Indian Polity for Groups Exams: వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు... వెట్టిచాకిరీని నిషేధించే ఆర్టికల్ ఏది?
ప్రకరణ 21
విస్తృత పరిధి, అభ్యుదయ వ్యాఖ్యానాలు
మేనకా గాంధీ కేసు, ఇంద్రజిత్, వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ కేసు, ప్రేమశంకర్ శుక్లా కేసు, నరేంద్రకుమార్ కేసు, మోహిని జైన్ కేసు, ఆటోశంకర్ కేసు, శ్రీమతి ఖుష్బు కేసు మొదలైన వాటిల్లో సుప్రీంకోర్టు జీవించే స్వేచ్ఛపై విస్తృత అర్థాన్ని చెప్పింది. ఈ తీర్పుల సారాంశం ప్రకారం ప్రకరణ 21లో కింద పేర్కొన్న హక్కులు కూడా అంతర్భాగమే.
- గౌరవప్రదంగా జీవించే హక్కు
- కాలుష్య రహిత వాతావరణ హక్కు
- రహస్యాలను, ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు
- ఉచిత న్యాయ సలహా హక్కు
- విదేశాల పర్యటన హక్కు
- లాకప్ మరణాల వ్యతిరేక హక్కు
- సమాచార హక్కు
- సహజీవన హక్కు
- ఏకాంతంగా జీవించే హక్కు
- సత్వర విచారణ పొందే హక్కు
- మరణ శిక్ష అమలును ఆలస్యం చేయడంపై అడిగే హక్కు
- ఆహార హక్కు
- నిద్ర హక్కు
చదవండి: Right to Freedom (Article 19-22): వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు... పత్రికా స్వేచ్ఛ గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
ఆత్మహత్యా ప్రయత్నం–జీవించే హక్కు– తాజా వివాదం
ప్రకరణ 21 జీవించే హక్కును కల్పించింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యాయత్నం శిక్షార్హమైన నేరం.ఈ సెక్షన్ అమానుషమైందని, దాన్ని ఇండియన్ పీనల్ కోడ్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ సెక్షన్‌ను తొలగిస్తున్నట్లు ఇటీవలే కేంద్రం ప్రకటించింది.
‘ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అసహజమైన కోరిక. కాబట్టి ఆ కోరికకు కారణమైన పరిస్థితులను పరిశీలించాలి. అలాంటి వ్యక్తులకు సరైన కౌన్సెలింగ్ నిర్వహించాలి. పోలీసు కేసులతో వేధించరాదు’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కారుణ్య మరణం (Euthanasia): 2011లో పింకీ విరానీ అనే జర్నలిస్టు అరుణా షాన్‌బాగ్ తరఫున సుప్రీంకోర్టులో కేసు వేసింది. వృత్తి రీత్యా నర్సు అయిన అరుణ షాన్‌బాగ్ బొంబాయి ఎడ్వర్డ్ ఆసుపత్రిలో లైంగిక దాడికి గురైంది.ఆమె సుమారు 37 సంవత్సరాలు కోమాలోనే ఉంది. ఆమె పరిస్థితి దృష్ట్యా కారుణ్య మరణానికి అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. న్యాయస్థానం కారుణ్య మరణాన్ని నిరాకరించింది. ప్రత్యేక పరిస్థితుల్లోనే పాసివ్ కారుణ్య మరణాన్ని అనుమతిస్తామని పేర్కొంది.
విద్యాహక్కు (ప్రకరణ 21–ఎ) (Right to education): విద్యాహక్కును 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్–21ఎలో చేర్చారు. 6–14 ఏళ్ల మధ్య వయసున్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్నారు.
