Skip to main content

TG Govt appoints VCs: 9 వర్సిటీలకు వీసీల నియామకం.. కోత్త వీసీల గురించి క్లుప్తంగా ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాల యాలకు ఉప కులపతులు నియమితులయ్యారు. ప్రభుత్వ సిఫారసుతో వర్సిటీలకు వీసీలను ఖరారు చేసినట్టు గవర్నర్‌ కార్యాలయం అక్టోబర్ 17న వెల్లడించింది.
Appointment of VCs for 9 Universities news in telugu  Governor's office announcement on Vice Chancellors for nine universities in Hyderabad  List of newly appointed Vice Chancellors for Telangana universities  Official announcement of Vice Chancellor appointments in Hyderabad universities

వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వీసీల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి 13 వర్సిటీలు ఉండగా.. మహిళా వర్సిటీకి ముందే వీసీని నియమించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్‌), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)లకు ఇంకా వీసీలను నియమించాల్సి ఉంది. 

అంబేడ్కర్‌ వర్సిటీకి అత్యధిక దరఖాస్తులు

రాష్ట్రంలోని వర్సిటీలకు చెందిన వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే 23 తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో తొలుత ఐఏఎస్‌ అధికారులకు వీసీలుగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం,  మరోవైపు ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అలాగే సెర్చ్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.

ఈ పోస్టుల కోసం 312 మంది 1,382 దరఖాస్తులు సమర్పించారు. చాలామంది అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేశారు. అత్యధికంగా బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయానికి 208 దరఖాస్తులు వస్తే, ఉస్మానియాకు 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీ వర్సిటీకి 157 వచ్చాయి.

చదవండి: Osmania University: ఓయూకు సురవరం పేరు పెట్టాలి

జేఎన్‌టీయూహెచ్‌కు 106 దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ సెర్చ్‌ కమిటీ పరిశీలించి మూడు పేర్ల చొప్పున ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వీసీలను ఎంపిక చేసిన ప్రభుత్వం దసరా ముందు ఫైల్‌ను గవర్నర్‌ కార్యాలయానికి పంపింది. తాజాగా గవర్నర్‌ కార్యాలయం వీసీల పేర్లను ఖరారు చేసింది. 

వివాదంలో జేఎన్‌టీయూహెచ్‌

జేఎన్‌టీయూహెచ్‌కు వీసీ నియామకం ఆఖరి దశలో ఆగిపోయింది. అంతర్గత వివాదం, వీసీ నియామకం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీసీ ఖరారును వాయిదా వేశారని తెలిసింది. ఈ వర్సిటీకి సెర్చ్‌ కమిటీ ముగ్గురు పేర్లను సిఫారసు చేయగా.. ఇందులో ఓ మాజీ వీసీ పేరు ఉండటం వివాదాస్పదమైంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

గతంలో ఆయనపై పలు ఆరోపణలున్నాయని, అయినప్పటికీ ఆయన పేరును సెర్చ్‌ కమిటీ సూచించిందంటూ పలువురు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీని వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఆయనకు సంబంధించిన ఫైల్‌ను గవర్నర్‌కు పంపలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. 

చదవండి: MBA Admissions: ఓయూ ఎంబీఏ ఈవినింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు

జేఎన్‌ఏఎఫ్, ‘అంబేడ్కర్‌’పై భేటీకాని సెర్చ్‌ కమిటీలు

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రాగా, ఈ పోస్టును దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు సైతం జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచే నాలుగు సిఫారసులు వచ్చినట్టు తెలిసింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సెర్చ్‌ కమిటీ ఇంతవరకూ ఈ వర్సిటీ విషయమై భేటీ అవ్వలేదని తెలుస్తోంది. అలాగే జేఎన్‌ఏఎఫ్‌ఏపై కూడా సెర్చ్‌ కమిటీ సమావేశం నిర్వహించలేదు. ఈ భేటీ త్వరలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్త వీసీలు వీరే.. 

యూనివర్సిటీ

వీసీ

పాలమూరు, మహబూబ్‌నగర్‌:

ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌రావు

కాకతీయ, వరంగల్‌:

ప్రొఫెసర్‌ ప్రతాప్‌ రెడ్డి

ఉస్మానియా, హైదరాబాద్‌:

ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం

శాతవాహన, కరీంనగర్‌:

ప్రొఫెసర్‌ ఉమేశ్‌కుమార్‌

తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌:

 ప్రొఫెసర్‌ నిత్యానందరావు

మహాత్మాగాంధీ, నల్లగొండ:  

ప్రొఫెసర్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌

తెలంగాణ, నిజామాబాద్‌:

 ప్రొఫెసర్‌ యాదగిరిరావు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ:  

ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య

శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన:  

ప్రొఫెసర్‌ రాజిరెడ్డి

కోత్త వీసీల గురించి క్లుప్తంగా ఇలా..

ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య
జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన ప్రొ.అల్దాస్‌ జానయ్య నల్లగొండ జిల్లా, తిప్పర్తి మండలం, మామిడాల గ్రామంలో జన్మించారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్‌ అందుకున్నారు. ప్రస్తుతం జగిత్యాల వ్యవసాయ కాలేజీ అసోసియేట్‌ డీన్‌గా సేవలందిస్తున్నారు. 2002లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.

ప్రొ.రాజిరెడ్డి దండ
కొండా లక్ష్మణ్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ వీసీగా నియమితులైన దండ రాజిరెడ్డి మహారాష్ట్రలోని పంజాబ్‌రావు కృషి విద్యాపీఠ్‌లో అగ్రికల్చర్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ చేశారు. గుజరాత్‌ అగ్రికల్చర్‌ వర్సిటీలో అగ్రో మెటియోరాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అఫ్గానిస్తాన్‌ అగ్రోమెట్‌ సర్వీసెస్‌ ప్రాజెక్టుకు వరల్డ్‌ బ్యాంకు కన్సల్టెంటుగా కొంతకాలం పనిచేశారు. చాలాకాలం పాటు జయశంకర్‌ అగ్రికల్చర్‌ వర్సిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ప్రొ.వెలుదండ నిత్యానందరావు 
తెలుగు వర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.వెలుదండ నిత్యానందరావు స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా మంగనూరు గ్రామం. పాలెం ఓరియంటల్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, అదే శాఖ హెచ్‌వోడీగా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు. ఆయన రచించిన ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే గ్రంథం అన్ని వర్సిటీల తెలుగు విభాగాల్లో ప్రామాణిక గ్రంథంగా ఇప్పటికీ బోధిస్తున్నారు.

ప్రొ.టి.యాదగిరిరావు 
తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.యాదగిరిరావు వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. పీజీ, పీహెచ్‌డీ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇప్పుడు అదే వర్సిటీలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ బీవోఎస్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో కేయూలో యూజీసీ కో–ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి అవార్డు అందుకున్నారు. తెలంగాణ వర్సిటీ సోషల్‌ సైన్సెస్‌ డీన్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. 

ప్రొ.జీఎన్‌ శ్రీనివాస్‌ 
పాలమూరు యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.జీఎన్‌ శ్రీనివాస్‌ సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఓయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీనివాస్‌.. 2003లో ఏపీలోని అనంతపురం జేఎన్టీయూలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్‌.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. 

ప్రొ.కుమార్‌ మొలుగరం 
ఉస్మానియా వీసీగా నియమితులైన కుమార్‌ మొలుగరం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొండాపురం గ్రామంలో జన్మించారు. ఓయూలో బీటెక్, జేఎన్‌టీయూలో ఎంటెక్, ఐఐటీ బాంబే నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ రంగంలో ఆయన అపార అనుభవశాలి. ప్రస్తుతం ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీనియర్‌ ప్రొఫెసర్‌గా, రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ అర్బన్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 2018లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి పురస్కారం, ఇంజనీర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అందుకున్నారు. ఓయూ 107 సంవత్సరాల చరిత్రలో వీసీగా నియమితులైన తొలి ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఘనత సాధించారు.

ప్రొ.అల్తాఫ్‌ హుస్సేన్‌ 
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జన్మించారు. ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి, వరంగల్‌ సీకేఎం కాలేజీలో ఇంటర్, డిగ్రీ.. కాకతీయ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. కేయూ ఫిజిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా, హెచ్‌వోడీగా, రిజిస్ట్రార్‌గా సేవలందించారు. 2016–19 మధ్యకాలంలో కూడా మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా పనిచేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని ఎంజీయూ వీసీగా నియమితులైన అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. వర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభిస్తామని ‘సాక్షి’కి తెలిపారు. 

ప్రొ.ప్రతాప్‌రెడ్డి 
కాకతీయ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.ప్రతాప్‌రెడ్డిది రంగారెడ్డి జిల్లా యాచారం. ఓయూలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన ప్రతాప్‌రెడ్డి.. ఓయూలో జువాలజీ విభాగం హెచ్‌వోడీగా, రిజిస్ట్రార్‌గా, పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌గా సేవలందించి రిటైర్‌ అయ్యారు. 

ప్రొ.ఉమేష్‌కుమార్‌
శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఉమేష్‌కుమార్‌.. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట గ్రామంలో జన్మించారు. కెమిస్ట్రీ విభాగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. గతంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా, రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ జాతీయ స్థాయి ఎన్‌ఎస్‌ఎస్‌ ట్రోఫీని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎంజీ యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు, బోధనా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారు.

Published date : 19 Oct 2024 12:17PM

Photo Stories