Skip to main content

Fundamental Rights Of India: వ్యక్తి వికాసానికి కనీస అవసరాలైన శాసనాలు ఇవే..

Fundamental Rights Of India

ప్రభుత్వ గొప్పదనం అనేది అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుందని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు హెచ్‌.జె. లాస్కీ వ్యాఖ్యానించారు. హక్కు అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనంలో ఒక ప్రాథమిక రాజకీయ భావన. ప్రజలు కోరుకునే, ప్రభుత్వం గుర్తించిన అధికారాన్నే హక్కుగా పేర్కొనవచ్చు. హక్కు అంటే అవకాశం, అధికారం కలిగి ఉండటం అని కూడా చెప్పవచ్చు. హక్కులు.. ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు. ఒక వ్యక్తి తన శక్తి, తెలివితేటల ఆధారంగా ఔన్నత్వం, సంపూర్ణ వికాసం పొందడానికి దోహదపడే పరిస్థితులనే హక్కులుగా అభివర్ణించవచ్చు.

ప్రాథమిక హక్కులు

భారత రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రకరణలు 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతాయి. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన లక్షణంగా పేర్కొంటారు. వీటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం నుంచి గ్రహించారు. అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను 'బిల్‌ ఆఫ్‌ రైట్స్‌' రూపంలో పొందుపరిచారు. చట్టబద్ధమైన హక్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించి, ప్రత్యేక ప్రతిపత్తితో గుర్తిస్తే వాటిని 'ప్రాథమిక హక్కులు'గా పేర్కొంటారు. వ్యక్తి వికాసానికి ఇవి కనీస అవసరాలు. దేశ ప్రాథమిక శాసనమైన రాజ్యాంగంలో గుర్తించడం వల్ల వీటిని 'ప్రాథమిక హక్కులు' అని అంటారు.

చ‌ద‌వండి: Indian Polity Notes for Group 1&2: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన కమిషన్‌ ఏది? 

ప్రాథమిక హక్కుల నేపథ్యం

 • రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ 1895లో 'స్వరాజ్య బిల్లు'లో మొదటిసారిగా ఈ హక్కులను ప్రతిపాదించారు. ఆ తర్వాత..
 • 1911లో కలకత్తాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు.
 • 1922లో మహాత్మా గాంధీ సాధారణ ప్రజల హక్కుల గురించి 'యంగ్‌ ఇండియా'లో ప్రస్తావించారు.
 • 1925లో అనిబీసెంట్‌.. కామన్‌వెల్త్‌ ఆఫ్‌ ఇండియా బిల్లులో, ఐర్లాండ్‌ రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగానే భారతీయులకూ ప్రాథమిక హక్కులు ఉండాలని ప్రతిపాదించారు.
 • 1927లో మద్రాసులో ఎం.ఎ.అన్సారీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో భావి రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలనే తీర్మానాన్ని ఆమోదించారు.
 • 1928లో మోతీలాల్‌ నెహ్రూ కమిటీ వెల్లడించిన నివేదికలో 'ప్రాథమిక హక్కులకు ఆమోదం పొందడం పౌరుల అవసరం'గా పేర్కొన్నారు. 
 • 1931లో కరాచీలో వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన కొంతమంది ప్రముఖులు ప్రాథమిక హక్కుల గురించి డిమాండ్‌ చేశారు. మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి వీరి నివేదికే ప్రాతిపదిక అయింది.
 • 1931లో నిర్వహించిన రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మహాత్మా గాంధీ భావి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని కోరారు. 
 • 1945లో తేజ్‌ బహదూర్‌ సప్రూ నాయకత్వంలో ఏర్పడిన పార్టీ రహిత మేధావుల సంఘం కూడా ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్‌ చేసింది.

చ‌ద‌వండి: Indian Territory-Union of India: భారత భూభాగం-భారత యూనియన్‌.. రాష్ట్రాల ఏర్పాటు-పునర్‌ వ్యవస్థీకరణ 

రాజ్యాంగ పరిషత్తు - ప్రాథమిక హక్కులు

హక్కులను రాజ్యాంగంలో చేర్చి, వాటికి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించడానికి రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 24న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ సలహా సంఘం ప్రాథమిక హక్కుల పరిశీలన కోసం 1947 ఫిబ్రవరి 12న ఆచార్య జె.బి. కృపలాని అధ్యక్షతన ఒక ఉప సంఘాన్ని నియమించింది.
ఉప సంఘం సూచన మేరకు రాజ్యాంగ పరిషత్‌ సలహాదారు బి.ఎన్‌. రావు హక్కులపై ఒక ముసాయిదా తయారు చేశారు. ఈ ముసాయిదాలో హక్కులను.. న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, న్యాయ సంరక్షణ లేని హక్కులుగా వర్గీకరించారు.

ప్రాథమిక హక్కులు - లక్షణాలు

 • ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే తాత్విక ఆదర్శాలకు వాస్తవికతను చేకూర్చే విధంగా ప్రాథమిక హక్కులను పొందుపరిచారు.
 • ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ (Justiciable) ఉంది. ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. వీటి రక్షణ, అమలుకు రాజ్యాంగంలో న్యాయపరమైన ఏర్పాట్లు ఉన్నాయి.
 • ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాల (Absolute Authority) పై పరిమితులు. ప్రభుత్వాలు తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి, ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించాలి.
 • కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి (Negative). అంటే ఇవి ప్రభుత్వ అధికారితపై పరిమితులు. 
  ఉదా: నిబంధనలు 14, 15, 16, 20, 21 మొదలైనవి. ఇవి ప్రభుత్వం ఏయే అంశాలను చేయకూడదో సూచిస్తాయి.
 • మరికొన్ని హక్కులు సకారాత్మకమైనవి (Positive). ఇవి ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి.
  ఉదా: నిబంధన 17లోని అస్పృశ్యత నిషేధం, నిబంధన 24లోని బాల కార్మిక వ్యవస్థ నిషేధం.
 • ప్రాథమిక హక్కులన్నింటినీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు. నిబంధనలు 20, 21 మాత్రం రద్దుకావు. 
 • ప్రాథమిక హక్కులన్నీ స్వతహాగా అమల్లోకి వస్తాయి. కానీ, నిబంధనలు 17, 23, 24లో ప్రస్తావించిన అంశాలు స్వతహాగా అమల్లోకి రావు (Non selfexecutory). వీటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
 • ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం. కానీ, సవరణ పేరుతో వీటి స్ఫూర్తికి భంగం కలిగించకూడదు.
 • కొన్ని ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలు, సాయుధ బలగాలు, పోలీసులు, ఖైదీలు, అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్నవారికి పరిమితంగా వర్తిస్తాయి.
 • కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా లభిస్తాయి. ఉదా:ప్రకరణ 17 -అస్పృశ్యత నివారణ, ప్రకరణ 23-వెట్టిచాకిరి రద్దు, ప్రకరణ 24-బాలకార్మిక వ్యవస్థ రద్దు.
 • కొన్ని హక్కులను అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడి, జాతీయ సమగ్రత నిలపడానికి ఉద్దేశించారు. ఉదా: మతస్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు.
 • ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్న నిషేధాలు/ వివక్షలు.. ప్రభుత్వాలు, పౌరులకు సమానంగా వర్తిస్తాయి. ఉదా: జాతి, మత, కుల, లింగ, జన్మ సంబంధ వివక్షలను ఎవరూ పాటించకూడదు.

చ‌ద‌వండి: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు 

ప్రాథమిక హక్కుల వర్గీకరణ

భారత రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కుల గురించి తెలిపారు.
1.    సమానత్వ హక్కు (Right to Equality): ప్రకరణలు 14-18.
2.    వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్ర హక్కు (Personal Freedoms): ప్రకరణలు 19-22.
3.    పీడనాన్ని నిరోధించే హక్కు (Right against Exploitation): ప్రకరణలు 23, 24. 
4.    మత స్వాతంత్య్ర హక్కు (Right to Religion): ప్రకరణలు 25-28.
5.    సాంస్కృతిక, విద్యా హక్కులు (Cultural & Educational rights): ప్రకరణలు 29, 30.
6.    ఆస్తి హక్కు(Right to Property): ప్రకరణ 31.
7.    రాజ్యాంగ పరిహార హక్కు (Right to Constitutional Remedies): ప్రకరణ 32.

ప్రత్యేక వివరణ

పైన పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లో అత్యంత వివాదాస్పదమైన ఆస్తి హక్కు (ప్రకరణ 31)ను, ఆస్తి సంపాదన విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన 19(1)(జ)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. వీటిని 12వ భాగంలోని 300(ఎ)లో చేర్చారు. ప్రస్తుతం ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధ హక్కు (Constitutional Right) మాత్రమే. దీన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగానూ పరిగణిస్తున్నారు. 

చ‌ద‌వండి: Indian Polity Terminology: భారత రాజ్యాంగ పీఠికలోని పదజాలం!

ప్రకరణ 12 - రాజ్యం నిర్వచనం

ప్రాథమిక హక్కులను మౌలికంగా రాజ్యం నిరపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా పొందుపరిచారు. రాజ్యాంగంలో రాజ్యం అనే పదాన్ని చాలా చోట్ల ప్రయోగించారు. అయితే రాజ్యం నిర్వచనాన్ని మాత్రం ప్రకరణ 12లో పేర్కొన్నారు. రాజ్యం అనే పదానికి విస్తృతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ప్రాథమిక హక్కులను రాజ్యం లేదా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించారు. కాబట్టి ఏయే సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయి? అనే అంశాన్ని స్పష్టంగా నిర్వచించకపోతే కొన్ని సంస్థలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినా వాటిపై న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం ఉండదు. అందువల్ల దీనికి విస్తృతమైన నిర్వచనం అవసరం. దీని ప్రకారం రాజ్యం అంటే..
ఎ.    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; కేంద్ర, రాష్ట్ర శాసనసభలు
బి.    స్థానిక ప్రభుత్వాలు (మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు)
సి.    ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ, చట్టేతర సంస్థలు (ఎల్‌.ఐ.సి., ఓ.ఎన్‌.జి.సి., ఎన్‌.టి.పి.సి. మొదలైనవి)
డి.    న్యాయవ్యవస్థ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పుల్లో తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్‌ సంస్థలు కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
పైన పేర్కొన్న సంస్థలతో పాటు ఎలాంటి ఇతర సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయనే అంశాన్ని సుప్రీంకోర్టు వివిధ కేసుల తీర్పుల సందర్భంగా స్పష్టపరిచింది. అవి:
అజయ్‌ సహాయ్‌ వర్సెస్‌ ఖలీద్‌ ముజీద్‌ (1981): సుప్రీంకోర్టు ఈ కేసు తీర్పులో ఒక సంస్థను రాజ్యం అనే నిర్వచనంలోకి చేర్చడానికి కింది ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

 • మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి.
 • ఆ సంస్థ మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలి
 • ఆ సంస్థపై సంపూర్ణ పరిపాలనా నియం త్రణ ఉండాలి.
 • ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి.

చ‌ద‌వండి: Constitution of India Notes for Competitive Exams: రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

న్యాయస్థానాలు రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి - సుప్రీంకోర్టు తీర్పులు

ఎ.ఆర్‌. అంతూలే వర్సెస్‌ ఆర్‌.ఎస్‌. నాయక్‌ కేసు (1988): న్యాయస్థానాల కొన్ని చర్యలు రాజ్య నిర్వచనంలోకి వస్తాయని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి రాజ్యాంగంలో స్పష్టమైన ఆధారాలున్నాయి.
ప్రకరణ 145, 146 ప్రకారం సుప్రీంకోర్టు సొంత నియమ, నిబంధనలను రూపొందించుకోవచ్చు. అదేవిధంగా తన సిబ్బందిని నియ మించుకునే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. ఈ చర్యలు కార్యనిర్వాహకపరమైనవి. వీటివల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు.
కాబట్టి న్యాయశాఖ కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే రాజ్యమనే పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

రాజ్యం నిర్వచనం - మినహాయింపులు

సహకార సంఘాలు; బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా; ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేట్‌ విద్యాసంస్థలు; ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నియంత్రణ లేని ఇతర సంస్థలు రాజ్యం నిర్వచనం పరిధిలోకి రావు. 
ప్రకరణ 13-చట్టం నిర్వచనం, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు - న్యాయ సమీక్షాధికారం.
ప్రకరణ 13(1) ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అంతవరకు అమల్లో ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే.. అవి చెల్లకుండా పోతాయి.
ప్రకరణ 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను హరించే లేదా పరిమితం చేసే చట్టాలు, ఆదేశాలు చెల్లవు.

ప్రకరణ 13(3)లో పేర్కొన్న చట్టం నిర్వచనం కిందకి వచ్చే అంశాలు:

 • కేంద్ర, రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు.
 • రాష్ట్రపతి, గవర్నర్‌ జారీ చేసిన ఆదేశాలు, ఆర్డినెన్స్‌లు.
 • ప్రభుత్వ రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్, ప్రకటనలు.
 • ప్రభుత్వం గుర్తించిన, చట్టబద్ధత ఉన్న ఆచార వ్యవహారాలు.

ప్రత్యేక వివరణ

1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా.. నిబంధన 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణలను నిబంధన 13లో పేర్కొన్న 'చట్టం' నిర్వచన పరిధి నుంచి మినహాయించారు. ఈ అంశాన్ని గోలక్‌నాథ్‌ కేసు(1967)లో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి చేర్చారు. కానీ, సుప్రీంకోర్టు 1973లో కేశవానందభారతి కేసులో ఈ సవరణ చెల్లదని తీర్పు చెప్పింది. కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా చట్టం నిర్వచన పరిధిలోకి వస్తుంది.

krishna reddy-బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: Indian Polity Study Material: భారత రాష్ట్రపతి

Published date : 18 Oct 2022 05:49PM

Photo Stories