Degree Students High Tension : ఆందోళనలో డిగ్రీ విద్యార్థులు.. నో ఫీజ్.. నో రిజల్స్ అంటున్న వర్సిటీ..

హైదరాబాద్: వివిధ రకాల ఫీజు బకాయిలు చెల్లించలేదని కాకతీయ విశ్వవిద్యాలయం 112 ప్రైవేటు కాలేజీలకు చెందిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను నిలిపివేసింది. మొత్తం బకాయిలు చెల్లించే వరకూ వెల్లడించబోమని తేల్చి చెప్పింది. దీంతో యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 80 వేల మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మిగతా వర్సిటీలు కూడా కాకతీయ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, రెండు, మూడో ఏడాది విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. వర్సిటీ పరిధిలోని 390 కాలేజీల విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారి ఫలితాలను ఈ నెల 4వ తేదీన ప్రకటించారు. కానీ, అందరివీ కాదు, కేవలం.. ఫీజు పూర్తి చెల్లించిన విద్యార్థులవి మాత్రమే వెల్లడించారు. బకాయిలు ఉన్న 112 కాలేజీల ఫలితాలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. వారివి నిలిపివేశారు.
ఏంటీ ఫీజులు..?
ప్రైవేటు డిగ్రీ కాలేజీలు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్, విద్యార్థుల గుర్తింపు, విద్యార్థుల సంక్షేమ నిధి, ఇంటర్ టోర్నమెంట్, అనుబంధ గుర్తింపు ఫీజులను ఏటా యూనివర్సిటీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కోర్సును బట్టి రూ.1,000 నుంచి రూ.5 వేల వరకూ ఉంటుంది. అన్ని యూనివర్సిటీల పరిధిలో దాదాపు రూ.100 కోట్ల ఫీజు బకాయిలుండగా.. కాకతీయ పరిధిలోనే 112 కాలేజీలు రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉంది.
రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు!
కొన్నేళ్ళుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సక్రమంగా అమలు కావడం లేదు. బోధన రుసుములు, ఉపకార వేతనాల కింద ప్రభుత్వం 2023–24 విద్యా సంవత్సరం వరకే రూ.5,195 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని కలిపితే ఈ మొత్తం దాదాపు రూ.8 వేల కోట్లకు చేరుతుంది. కొన్నేళ్లుగా రీయింబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో ప్రైవేటు కాలేజీలకు నిధుల కొరత ఏర్పడింది.
అధ్యాపకులకే వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో గత పరీక్షల సమయంలో కాలేజీలు ఆందోళనకు కూడా దిగాయి. అప్పుడు నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. సాధారణంగా వర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజులను కాలేజీలు విద్యార్థుల నుంచి ముందే వసూలు చేస్తాయి. రీయింబర్స్‌మెంట్ వచ్చినప్పుడు విద్యార్థులకు తిరిగి చెల్లిస్తాయి.
అయితే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కాలేజీలు యూనివర్సిటీలకు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. కాలేజీలు ఎక్కువ ఉండటం, పోటీ పెరగడంతో ఫీజులు ఒత్తిడి చేసి వసూలు చేసే పరిస్థితి లేదని మరోవైపు యాజమాన్యాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఫలితాల నిలిపివేతతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
రీయింబర్స్‌మెంట్ రావడం లేదు
మూడేళ్ళుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదు. ప్రతి కాలేజీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాం. అయినా ఫలితం లేదు. వర్సిటీని కూడా కొంత సమయం అడిగాం. పట్టించుకోకుండా ఫలితాలు నిలిపి వేయడం సరికాదు. తక్షణమే ప్రకటించాలి.
– జె.శ్రీధర్‌రావు (ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్)
సమయం ఇచ్చినా చెల్లించలేదు
వర్సిటీకి చెల్లించాల్సిన దాదాపు రూ.2.5 కోట్ల బకాయిలు చెల్లించమని కాలేజీలను కోరాం. వారితో చర్చలు జరిపాం. కొంత సమయం కూడా ఇచ్చాం. అయినా చెల్లించలేదు. ఫీజులు చెల్లించకపోతే యూనివర్సిటీ నడిచేదెలా? అందుకే ఫలితాలు నిలిపివేశాం.
– ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి (కాకతీయ యూనివర్సిటీ వీసీ)
మాకెందుకీ శిక్ష?
కష్టపడి చదివి పరీక్షలు రాశాం. కాలేజీలకు, వర్సిటీకి ఉన్న లావాదేవీలు వాళ్ళు చూసుకోవాలి. మేమేం తప్పు చేశాం. మాకు ఎందుకీ శిక్ష?
– బి.సరిత (బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని, ఖమ్మం)
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Degree Students
- Kakatiya University
- 112 college students
- no fees no results
- semester results 2025
- second and third year students semester results
- students anger
- fee reimbursement
- fees due
- 80 thousand students anger
- no fees reimbursement
- affiliated colleges financial status
- kakatiya university affiliated colleges
- semester results suspended
- non payment
- Fee reimbursement scheme
- telangana degree college students
- Education News
- Sakshi Education News