UPSC IES/ISS-2023 Notification: ఐఈఎస్/ఐఎస్‌ఎస్–2023 పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్ ఇదే..
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్.. ఐఈఎస్‌గా సుపరిచితం!
ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్.. సంక్షిప్తంగా ఐఎస్‌ఎస్!!
ఈ రెండు సర్వీసుల్లో పోస్ట్‌ల భర్తీకి యూపీఎస్సీ ఐఈఎస్/ఐఎస్‌ఎస్–2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్; అలాగే కేంద్ర ఆర్థిక శాఖలో జూనియర్ టైమ్ స్కేల్‌తో అసిస్టెంట్ డైరెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఐఈఎస్/ఐఎస్‌ఎస్–2023 పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్, కెరీర్ స్కోప్ తదితర వివరాలు..
- ఐఈఎస్, ఐఎస్‌ఎస్–2023 నోటిఫికేషన్ విడుదల
- ఎకనామిక్స్‌లో పీజీ, స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ అర్హత
- మొత్తం 51 పోస్టులకు రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ
రెండు సర్వీసుల్లో.. 51 పోస్ట్‌లు
ఐఈఎస్/ఐఎస్‌ఎస్–2023 నోటిఫికేషన్ ద్వారా.. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌లో 18 పోస్ట్‌లు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌లో 33 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.
అర్హతలు
- ఐఈఎస్ అభ్యర్థులు ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ లేదా ఎకనోమెట్రిక్స్ స్పెషలైజేషన్లతో పీజీ ఉత్తీర్ణత సాధించాలి.
- ఐఎస్‌ఎస్ అభ్యర్థులు స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లలో ఏదో ఒక సబ్జెక్ట్‌తో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత(లేదా) స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!
వయసు
- ఆగస్ట్ 1, 2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి(ఆగస్ట్ 2,1993–ఆగస్ట్ 1, 2002 మధ్యలో జన్మించి ఉండాలి).
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇస్తారు.
రెండంచెల ఎంపిక ప్రక్రియ
యూపీఎస్‌సీ.. ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎంపిక ప్రక్రియ రెండంచెలుగా ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు 2.5 నిష్పత్తిలో తదుపరి దశలో పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల్లో పొందిన మార్కుల ఆధారంగా నియామకాలు ఖరారు చేస్తారు.
రాత పరీక్షలు.. వేర్వేరుగా
- ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌లకు సంబంధించి ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ.. రాత పరీక్షలు మాత్రం రెండు సర్వీసులకు వేర్వేరుగా ఉంటాయి.
- ఐఈఎస్ రాత పరీక్షను ఆరు పేపర్లుగా వేయి మార్కులకు నిర్వహిస్తారు. అవి..
- పేపర్–1 జనరల్ ఇంగ్లిష్ 100 మార్కులు; పేపర్–2 జనరల్ స్టడీస్ 100 మార్కులు; పేపర్–3 జనరల్ ఎకనామిక్స్–1, 200 మార్కులు; పేపర్–4 జనరల్ ఎకనామిక్స్–2, 200 మార్కులు; పేపర్–5 జనరల్ ఎకనామిక్స్–3, 200 మార్కులు; పేపర్–6 ఇండియన్ ఎకనామిక్స్ 200 మార్కులు. ఇలా మొత్తం 1,000 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఐఈఎస్ పరీక్ష పేపర్లన్నీ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటాయి.
- పరీక్షకు కేటాయించిన సమయం 3 గంటలు.
చదవండి: Civils Prelims Guidance
ఐఎస్‌ఎస్‌కు ఇలా
- ఐఎస్‌ఎస్ రాత పరీక్షలోనూ ఆరు పేపర్లు ఉంటాయి. వేయి మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఐఈఎస్‌తో పోల్చితే.. ఐఎస్‌ఎస్ రాత పరీక్ష కొంత భిన్నంగా ఉంటుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ప్రశ్నలతో ఆయా పేపర్లు ఉంటాయి.
- పేపర్–1 జనరల్ ఇంగ్లిష్–100 మార్కులు; పేపర్–2 జనరల్ స్టడీస్–100 మార్కులు; పేపర్–3 స్టాటిస్టిక్స్–1, 200 మార్కులు; పేపర్–4 స్టాటిస్టిక్స్–2, 200 మార్కులు; పేపర్–5 స్టాటిస్టిక్స్–3, 200 మార్కులు; పేపర్–6 స్టాటిస్టిక్స్–4, 200 మార్కులు; మొత్తం మార్కులు 1000.
- స్టాటిస్టిక్స్–1, స్టాటిస్టిక్స్–2 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. వీటిలో 80 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. వీటికి కేటాయించిన సమయం రెండు గంటలు. మిగతా పేపర్లకు కేటాయించిన సమయం మూడు గంటలు.
