగం

నీట్‌ యూజీ–2025 పరీక్ష మే 4న నిర్వహించనున్నారు. అంటే ఇప్పటి నుంచి దాదాపు 75 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సబ్జెక్ట్‌ల వారీగా పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. మంచి స్కోర్‌ సా­ధించే అవకాశం ఉంది. మార్చి చివరి నాటికి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత నీట్‌ పరీక్ష తేదీకి దాదాపు నెల రోజుల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో పూర్తిగా రివిజన్, మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. 

ప్రతి సబ్జెక్ట్‌లో 130 మార్కులు

మెడికల్‌ సీటు సొంతం చేసుకునే దిశగా అభ్యర్థులు ప్రతి సబ్జెక్ట్‌లోనూ 180 మార్కులకు గాను కనీసం 130 మార్కులు సాధించేలా సిలబస్‌పై పట్టు సాధించాలి. మొత్తంగా 720 మార్కులకు గాను 450 మార్కుల నుంచి 500 మార్కులు సాధించేలా కృషి చేస్తే.. డాక్టర్‌ కల నెరవేర్చుకోవచ్చు. 
ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025, మార్చి 7
  • దరఖాస్తు సవరణ అవకాశం: 2025, మార్చి 9 నుంచి 11 వరకు
  • పరీక్ష తేదీ: 2025, మే 4
  • ఫలితాల వెల్లడి: 2025, జూన్‌ 14
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://neet.nta.nic.in

చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

సబ్జెక్ట్‌ వారీగా ప్రిపరేషన్‌ ఇలా.. 

బయాలజీ
బయాలజీలోని బోటనీ, జువాలజీ సబ్జెక్ట్‌ల  నుంచి ప్రశ్నలు అడుగుతారు. హుమన్‌ ఫిజియాలజీ, మైక్రోబ్స్‌ ఇన్‌ హ్యూమన్‌ ఫిజియాలజీ, హ్యూమన్‌ ఇన్సులిన్‌ అండ్‌ వ్యాక్సీన్‌ ప్రొడక్షన్, టాక్సానమీ, నెర్వస్‌ సిస్టమ్, క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ప్లాంట్స్, ప్లాంట్‌ ఫిజియాలజీ, బయో టెక్నాలజీ అప్లికేషన్స్, ఎకలాజికల్‌ సక్సెషన్, ఎకలాజికల్‌ /ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌పై పట్టు సాధించాలి. డయాగ్రమ్‌ ఆధారిత ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. గత రెండేళ్ల నీట్‌ ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే.. రెండు సబ్జెక్ట్‌లకు సంబంధించి ఇంటర్మీడియెట్‌లోని ప్రథమ, ద్వితీయ సంవత్సరాల టాపిక్స్‌కు సమ ప్రాధాన్యం కల్పిస్తూ ప్రశ్నలు అడిగారు. కాబట్టి అభ్యర్థులు రెండేళ్ల సిలబస్‌పై పూర్తిగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. 
ప్రాక్టీస్‌తో ఫిజిక్స్‌లో మంచి మార్కులు
ఫిజిక్స్‌లో స్కోర్‌ కోసం విద్యార్థులు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మోడరన్‌ ఫిజిక్స్‌ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. 
ఇంటర్‌ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్‌ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

చదవండి: Good News: తెలంగాణ విద్యార్ధులకు, పేరెంట్స్ కు గుడ్ న్యూస్.. ఇక‌పై ఇక్క‌డ‌ సీట్లలో 95 శాతం కేటాయింపు!
కెమిస్ట్రీ.. కాన్సెప్ట్స్, రివిజన్‌
విద్యార్థులు కాన్సెప్ట్‌లపై పూర్తి అవగాహనతోపాటు రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, మోల్‌ కాన్సెప్ట్, కెమికల్‌ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్‌ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్‌ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్‌ కెమిస్ట్రీ; ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీలకు కొంత వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. కెమిస్ట్రీలో చర్యలు, సమీకరణాలను నిరంతరం పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలను, వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. పీరియాడిక్‌ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో మంచి స్కోర్‌కు ఆస్కారం ఉంటుంది.
రివిజన్‌కు ప్రాధాన్యం
ప్రస్తుతం బోర్డ్‌ పరీక్షలకు సమయం కేటాయించాలి. ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ఇందుకోసం అప్పటికే రూపొందించుకున్న షార్ట్‌ నోట్స్‌ను అనుసరించాలి. ప్రతి రోజు మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. మోడల్‌ కొశ్చన్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. డైరెక్ట్‌ కొశ్చన్స్‌ కంటే ఇన్‌ డైరెక్ట్‌ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్‌ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. ప్రిపరేషన్‌ సమయంలోనే షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవా­లి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.  

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 20 Feb 2025 10:59AM

Photo Stories