Skip to main content

Military Nursing Service Notification: ఎన్‌టీఏ-మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ పోస్టుల వివరాలు.. రాత పరీక్ష, కెరీర్‌ అవకాశాలు..

నర్సింగ్‌లో.. బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసిన మహిళలకు శుభవార్త! త్రివిధ దళాల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. ఎంపికైతే ప్రారంభంలోనే లెఫ్ట్‌నెంట్‌ హోదాతో కొలువు సొంతమవుతుంది. ఆకర్షణీయ వేతనం అందుకునే వీలుంది. ఈ నేపథ్యంలో.. ఎన్‌టీఏ-మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష, కెరీర్‌ అవకాశాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం..
NTA Military Nursing Service Jobs Details Written Exam Career Opportunities
  • మిలటరీ నర్సింగ్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల 
  • ఎన్‌టీఏ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహణ
  • మలి దశలో ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌
  • ఎంపికైతే లెఫ్ట్‌నెంట్‌ హోదాలో నర్సింగ్‌ ఆఫీసర్‌ కొలువు
  • ప్రారంభ వేతన శ్రేణి రూ.56,100-రూ.1,77,500

ఇండియన్‌ మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఆర్మీలో నర్సింగ్‌ విభాగంలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో పోస్ట్‌లను భర్తీ చేస్తారు. తొలుత అయిదేళ్ల వ్యవధికి నియామకం ఖరారు చేస్తారు. ఆ తర్వాతో మరో అయిదేళ్లకు పొడిగిస్తారు. అభ్యర్థుల ఆసక్తిని బట్టి చివరగా మరో నాలుగేళ్లకు సర్వీసు పొడిగిస్తారు. ఇలా మొత్తం 14 ఏళ్లపాటు మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది.

అర్హతలు

  • ఎమ్మెస్సీ నర్సింగ్‌/పోస్ట్‌ బ్యాక్యులరేట్‌ బీఎస్సీ(నర్సింగ్‌)/బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణత ఉండాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • వయసు: 2023, డిసెంబర్‌ 26 నాటికి 21- 35 ఏళ్ల మ«ధ్య ఉండాలి.

ప్రతిభే ప్రామాణికం
మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌కు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కులు, అందుబాటు­లో ఉన్న పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకు­ని.. ఒక్కో పోస్ట్‌కు 10 మందిని చొప్పున మలి దశ­లో ఇంటర్వ్యూకు, మెడికల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. మలి దశ ప్రక్రియను ఇండియన్‌ ఆర్మీ అధికారులు చేపడతారు.

చ‌ద‌వండి: Indian Army Jobs: త్రివిధ దళాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఎన్‌టీఏ రాత పరీక్ష
మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ ఎంపిక ప్రక్రియ తొలి దశలో రాత పరీక్షను.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించనుంది. ఈ పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. బేసిక్‌ నర్సింగ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్లినికల్‌ స్పెషాలిటీస్‌ 100 ప్రశ్నలు-100 మార్కు లు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 10 ప్రశ్నలు-10 మార్కు­లు, జనరల్‌ ఇంగ్లిష్‌ 10 ప్రశ్నలు-10 మార్కులకు ఉంటాయి. 

  • పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులకు జరుగుతుంది. ఈ పరీక్షకు కేటాయించిన సమయం రెండున్నర గంటలు.

మలి దశ ఇంటర్వ్యూ
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో ఇండియన్‌ ఆర్మీ అధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ మూడు నుంచి అయిదు రోజుల పాటు జరుగుతుంది. అభ్యర్థులకు జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఇంగ్లిష్, సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌కు చెందిన ఉన్నతాధికారుల నేతృత్వంలో పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ ఇలా
పర్సనల్‌ ఇంటర్వ్యూలో భాగంగా..సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థులకున్న సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తోపాటు జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌పై అవగాహనను పరిశీలిస్తారు. దీంతోపాటు వ్యక్తిగత ఆసక్తి, అలవాట్లుతోపాటు నర్సింగ్‌ కెరీర్‌ పట్ల ఉన్న అంకిత భావాన్ని పరిశీలించేలా ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌లో భాగంగా.. అభ్యర్థుల వ్యవహార శైలి, వ్యక్తిగత వైఖరి, దృక్పథం వంటి వాటిని పరిశీలిస్తారు. ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపిన వారికి చివరగా మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది.