- స్టాటిస్టిక్స్–3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలోనే నిర్వహిస్తున్నప్పటికీ.. వీటిలో షార్ట్ ఆన్సర్ కొశ్చన్స్, స్మాల్ ప్రాబ్లమ్ కొశ్చన్స్ ఉంటాయి. మొత్తం ప్రశ్నల్లో ఈ తరహా ప్రశ్నలు 50 శాతం మేరకు ఉంటాయి. మరో 50 శాతం ప్రశ్నలు దీర్ఘ సమాధాన ప్రశ్నలు, కాంప్రహెన్షన్ ప్రాబ్లమ్ ప్రశ్నలుగా ఉంటాయి.
- స్టాటిస్టిక్స్ పేపర్–4లో మొత్తం ఏడు సెక్షన్లలో ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఛాయిస్ విధానంలో ఏదైనా రెండు సెక్షన్లు ఎంచుకుని.. ఆ రెండు సెక్షన్లలోనే పరీక్ష రాసే అవకాశం ఉంది.
చదవండి: Civils Prelims Study Material
పర్సనల్ ఇంటర్వ్యూ
ఎంపిక ప్రక్రియలో చివరి దశ..పర్సనల్ ఇంటర్వ్యూ. తొలిదశ రాత పరీక్షలో చూపిన ప్రతిభ, పోస్ట్‌ల సంఖ్య, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఇందులో చోటు సంపాదించిన వారికి మలిదశలో 200 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ ప్రతిభ కనబరిస్తే.. రాత పరీక్షలో మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులను క్రోడీకరించి తుది విజేతలను ఖరారు చేసి.. ఆయా సర్వీసులకు ఎంపిక చేస్తారు.
విజయానికి అడుగులు ఇలా
ఐఈఎస్, ఐఎస్‌ఎస్ పరీక్షల్లో విజయం సాధించడానికి అభ్యర్థులు ప్రధానంగా.. పీజీ స్థాయి పుస్తకాలను చదవడం ఎంతో ఉపకరిస్తుంది. అదే విధంగా ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్ల సాధన కూడా సత్ఫలితాలకు దోహదం చేస్తుంది.
జనరల్ ఇంగ్లిష్
రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉండే పేపర్‌ఇది. ఇందులో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. మంచి మార్కుల సాధనకు వొకాబ్యులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి. ఇంగ్లిష్‌లో ఎక్కువగా ప్యాసేజ్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ స్టడీస్
రెండు సర్వీసుల అభ్యర్థులకూ ఉండే మరో పేపర్.. జనరల్ స్టడీస్. ఇందులో అధిక శాతం ప్రశ్నలు.. కరెంట్ ఈవెంట్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతున్నారు. ఇందులో రాణించేందుకు తాజా పరిణామాలతోపాటు శాస్త్రసాంకేతిక రంగం, భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జాగ్రఫీలపై పట్టు సాధించాలి. అభ్యర్థులు సివిల్స్ జనరల్ స్టడీస్ పేపర్లు, ప్రిలిమ్స్ పేపర్లు అధ్యయనం చేయడం ఉపకరిస్తుంది.
చదవండి: Civils Practice Tests
ఐఈఎస్ సబ్జెక్ట్ పేపర్లకు ఇలా
జనరల్ ఎకనామిక్స్–1
సూక్ష్మ అర్థశాస్త్రం, మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ ఎకనోమెట్రిక్ మెథడ్స్‌పై పట్టు సాధించాలి. సూక్ష్మ అర్ధశాస్త్రానికి సంబంధించి వినియోగదారుని డిమాండ్ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం, విలువ, పంపిణీ అంశాలు తెలుసుకోవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ఉండే ఈ పేపర్ కోసం లారెంజ్ వక్ర రేఖ, ఏంజెల్ సూత్రం, షాడో ప్రైస్, పారెటో పంపిణీ సిద్ధాంతం, స్వల్ప కాల–దీర్ఘకాల వ్యయ రేఖలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
జనరల్ ఎకనామిక్స్–2
స్థూల అర్థశాస్త్రం, ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్, అంతర్జాతీయ అర్థశాస్త్రం తదితర అంశాల కలయికగా ఉండే ఈ పేపర్ కోసం ప్రతి అంశాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ చదువుకోవాలి. జాతీయాదాయం కొలమానం, గ్రీన్ నేషనల్ ఇన్‌కమ్, సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం, ఫిలిప్స్ రేఖ, ద్రవ్యరాశి సిద్ధాంతం వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రపంచ వాణిజ్య సంక్షోభాలు–కారణాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల తాజా కార్యకలాపాలపై అవగాహన పెంచుకోవాలి.
