Skip to main content

AMUL Successful Journey: అమూల్‌ అంటే అర్థం తెలుసా... దీని చరిత్ర తప్పక తెలుసుకోవాల్సిందే

దేశంలో దాదాపు అందరికీ అమూల్‌ పేరు తెలుసు. దేశ ప్రజల నుంచి అత్యంత ప్రేమ పొందిన సంస్థల్లో అమూల్‌ ముందు వరుసలో ఉంటుంది. అంతలా భారతీయులు ఆ సంస్థ పాల ఉత్పత్తులను దశాబ్దాలుగా ఇష్టపడుతున్నారు. సహకార ఉద్యమంలో పుట్టిన ఆ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్‌ మిల్క్‌ ప్రాసెసింగ్‌ సంస్థగా నిలిచింది. ఒకప్పుడు రోజుకు 200 లీటర్లను సేకరించిన అమూల్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి ప్రపంచ ఖ్యాతిని కొనసాగిస్తోంది.
Amul

స్వాతంత్య్రానికి ఏడాది ముందు... 
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది ముందు.. అంటే 1946లో అమూల్‌ ప్రస్థానానికి పునాది పడింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పిలుపు మేరకు ఆ ఏడాది గుజరాత్‌ లోని ఆనంద్లో కైరా డిస్ట్రిక్ట్‌ పాల ఉత్పత్తుల సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (కేడీసీఎంపీయూఎల్‌)ను త్రిభువన్‌ దాస్‌ స్థాపించారు. అక్కడి పోల్సస్‌ డెయిరీ చేతిలో పాడి రైతులు మోసపోతు ఉండడంతో ఆయన ప్రతిఘటించి సహకార సంస్థను ఏర్పాటు చేశారు. అప్పట్లో దానికి అమూల్‌ అన్న బ్రాండ్‌ లేదు. కేడీసీఎంపీయూఎల్‌ పేరిటే కార్యకలాపాలు కొసాగించేది.  

చ‌ద‌వండి: హోంబలే ఫిల్మ్స్‌.... ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా...
వర్ఘీస్‌ కురియన్‌ రాకతో....
మిల్క్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్‌ వర్ఘీస్‌ కురియన్‌.. అమూల్ను తీర్చిదిద్దారు. 1949లో సంస్థలో ఆయన ఉద్యోగిగా అడుగుపెట్టారు. రైతుల వద్దకు నేరుగా వెళ్లి కురియన్‌ సలహాలు ఇచ్చేవారు. పాల ఉత్పత్తిని ఎలా పెంచాలో అన్నదాతలకు సూచనలు చేసేవారు. దీంతో ఆ సంస్థ పేరు ఒక్కసారిగా మార్మోగింది. అనతి కాలంలో వేగంగా అభివృద్ధి చెందింది. వేల సంఖ్యలో రైతుల నుంచి అప్పుడే పాలు సేకరించింది. దీంతో భారత పాల ఉత్పత్తి రంగంలో విప్లవాన్ని తెచ్చి శ్వేత విప్లవానికి వర్ఘీస్‌ కురియన్‌ నాంది పలికారు.  

amul
అమూల్‌ పేరు వచ్చిందిలా....
1955లో కొత్త డెయిరీతో పాటు మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ను సంస్థ ప్రారంభించింది. ప్రపంచ డైరీ టెక్నాలజీలో ఆ ఏడాది ఓ మైలురాయిగా నిలిచిపోయింది. పాల ఉత్పత్తుల కోసం బర్రె పాలను ప్రపంచంలోనే తొలిసారి వినియోగించారు. సంస్థ అభివృద్ధి చెందుతున్నా కేడీసీఎంపీయూఎల్‌ అని పిలవాలంటే అందరికీ కష్టంగా ఉండేది. అందరూ సులభంగా పిలువగలిగేలా, ఇంకా ఫేమస్‌ అయ్యేలా పేరు ఉండాలని కురియన్‌ అనుకున్నారు. ఓ పేరును సూచించాలని ఉద్యోగులను అడిగారు. అప్పుడు ఓ క్వాలిటీ కంట్రోల్‌ సూపర్‌ వైజర్‌ ముందుకు వచ్చి అమూల్య అన్న పేరును ప్రతిపాదించారు. అమూల్య అంటే వెలకట్టలేనిది, అపూర్వమైనది అని అర్థం వస్తుంది. తర్వాత సంస్థ పేరును అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌)గా మార్చేశారు. 

