Skip to main content

Right to Freedom (Article 19-22): వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు... పత్రికా స్వేచ్ఛ గురించి తెలిపే ఆర్టికల్‌ ఏది?

వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు: ప్రకరణ 19 నుంచి 22 వరకు ఉన్న హక్కులను వివిధ స్వేచ్ఛల రూపంలో పొందుపర్చారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛలు చాలా విలువైనవి. కానీ ఈ స్వేచ్ఛలపై హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చు. అధికరణం 19లో ఆరు వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి.
Right to Freedom (Article 19&22)

ప్రకరణ 19 (1)
ఎ.    వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన.
బి.    శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశాలు నిర్వహించడం.
సి.    సంస్థలు, సంఘాల ఏర్పాటు. సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణ.
డి.    దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ.
ఇ.    దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ.
ఎఫ్‌.    ఆస్తిని సముపార్జించుకునే స్వేచ్ఛ. (ఈ క్లాజ్‌ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.)
జి.    వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు.
పైన పేర్కొన్న ఆరు స్వేచ్ఛలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇవి భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు, కంపెనీలకు, కార్పొరేషన్లకు వర్తించవు.
ప్రకరణ 19(1)(ఎ)లో పేర్కొన్న వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు విస్తృత వ్యాఖ్యానాలు చేసింది. పౌరుడు తన భావాలతో పాటు ఇతరుల భావాలను కూడా వ్యక్తీకరించవచ్చు. ఇది పత్రికా స్వేచ్ఛ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి పత్రికా స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్‌ ప్రెస్‌)అనేది భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్గతంగా ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 
కింద పేర్కొన్న స్వేచ్ఛలు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్గతంగా ఉంటాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

  • పత్రికా స్వేచ్ఛ 
  • వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ
  • రహస్యాలను కాపాడుకునే స్వేచ్ఛ
  • ప్రసారాల స్వేచ్ఛ 
  • సమాచార స్వేచ్ఛ
  • బంద్‌కు వ్యతిరేకమైన స్వేచ్ఛ
  • మౌనం పాటించే స్వేచ్ఛ
  • నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ

చ‌ద‌వండి: Indian Polity Notes for Competitive Exams: భారత రాష్ట్రపతి–ఎన్నిక పద్ధతి, అధికార విధులు

మినహాయింపులు

ఈ స్వేచ్ఛలపై హేతుబద్ధమైన పరిమితులను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కింది కారణాల వల్ల పరిమితులు విధించవచ్చు.

  • భారత సార్వభౌమాధికారం, సమగ్రత.
  • దేశ రక్షణ, విదేశాలతో స్నేహా సంబంధాలు.
  • ప్రజాశాంతి, సఖ్యత, మర్యాద, నీతి, కోర్టు ధిక్కారం.
  • పరువు నష్టం, నేర ప్రేరేపణ తదితర ప్రాతిపదికలపై స్వేచ్ఛకు హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు.

ఈ పరిమితులు పార్లమెంట్, శాసనసభ చర్చలకు వర్తించవు. సభాధ్యక్షుల రూలింగ్‌ మేరకు సభ్యులు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ - సుప్రీంకోర్టు తీర్పులు

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు విస్తృత తీర్పులు వెలువరించింది.

శ్రేయా సింఘాల్‌ V/S యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2015)

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్‌ 66ఎ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని, అది చెల్లదని సుప్రీం తీర్పు చెప్పింది.

శ్రీమతి కుష్బు V/S తమిళనాడు (2012)

పౌరులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. ఒకరు వ్యక్తీకరించిన భావం నచ్చకపోతే న్యాయస్థానంలో దావా వేయవచ్చు. అంతేకానీ పూర్తిగా తమ భావాలను వ్యక్తీకరించకుండా నిషేధించడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. మేజర్లయిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోకుండా సహజీవనం చేయడం నేరం కాదని పేర్కొంది.