జనరల్ ఎకనామిక్స్–3
ఈ పేపర్ ప్రభుత్వ విత్త శాస్త్రం, పర్యావరణ అర్థశాస్త్రం, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్ అంశాల సమ్మిళితంగా ఉంటుంది.ఇందులో మంచి మార్కుల కోసం పన్ను సంస్కరణలు, గరిష్ట సాంఘిక ప్రయోజన సిద్ధాంతం, ప్రభుత్వ వ్యయ సిద్ధాంతం, గ్రీన్ జీడీపీ, క్యోటో ప్రోటోకాల్, బాలి యాక్షన్ ప్లాన్, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్ అంశాలపై అవగాహన పొందాలి.
ఇండియన్ ఎకనామిక్స్
సిలబస్‌లోని ముఖ్యాంశాలను వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ నోట్స్ రూపొందించుకోవాలి. దీన్ని పదే పదే చదవాలి. అలాగే స్థిరీకరణ–నిర్మాణాత్మక సర్దుబాటు ప్యాకేజీ, విత్తరంగ సంస్కరణలు, నీతి ఆయోగ్ సిఫార్సులు, టోకు ధరల సూచీ–రిటైల్ ధరల సూచీ, భారత ద్రవ్య మార్కెట్, ఎఫ్‌డీఐ, డిజిన్వెస్ట్‌మెంట్ పాలసీ తదితర తాజా అంశాలపై దృష్టి సారించాలి.
ఐఎస్‌ఎస్ సబ్జెక్ట్ పేపర్లకు ఎలా
స్టాటిస్టిక్స్–1
ఈ పేపర్‌లో రాణించాలంటే..పలు సిద్ధాంతాలపై పట్టు సాధించాలి. స్టాటిస్టికల్ మెథడ్స్, న్యూమరికల్ అనాలిసిస్ వంటి అంశాలపై అవగాహన పొందాలి.
స్టాటిస్టిక్స్–2
ఈ పేపర్‌లో లీనియర్ మోడల్స్, ఎస్టిమేషన్, హైపోథిసిస్ టెస్టింగ్, మల్టీవెరైటీ అనాలిసిస్(ఎస్టిమేషన్ ఆఫ్ మీన్ వెక్టార్ అండ్ కో వేరియన్స్ మ్యాట్రిక్స్ తదితర) అంశాలపై దృష్టిసారించాలి.
స్టాటిస్టిక్స్–3
శాంప్లింగ్ టెక్నిక్స్, ఎకనామిక్ సాటిస్టిక్స్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్, ఎకనోమెట్రిక్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
స్టాటిస్టిక్స్–4
- స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్, డెమోగ్రఫీ అండ్ వైటల్ ఛార్ట్స్, కంప్యూటర్ సిస్టమ్–సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ వంటి కంప్యూటర్ సంబంధ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- డేటా ఆధారిత అంశాలు అధికంగా ఉండే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ పేపర్లలో మంచి స్కోర్ చేయాలంటే.. వేగంతోపాటు కచ్చితత్వం, సునిశిత పరిశీలన అవసరం. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని నిర్దిష్ట కాలపరిమితి విధించుకుని చదవాలి. ముఖ్యంగా ఆయా సిద్ధాంతాలు..వాటిని వినియోగించి డేటా రూపకల్పన, ఛార్ట్స్, గ్రాఫ్స్ రూకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి.
జూనియర్ టైమ్ స్కేల్
ఐఈఎస్, ఐఎస్‌ఎస్‌లకు ఎంపికైన వారికి జూనియర్ టైమ్ స్కేల్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. ఆర్థిక వ్యవహారాల సంబంధ శాఖల్లో అసిస్టెంట్ డైరెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ కొలువు లభిస్తుంది. నీతి ఆయోగ్, నేషనల్ శాంపుల్ సర్వే, లేబర్ బ్యూరో, ఆర్థిక సంఘం, గ్రామీణాభివృద్ధి, విద్య, వ్యవసాయం, వాణిజ్యం తదితర విభాగాల్లో నియమిస్తారు. అనుభవం, పనితీరు ఆధారంగా డిప్యూటీ డెరైక్టర్/అసిస్టెంట్ అడ్వైజర్(సీనియర్ టైం స్కేల్), జాయింట్ డెరైక్టర్/డిప్యూటీ అడ్వైజర్, సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్ తదితర హోదాల నుంచి అత్యున్నత స్థాయి ప్రిన్సిపుల్ అడ్వైజర్ లేదా చీఫ్ అడ్వైజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 9, 2023
- దరఖాస్తు సవరణ అవకాశం: మే 10–మే 16
- పరీక్ష తేదీ: జూన్ 23 నుంచి
- ఆన్‌లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://upsconline.nic.in/, https://www.upsc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |