Skip to main content

Indian Polity : పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా.. ఇండియన్‌ పాలిటీ.. భారత రాజ్యాంగ పీఠికలోని పదజాలం!

Study material and Model questions in Indian Polity for competitive exams

ప్రవేశిక – తాత్విక పునాదులు
(Preamble - Philosophical Foundations)
ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగమైనా సాధారణంగా ప్రవేశికతోనే ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే మొదలైంది. ప్రవేశికకు బదులు పీఠిక, అవతారిక,  ముందుమాట, ఉపోద్ఘాతం లాంటి పర్యాయ పదాలను వాడతారు. ప్రవేశికనే ఆంగ్లంలో ‘Preamble’ అంటారు. ప్రవేశిక రాజ్యాంగం లక్ష్యాలను, ఆదర్శాలను, మూలతత్వాన్ని సూచప్రాయంగా తెలుపుతుంది. రాజ్యాంగాన్ని ఏ ఉన్నత ఆశయాలతో రచించారు, ఏ తరహా ప్రభుత్వాన్ని, ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని భావించారు మొదలైన అంశాలను స్పష్టీకరిస్తూ రాజ్యాంగ నిర్మాతలు ముందుమాటగా తెలుపుతారు.

ప్రవేశిక–ఆధారం
ప్రవేశిక ఉన్న మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ప్రవేశిక భావాన్ని అమెరికా నుంచి గ్రహించినప్పటికీ, అందులోని లక్ష్యాలు, ఆధారాలకు డిసెంబర్‌ 13, 1946న రాజ్యాంగ పరిషత్‌ సమావేశంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన ‘ఆశయాల’ తీర్మానమే ప్రధాన ప్రాతిపదిక. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం అనే అంశాలను గ్రహించారు. ఐక్య రాజ్య సమితి చార్టర్‌లోని ప్రవేశిక కూడా భారత రాజ్యాంగానికి ఆధారమని చెప్పవచ్చు. భారత రాజ్యాంగ ప్రవేశికకు నందన్‌ లాల్‌ బోస్‌ అనే శిల్పి నగిషీ చెక్కారు. 

New Districts: ఈ రాష్ట్రంలో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు

ప్రవేశిక–పదజాలం, భావాలు అర్థవివరణ

ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి, భావానికి ఒక విశిష్ట అర్థాన్ని, పరమార్థాన్ని ఆపాదించవచ్చు. ‘భారత ప్రజలమైన మేము’ అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయాధికారానికి మూలం, ప్రజలే రాజ్యాంగాన్ని రచించుకున్నారని దీని అర్థం.
రాజకీయ స్వభావాన్ని తెలియజేసే పదాలు:
భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందో, దాని స్వభావం ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు.
సార్వభౌమత్వం (Sovereignty):
సార్వభౌమత్వం అంటే సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారాన్ని, బాహ్యంగా విదేశీ, దౌత్య విధానాల్లో స్వేచ్ఛ (Ext­e­r­­nal Indepen­de­nce and Internal Supre­macy)ను కలిగి ఉంటుంది. ఏ బాహ్య శక్తీ మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు.
సామ్యవాదం (Socialist):
ఈ పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమేణా తగ్గించడం. ఉత్పత్తి శక్తులను (Land, lab­­our and capital) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కాకుండా, సాధ్యమైనంత వరకు జాతీయం చేయడం. తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతోపాటు వాటిని అందిపుచ్చుకోవడానికి అవసరమైన తోడ్పాటు అందిస్తారు.

TS RTC Jobs 2024 Notification : 2 వారాల్లో ఆర్టీసీలో 3035 ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్‌.. మరో 4 వేల ఉద్యోగాల‌కు కూడా..

సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్‌ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్‌ సోషలిజం మొదలైన రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యవాదం (Democratic Socialism) అమల్లో ఉంది. దీన్నే ‘రాజ్యాంగ సామ్యవాదం’ అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా నిర్దిష్ట పద్ధతిలో మార్పులు చేపడతారు. మన సామ్యవాదం గాంధీయిజం మార్క్సిజంల మేలు కలయిక. కానీ గాంధీతత్వం వైపు కొంత మొగ్గు కనిపిస్తుంది. ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రైవేటీకరణ నేపథ్యంలో సామ్యవాదతత్వం మసక బారుతోందని చెప్పవచ్చు.
లౌకిక తత్వం (Secular): ఈ పదాన్ని కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. లౌకిక దేశాల్లో అధికార మతం, మత వివక్ష ఉండవు. మత విషయంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదా నష్టం వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మతస్వామ్య రాజ్యం ((Theocratic State) అంటారు. 
ఉదా: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌.
ప్రజాస్వామ్యం (Democracy): ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అంటే ప్రజలే పాలితులు, పాలకులని అబ్రహం లింకన్‌ నిర్వచించారు. భారత్‌లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. ఎలాంటి వివక్ష లేకుండా కేవలం నిర్ణీత వయసున్న పౌరులందరికీ ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీ చేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా(Rule of law) జరుగుతుంది. చట్టబద్ధత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. సాధారణంగా ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినహాయింపు ఉండదు.
గణతంత్ర (Republic): ‘గణం’ అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇది ప్రజాపాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ట్రపతి, ఇతర ప్రజా పదవుల్లోని వ్యక్తులను నిర్ణీత కాలానికి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. లేదా పరోక్షంగా  ఎన్నికవుతారు. బ్రిటిష్‌ రాణి/రాజు తరహాలో వారసత్వ అధికారం ఉండదు.
సామాజిక ఆశయాలు (Social Objec­tives): ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపరిచారు. రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.

Indians Leaving Sweden: స్వీడన్‌ను వీడి స్వదేశానికి వస్తున్న భారతీయులు.. కారణాలు ఇవే..!

న్యాయం

న్యాయం అంటే ఒక సర్వోన్నతమైన సమతా భావన. అసమానతలు, వివక్షలు లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. రాజ్యాంగంలో మూడు రకాల న్యాయాలను ప్రస్తావించారు.
రాజకీయ న్యాయం (Political Ju­s­tice): రాజ్య కార్యకలాపాల్లో పౌరులంతా ఎలాంటి వివక్ష లేకుండా పాల్గొనడమే రాజకీయ న్యాయం. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైనవి రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు.
సామాజిక న్యాయం (Social Justice): సమాజంలో పౌరులంతా సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించడమే సామాజిక న్యాయం. అన్ని రకాల సామాజిక వివక్షలను రద్దు చేయడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయడం ఇందులో భాగం.
ఆర్థిక న్యాయం (Economic Justice): ఆర్థిక అంతరాలను తగ్గించడం, సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుంచి విముక్తులను చేయడం. 

IIITDM Faculty Posts : ట్రిపుల్‌ఐటీడీఎంలో వివిధ విభాగాల్లో ఫాక‌ల్టీ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ఉన్నత ఆదర్శాలు

స్వేచ్ఛ(Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక, సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అవసరం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్భంధాలు లేకుండా వ్యక్తి పరిపూర్ణ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉండాలి.
ఉదా:  లౌకిక రాజ్య స్థాపనకు పునాది మత స్వేచ్ఛ.
సమానత్వం(Equality): ప్రజాస్వామ్యంలో అతి ముఖ్య ఆదర్శం సమానత్వం. అంటే అన్ని రకాల అసమానతలను, వివక్షలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి వికాసానికి అవసరమైన అవకాశాలను కల్పించడం.
సౌభ్రాతృత్వం (Fraternity): సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్థిల్లుతుంది. సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో  సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపరచాలని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రతిపాదించారు.
ఐక్యత, సమగ్రత (Unity & integrity):
ఐక్యతా భావం దేశ ప్రజలు కలిసి ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychlological emo­tion). మతం,కులం, ప్రాంతం లాంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల్లో జాతీయ దృక్ఫథాన్ని పెంపొందిస్తుంది.
సమగ్రతను చేర్చాల్సిన ఆవశ్యకత: 1970 తరువాత దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మిలిటెంట్‌ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమగ్రత అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది.

AP Police Constable Jobs 2024 Update News : 6,100 కానిస్టేబుల్‌ పోస్టులపై అప్‌డేట్ న్యూస్ ఇదే.. ఈ నియామకాలను...

ప్రవేశిక సవరణకు అతీతం కాదు

ఆర్టికల్‌ 368 ప్రకారం ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం పరిధిలోకి వస్తుంది కాబట్టి దాని సారాంశం ( Spirit) మార్చకుండా, ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలు చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్‌ సింగ్‌ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికతత్వం, సమగ్రత అనే పదాలను చేర్చారు. ఇప్పటి వరకూ ఒకసారి మాత్రమే ప్రవేశికను సవరించారు.
గతంలో వచ్చిన ప్రశ్నలు
1.    భారత్‌లో రాజ్యాధికారానికి మూలం?
    ఎ) రాజ్యాంగం     బి) పార్లమెంట్‌
    సి) ప్రజలు    డి) రాష్ట్రపతి
2.    భారత రాజ్యాంగ పీఠికలోని పదాలు?
    ఎ) సార్వభౌమాధికార, ప్రజాస్వామిక, సామ్యవాద, గణతంత్ర రాజ్యం
    బి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం
    సి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక రాజ్యం
    డి) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం
3.    భారత రిపబ్లిక్‌ రాజ్యాంగం?
    ఎ) రాజ్యాంగ సభ ద్వారా నిర్మితమై  గవర్నర్‌ జనరల్‌ ఆమోదం పొందింది.
    బి) బ్రిటిష్‌ ΄ార్లమెంట్‌ ప్రతి΄ాదనతో రాజ్యాంగ సభ ద్వారా ఆమోదం పొందింది.
    సి) భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రస్తావించింది, రాజ్యాంగ సభ ద్వారా ఆమోదం పొందింది.
    డి) రాజ్యాంగ పరిషత్‌ రచించి, స్వీకరించింది.
4.    రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, అభి్ర΄ాయాలను ప్రతిబింబిస్తుంది?
    ఎ) ప్రవేశిక 
    బి) ప్రాథమిక హక్కులు
    సి) ఆదేశిక సూత్రాలు    
    డి) అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రకరణలు

సమాధానాలు
    1) సి;    2) డి;    3) డి;    4) ఎ.

BECIL Recruitment 2024: టెన్త్‌/ డిప్లొమా అర్హతతో ఉద్యోగం.. నెలకు రూ. 30వేలు
    
మాదిరి ప్రశ్నలు
1.    ప్రవేశికలో ప్రస్తావించిన సౌభ్రాతృత్వం అనే ఆదర్శాన్ని పెం΄÷ందించే అంశాలు?
    1. ఏక పౌరసత్వం
    2. కేంద్రీకృత సమాఖ్య
    3. ప్రాథమిక హక్కులు
    4. ప్రాథమిక విధులు
    ఎ) 1, 2        బి) 1, 3, 4
    సి) 2, 3, 4    డి) 1, 2, 3, 4
2.    ప్రవేశికలో పేర్కొన్న ‘సమానత్వం’ దేనికి హామీ ఇస్తుంది?
    ఎ) హోదా    బి) అవకాశాలు
    సి) ఉపాధి    డి) ఎ, బి
3.    ఈ కింది వాటిలో సరైంది?
    ఎ) ప్రవేశిక అధికారానికి ఆధారం కాదు, పరిమితి కాదు
    బి) ప్రవేశిక సవరణకు అతీతం కాదు
    సి) ప్రవేశికను రాజ్యాంగ రచన తర్వాత∙చేర్చారు, చివరిగా ఆమోదించారు
    డి) పైవన్నీ
4.    ప్రవేశికకు ఈ కింది వాటిలో వేటిని ఆపాదించవచ్చు?
    ఎ) రాజ్యాంగానికి అనివార్యమైన భాగం
    బి) రాజ్యాంగ ప్రకరణలను ప్రభావితం చేయదు
    సి) రాజ్యాంగంలోని అంశాలకు సూచనాత్మకమైంది
    డి) పైవేవీ ఆపాదించలేం

సమాధానాలు
    1) బి;    2) డి;      3) డి;        4) డి. 

Russia Attack Ukraine: పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్‌.. 100 క్షిపణులు, డ్రోన్లు..!

Published date : 27 Aug 2024 03:28PM

Photo Stories