Skip to main content

AIIMS: 183 పోస్టులకు 92 మందే నియామకం.. అనేక ఎయిమ్స్‌ల్లోనూ ఇదే పరిస్థితి..

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రస్తుతం సగం ఫ్యాకల్టీతోనే నడుస్తున్నాయి.
AIIMS
183 పోస్టులకు 92 మందే నియామకం.. అనేక ఎయిమ్స్‌ల్లోనూ ఇదే పరిస్థితి..

బోధన సిబ్బంది (ఫ్యాకల్టీ)కి సంబంధించి మంజూరైన పోస్టులు 183 ఉండగా, కేవలం 92 మందినే నియమించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ఈ అంశాన్ని వెల్లడిస్తుండగా.. ఏకంగా 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఎయిమ్స్‌ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభమైన అనేక ఎయిమ్స్‌ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్, మంగళగిరిలో 68 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

భోపాల్‌ ఎయిమ్స్‌లో 305 పోస్టులకు, 105 ఖాళీగా ఉన్నాయి. భువనేశ్వర్‌లో 305కు గాను 74, జోధ్‌పూర్‌లో 305కు గాను 77, పాట్నాలో 305కు గాను 151, రాయిపూర్‌లో 305కు 135, రిషికేష్‌లో 305కు గాను 106, మంగళగిరిలో 183కు గాను 65, నాగ్‌పూర్‌లో 183కు గాను 64, కళ్యాణిలో 183కు గాను 88, గోరఖ్‌పూర్‌లో 183కు గాను 105, భటిండాలో 183కు గాను 72, భిలాస్‌పూర్‌లో 183కు గాను 90, గౌహతిలో 183కు గాను 89, రాజ్‌కోట్‌లో 183కు గాను 143, విజయ్‌పూర్‌లో 183కు గాను 107, రాయ్‌బరేలీలో 183కు గాను 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫ్యాకల్టీ ఇంత తక్కువగా ఉండటం వల్ల తరగతులు సరిగా జరగక పోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని రాష్ట్ర వైద్య వర్గాలు చెబుతున్నాయి. 

చదవండి: AIIMS Jodhpur Recruitment 2023: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 114 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

2021లో శస్త్రచికిత్సలు షురూ 

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 2021లో శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం ప్రధాన శస్త్రచికిత్సలు 26 జరగ్గా, 2022 జూలై నాటి వరకు 294 జరిగాయి. ఇక చిన్నపాటి శస్త్రచికిత్సలు ఇప్పటివరకు 3,600పైగా జరిగాయి. అయితే సీనియర్‌ రెసిడెంట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయన్న చర్చ జరుగుతోంది. 

చదవండి: Romansaini Inspiration Story: 22 ఏళ్లకే ఐఏఎస్‌... రెండేళ్లకే రాజీనామా... ఇప్పుడు ఉచితంగా కోచింగ్‌

అందుబాటులోకి వచ్చి మూడేళ్లు గడిచినా..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన కృషితో రాష్ట్రానికి ఎయిమ్స్‌ వచ్చింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్‌లో ఏకంగా 200 ఎకరాల భూమి ఇచ్చింది. అలాగే అక్కడ నిమ్స్‌ ఆసుపత్రి భవనాలను కూడా ఉచితంగా అప్పగించింది. అనంతరం 2019 నుంచి బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్‌తో అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రధాన ఉద్దేశం. కీలకమైన 50 రకాల స్పెషలిస్టు వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉండాలి.

 AIIMS Recruitment 2023: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంబీబీఎస్, నర్సింగ్‌ విద్య అందించాలన్నది లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఎయిమ్స్‌ను బీబీనగర్‌లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు సమీపంలో, ఔటర్‌రింగ్‌ రోడ్డుకు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి అన్ని జిల్లాలకూ సులువుగా వెళ్లి వచ్చేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎయిర్‌పోర్టుకు ఇక్కడి నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిపుణులైన వైద్యులు సులభంగా వచ్చివెళ్లేందుకు అవకాశం ఉంది. ఇంత కీలకమైన ఎయిమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చదవండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, మంగళగిరిలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.67,700 వ‌ర‌కు వేతనం..

Published date : 18 Jan 2023 01:38PM

Photo Stories