Romansaini Inspiration Story: 22 ఏళ్లకే ఐఏఎస్... రెండేళ్లకే రాజీనామా... ఇప్పుడు ఉచితంగా కోచింగ్
సామాజిక మార్పునకు కృషిచేయాలనే సంకల్పం.. యువతకు అవకాశాలను దగ్గర చేయాలన్న ఆకాంక్ష.. ఈ క్రమంలో ఐఏఎస్‌కు రాజీనామా చేసి.. సివిల్స్, ఎస్‌ఎస్‌సీ తదితర పరీక్షల ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాడు.. ఆయనే రాజస్థాన్ కు చెందిన రోమన్ సైనీ...
చదవండి: యూనివర్సిటీ డ్రాపౌట్... పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు... ముకేశ్ అంబానీ
రోమన్ సైనీ.. స్వస్థలం రాజస్థాన్‌లోని జైపూర్. సైనీ 1991 జులై 27న జన్మించాడు. చిన్ననాటి నుంచి అకడమిక్ పరీక్షల్లో అదిరే రికార్డ్. 16 ఏళ్లకే ప్రతిష్టాత్మక ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్ (ఎయిమ్స్ న్యూఢిల్లీ) ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం లభించింది. కోర్సు పూర్తయ్యాక సివిల్స్‌కు హాజరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే 22 ఏళ్ల వయసులో 2013లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. శిక్షణ తర్వాత మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు అవకాశాల పరంగా యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యక్షంగా చూశాడు. మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన తక్కువని గమనించాడు.
ఆలోచన మొదలు....
జబల్‌పూర్‌లో యువత విద్య, ఉద్యోగావకాశాల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసిన రోమన్ సైనీలో పరిష్కారాల మార్గాలపై ఆలోచన మొదలైంది. ఈ క్రమంలోనే పోటీపరీక్షల్లో విజయానికి అవసరమైన పాఠాలను యువతకు ఉచితంగా అందించాలని భావించాడు. అనుకున్నది తడవుగా 2015 జూన్‌లో ఐఏఎస్‌కు రాజీనామా చేశాడు. లక్షల మంది ప్రతిభావంతుల కలల కెరీర్ అయిన ‘కలెక్టర్’ గిరీని వదులుకున్నాడు.
చదవండి: పాలిటెక్నిక్ మధ్యలో మానేసినా... ఇంటర్‌లో చేరొచ్చు
అందరికీ అందాలంటే...
యువతకు సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, ఇతర పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన రోమన్ సైనీకి మరో ప్రశ్న ఎదురైంది. తాను అందించే పాఠాలు ఒక ప్రాంతానికే పరిమితం అయితే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అనే అంతర్మథనం మొదలైంది. దీనికి ఆన్‌లైన్ విధానంలో శిక్షణ సరైందని భావించాడు. వెంటనే తన స్నేహితుడు గౌరవ్ ముంజాల్‌తో యూఎన్‌అకాడమీ పేరుతో ఆన్‌లైన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. వాస్తవానికి 2013 నుంచే ఆన్‌లైన్ విధానంలో ఉచితంగా పాఠాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన సలహాలు అందించడం ప్రారంభించాడు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా సాధనాల ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాడు. కానీ, తన సేవలను పూర్తిస్థాయిలో అందించాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌కు రాజీనామా చేశాడు. ఈ విషయంలో స్నేహితులు గౌరవ్ ముంజాల్, హేమేశ్‌సింగ్‌ల సహకారం మరవలేనిదని రోమన్ సైనీ చెబుతాడు.
చదవండి: అవమానాలు భరించలేక కిటికిలోంచి దూకేద్దాం అనుకున్నా...
పోటీ పరీక్షలకు విలువైన శిక్షణ..
యూఎన్‌అకాడమీ(Unacadamy) ఆన్‌లైన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రోమన్ సైనీ.. సివిల్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్ తదితర ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను, టీచింగ్‌ను ఆన్‌లైన్లో ఉచితంగా అందిస్తున్నాడు. 2015లో సివిల్స్ విజేతల్లో 20 మందికిపైగా అభ్యర్థులు స్వీయ ప్రిపరేషన్ సాగిస్తూ.. Unacadamy ఆన్‌లైన్ ట్యుటోరియల్ ద్వారా ప్రయోజనం పొందారు.
సామాజిక సేవ
వాస్తవానికి ఇప్పుడు ఎన్నో ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. కానీ రోమన్ సైనీ విషయంలో అందరికీ చర్చనీయాంశం ఐఏఎస్‌కు రాజీనామా చేసి మరీ.. ఆన్‌లైన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌ను రూపొందించడం. దీనికి ప్రధాన కారణం సామాజిక దృక్పథం. దీనికి మెచ్చిన.. తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ సహా పలువురు మాజీ, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రోమన్ సైనీ నేతత్వంలోని Unacadamy కి ఉచితంగా సేవలందిస్తున్నారు. వీరేకాకుండా సామాజిక దృక్పథం ఉన్న ఎందరో యువ సివిల్ సర్వెంట్లు సైతం ఉచితంగా పాఠాలు చెబుతూ తమ వంతు చేయూతనందిస్తున్నారు.
చదవండి: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....
నిర్ణయం క్లిష్టమైందే అయినా..
22 ఏళ్ల వయసులోనే ఐఏఎస్‌కు ఎంపికై, రెండేళ్లకే రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్న సమయంలో ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యానని.. వాస్తవానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అత్యంత క్లిష్టమైందని అంటాడు సైనీ. అయితే సామాజిక మార్పునకు సంబంధించి తన లక్ష్యం నెరవేరాలంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని భావించి, రాజీనామా చేసినట్లు చెప్తాడు. భవిష్యత్తులోనూ తన సామాజిక స్పృహ, సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తానని, పాఠశాల స్థాయిలోనూ వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు సేవలందించేందుకు కృషిచేస్తానని చెబుతున్న సైనీ మాటలు.. నేటి యువతకు స్ఫూర్తి వచనాలు.