Skip to main content

Fundamental Rights Study Material: ముఖ్యమైన‌ ప్రాథమిక హక్కులు – ఇతర నిబంధనలు

fundamental rights study material for competitive exams,sakshi education

వివిధ రిట్లు–అర్థం–పరిధి – ప్రాముఖ్యత
ప్రొహిబిషన్‌ (నిషేధం)

భాషా పరంగా ప్రొహిబిషన్‌ అంటే నిషేధించడం అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు లేదా ట్రైబ్యునల్‌ తన పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశిస్తుంది. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రిట్‌ ముఖ్య ఉద్దేశం. ప్రొహిబిషన్‌ న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పాలనా సంస్థలు, చట్టపర సంస్థలకు వర్తించదు.

సెర్షియోరరి (ఉన్నత న్యాయస్థాన పరిశీలన అధికారం)

భాషాపరంగా సెర్షియోరరి అంటే ‘సుపీరియర్‌’ లేదా ‘టు బి సర్టిఫైడ్‌’ లేదా ‘బ్రింగ్‌ ద రికార్డ్స్‌’ అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు వెలువరించినప్పుడు దాన్ని రద్దు చేసి, కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చే ఆదేశం. ఈ రిట్‌ ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే.
సెర్షియోరరిని ప్రైవేటు సంస్థలు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయరు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే పరిపాలనా సంస్థలకు వ్యతిరేకంగా జారీచేయవచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎన్విరాన్‌–లీగల్‌ యాక్షన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1996) కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

చదవండి: TSPSC Group 2 Guidance: గ్రూప్‌–2 పరీక్ష తేదీలు... రివిజన్‌తోనే సక్సెస్‌ అంటున్న నిపుణులు

ప్రొహిబిషన్, సెర్షియోరరి మధ్య తేడాలు

ప్రొహిబిషన్, సెర్షియోరరిల రిట్ల ఉద్దేశం ఒక్కటే. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడం. అయితే వీటి ప్రక్రియలో తేడా ఉంది. కేసు ప్రారంభదశలో ఉంటే ప్రొహిబిషన్‌ రిట్, తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరి రిట్‌ను జారీ చేస్తారు. సెర్షియోరరి రిట్‌ దిగువ కోర్టులను నియంత్రించడంతోపాటు, అవి చేసిన తప్పులను కూడా సవరిస్తుంది. ప్రొహిబిషన్‌ రిట్‌ కేవలం నిలుపుదల చేస్తుంది. (Prohibition is preventive where as certiorari is curative)

కోవారంటో (అధికార పృచ్ఛ)

భాషాపరంగా దీన్ని ‘బై వాట్‌ వారంట్‌’ (By What Warrant) అంటారు. అంటే ‘ఏ అధికారంతో’ అని ప్రశ్నించడం. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్‌ ప్రధాన ఉద్దేశం. ప్రజా సంబంధమైన పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించిన లేదా ప్రజా పదవులను దుర్వినియోగం చేసిన వ్యక్తి ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. చట్టబద్ధత లేకపోతే ఆ పదవి నుంచి వెంటనే తొలగిపోవాలని ఆదేశిస్తాయి. ప్రజా పదవి అంటే చట్టంతో ఏర్పాటైన స్వతంత్ర పత్రిపత్తి సంస్థ. ఉదాహరణకు ప్రభుత్వ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలైనవి.
ఈ రిట్‌ కోసం బాధితుడు మాత్రమే న్యాయస్థానాల్లో కేసు వేయాలనే నియమం లేదు. ప్రజా పదవులను దుర్వినియోగం నుంచి కాపాడాలనే సామాజిక స్పృహ ఉన్న ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు. మూడో వ్యక్తికి (Third Person) ఇందులో జోక్యం చేసుకునే హక్కు (Locus Standi లోకస్‌ స్టాండై) ఉంటుంది.

