CM Revanth Reddy: నాణ్యత లేకుంటే జైలే!.. కాంట్రాక్టర్లకు సీఎం హెచ్చరిక
ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామని తెలిపారు. విద్యార్థి నులకు కాస్మెటిక్ చార్జీలు సకాలంలో చెల్లిస్తున్నా మన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్ చానల్ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు.
చదవండి: 10th Class: ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ దృష్టి
ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కూడా స్కూళ్లకు వెళ్లాలన్నారు. కుల గణనపై కొంతమంది కుట్ర చేస్తున్నారని, దీన్ని విద్యార్థి లోకం సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరారు.
జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నవంబర్ 14న బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాల నుంచి వచ్చిన బాలలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.
ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం పెంచాలి
‘ప్రభుత్వ స్కూళ్ల ప్రతిష్ట దెబ్బతింటోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 26 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతుంటే, 36 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్నారు. అన్ని సౌకర్యాలున్నా, అర్హులైన టీచర్లు ఉన్నా ఈ పరిస్థితి ఎందుకుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి.
కలెక్టర్లు, ఎస్పీలు స్కూళ్లకు వెళ్లాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళాలి. విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యంతో అన్నం పెట్టాలి. అందుకే రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
విద్యా రంగానికి పెద్దపీట
‘విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 20 వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 35 వేలమంది టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చాం.
వర్సిటీలకు వీసీలను నియమించాం. త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. గత సీఎం మనవడి కుక్క చనిపోతే డాక్టర్‌ను జైల్లో పెట్టారు. విద్యార్థులు చనిపోతే కనీసం కన్నీరు కూడా పెట్టలేదు..’అని రేవంత్ అన్నారు. ‘తెలంగాణకు విద్యార్థులే పునాదులని, తమ ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాలను అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు.
భవిష్యత్‌లో ఎలాంటి వ్యసనాలకు బానిసలం కాబోమని, ఉన్నత విద్యలో రాణిస్తామని ప్రమాణం చేయాలని బాలలను సీఎం కోరారు. చదువులోనే కాదు.. క్రీడల్లో రాణించినా ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు.
కుల గణన మెగా హెల్త్ చెకప్ లాంటిది
‘కులగణనను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇది సమాజానికి మెగా ఆరోగ్య పరీక్ష వంటిది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలకు పెరగాలన్నా, నిధుల కేటాయింపు జరగాలన్నా కుల గణనే కీలకం.
కులగణన ఆధారంగా భవిష్యత్తులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అందుబాటులోకి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దీనిద్వారా ఎవరి ఆస్తులూ లాక్కోవడం జరగదు. సంక్షేమ పథకాలు అందకుండా పోవడం అంటూ ఉండదు. విద్యార్థులు కూడా కులగణన వివరాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ పుస్తకాన్ని, తెలంగాణ విద్యా ప్రగతి సూచించే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం అందజేశారు
‘21 ఏళ్ళకే పోటీ చేసే హక్కు’తీర్మానం చేయండి
ఎస్‌సీఈఆర్‌టీలో నవంబర్ 14న జరిగిన అండర్ 18 విద్యార్థుల నమూన అసెంబ్లీ సమావేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో పోటీ చేసే వయసును 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని, ఈ విధంగా చేసిన మాక్ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపాలని సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేదని, ఇప్పుడు ఓటు హక్కుకు అర్హత 18 ఏళ్ళకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్ళకు తగ్గిస్తే ఎక్కువమంది యువత రాజకీయాల్లోకి వస్తారని సీఎం పేర్కొన్నారు.
Tags
- social welfare hostels
- telangana cm revanth reddy
- Diet and Cosmetic Charges
- Mess Charges
- Food
- Food Supply
- Education Sector
- Government Social Welfare Hostels
- Prem Sagar Rao
- IAS
- IPS
- Jawaharlal Nehru Birthday
- Children's Day
- Government Hostels
- Telangana News
- SCERT
- RevanthReddy
- FoodQuality
- ContractorAccountability
- TelanganaNews