లెఫ్ట్‌నెంట్‌ హోదాతో కొలువు
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి తుది నియామకం ఖరారు చేసుకున్న వారికి లెఫ్ట్‌నెంట్‌ హోదాతో కొలువు ప్రారంభం అవుతుంది. ప్రారంభంలో వేతన శ్రేణి రూ. రూ.56,100-రూ. 1,77,500గా ఉంటుంది. అంటే.. ప్రారంభంలో నెలకు రూ.లక్ష వరకు వేతనం పొందొచ్చు.

మేజర్‌ స్థాయికి చేరుకునే అవకాశం
నర్సింగ్‌ ఆఫీసర్లుగా ఎంపికైన వారు.. షార్ట్‌ సర్వీ­స్‌ కమిషన్‌ విధానంలో మేజర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. లెఫ్ట్‌నెంట్‌ హోదాలో మూడేళ్ల స­ర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత కెప్టెన్‌గా పదోన్నతి లభిస్తుంది. కెప్టెన్‌ హోదాలో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటే మేజర్‌ స్థాయికి చేరుకోవచ్చు.

చ‌ద‌వండి: Medical Officer Jobs: సెక్యూరిటీ పేపర్‌మిల్, నర్మదాపురంలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

విధులు ఇలా
మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌కు ఎంపికైన వారు.. దేశ వ్యాప్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చెందిన సైనిక శిబిరాల్లో, ఆర్మీ మెడికల్‌ హాస్పిటల్స్‌లో, అదే విధంగా త్రివిధ దళాలకు సంబంధించి ఆయా సెక్టార్లలో ఉన్న బేస్‌ క్యాంప్‌లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2023, డిసెంబర్‌ 26
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: డిసెంబర్‌ 27 - 28, 2023
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: 2024 జనవరి మొదటి వారం
  • పరీక్ష తేదీ: 2024, జనవరి 14
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/SSCMNS

రాత పరీక్షలో రాణించేలా
మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌ ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షలో విజయానికి అభ్యర్థులు సిలబస్‌ అంశాలపై పట్టు సాధించాలి.

బేసిక్‌ నర్సింగ్‌
ఈ విభాగానికి సంబంధించి మాలిక్యులర్‌ బ­యాలజీ, జెనెటిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్, హ్యూ­మన్‌ హెల్త్, డిసీజెస్, ప్లాంట్‌ అండ్‌ హ్యూమన్‌ ఫిజియాలజీ, బయో టెక్నాలజీ అండ్‌ అప్లికేషన్స్, బయో డైవర్సిటీ, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

క్లినికల్‌ స్పెషాలిటీస్‌
ఇందులో పేషెంట్‌ కేర్, హెల్త్‌ కేర్‌ డెలివరీ సిస్ట­మ్స్, కేస్‌ స్టడీ బేస్డ్‌ రీసెర్చ్, ఆపరేషన్‌ థియేటర్‌ ప్రొసీజర్స్, మెడికల్‌ టెస్ట్స్‌ అండ్‌ ప్రొసీజర్స్, పేషెంట్‌ డేటా కలెక్షన్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా కమ్యూనిటీ హెల్త్‌కేర్, జనరల్‌ డిసీజెస్‌పైనా అవగాహన ఏర్పరచుకోవాలి.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌
ఈ విభాగంలో మార్కుల కోసం కరెంట్‌ అఫై­ర్స్, స్టాక్‌ జీకే అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా రీజనింగ్‌ అంశాలైన నంబర్‌ సిరీస్, స్పేస్‌ విజువలైజేషన్, డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్, విజువల్‌ మెమొరీ, రిలేషన్‌షిప్స్, నాన్‌-వెర్బల్‌ సిరీస్, ఫిగర్‌ క్లాసిఫికేషన్‌ వంటి అంశాలను అధ్యయనం చేయాలి.

జనరల్‌ ఇంగ్లిష్‌
ఈ విభాగానికి సంబంధించి బేసిక్‌ గ్రామర్‌ అంశాలు, సినానిమ్స్, యాంటానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్స్, సెంటెన్స్‌ ఫార్మేషన్, కాంప్రహెన్షన్‌లపై దృష్టి పెట్టాలి.

పాఠ్య పుస్తకాలు
రాత పరీక్షలో విజయం దిశగా అభ్యర్థులు బీఎస్సీ స్థాయిలోని నర్సింగ్‌ పుస్తకాలను 
అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా ప్రీవియస్‌ పేపర్స్‌ను ప్రాక్టీస్‌ చేయడం, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది. బీఎస్సీ నర్సింగ్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించి.. కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. అదే విధంగా క్లినికల్‌ స్పెషాలిటీస్‌కు సంబంధించి సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ అధ్యయనం 
సాగించాలి. 

చ‌ద‌వండి: Indian Navy Recruitment 2023: ఇండియన్‌ నేవీలో 910 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories