Skip to main content

Inspirational Story: ఎనిమిదో తరగతికే పెళ్లి... ఇప్పుడు ఆ యువతి ఏం సాధించిందో తెలుసా....

13 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసేశారు. కూతురుని భారంగా భావించారేమో తెలియదు కానీ, ఆ తల్లిదండ్రుల నిర్ణయాన్ని ఆ బాలిక కాదనలేకపోయింది. అభంశుభం తెలియని వయసులో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది.
Nakka Adhilakshi

కానీ, అక్కడ ఆమెకు స్వేచ్ఛ లభించకపోగా మరిన్ని ఆంక్షలు మొదలయ్యాయి. ఇలా ఉండు.. అలా ఉండు.. ఇది చేయి అది చేయి అంటూ అత్తామామలు ఆంక్షలు పెట్టసాగారు. చదువుకుంటానంటే అవన్నీ కుదరవని తెగేసి చెప్పారు. దీంతో ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకుని తన రాతను తనే తిరగ రాసుకుంది. 

చ‌ద‌వండి: హోంబలే ఫిల్మ్స్‌.... ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా...

కాకినాడకు చెందిన నక్కా ఆదిలక్ష్మి చాలా బీద కుటుంబంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎన్నారై కంభంపాటి సుశీలా దేవి స్థాపించిన స్కూల్‌ లో చేర్పించారు. ఆ స్కూల్‌ పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తోంది. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితి కారణంగా ఆదిలక్ష్మికి 8వ తరగతిలోనే పెళ్లి చేసారు. పెళ్లి తరువాత చదువు కొనసాగించడానికి ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

చ‌ద‌వండి: అమూల్‌ అంటే అర్థం తెలుసా... దీని చరిత్ర తప్పక తెలుసుకోవాల్సిందే

దువుకోవద్దంటూ అత్తమామలు, భర్త ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు సహకరించడంతో తనను చదువుకోవద్దని ఇబ్బంది పెడుతున్న భర్తకు విడాకులు ఇచ్చేసింది. విడాకుల తరువాత తనకు చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛ లభించింది. డబ్బుల కోసం పది ఇళ్లలో పనిమనిషిగా చేరింది. అలా సంపాదించన డబ్బుతో మెల్లిగా ఇంటర్మీడియట్‌ పూర్తిచేసింది. తర్వాత కాకినాడలో ఉన్న ఐడియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజిలో ఇంజినీరింగ్‌ జాయిన్‌ అయ్యింది. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహాయంతో బీటెక్‌ విజయవంతంగా పూర్తిచేసింది. 

చ‌ద‌వండి: డిగ్రీ కూడా లేని మేధావి... రామానుజన్‌ జీవిత విశేషాలు తెలుసా

ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న సమయంలోనే క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు ప్రిపేర్‌ అవడం మొదలు పెట్టింది. కష్టానికి తోడు అదృష్టం తోడవడంతో మూడు కంపెనీలు ఆదిలక్ష్మికి జాబ్‌ ఆఫర్‌ చేశాయి. కానీ, ప్రభుత్వ ఉద్యోగమే అంతిమ లక్ష్యం కావడంతో జాబ్‌ ఆఫర్లను కాదనుకుని స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అయ్యింది. అందులో ఉత్తీర్ణత సాధించడంతో ఇండోటిబెట్‌ పోలీస్‌ ఫోర్స్‌ కు ఎంపికయ్యింది. పనిమనిషిగా పనిచేస్తూ చదువుకున్న ఆదిలక్ష్మి పాతికేళ్లకే పోలీస్‌ ఫోర్స్‌కు ఎంపికవడంపై ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంతటితో నా లక్ష్యం పూర్తవలేదు... ఇంకా బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది ఆదిలక్ష్మి. బాల్యవివాహాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు మెరుగైన భవిష్యత్తుకు దూరమవుతున్నారు. అమ్మాయిలు కుటుంబానికి బారం కాదు అన్న భావన అందరిలోనూ ఉంటే ఆదిలక్ష్మి లాంటి అమ్మాయిలు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Published date : 23 Dec 2022 01:43PM

Photo Stories