చ‌ద‌వండి: డిగ్రీ కూడా లేని మేధావి... రామానుజన్‌ జీవిత విశేషాలు తెలుసా
1998లోనే అమెరికాను దాటి...
దేశంలో పాల కొరతను అమూల్‌ తీర్చేసింది. ప్రపంచంలోనే పాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచేందుకు ఆ సంస్థే ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్ఘీస్‌ కురియన్‌ చేపట్టిన శ్వేత విప్లవంతో 1998లోనే పాల ఉత్పత్తుల్లో అమెరికాను భారత్‌ అధిగమించేసింది.  
దేశం మనసును గెలిచిన అమూల్‌ గర్ల్‌
అమూల్‌ విజయంతో ఆ సంస్థ లోగో, మస్కట్లకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. అమూల్‌ ప్రకటనల్లో కనిపించే అమూల్‌ గర్ల్‌ని 1966లో ఓ యాడ్‌ ఏజెన్సీ ఎండీ సిల్వెస్టర్‌ దచున్చా రూపొందించారు. అది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. 

చ‌ద‌వండి: రెండు వారాలే టైం... ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్... వివ‌రాలు
దినదినాభివృద్ధి చెందుతూ... 
1948లో రోజుకి 200 లీటర్లతో ప్రారంభమైన పాల సేకరణ 1952కి 20 వేల లీటర్ల స్థాయికి చేరింది. పాశ్చరైజ్‌ చేసిన పాలకు బొంబాయిలో డిమాండ్‌ పెరగడంతో మరిన్ని పాలు సేకరించవలసిన అవసరం పడింది. కొత్త డెయిరీలు ప్రారంభించాల్సి వచ్చింది. కురియన్‌ ను కేంద్ర ప్రభుత్వం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు పంపించి డెయిరీ పరిశ్రమలో శిక్షణ పొంది రావాలంది. దాంతో ఆయన మరింత రాటు దేలాడు. ఇదిలా పెరుగుతూంటే అవతల పోటీదారైన పోల్సన్‌ కి దెబ్బ పడుతోంది.  క్రమేపీ అమూల్‌ వెన్న కూడా తయారు చేసి పోల్సన్‌ వారితో పోటీ పడింది. అక్కడ వారికి ఓ చిక్కు వచ్చింది. 
వెన్న తయారీలో ఇబ్బంది....
పోల్సన్‌ వాళ్లు నిల్వ వుంచిన మీగడతో వెన్న తయారుచేసేవారు. దాంతో కొంచెం చెడువాసన వచ్చేది. వాక్రియేటర్‌ అనే యంత్రం ద్వారా ఆ చెడువాసనను తొలగించేవారు. అమూల్‌ వాళ్లు వెన్నను తాజా మీగడతో తయారుచేసేవారు. పోల్సన్‌ కాలుష్యపు వెన్న రుచికి అలవాటు పడిన కస్టమర్లు అమూల్‌ వెన్న చూసి ‘ఇదేం వెన్న? రుచీపచీ లేదు. చప్పగా వుంది.’ అనసాగారు. చివరకు అమూల్‌ వాళ్లు డయాసెటిల్‌ అనే రసాయనాన్ని కలిపి ఆ పోల్సన్‌ రుచిని తెప్పించారు. దాంతో అమ్మకాలు పెరిగాయి. ఇలా పాలు, పాల ఉత్పతుల్లో అమూల్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అమూల్ స‌క్సెస్‌ను చూసి దేశ‌మంతా గ‌ర్విస్తోంది.

Published date : 22 Dec 2022 07:13PM

Photo Stories