Skip to main content

Fundamental Rights of India: ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?

Fundamental Rights of India

ప్రాథమిక హక్కులు- విమర్శనాత్మక పరిశీలన

ప్రాథమిక హక్కుల్లో ఆర్థిక పరమైన హక్కులను గుర్తించలేదు. ఉదాహరణకు పని హక్కు, విశ్రాంతి హక్కు, సామాజిక భద్రతా హక్కులను ప్రాథమిక హక్కుల్లో పొందుపరచలేదు.

మితిమీరిన పరిమితులు

'మూడో భాగంలో ఆరు ప్రాథమిక హక్కులుంటే రెట్టింపు సంఖ్యలో పరిమితులున్నాయి. ఒకవైపు హక్కులు కల్పిస్తూ మరోవైపు పరిమితులు విధించడం సమంజసం కాదు' అని విమర్శకులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని మూడో భాగం ప్రాథమిక హక్కుల జాబితా కాదని, ప్రాథమిక హక్కులపై పరిమితుల జాబితా అని జస్వంత్‌రాయ్‌ కపూర్‌ అనే రచయిత వ్యాఖ్యానించారు. ఒక చేత్తో హక్కులిచ్చి మరో చేత్తో వాటిని తీసుకునే విధంగా హక్కులున్నాయని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు ఎం.సి. చాగ్లా వ్యాఖ్యానించారు.

చ‌ద‌వండి: Fundamental Rights (Article 28-32): ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త ఎవ‌రు?

స్పష్టత లేకపోవడం, కఠిన పదజాలం

ప్రాథమిక హక్కుల్లో ఉపయోగించిన భాష సంక్లిష్టంగా ఉంది. దీంతో ఇది సామాన్యులకు అర్థం కాదు. దీన్ని అర్థం చేసుకోవడం న్యాయకోవిదులకు కూడా తేలిక కాదు. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అన్న ఐవర్‌ జెన్నింగ్స్‌ విమర్శ ఒక్క ప్రాథమిక హక్కులతోనే రుజువు అవుతుంది.

ఆస్తి హక్కు- తొలగింపు

మౌలిక రాజ్యాంగంలో ఉన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. దీంతో ప్రాథమిక హక్కుల స్థాయిని తగ్గించినట్లయింది. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. నివారక నిర్బంధ చట్టాల ఆధారంగా ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చు. రాజకీయ ప్రయోజనాలు, కక్ష సాధింపులకు ఇది ఆస్కారం కల్పిస్తోంది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. అది శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణ వైఖరికి దారితీసే అవకాశముంది.

చ‌ద‌వండి: Fundamental Rights Notes for Group 1&2: సమన్యాయ పాలనను ప్రతిపాదించిందెవరు?

అత్యవసర పరిస్థితి-హక్కుల రద్దు

జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు. దీంతో ప్రజల స్వేచ్ఛలకు, హక్కులకు రక్షణ ఉండదు. ప్రాథమిక హక్కులపై విమర్శ ఉన్నప్పటికీ, వాటి ప్రాముఖ్యతను, విలువను విస్మరించలేం. ఇవి వ్యక్తి స్వేచ్ఛకు మూలాలు. వ్యక్తి వికాసానికి అనివార్యమైనవి. వ్యక్తులు నైతికంగా, భౌతికంగా ఎదగడానికి ఇవి ఎంతో అవసరం. హక్కుల అమలు కేవలం న్యాయస్థానాల జోక్యం ద్వారానే కాకుండా పౌరుల చైతన్యం, అవగాహనపై కూడా ఆధారపడి ఉంటుంది. నిరంతర అప్రమత్తతే పై స్వేచ్ఛలకు మూలం అని జె.ఎస్‌.మిల్‌ అనే రాజనీతిజ్ఞుడు వ్యాఖ్యానించాడు.

ఇతర భాగాల్లో ఉన్న హక్కులు

మూడో భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులే కాకుండా రాజ్యాంగంలోని మరికొన్ని భాగాల్లో రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కులున్నాయి. వీటినే ప్రాథమికేతర హక్కులు అంటారు.
ఉదాహరణలు:

  • 12వ భాగంలోని ఆర్టికల్‌ 265 ప్రకారం చట్టపరమైన ఆధారం లేనిదే పన్నులు విధించరాదు.
  • 12వ భాగంలో ప్రకరణ 300-ఎ ప్రకారం చట్టబద్ధంగా తప్ప మరే విధంగా వ్యక్తి ఆస్తికి భంగం కలిగించరాదు.
  • 15వ భాగంలో ప్రకరణ 326 ప్రకారం వయోజన ఓటుహక్కును గుర్తించారు. 

పై హక్కులకు కూడా న్యాయ సంరక్షణ ఉన్నప్పటికీ అవి ప్రాథమిక హక్కులతో సమానం కావు.
వీటి అమలు, రక్షణ కోసం ప్రకరణ-32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదు. కానీ ప్రకరణ-226 ప్రకారం హైకోర్టు ద్వారా రక్షణ పొందవచ్చు.

చ‌ద‌వండి: Fundamental Rights Of India: వ్యక్తి వికాసానికి కనీస అవసరాలైన శాసనాలు ఇవే..

రాజ్యాంగ సమీక్షా కమిషన్‌ సూచించిన ఇతర ప్రాథమిక హక్కులు

2000లో జస్టిస్‌ వెంకటాచలయ్య అధ్యక్షతన రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ను నియమించారు. రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రాథమిక హక్కుల జాబితాలో కింద పేర్కొన్న హక్కులను కూడా పొందుపరచాలని ఈ కమిషన్‌ సిఫారసు చేసింది.

  • పత్రికా స్వేచ్ఛ-సమాచార స్వేచ్ఛ
  • క్రూరమైన శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ
  • పని హక్కు
  • రహస్యాలను కాపాడుకునే హక్కు
  • రక్షిత మంచినీరు 
  • పర్యావరణ హక్కు
  • న్యాయం, న్యాయ సలహా పొందే హక్కు

చ‌ద‌వండి: Fundamental Rights Notes for Group 1&2: సమన్యాయ పాలనను ప్రతిపాదించిందెవరు?

ప్రాథమిక హక్కులు - ముఖ్య వివాదాలు సుప్రీంకోర్టు తీర్పులు
సజ్జన్‌ సింగ్‌ Vs రాజస్థాన్‌ -1964

ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ అధికారానికి సంబంధించిన వివాదాన్ని పరిశీలించింది. ఆస్తి హక్కుకు సంబంధించిన 17వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమేనని ప్రకటించింది.

గోలక్‌నాథ్‌ Vs పంజాబ్‌ ప్రభుత్వం-1967

పంజాబ్‌ ప్రభుత్వం రూపొందించిన భూసంస్కరణ చట్టాన్ని ఈ కేసులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కులను సవరించాలంటే ప్రత్యేక రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రకటించింది.

కేశవానంద భారతి Vs కేరళ ప్రభుత్వం-1973

ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించిన 24,25వ రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. గోలక్‌నాథ్‌ కేసులో చెప్పిన తీర్పులకు విరుద్ధంగా ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 'పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చరాదు' అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మౌలిక స్వరూపం(Basic Structure) అనే పదాన్ని తొలిసారిగా ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు ప్రయోగించింది.

మినర్వా మిల్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా -1980

ఈ కేసులో 42వ రాజ్యాంగ సవరణను ప్రశ్నించారు. 'ప్రాథమిక హక్కులు రాజ్యాంగ స్వరూపంలో భాగం. వాటిని తగ్గించడం లేదా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం' అని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది.

ఇందిరా సహాని Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా-1992

వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించారు.

ఉన్ని కృష్ణన్‌ Vs ఆంధ్రప్రదేశ్‌; మోహిని జైన్‌ Vs కర్ణాటక 1993

'ప్రాథమిక హక్కుల్లో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికే అర్థం లేదు. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలి' అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

krishna reddy-బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: Fundamental Rights of India: గతంలో అడిగిన ప్రశ్నలు ఇవే...

Published date : 06 Dec 2022 05:39PM

Photo Stories