Skip to main content

UPSC CMS Preparation Tips: కేంద్రంలో 1261 పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, పరీక్షలో విజయానికి మార్గాలు..

ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌తోనే.. సుస్థిర కొలువు, సమున్నత భవిష్యత్తు సొంతం చేసుకునే అరుదైన అవకాశం! అది కూడా కేంద్ర ప్రభుత్వంలో మెడికల్‌ ఆఫీసర్‌గా కొలువు!! యూపీఎస్సీ తాజాగా కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎంఎస్‌ఈ)–2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల్లో.. మొత్తం 1,261 మెడికల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో.. సీఎంఎస్‌ ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, పరీక్షలో విజయానికి మార్గాలు తదితర వివరాలు..
upsc cms syllabus and exam pattern and preparation tips
  • ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులకు కేంద్ర కొలువుల పిలుపు
  • సీఎంఎస్‌ఈ–2023 ఎంపిక ప్రక్రియ ప్రారంభం
  • నాలుగు విభాగాల్లో మొత్తం 1,261 పోస్ట్‌లు
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియామకం
  • రూ.56,100– రూ.1,77,500 పే స్కేల్‌తో ప్రారంభ వేతనం

ఎంబీబీఎస్‌.. వైద్య రంగంలో కెరీర్‌ ప్రారంభించడానికి మొదటి దశ. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్‌తోపాటు పీజీ,సూపర్‌ స్పెషాలిటీ వంటి కోర్సులు పూర్తి చేస్తేనే వైద్య రంగంలో సుస్థిర అవకాశాలు లభిస్తాయి.కానీ..యూపీఎస్‌సీ సీఎంఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ఎంబీబీఎస్‌ అర్హతతోనే ఉన్నత స్థాయి కొలువు సొంతమవుతుంది.

చ‌ద‌వండి: UPSC CMS Exam 2023: యూపీఎస్సీలో 1261 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

మొత్తం పోస్టులు 1,261

  • ప్రతి ఏటా సీఎంఎస్‌ఈ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల్లో వైద్య పోస్టులను భర్తీ చేస్తారు. తాజాగా.. నాలుగు విభాగాల్లో రెండు కేటగిరీలుగా మొత్తం 1,261 పోస్ట్‌ల భర్తీకి సీఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 
  • కేటగిరీ–1: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్స్‌– 584
  • కేటగిరీ–2: రైల్వేస్‌లో అసిస్టెంట్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు–300
  • ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2) పోస్ట్‌లు – 376; న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు–1.

అర్హత

ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖా­స్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది. కంపల్సరీ రొటేటింగ్‌ ఇంటర్న్‌షిప్‌లో ఉన్న విద్యార్థులు కూడా దరఖా­స్తు చేసుకోవచ్చు. ఇలాంటి అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాకే అపాయింట్‌మెంట్‌ ఖరారు చేస్తారు.

వయసు

ఆగస్ట్‌ 1,2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు(ఆగస్ట్‌ 2, 1991 తర్వాత జన్మించి ఉండాలి). సెంట్రల్‌ హెల్త్‌ సర్వీసెస్‌లో జూనియర్‌ టైమ్‌ స్కేల్‌ పోస్ట్‌ల అభ్యర్థులు ఆగస్ట్‌ 1,2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

చ‌ద‌వండి: Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ

  • కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ద్వారా ఆయా శాఖల్లో పోస్ట్‌ల భర్తీకి రెండు దశలలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ.
  • తొలి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో తదుపరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ రెండిటిలోనూ చూపిన ప్రతిభ ఆధారంగా తుది విజేతల జాబితా రూపొందించి వారికి నియామకాలు ఖరారు చేస్తారు. 

రాత పరీక్ష.. 500 మార్కులు

  • కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో తొలి దశ రాత పరీక్షను.. రెండు పేపర్లుగా 500 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు కేటాయిస్తారు. 
  • పేపర్‌–1: జనరల్‌ మెడిసిన్‌ అండ్‌ పిడియాట్రిక్స్‌: ఈ పేపర్‌లో జనరల్‌ మెడిసిన్‌ నుంచి 96 ప్రశ్న­లు, పిడియాట్రిక్స్‌ నుంచి 24 ప్రశ్నలు అడుగుతారు. ఇలా మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు.
  • పేపర్‌–2ను మూడు భాగాలుగా వర్గీకరించారు. అవి.. ఎ) సర్జరీ, బి) గైనకాలజీ అండ్‌ ఆబ్‌స్టెట్రిక్స్, సి) ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌.
  • ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం మార్కులు 120.
  • రెండు పేపర్లలోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. 
  • నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును నెగెటివ్‌ మార్క్‌గా నిర్దేశించారు.

చ‌ద‌వండి: Civils Prelims Guidance

100 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్‌

రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. ఈ పరీక్షకు కేటాయించిన మార్కులు 100. పర్సనాలిటీ టెస్ట్‌కు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో.. ఆయా శాఖల్లోని పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి.. 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో రాత పరీక్ష నుంచి పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థుల్లోని జనరల్‌ నాలెడ్జ్‌ను, వైద్య రంగం పట్ల వారికున్న సేవా దృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని, నాయకత్వ నైపుణ్యాలను పరిశీలిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే తుది జాబితాలో చోటు సంపాదిస్తే.. కొలువు ఖరారైనట్లే.