భరత్‌ కుమార్‌ V/S సి.పి.ఎం. (1998)

బంద్‌లు, సార్వత్రిక సమ్మెలు, ప్రాథమిక హక్కులు కావని, అవి ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, బలవంతంగా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. టి.రంగరాజన్‌ V/S తమిళనాడు కేసు(2003)లోనూ సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

చ‌ద‌వండి: Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?

బిజో ఇమాన్యూవల్‌ V/S స్టేట్‌ ఆఫ్‌ కేరళ (1986)

దీన్ని జాతీయ గీతం కేసుగా పేర్కొంటారు. జాతీయ గీతాన్ని ఆలపించడం తమ మత విశ్వాసానికి విరుద్ధమని ఎవరైనా నిరూపించగలిగితే జాతీయ గీతాన్ని ఆలపించమని ఎవరూ ఒత్తిడి చేయరాదని పేర్కొంది. ఒక వ్యక్తి మౌనంగా ఉండటం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమని వ్యాఖ్యానించింది.

మేనకా గాంధీ V/S యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1978)

పౌరులకు సంచార స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు దేశంలో ఉన్నప్పుడే కాకుండా, విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా వర్తిస్తాయని తెలిపింది. వాటికి భౌగోళిక పరిమితి ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నవీన్‌ జిందాల్‌ V/S యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1995)

జాతీయ జెండాను ప్రతి పౌరుడు ఎగురవేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగమని ప్రకటించింది. పత్రికలు లేదా మీడియాపై ముందస్తు సెన్సార్‌షిప్‌ లేదా నియంత్రణ సాధ్యం కాదు. కానీ సినిమాలపై ముందస్తు సెన్సార్‌షిప్‌ ఉండాలి. అది స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని, బ్రిజ్‌ భూషణ్‌ V/S యూనియన్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెన్సార్‌షిప్‌ విషయంలో పత్రికలు/మీడియాను, సినిమాలను ఒకే విధంగా చూడటం సమంజసం కాదని పేర్కొంది.
సమాచార స్వేచ్ఛ అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకునే హక్కు.

చ‌ద‌వండి: Fundamental Rights Notes for Group 1&2: సమన్యాయ పాలనను ప్రతిపాదించిందెవరు?

అది ప్రకరణ 19(1)(ఎ)లో అంతర్భాగం అని బెన్నెట్‌ కోల్‌మన్‌ కంపెనీ కేసులో 1973లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల 2005 జూన్‌లో పార్లమెంట్‌ సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది.

19 (1) (బి) - సమావేశ స్వేచ్ఛ
శాంతి భద్రతలకు భంగం కలగకుండా, ఆయుధాలు లేకుండా, శాంతియుతంగా సమావేశం కావడానికి పౌరులకు స్వేచ్ఛ ఉంది. కానీ సిక్కులు తమ మత చిహ్నమైన చిన్న కత్తిని(కృపాణం) ధరించి శాంతియుతంగా సమావేశం కావచ్చు. స్వేచ్ఛపై కూడా కొన్ని పరిమితులుంటాయి. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు,శాంతి భద్రతలకు భంగం కలిగించేలా నిర్వహించే సమావేశాలను నిషేధించవచ్చు. ఉదా:క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 144 ప్రకారం నిషేధాజ్ఞను, కర్ఫ్యూను అమలు చేయవచ్చు.

19 (1) (సి) - సంఘాలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
పౌరుడు స్వచ్ఛందంగా తమకు నచ్చిన సంఘాలు, సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించవచ్చు. నైతిక విరుద్ధమైన, సమాజ హితానికి వ్యతిరేకమైన సంస్థలను, దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే సంస్థలను, సంఘాలను అనుమతించరు.
2012లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా సహకార సంఘాలను ఏర్పాటు చేసి, నిర్వహించుకునే స్వేచ్ఛను ఆర్టికల్‌ 19(1)(సి)లో చేర్చారు.

19 (1) (డి) - సంచార స్వేచ్ఛ
పౌరులు తమ ఇష్ట ప్రకారం దేశమంతటా సంచరించవచ్చు. తద్వారా వారికి విశాల భావజాలం పెంపొందడమే కాకుండా వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే సంచార స్వేచ్ఛపై కొన్ని ఆంక్షలను విధించవచ్చు. ప్రజల సంక్షేమం,షెడ్యూల్డ్‌ తెగల ప్రయోజనాలు,శాంతి భద్రతల దృష్ట్యా జన సంచారాన్ని నిషేధించవచ్చు. సంచార సమయంలో పౌరులు కొన్ని నియమ నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. 
ఉదా: వాహనదారులు హెల్మెట్లు ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, అంటువ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు తీసుకోవడం తదితర సహేతుకమైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవచ్చు.

19(1)(ఇ): నివాసం ఏర్పరచుకొని స్థిరపడే స్వేచ్ఛ
దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పర్చుకొని స్థిరపడే స్వేచ్ఛ పౌరులకు ఉంది. అయితే ప్రజా సంక్షేమం, షెడ్యూల్డ్‌ ప్రాంతాల ప్రయోజనాల దృష్ట్యా ఈ హక్కుపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. 

19 (1) (ఎఫ్‌) - వృత్తి, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ
భారత పౌరులు తమకు ఇష్టమైన వృత్తి, వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం హేతుబద్ధమైన ఆంక్షలు విధించవచ్చు. ఉదా: జోగినీ, దేవదాసి, వేశ్యా వృత్తులను పూర్తిగా నిషేధించారు. కొన్ని వృత్తులను చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతితో పాటు కొన్ని అర్హతలుండాలి. నిర్దిష్టమైన షరతులు పాటించాలి.
ఉదా: వైద్య వృత్తి, న్యాయవాద వృత్తి. ఔషధాలను విక్రయించే వారికి ప్రత్యేక అర్హతలతో పాటు ప్రభుత్వ అనుమతి కూడా ఉండాలి.

చ‌ద‌వండి: Fundamental Rights Of India: వ్యక్తి వికాసానికి కనీస అవసరాలైన శాసనాలు ఇవే..

ప్రకరణ-20

నేరం, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు
ఈ నిబంధన ప్రకారం వ్యక్తులకు నేరం, శిక్ష నుంచి రక్షణ పొందేందుకు కొన్ని అంశాలను పొందుపరిచారు.

  • 20(1) ప్రకారం తప్పు చేయనిదే ఎవరినైనా శిక్షించరాదు. ఒక వ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరమైతేనే శిక్షించాలి. ఆ నేరానికి చట్టపరంగా విధించాల్సిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష విధించరాదు. కానీ తక్కువ శిక్షను విధించవచ్చు. దీన్ని 'Doctrine of Beneficial Construction' అంటారు.
  • 20(2) ప్రకారం ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు.
  • 20(3) ప్రకారం ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు.
  • ఒక వ్యక్తి వర్తమానంలో చేసిన పనిని భవిష్యత్‌ కాలంలో నేరంగా పరిగణించి శిక్షించరాదు. క్రిమినల్‌ చట్టాలు చేసిన రోజు నుంచి లేదా తర్వాతి కాలం నుంచి అమల్లోకి వస్తాయి. క్రిమినల్‌ చట్టాలు ముందుకాలానికి వర్తిస్తాయి. కానీ గత కాలానికి వర్తించవు. దీన్నే న్యాయ పరిభాషలో ఎక్స్‌ పోస్ట్‌ ఫ్యాక్టో చట్టాలు (Expost Facto Legislations) అంటారు. ఎక్స్‌ పోస్ట్‌ ఫ్యాక్టో అంటే Now and After, Not Before అని అర్థం. 
  • సివిల్‌ చట్టాలను గతకాలానికి కూడా వర్తింపజేయవచ్చు. ఉదా: ప్రభుత్వం ఇంటి పన్నును పెంచుతూ 2015 జనవరి 26న ఆదేశాలు జారీ చేస్తే.. అది గత ఏడాది జూలై నుంచి వర్తిస్తుందని పేర్కొనడం సమంజసమే. పౌరులు ఆ రోజు నుంచి పెరిగిన పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Indian Polity Notes for Group 1&2: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన కమిషన్‌ ఏది?

డబుల్‌ జపార్డి

ద్వంద్వ శిక్షలను న్యాయ పరిభాషలో డబుల్‌ జపార్డి (Double Jeopardy) అంటారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఒకసారి శిక్ష పడి ఉంటే అదే నేరానికి మరోసారి శిక్ష వేయరాదు. ఈ రక్షణ న్యాయపరమైన ప్రక్రియలకు మాత్రమే వర్తిస్తుంది. శాఖాపరమైన, పరిపాలనాపరమైన చర్యలకు వర్తించదు.
ఉదా: ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు రుజువైతే అతణ్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు. జైలు శిక్ష విధించడంతోపాటు అన్యాక్రాంతమైన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేస్తారు. ఇక్కడ తప్పు ఒక్కటే కానీ శిక్షలు ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు.

స్వయం సాక్ష్యం చెల్లదు

ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు. దీన్ని న్యాయభాషలో సెల్ఫ్‌ ఇంక్రిమినేషన్‌ (Self Incrimination) అంటారు. కానీ ముద్దాయి చేతిగుర్తులు, చేతిరాత, రక్త నమూనాలను అతడికి వ్యతిరేక సాక్ష్యాలుగా తీసుకుంటారు. 1978లో నందిని శతపతి V/S పి.ఎల్‌.డానీ కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని విశదీకరించింది. దీని ప్రకారం.. బెదిరించి,శారీరకంగా హింసించి,మానసిక క్షోభకు గురిచేసి నేరం ఒప్పుకునేలా చేసి సమాచారం రాబడితే అది బలవంతపు సాక్ష్యం కిందకు వస్తుందని పేర్కొంది. అలాంటి చర్యలు ఆర్టికల్‌ 20(3)కు వ్యతిరేకమని పేర్కొంది.నేర వైద్య శాస్త్ర పరంగా (For-ensic Science) నిందితుల నుంచి సమాచారం రాబట్టడం కొంత మేరకు చెల్లుబాటు అవుతుంది.
ఉదా: సత్యశోధన లేదా లై డిటెక్టర్‌ (Polygraph), నార్కో అనాలిసిస్, మైండ్‌ మ్యాపింగ్‌ మొదలైనవి. అయితే కొన్ని రసాయనాలు ఉపయోగించి చేసే నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ పూర్తిగా శాస్త్రబద్ధం కాదని కొవ్వాడ గాంధీ కేసు (2011)లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

చ‌ద‌వండి: Indian Territory-Union of India: భారత భూభాగం-భారత యూనియన్‌.. రాష్ట్రాల ఏర్పాటు-పునర్‌ వ్యవస్థీకరణ

ప్రకరణ -21

వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి రక్షణ
ఇది చాలా ముఖ్యమైంది. భారత పౌరులతోపాటు విదేశీయులకు కూడా వర్తిస్తుంది. జీవించే హక్కును, ఆంతరంగిక స్వేచ్ఛను చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం తప్ప మరే విధంగా హరించడానికి వీల్లేదు. ఈ నిబంధన వ్యక్తి జీవించే స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది. చట్టం నిర్దేశించిన పద్ధతి అనే భావాన్ని జపాన్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు. శాసనసభల చట్టాల నిర్ణీత పద్ధతి ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే పైన పేర్కొన్న పద్ధతి చెల్లుబాటవుతుంది. ఈ ప్రకరణను కార్యనిర్వాహక అధికారాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాత్రమే పొందుపరిచారు. ఇది శాసనసభల చట్టాలకు వ్యతిరేకంగా రక్షణ ఇవ్వదు.
ప్రకరణ 21లో కల్పించిన రక్షణలు కార్య నిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తిస్తాయి. శాసనపరమైన చర్యలకు వర్తించవు. వీటిని న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మేనకా గాంధీ కేసులో విస్తృతంగా వ్యాఖ్యానించింది. శాసన శాఖ చర్యలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించేలా కొన్ని సూత్రాలను నిర్దేశించింది.

krishna reddy-బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

Published date : 08 Nov 2022 05:56PM

Photo Stories