వాస్తవానికి 2002కు ముందు ఆదేశ సూత్రాల్లోని ఆర్టికల్ 45లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుపరిచారు. కానీ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఆర్టికల్ 21–ఎకి బదలాయించి ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ప్రస్తుతం నిబంధన 45లో ఉచిత ప్రాథమిక విద్యను (ఆరేళ్ల లోపు వారికి) అందించాలనే కొత్త అంశాన్ని చేర్చారు.2009లో విద్యా హక్కు చట్టాన్ని చేశారు. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
విద్యా హక్కుచట్టం ముఖ్యాంశాలు
- ఒకటి నుంచి అయిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి నివాస ప్రదేశానికి ఒక కి.మీ. పరిధిలో పాఠశాల ఉండాలి.
- ప్రైవేట్ పాఠశాలల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25 శాతం సీట్లను బలహీన వర్గాలకు కేటాయించాలి.
- ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉండాలి.
- ఈ చట్టం అమలుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో భరిస్తాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కోటాలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండరాదు.
చదవండి: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు
విద్యాహక్కు – సుప్రీంకోర్టు తీర్పులు
1992లో మోహిని జైన్ v/s కర్ణాటక, ఉన్నికృష్ణన్ v/s ఆంధ్రప్రదేశ్ కేసుల్లో జీవించే హక్కు, వ్యక్తి గౌరవాన్ని పొందే హక్కుల్లో విద్యా హక్కు అంతర్భాగం. దాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా బాలలకు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని తమిళనాడు ప్రభుత్వం v/s శ్యామ్ సుందర్ కేసు (2011)లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ప్రాథమిక విధి: ఇదే సవరణ ద్వారా నిబంధన 51–ఎలో ప్రతి తల్లిదండ్రులు, సంరక్షకులు 6 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న తమ పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పించాలనే విధిని నూతన ప్రాథమిక విధిగా పేర్కొన్నారు.
ప్రకరణ–22
అక్రమ నిగ్రహణ (Arrest), నిర్బంధం (Detention) నుంచి రక్షణ
అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు వ్యతిరేకంగా ఆర్టికల్ 22 రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రకరణ ప్రకారం చట్టబద్ధంగా అరెస్ట్ చేయడానికి కొన్ని ప్రాతిపదికలు పాటించాలి. అవి..
ప్రకరణ 22 (1):
ఎ) ప్రతి అరెస్టుకు కారణం ఉండాలి లేదా కారణాన్ని తెలియజేయాలి. న్యాయవాదిని సంప్రదించే అవకాశం ఇవ్వాలి.
బి) నిందితుణ్ని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి.
24 గంటలను లెక్కించేటప్పుడు ప్రయాణ సమయాన్ని మినహాయిస్తారు. సెలవు దినాలను మినహాయించరు. అరెస్టయిన వ్యక్తిని సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చాలి. పై రక్షణలకు కొన్ని మినహాయింపులున్నాయి. ప్రకరణ 22(3) ప్రకారం శత్రు దేశ పౌరులకు, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టయిన వారికి ఈ రక్షణలు వర్తించవు.
ప్రకరణ 22(4) ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టయిన వారిని మూడు నెలలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద ఏర్పాటైన ఎడ్వైజరీ బోర్డు సూచన మేరకు మూడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అర్హతలున్న వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.
ప్రకరణ 22(5) ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్టయిన వారికి తమను ఎందుకు అరెస్టు చేశారో వీలైనంత త్వరగా తెలపాలి. తద్వారా బాధితులకు పిటీషన్ వేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రకరణ 22(6) ప్రకారం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రివెంటివ్ అరెస్టుకు కారణాలను వెల్లడించకుండా ఉండే అధికారం ప్రభుత్వానికి ఉంది.
ప్రకరణ 22(7) ప్రకారం పైన పేర్కొన్న క్లాజులతో సంబంధం లేకుండా మూడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధించే విధంగా పార్లమెంట్ శాసనాలు రూపొందించవచ్చు.
చదవండి: Fundamental Rights Notes for Group 1&2: సమన్యాయ పాలనను ప్రతిపాదించిందెవరు?
ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు, వివరణ: సాధారణంగా నిర్బంధాలు రెండు రకాలు:
1. శిక్షించే చట్టాలు 2. నివారక చట్టాలు.
శిక్షించే చట్టాల్లో ముద్దాయి నేరం రుజువయ్యాక కోర్టు విధించిన శిక్షను అమలు చేయడానికి నిర్బంధిస్తారు. నివారక నిర్బంధంలో విచారణ లేకుండా నేరం చేస్తారేమో అనే అనుమానంతో నిందితుణ్ని లేదా అనుమానితుణ్ని ముందుగానే నిర్బంధిస్తారు.దేశ రక్షణ,శాంతి భద్రతల దృష్ట్యా ఇలా చేస్తారు.
సుప్రీంకోర్టు తీర్పులు
ఎ.కె.గోపాలన్ v/s స్టేట్ ఆఫ్ మద్రాస్ (1950):
ఒక వ్యక్తిని అరెస్టు చేస్తున్నప్పుడు అతడికి కారణాలను తెలపడం సంబంధిత పోలీస్ అధికారి బాధ్యత. అలాగే అరెస్టయిన వ్యక్తికి తన వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి. దీన్ని లాటిన్ పరిభాషలో ‘ఆడీ ఆల్టిరమ్ పార్టెమ్’ అంటారు. అంటే హియర్ ది అదర్ సౌండ్ టూ అని అర్థం. అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తికి తన నిర్దోషిత్వాన్ని వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని దీని అర్థం.
అబ్దుల్ సమర్థ v/s స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ (1962)
అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరు పరచకపోతే 24 గంటల తర్వాత ఆ వ్యక్తికి విడుదలయ్యే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
జోగిందర్ కుమార్ v/s స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్
ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు/స్నేహితుడికి/సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలి.
చదవండి: Fundamental Rights Of India: వ్యక్తి వికాసానికి కనీస అవసరాలైన శాసనాలు ఇవే..
ప్రకరణలు 23, 24
పీడన నిరోధ హక్కులు
మానవులతో వ్యాపారం, బలవంతపు వెట్టిచాకిరీని ప్రకరణ 23(1) నిషేధిస్తుంది. వ్యక్తుల ఇష్టానికి వ్యతిరేకంగా, బలవంతంగా ఏ పని చేయించరాదు. పై చర్యలకు పాల్పడితే పార్లమెంటు చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారు.
నిబంధన 23లో బేగార్ అనే పదాన్ని ప్రయోగించారు. బేగార్ అంటే వెట్టిచాకిరీ. ఉత్తర భారతదేశంలో హాలీ అంటే.. ఎలాంటి పారితోషకం లేకుండా వ్యక్తులతో పని చేయించుకోవడం. దీన్ని 1976లో వెట్టిచాకిరీ చట్టం ద్వారా నిషేధించారు.
ఈ నిబంధన స్వయంగా అమల్లోకి రాదు. అందుకే 1956లో పార్లమెంటు అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని రూపొందించింది.
ప్రకరణ 23(2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధ సేవలను విధించవచ్చు. దీన్ని దోపిడీగా పరిగణించరు.
ప్రకరణ–24
బాల కార్మిక వ్యవస్థ రద్దు
ఈ ఆర్టికల్ ప్రకారం 14 ఏళ్ల లోపు వయసుఉన్న బాలలను ప్రమాదకర, ఇతర పనుల్లో వినియోగించరాదు. ఒకవేళ వినియోగిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఈ నిబంధన కూడా స్వయంగా అమల్లోకి రాదు. దీనికి సంబంధించి పార్లమెంటు చట్టం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తదనుగుణంగా చట్టాలు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పులు
ఎం.సి.మెహతా v/s తమిళనాడు(1997) కేసులో 14 ఏళ్ల లోపు వయసున్న బాలలను ఏ రకమైన ప్రమాదకర పరిశ్రమల్లో లేదా ఇతర పనుల్లో వినియోగించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
బందువా ముక్తిమోర్చా v/s యూనియన్ ఆఫ్ ఇండియా, 1997 కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెలువరించింది. బాలల సంరక్షణకు ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, బాలకార్మికులను పనిలో వినియోగించే యజమానిపై రూ.20,000 వరకు జరిమానా విధించాలని పేర్కొంది.