విజయం సాధించాలంటే

  • జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్‌ అంశాలు ఉండే పేపర్‌–1లో విజయానికి అభ్యర్థులు కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, జెనిటో యురినరీ, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రినాలజీ, మెటబాలిక్‌ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్‌ –కమ్యూనికబుల్‌ డిసీజెస్,న్యూట్రిషన్‌/గ్రోత్, డె­ర్మటాలజీ, మస్కులో–స్కెలిటిల్‌ సిస్టమ్, సైకియాట్రీ, జనరల్‌ మెడిసిన్‌‡అంశాలపై దృష్టి పెట్టాలి.
  • కామన్‌ చైల్డ్‌హుడ్‌ ఎమర్జెన్సీస్, బేసిన్‌ న్యూబార్న్‌ కేర్, నార్మల్‌ డెవలప్‌మెంటల్‌ మైల్‌స్టోన్స్, ఇమ్యునైజేషన్‌ ఇన్‌ చిల్డ్రన్, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను గుర్తించడం, వారికి కల్పించే చికిత్స మార్గాలు, విధానాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

చ‌ద‌వండి: Civils Prelims Study Material

పేపర్‌–2కు ఇలా

  • సర్జరీ: జనరల్‌ సర్జరీకి సంబంధించి గాయాలు, కాలేయం, రక్త నాళాలు, పేగులు, కణితులు, ఉదర సంబంధ సమస్యలు తదితర సమస్యలకు సంబంధించిన శస్త్రచికిత్సల అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు యూరలాజికల్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, ఈఎన్‌టీ సర్జరీ, థొరాసిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ సర్జరీ, ఆఫ్తమాలజీ, అనస్థీసియాలజీ, ట్రామటాలజీ అంశాలను ఔపోసన పట్టాలి. 
  • గైనకాలజీ అండ్‌ ఆబ్‌స్టెట్రిక్స్‌: ఈ విభాగానికి సంబంధించి గైనకాలజీలో అప్లయిడ్‌ అనాటమీ, అప్లయిడ్‌ ఫిజియాలజీ, జెనిటల్‌ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్లు, నియాప్లాస్మా, గర్భాశయం స్థానంలో మార్పులు, కన్వెన్షనల్‌ కాంట్రాసెప్టివ్స్, యూడీ, ఓరల్‌ పిల్స్, ఆపరేటివ్‌ ప్రొసీజర్, మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. 
  • ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌: సీఎంఎస్‌ఈ రాత పరీక్షలో కీలకం విభాగం ఇది. అభ్యర్థులు ఈ విభాగంలో మంచి మార్కుల కోసం సోషల్‌ అండ్‌ కమ్యూనిటీ మెడిసిన్, కాన్సెప్ట్‌ ఆఫ్‌ హెల్త్, డిసీజ్, ప్రివెంటివ్‌ మెడిసిన్, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ప్లానింగ్, డెమోగ్రఫీ అండ్‌ హెల్త్‌ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్, ఆక్యుపేషనల్‌ హెల్త్, జెనిటిక్స్‌ అండ్‌ హెల్త్, ఇంటర్నేషనల్‌ హెల్త్, మెడికల్‌ సోషియాలజీ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్,మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్, నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ అంశాలపై ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. 

వైరస్‌లు, వ్యాక్సీన్లపై ప్రత్యేక దృష్టి

సీఎంఎస్‌ఈ అభ్యర్థులు సమకాలీన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా వైరస్‌లు, వాటి సంక్రమణ తీరు, వ్యాక్సీన్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టితో అభ్యసనం చేయాలి. ప్రధానంగా కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సీన్లు, వ్యాక్సీన్‌ ప్రయోగాలు, తదితర అంశాల గురించి సమాచారం తెలుసుకోవాలి. అదే విధంగా అంతర్జాతీయంగా కోవిడ్‌ ప్రభావానికి గురైన దేశాలు, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గణాంకాలు, నివేదికలు, యూఎన్‌ఓ నివేదికల్లోని ముఖ్యాంశాలపైనా పట్టు సాధించాలి.

చ‌ద‌వండి: Civils Practice Tests

ఎంబీబీఎస్‌ అకడమిక్స్‌

సీఎంఎస్‌ఈ తొలి దశ రాత పరీక్షలో మెరుగైన మార్కులు పొందడానికి అభ్యర్థులు తమ అకడమిక్‌ పుస్తకాలపై ఎక్కువగా ఆధారపడొచ్చు. ముందుగా పరీక్ష సిలబస్‌ను పరిశీలించి.. అందులోని టాపిక్స్‌ను అకడమిక్స్‌లోని అంశాలతో బేరీజు వేసుకుంటూ అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో చదవాలి. అదే విధంగా పాత ప్రశ్న పత్రాల సాధన కూడా ఎంతో ఉపకరిస్తుంది.

ప్రొబేషన్‌ విధానం

ఆయా విభాగాల్లో సర్వీస్‌లో చేరిన వారు నిర్దిష్ట వ్యవధిలో ప్రొబేషన్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రొబేషన్‌ సమయంలో సంతృప్తికరమైన పనితీరు కనబర్చిన వారికే శాశ్వత కొలువు ఖరారవుతుంది. ఇండియన్‌ రైల్వేస్‌లో ఒక ఏడాది వ్యవధిలో, మిగిలిన విభాగాల్లో రెండేళ్ల వ్యవధిలో ప్రొబేషన్‌ ఉంటుంది. దీంతోపాటు ఇండియన్‌ రైల్వేస్‌లో ప్రొబేషన్‌తోపాటు ఫౌండేషన్‌ కోర్సు విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రొబేషన్‌ పూర్తి చేసుకున్న వారిని జూనియర్‌ టైం స్కేల్‌ ఆఫీసర్లుగా శాశ్వత ప్రాతిపదికగా విధుల్లోకి తీసుకుంటారు.

సీఎంఎస్‌ఈ–2023 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 9, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: మే 10–16
  • సీఎంఎస్‌ఈ పరీక్ష తేదీ: జూలై 16
  • తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/

చ‌ద‌వండి: UPSC IES/ISS Examination 2023: ఎకనామిక్స్‌ /స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైం స్కేల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories