Skip to main content

Fundamental Rights (Article 28-32): ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త ఎవ‌రు?

వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు
Fundamental Rights

ప్రకరణ-28
విద్యాలయాల్లో మత బోధన నిషేధం

ప్రకరణ 28(1): ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధం.
ప్రకరణ 28(2): పై నిబంధనకు కొన్ని మినహాయింపులిచ్చారు. ప్రభుత్వం నిర్వహించే దేవాదాయ, ధర్మాదాయ సంస్థల్లో ప్రత్యేక మత బోధన చేయవచ్చు.
ప్రకరణ 28(3): ప్రభుత్వ గుర్తింపు ఉన్న, ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే విద్యాసంస్థల్లో ఒక వ్యక్తి ఐచ్ఛికంగా మత ప్రార్థనలు/బోధనల్లో పాల్గొనవచ్చు. అయితే పాల్గొనమని ఒత్తిడి చేయరాదు. ఆ వ్యక్తి మైనర్‌ అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి అనుమతి తీసుకోవాలి.

చ‌ద‌వండి: Indian Polity for Groups Exams: వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు... వెట్టిచాకిరీని నిషేధించే ఆర్టికల్‌ ఏది?

ప్రకరణలు-29, 30 
విద్యా, సాంస్కృతిక పరమైన హక్కులు

ప్రకరణ 29(1): భారతదేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి ఉంటే.. వాటిని పరిరక్షించుకుని, పెంపొందించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది.
ప్రకరణ 29(2): ప్రభుత్వం నిర్వహిస్తోన్న లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో ప్రవేశానికి మతం, జాతి, కులం, భాషా ప్రాతిపదికన వివక్ష చూపరాదు.
ప్రకరణ 30(1): మైనారిటీ వర్గాలవారు, ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకొని, నిర్వహించుకోవచ్చు.
ప్రకరణ 30(1)(ఎ): మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే,వారికి ప్రత్యేక నష్టపరిహారం చెల్లించాలి. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్లాజును చేర్చారు.
ప్రకరణ 30(2): ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే సమయంలో విద్యాసంస్థల పట్ల వివక్ష చూపరాదు. అల్ప సంఖ్యాక వర్గాల వారు నడిపే సంస్థలు, అధిక సంఖ్యాక వర్గాల వారు నడిపే సంస్థలను సమ దృష్టితో చూడాలి.
వివరణ:

  • ఆర్టికల్‌ 29, 30లలో 'మైనారిటీ' పదాన్ని ప్రస్తావించారు. కానీ ఈ పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదు.
  • మైనారిటీల వర్గీకరణకు రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో రెండు రకాల మైనారిటీ వర్గాలున్నాయి. అవి మతపరమైన, భాషాపరమైన మైనారిటీ వర్గాలు.
  • హిందువులు మినహా మిగతా వారంతా మతపరమైన మైనారిటీలే. భాషాపరమైన మైనారిటీలు రాష్ట్రాల వారీగా మారుతుంటారు. ఉదాహరణకు.. తెలంగాణలో కన్నడిగులు, గుజరాతీలు, మరాఠీలు భాషాపరంగా మైనారిటీలు.

చ‌ద‌వండి: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు

సుప్రీంకోర్టు తీర్పులు

కేరళ విద్య పాఠ్యాంశాల సవరణ బిల్లు (1958) కేసు: కేరళ ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవ, కమ్యూనిస్టు భావాలున్న పాఠ్యాంశాలను చేర్చారు. దీంతో ఈ బిల్లును సుప్రీంకోర్టు సలహా పరిధికి నివేదించారు. పాఠ్యాంశాల్లో తీవ్రవాద భావజాలాన్ని చేర్చడం చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది.
డి.ఎ.వి. కాలేజ్‌ v/s స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (1971) కేసు: విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పంజాబీ మాత్రమే బోధన భాషగా ఉండాలని నిర్ణయించారు. అయితే ఇది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.
ఆల్‌సెయింట్స్‌ v/s గవర్నమెంట్‌æ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1980) కేసు: మెనారిటీ విద్యాసంస్థల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
టి.ఎం.ఎ.పాయ్‌ v/s స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక (2003) కేసు: మైనారిటీ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఏ సందర్భంలో జోక్యం చేసుకోవచ్చో, జోక్యం చేసుకోరాదో వివరణ ఇస్తూ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవి..

  • మైనారిటీ స్థాయిని నిర్ణయిం చడానికి రాష్ట్రాన్ని మాత్రమే యూనిట్‌గా తీసుకోవాలి. 
  • మైనారిటీ అనే పదంలో భాషాపరమైన, మతపరమైన మైనారిటీలు ఉండవచ్చు. 
  • బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, వారిపై పాలనా నియంత్రణ సంబంధిత హక్కులు మేనేజ్‌మేంట్‌కే ఉంటాయి. ప్రభుత్వ ధనసహాయం పొందని మైనారిటీ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదు. అయితే క్యాపిటేషన్‌ ఫీజులను ప్రభుత్వం నియంత్రించవచ్చు.

చ‌ద‌వండి: Fundamental Rights Of India: వ్యక్తి వికాసానికి కనీస అవసరాలైన శాసనాలు ఇవే..

ప్రకరణ - 31
ఆస్తిహక్కు

పార్లమెంటు ఆస్తి హక్కుకు సంబంధించి అనేక సవరణలు, చట్టాలు చేసింది. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ, 1964లో 17వ రాజ్యాంగ సవరణ, 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేశారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. దాన్ని 12వ భాగంలో ప్రకరణ 300-ఎలో రాజ్యాంగ పరమైన హక్కుగా (Constitutional Rights) చేర్చారు. 1979 జూన్‌ 20 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అలాగే ఆస్తి హక్కుకు సంబంధించి నూతన నిబంధనలను కూడా చేర్చారు.
ప్రకరణ 31(ఎ): ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు వర్తించే కొన్ని మినహాయింపులను ఈ ప్రకరణలో పేర్కొన్నారు. భూ సంస్కరణల అమలు కోసం చట్టాలు చేసినప్పుడు.. అవి 14, 19 ప్రకరణలకు  వ్యతిరేకమనే కారణంతో న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు.
ప్రకరణ 31(బి): కొన్ని చట్టాల వర్తింపునకు మినహాయింపులు. వీటిని 9వ షెడ్యూల్డ్‌లో ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంతో ఇలాంటి చట్టాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు. 9వ షెడ్యూల్డ్‌లో పేర్కొన్న అంశాలు సాధారణంగా న్యాయ సమీక్షకు గురికావు. కానీ 'రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో న్యాయ సమీక్ష అంతర్భాగం. దాన్ని పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు లేదు'అని కేశవానంద భారతి కేసు(1973)లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
2007లో ఐ.ఆర్‌. కొహెల్హో v/s తమిళనాడు కేసులో 'న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది. కాబట్టి 1973 తర్వాత 9వ షెడ్యూల్డ్‌లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్షకు గురవుతాయి' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రకరణ 31(సి): ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులపై, ముఖ్యంగా ఆస్తి హక్కుపై కొన్ని పరిమితులు విధించవచ్చు. ఈ పరిమితులు రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీల్లేదు.
ఆదేశిక సూత్రాల్లోని ప్రకరణ 39లో ఉన్న క్లాజు బి, సిలో సామ్యవాద తరహా సమాజ స్థాపన గురించి పేర్కొన్నారు. ఈ విషయమై రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు కొన్ని పరిమితులు విధిస్తే, అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని న్యాయస్థానంలో ప్రశ్నించలేం.
వివరణ: ప్రకరణ 31(ఎ),31(బి),31(సి)లు ఆస్తిహక్కుపై పరిమితికి సంబంధించినవి. ఇవి ఎలాంటి ప్రాథమిక హక్కులను ప్రసాదించవు.44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రకరణ 31ను తొలగించారు. కానీ వీటిని మాత్రం కొనసాగించారు.

చ‌ద‌వండి: Right to Freedom (Article 19-22): వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు... పత్రికా స్వేచ్ఛ గురించి తెలిపే ఆర్టికల్‌ ఏది?

ప్రకరణ - 32
రాజ్యాంగ పరిహార హక్కు (Right to Constitutional Remedies)

ప్రాథమిక హక్కుల్లో ఇది అత్యంత ముఖ్యమైంది. మూడో భాగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా/ఆ హక్కులను పరిమితం చేసినా/అమలు చేయకపోయినా, బాధితులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన రాజ్యాంగ పరిహారాలను పొందవచ్చు. మొదటి ఆరు ప్రాథమిక హక్కుల అమలు ఈ నిబంధన పైనే ఆధారపడి ఉంటుంది. హక్కులను గుర్తించడంతోపాటు, వాటి అమలుకు హామీ ఉన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది. అమలు కాని హక్కులు వ్యర్థం.
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు నిబంధన 32(4) హామీ ఇస్తోంది. అందుకే అంబేద్కర్‌ రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగ ఆత్మగా, హృదయంగా వర్ణించారు.
ప్రకరణ 32(1): ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా అవి అమలు కానప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన పరిహారం పొందవచ్చు.
ప్రకరణ 32(2): హక్కులను కాపాడటానికి ప్రత్యేక ఆదేశాలైన హెబియస్‌ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో-వారెంటో, సెర్షియరీ లాంటి రిట్లను సుప్రీంకోర్టు జారీ చేసేందుకు ఈ భాగం వీలు కల్పిస్తుంది.
ప్రకరణ 32(3): సుప్రీంకోర్టు అధికారాలకు విఘాతం కలగకుండా,ఇతర న్యాయస్థానాల(స్థానిక కోర్టులు, జిల్లా కోర్టులు)కు కూడా రిట్లు జారీచేసే అధికారాన్ని పార్లమెంటు చట్టం ద్వారా కల్పించవచ్చు.
ప్రకరణ 32(4): రాజ్యాంగంలో ఇతరత్రా అనుమతించిన విధంగా తప్ప ఈ ప్రకరణ ద్వారా గుర్తించిన హక్కులు రద్దు కావు.
వివరణ: రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో రాజ్యాంగ పరిహార హక్కు అంతర్భాగమని 1981లో ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

రిట్లు-పరిధి-పరిమితులు

ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జారీచేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయశాస్త్ర పరిభాషలో రిట్లు (Writs) అంటారు. రిట్లు జారీ చేసే పద్ధతిని బ్రిటన్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు. నిబంధన 32 ప్రకారం సుప్రీంకోర్టుకు, నిబంధన 226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారాన్ని కల్పించారు. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఈ అధికారాన్ని జిల్లా న్యాయస్థానాలకు కల్పించవచ్చు. ఇప్పటి దాకా పార్లమెంటు అలాంటి చట్టాలను రూపొందించలేదు. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉంది. రిట్ల జారీ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.
 హైకోర్టులు జారీ చేసే రిట్‌ అత్యవసర పరిస్థితుల్లో రద్దవుతుంది. ప్రకరణ 226 విషయ పరిధి తక్కువ. కానీ సుప్రీంకోర్టు జారీ చేసే రిట్‌ అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాదు. ప్రకరణ 32 విషయ పరిధి విస్తృతమైంది.
ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీం కోర్టుకు ప్రత్యేకమైన, ప్రాథమిక విచారణ పరిధి ఉంటుంది (Primary and Original). అందుకే సుప్రీం కోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త అంటారు.
ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉమ్మడి పరిధి ఉంటుంది. అంటే పౌరులు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రకరణ 32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టును లేదా ప్రకరణ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించవచ్చు.
సాధారణంగా హైకోర్టు ద్వారా తగిన రక్షణ, ఉపశమనం లభిస్తుందని పౌరులు భావిస్తే, మొదట హైకోర్టును ఆశ్రయించాలని కనుభాయ్‌ బ్రహ్మ భట్‌  ఠి/టగుజరాత్‌ (1972) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

చ‌ద‌వండి: Indian Polity for Groups Exams: వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు... వెట్టిచాకిరీని నిషేధించే ఆర్టికల్‌ ఏది?

వివిధ రిట్లు-అర్థం-పరిధి-ప్రాముఖ్యత
హెబియస్‌ కార్పస్‌ (Hebeas Corpus)

ఈ పదం లాటిన్‌ భాష నుంచి వచ్చింది. హెబియస్‌ అంటే 'Have', కార్పస్‌ అంటే 'Body' అని అర్థం. ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపర్చడమని దీనికి అర్థం. ఇది పురాతన రిట్‌. నిబంధన 19-22 వరకు పొందుపరచిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్‌ జారీ చేస్తారు. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి. లేని పక్షంలో ఈ రిట్‌ దాఖలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశిస్తుంది.
వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణతోపాటు చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడటం ఈ రిట్‌ ప్రధాన ఉద్దేశం. ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేట్‌ వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు. మూడో వ్యక్తికి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు (లోకస్‌ స్టాండై) ఉంటుంది. బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ/వ్యక్తి ఈ రిట్‌ దాఖలు చేయవచ్చు. అందుకే దీన్ని ఉదారమైన రిట్‌ అని, వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనమని అంటారు.

మినహాయింపులు
పార్లమెంటు స్వాధికారాలకు భంగం కలిగించిన కారణంతో వ్యక్తిని నిర్బంధించినప్పుడు, కోర్టు ద్వారా నేరారోపణ నిరూపితమై జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు.

మాండమస్‌ (Mandamus)
భాషాపరంగా మాండమస్‌ అంటే ఆదేశం అని అర్థం. సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జారీచేసే అత్యున్నత ఆదేశంగా దీన్ని చెప్పవచ్చు. ప్రభుత్వాధికారి/సంస్థ తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశం. ప్రభుత్వాధికారులు, సంస్థలు తమ విధులను చట్టబద్ధంగా నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం వాటిల్లుతుంది.అలాంటి సందర్భాల్లో వారు సక్రమంగా విధులు నిర్వర్తించడానికి ఈ రిట్‌ జారీ చేస్తారు. పబ్లిక్‌ సంస్థలు, క్వాజి పబ్లిక్‌ (Quasi Public),జ్యుడీషియల్‌ సంస్థలు,క్వాజి జ్యుడీషియల్‌ సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్‌ జారీ చేయవచ్చు.

మినహాయింపులు

రాష్ట్రపతి, గవర్నర్లకు ఈ రిట్‌ వర్తించదు. వీరు తమ అధికారాలు, విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వర్తించమని ఏ కోర్టు ఆదేశించలేదు. ప్రైవేట్‌ వ్యక్తులు, ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్‌ జారీచేయడానికి వీల్లేదు. మాండమస్‌ రిట్‌ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీచేస్తారు. అంటే పరిపాలనాపరమైన ప్రత్యామ్నాయాల ద్వారా పౌరులు న్యాయాన్ని పొందలేనప్పుడు ఈ రిట్‌ ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ రిట్‌ జారీ అనేది కోర్టు విచక్షణపై ఆ«ధారపడి ఉంటుంది.
అధికారులు తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధులకే ఇది వర్తిస్తుంది. విచక్షణా (Discretion) పూర్వకమైన విధులకు వర్తించదు.

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: ఎన్నో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి గాంధీజీ హాజ‌ర‌య్యాడు?

మత స్వేచ్ఛ - సుప్రీంకోర్టు తీర్పులు
బిజో ఇమాన్యువల్‌ v/s స్టేట్‌ ఆఫ్‌ కేరళ (1986) కేసు:

జాతీయ గీతాన్ని ఆలపించడం తమ మత విశ్వాసాలకు విరుద్ధమని నిరూపించగలిగితే.. జాతీయ గీతం పాడాలని ఏ వ్యక్తిని ఒత్తిడి చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేరళ పాఠశాలల్లో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో ఈ కేసు దాఖలైంది.

సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీ v/s స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ (1974) కేసు:

'లౌకికతత్వం' పదానికి ఈ కేసులో సుప్రీంకోర్టు  వివరణ ఇచ్చింది. మతానికి, దేవుడికి అతీతంగా వ్యవహరించడమే లౌకికతత్వం. దేవుడి పట్ల ప్రత్యేక ద్వేషం, వ్యతిరేకత చూపకూడదు. దేవుణ్ని నమ్మేవారిని, నమ్మని వారిని ప్రభుత్వం ఒకే విధంగా చూడాలి.

krishna reddy-బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

Published date : 22 Nov 2022 03:46PM

Photo Stories