చదవండి: Indian Polity Study Material: రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

ఇన్‌జంక్షన్‌ (నిలుపుదల ఆదేశం)

ఈ రిట్‌ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కేవలం సివిల్‌ వివాదాల్లో యధాతథస్థితిని (Status Quo Ante) కొనసాగించడానికి దీన్ని జారీ చేస్తారు. భర్తీ చేయడానికి వీలుపడని నష్టాన్ని అరికట్టేందుకు ఇన్‌జంక్షన్‌ను జారీ చేస్తారు. కాబట్టి ప్రాథమిక హక్కుల రక్షణకు, ఈ రిట్‌కు సంబంధం లేదు.

ప్రాథమిక హక్కులు – ఇతర నిబంధనలు

ప్రకరణ 33ను అనుసరించి, ప్రాథమిక హక్కులు కింది వర్గాలకు వర్తించే విషయంలో పార్లమెంటు చట్టం ద్వారా కొన్ని పరిమితులు విధించవచ్చు.
ఎ) సైనిక, పారా మిలటరీ దళాలు.
బి) పోలీసులు, ఇతర రక్షణపరమైన విధులు నిర్వర్తిస్తున్న సంస్థలు, అధికారుల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చు.
సి) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు.
డి) అత్యవసర సర్వీసులైన టెలి కమ్యూనికేషన్లు, ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగులు.

ప్రకరణ 34–సైనికచట్టం (Marshal Law)– ప్రాథమిక హక్కులపై పరిమితులు

దేశంలోని ఏదైనా ప్రాంతంలో సైనిక చట్టం ప్రకటించినప్పుడు ఆ సమయంలో సైనిక బలగాలు చేపట్టిన చర్యలు, తద్వారా జరిగిన నష్టాలకు, పరిణామాలకు వారిని బాధ్యులను చేయడానికి వీలులేదు. పార్లమెంటు ఒక చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలులేదు.

ప్రకరణ 34, 35ల మధ్య తేడా

ప్రకరణ 34లో ప్రస్తావించిన అంశాలు కేవలం కొన్ని వర్గాల ఉద్యోగులు, వారి హక్కులపై విధించిన పరిమితులు. ప్రకరణ 35లో ప్రస్తావించిన అంశాలు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులను పరిమితం చేయడానికి రూపొందించినవి. కాబట్టి ఒకటి వర్గానికి సంబంధించింది, మరొకటిæ ప్రాంతానికి సంబంధించినది.
ఉదా: 1958లో రూపొందించిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (Armed Forces (Special Power) Act AFSPA). దీన్ని పలు పర్యాయాలు సవరించి అసోం,మణిపూర్‌ రాష్ట్రాల్లోని కల్లోలిత ప్రాంతాల్లో విధించారు. అలాగే 1983లో పంజాబ్, చండీగఢ్‌లో కూడా ప్రయోగించారు. అక్కడి పరిస్థితుల కారణంగా శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులు విఫలమైనప్పుడు ఈ చట్టం ద్వారా సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.

ప్రకరణ– 35 చట్టబద్ధత, శిక్షలు

మూడో భాగంలో పేర్కొన్న నిబంధన అమలుకు చట్టబద్ధత కల్పించడం, శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. శాసనసభలకు ఉండదు. ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి లేదా ప్రక్రియ ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారాన్ని పార్లమెంటుకు మాత్రమే ఇచ్చారు.
ఉదా: ప్రకరణ 16(3) ప్రకారం రిజర్వేషన్ల అమ­లు, ప్రకరణ 32(3) ప్రకారం రిట్లు జారీ చేసే అధికారాన్ని న్యాయస్థానాలకు సంక్రమింపజేయడం, ప్రకరణ 33 ప్రకారం సాయుధ బలగాల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, ప్రకరణ 34 ప్రకారం సైనిక పాలన, మొదలైన అంశాలపై పార్లమెంటుకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అదే విధంగా ఈ భాగంలో పేర్కొన్న నేరాలకు, (ఉదాహరణకు ప్రకరణ 17లో పేర్కొన్న అస్పృశ్యత, 23లో పేర్కొన్న దోపిడీ, 24లోని బాలకార్మిక వ్యవస్థ మొదలైన వాటికి) శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుంది.
ప్రకరణ 35(బి) ప్రకారం, పై విషయాలకు సంబంధించి రాజ్యాంగం అమల్లోకి రాక పూర్వం ఉన్న చట్టాలు అలాగే కొనసాగుతాయి. అయితే ప్రకరణ 372 ప్రకారం పూర్వ శాసనాలకు మార్పులు, చేర్పులు, సవరణలు చేసి పార్లమెంటు కొత్త చట్టాలు రూపొందించుకోవచ్చు.

చదవండి: Indian Polity Study Material: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?

ప్రాథమిక హక్కులు–ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (Public Interest Litigation-PIL)

ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లను ప్రకరణ 32, ప్రకరణ 226లో పేర్కొన్నారు. హక్కులకు భంగం వాటిల్లినప్పుడు లేదా అమలు కానప్పుడు బాధితుడే కోర్టును ఆశ్రయిస్తాడు. అయితే బాధితుడికి సరైన అవగాహన లేకపోవడం లేదా ఆర్థిక, సామాజిక స్థితి పరంగా కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో బాధితులకు సంబంధించి ప్రజాప్రయోజనం అందులో ఇమిడి ఉంటే వారి తరఫున∙మూడో వ్యక్తి కూడా కోర్టులో వ్యాజ్యం వేయవచ్చు. దీన్నే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు.
సాధారణంగా కోర్టు జోక్యాన్ని కోరే హక్కు (Locus Standi) బాధితులకే ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఆ హక్కును ఇతరులకు కూడా సంక్రమింపజేసింది. ఈ వెసులుబాటును పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌ (పీఐఎల్‌) లేదా సోషల్లీ ఇంట్రస్ట్‌ లిటిగేషన్‌ అని అంటారు.
గమనిక: పీఐఎల్‌ భావన మొదట అమెరికా న్యాయ వ్యవస్థలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇండియాలోని పీఐఎల్‌ భావన అమెరికా నమూనా లాంటిదే. కానీ కొన్ని మార్పులతో పాటిస్తుంది.
రాజ్యాంగంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గురించి ప్రస్తావన లేదు. అయితే సుప్రీంకోర్టులో మొదటిసారి ఈ భావనను ప్రవేశపెట్టింది జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణ అయ్యర్‌. ఆ తర్వాత జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌కి మొదటిసారిగా 1979లో బిహార్‌ జైల్లో ఖైదీల తరఫున పీఐఎల్‌ దాఖలు చేశారు. దీన్నే హస్నార ఖతూన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు అంటారు.
1981లో ఎస్‌.పి.గుప్తా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసును పీఐఎల్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన కేసుగా పేర్కొంటారు. జస్టిస్‌ పి.ఎన్‌.­భగవతి పీఐఎల్‌ను చక్కగా నిర్వచించి, తగిన వివరణ ఇచ్చారు.
ప్రకరణ 32 ప్రకారం, సుప్రీంకోర్టులో, ప్రకరణ 226 ప్రకారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేయవచ్చు. ఇతర న్యాయస్థానాలకు ఈ అధికారం లేదు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి కుంభకోణాలు పీఐఎల్‌ ద్వారానే దేశంలో వెలుగులోకి వచ్చాయి.
పీఐఎల్‌ను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించరాదు. ప్రచారం కోసం ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయాలనే దురుద్ధేశంతో ప్రజాప్రయోజనాల నెపంతో పీఐఎల్‌ ను దాఖలు చేస్తే అలాంటి వ్యక్తులపై న్యాయస్థానాలు భారీ జరిమానాలు విధిస్తాయి. 
ఉదా: సంజీవ్‌ భట్నాగర్‌ జాతీయగీతం నుంచి సింధ్‌ అనే పదాన్ని తొలగించాలని సుప్రీంకోర్టులో పీఐఎల్‌ దాఖలు చేశారు. అది అనవసరమైన, ఆర్భాటమైన కేసుగా భావించి కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు భారీ జరిమానా విధించింది.