ప్రకరణలు 25–28
మత స్వాతంత్య్రపు హక్కులు
ప్రకరణ 25(1) ప్రకారం ప్రతి వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా అవలంబించి, ఆచరించి, ప్రచారం చేసే స్వేచ్ఛ ఉంది.
ప్రకరణ 25(2) ప్రకారం మత స్వేచ్ఛ ప్రజాశాంతికి, నైతికతకు, ప్రజారోగ్యానికి భంగం కలిగించరాదు. అలాంటి సమయాల్లో ప్రభుత్వం పరిమితులు విధించవచ్చు. మత విషయాలను నియంత్రించవచ్చు. హిందూ మతంలో కొన్ని సామాజిక సంస్కరణలు చేపట్టవచ్చు.
ప్రకరణ–25లో రెండు వివరణలు ఉన్నాయి. అవి
- సిక్కులు తలపాగా, కత్తి ధరించడం వారి సంప్రదాయంలో భాగం.
- ప్రకరణ–25(2)(బి)లో హిందువులు అనే పదం ఉంది. ఇక్కడ హిందువులంటే సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా.
చదవండి: Indian Polity Notes for Group 1&2: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన కమిషన్ ఏది?
ప్రకరణ–26
మత సంస్థలు – మతపరమైన వ్యవహార నిర్వహణలో స్వేచ్ఛ
ప్రజా శాంతికి, నైతికతకు, ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు మత సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించుకోవచ్చు.
- మత సంస్థలను, ధర్మాదాయ సంస్థలను స్థాపించవచ్చు.
- సంస్థలను నిర్వహించుకోవచ్చు.
- స్థిర, చరాస్తులను సంపాదించుకోవచ్చు.
- అమల్లో ఉన్న చట్టాలకు లోబడి వాటిని నిర్వహించుకోవచ్చు.
చదవండి: Indian Polity Bit Bank For All Competitive Exams: దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు?
ప్రకరణ–27
మతవ్యాప్తి లేదా మత పోషణ కోసం పన్నులు వసూలు చేయరాదు
మత ప్రాతిపదికన ప్రజలపై పన్నులు విధించరాదు, వసూలు చేయరాదు. ఈ నిబంధన పన్నులు వసూలు చేయడాన్ని మాత్రమే నిషేధిస్తుంది. అయితే మత ప్రాతిపదికన ప్రత్యేక సేవలు అందించినందుకు ప్రజల నుంచి ప్రభుత్వం రుసుం వసూలు చేయవచ్చు.
ఉదా: దేవాలయంలో ప్రత్యేక దర్శనాల కోసం, సేవల కోసం రుసుం వసూలు చేయడం రాజ్యాంగబద్ధమే.
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: రాష్ట్ర శాసనాలు రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?
మేనకా గాంధీ v/s యూనియన్ ఆఫ్ ఇండియా (1978 డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా)
1978లో మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు వ్యక్తి స్వేచ్ఛకు నూతన అర్థాన్నిచ్చింది. మేనకా గాంధీ వివాదం విదేశీ సంచారానికి సంబంధించింది. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆమె పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడిచింది. ఈ కేసులో అమెరికా రాజ్యాంగంలోని ‘డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా’ను సుప్రీంకోర్టు అనువర్తింపజేసింది.‘ప్రభుత్వం ఏదో ఒక పద్ధతిని నిర్ణయించి స్వేచ్ఛలను పరిమితం చేయలేదు. నిర్ణయించిన పద్ధతి న్యాయబద్ధంగా, సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా, వెరసి సమంజసంగా ఉండాలి. ప్రభుత్వం చేసిన పని సక్రమమైనా, ఆ పని చేయడానికి ఎంచుకున్న ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ చర్యలు చెల్లుబాటు కావు.’ దీన్నే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు.
–బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు