Skip to main content

Success Story: బంగారం వచ్చే ఏటీఎం ఎక్క‌డ ఉందో తెలుసా... దీన్ని తయారు చేసింది మన తెలుగోడే

ఒకప్పుడు డబ్బులు కావాలంటే బ్యాంకులకు వెళ్లి ఫాం నింపి డ్రా చేసుకోవాల్సి ఉండేది. ఆ తర్వాత ఏటీఎంలు రావడంతో ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడ అంటే అక్కడ డబ్బులు తీసుకునే వెసులుబాటు వచ్చింది. అలాగే బంగారం కూడా... బంగారం కొనాలంటే గోల్డ్‌ షాప్‌లకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

అయితే మన తెలుగు యువకుడి చొరవతో... డబ్బుల లాగే బంగారం కూడా ఎంత కావాలంటే అంత తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా.!

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన వినోద్‌ గోల్డ్‌ ఏటీఎం తయారుచేశాడు. వినోద్‌ తండ్రి వ్యాపారం చేసేవారు. చిన్నతనంలో కంప్యూటర్‌పై మక్కువ పెంచుకున్న వినోద్‌ వేసవి సెలవుల్లో వెబ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో చేరాడు. పదోతరగతి పూర్తయ్యేసరికి అందులో పూర్తిగా పట్టు సాధించాడు. అప్పటి నుంచే సొంతంగా వెబ్‌సైట్‌లు రూపొందిస్తూ సంపాదించడం మొదలుపెట్టాడు. 
పదో తరగతికే పూర్తి పట్టు..!
ఇంటర్, బీటెక్‌ పూర్తయ్యాక ఎంబీఏలో చేరాడు వినోద్‌. చదువు పూర్తయిన తర్వాత ఓ టెలికాం కంపెనీలో చేరాడు. అక్కడి నుంచి బీమా కంపెనీలో పనిచేసి మార్కెటింగ్, సేల్స్‌ మెలకువలు నేర్చుకున్నాడు. 2017లో హైదరాబాద్‌కి వచ్చేశాడు వినోద్‌. ఓవైపు ఉద్యోగం చేస్తూనే తనకంటూ గుర్తింపు తెచ్చే ఆవిష్కరణలపై పని చేయడం మొదలు పెట్టాడు. మొదటిసారి బధిరులకు తేలిగ్గా సమాచారం అందించే ఒక కమ్యూనికేషన్ పరికరాన్ని రూపొందించాడు. దీనికి పేటెంట్‌ దక్కింది. 
‘ఓపెన్‌  క్యూబ్స్‌’తో ఆవిష్కరణలకు నాంది...!
తన ఆవిష్కరణలకు కొత్తరూపం ఇచ్చే క్రమంలో ఏడేళ్ల కిందట హైదరాబాద్‌లో ‘ఓపెన్‌ క్యూబ్స్‌’ అనే అంకుర సంస్థ ప్రారంభించాడు. కొత్త కంపెనీ కావడంతో మొదట్లో ప్రాజెక్టులు సంపాదించడంలో చాలా సవాళ్లే ఎదురయ్యాయి. అయినా మొదటి ఆవిష్కరణ భిన్నంగా ఉండాలనుకొని ‘ఎన్‌హెచ్‌ 7’ అనే అప్లికేషన్‌ ని తయారు చేశాడు. ఇది ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాలను పోలిన యాప్‌. ఇది విజయవంతం కావడంతో సింగపూర్‌లోనూ కార్యాలయం తెరిచాడు.
కరోనాతో అస్తవ్యస్తం...!
అంతా సవ్యంగా సాగిపోతున్న దశలో కరోనా విరుచుకుపడింది. కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఆఫీసులు, యాప్‌ల నిర్వహణకే రూ.20లక్షలు ఖర్చయ్యేది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో.. ఆ యాప్‌ని ఒక అమెరికా కంపెనీకి లాభానికే విక్రయించాడు. తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ కోసం ‘ఆజాదీ’ అనే యాప్‌ రూపొందించారు. దీంతో బాగా పేరు రావడంతో.. ‘గోల్డ్‌ సిక్కా’ కంపెనీ నిర్వాహకులు గోల్డ్‌ ఏటీఎం తయారు చేయమంటూ వినోద్‌ని సంప్రదించారు.
0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు...
దుబాయ్, లండన్‌ నగరాల్లో ఉండే ఈ తరహా ఏటీఎంల తయారీ.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సిబ్బందితో కలిసి దాదాపు మూడు నెలలపాటు శ్రమించి వారు చెప్పినట్టే గోల్డ్‌ ఏటీఎం తయారు చేశాడు. దీనికోసం సొంతంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాడు. ఇందులో నుంచి 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బంగారాన్ని డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. విదేశాల్లో అయితే 20 గ్రాములకంటే తక్కువగా డ్రా చేయలేరంటున్నాడు వినోద్‌. 
దేశంలోనే తొలిసారిగా....
దేశంలోనే తొలిసారిగా మొదలైన ఈ గోల్డ్‌ ఏటీఎంను హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో ప్రారంభించారు. లండన్‌ బులియన్‌ మార్కెట్‌ ఆధారంగా నాలుగు సెకన్లకోసారి ఇందులో బంగారం ధర మారిపోతుంటుంది. ఈ యంత్రాన్ని ముప్ఫై శాతం తక్కువ ఖర్చుతోనే రూపొందించామంటున్నాడు వినోద్‌. ఇది సక్సెస్‌ కావడంతో.. ఔషధ మందుల ఏటీఎం రూపొందించే పనిలో ఉన్నాడు.

Published date : 02 Feb 2023 03:45PM

Photo Stories