చదవండి: Fundamental Rights of India: ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?

ప్రాథమిక హక్కులపై పరిమితులు– జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావం

నిబంధన 352 ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మూడో భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ప్రకరణలు 358, 359లలో వివరణలు ఉన్నాయి.

ప్రకరణ 358 ప్రకారం బాహ్య అత్యవసర పరిస్థితి

యుద్ధం, దురాక్రమణ కారణంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకా­రం ప్రకరణ 19లో పేర్కొన్న స్వేచ్ఛలను మాత్రమే రద్దు చేస్తారు. ఇతర ప్రాథమిక హక్కులు రద్దు కావు.
ప్రకరణ 358 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రకరణ 19లో పేర్కొన్న స్వేచ్ఛలు వాటంతట అవే రద్దవుతాయి. కానీ ప్రకరణ 359 ప్రకారం ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేయాలి. ఎమర్జెన్సీ విధించినంత మాత్రాన వాటంతట అవే రద్దు కావు.
నిబంధన 358 పరిధి దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. కానీ ప్రకరణ 359 పరిధి దేశంలో కొన్ని ప్రాంతాలకు లేదా మొత్తం భాగానికి వర్తింపజేయవచ్చు.
జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ కారణంగా విధించినప్పటికీ (బాహ్య, అంతరంగిక కారణాలు) ప్రకరణ 20, 21 రద్దుకావు. ఈ అంశాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు.
ప్రకరణలు 358, 359 మధ్య కొంత సామీప్యం ఉంది. ఇవి అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా జరిగే పరిణామాలకు రక్షణ కల్పిస్తాయి కానీ ఎమర్జెన్సీతో సంబంధం లేని చట్టాలకు వర్తించవు.

ప్రాథమిక హక్కులు– మినహాయింపులు

ప్రకరణ 31–ఏ లో పేర్కొన్న ఐదు రకాల చట్టాలు తమ ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీలులేదు. ఈ అంశాలను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు.
నిబంధన 31–బిలో కూడా ఇలాంటి పరిమితులనే పేర్కొన్నారు. 31–సి ప్రకారం నిర్దేశిక నియమా­ల్లో పొందుపరిచిన 39–బి, 39–సి అమలు కోసం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తే, అది రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు.

చదవండి: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు

ప్రాథమిక హక్కులు – ముఖ్య వివాదాలు – సుప్రీంకోర్టు తీర్పులు

  • ఎ.కె. గోపాలన్‌ వర్సెస్‌ తమిళనాడు –1950: 1950లో చేసిన నివారక నిర్బంధ చట్టంలోని సెక్షన్‌ 4 న్యాయ సమీక్షాధికారానికి విరుద్ధంగా ఉన్నందున అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ చట్టం కింద ముందస్తు అరెస్టు సమంజసమేనని పేర్కొంది.
  • శంకర్‌ ప్రసాద్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా–1951: మొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాన్ని ఈ వివాదంలో సుప్రీం కోర్టు పరిశీలించింది. ఈ సవరణ రాజ్యాంగబద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ కేసులోనే సుప్రీం కోర్టు మొదటిసారి న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.
  • బేలా బెనర్జీ వర్సెస్‌ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం–1954: ఈ వివాదం కూడా ఆస్తి హక్కుకు సంబంధించిందే. ప్రభుత్వం ప్రజల ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు అందుకు మార్కెట్‌ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది.

 బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

Published date : 04 Oct 2023 08:14AM

Photo Stories