AP Students: ఇంగ్లిష్‌లో అదరగొడుతున్న బాపట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు... ఏకంగా అమెరికా విద్యార్థులతో మాటామంతీ..!
అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ ఇంగ్లిష్ టీచర్.. విద్యార్థులు ఇకపై తమ భావాన్ని వ్యక్తపరచలేక ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించాడు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే పెన్ పాల్ కార్యక్రమం.
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే దర్శనమిస్తోంది. వాట్సప్ చాటింగ్, ఈ-మెయిల్స్ ద్వారానే ఒకరినొకరు కమ్యూనికేట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో సదరు ఇంగ్లిష్ టీచర్ లెటర్ల(ఉత్తరాలు)కు పనిపెట్టారు. విద్యార్థులు తాము చెప్పాలనుకున్న భావాన్ని, విషయాన్ని ఉత్తరాల్లో రాయాలని సూచిస్తున్నాడు. ఇలా రాయడం వల్ల ఇంగ్లిప్ ప్లూయెన్సీగా రావడంతో పాటు, విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు.
ఇవీ చదవండి: APPSC Group 1 Ranker Mutyala Sowmya Interview
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని ఐలవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పచ్చారు హరికృష్ణ పనిచేస్తున్నాడు. విద్యార్థుల్లోని హ్యాండ్ రైటింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారి భావాలను స్పష్టంగా వ్యక్తీకరించాలని సూచిస్తున్నాడు. ఇందుకోసం నాలుగేళ్ల కిందట ప్రారంభించిన పెన్‌పాల్ కార్యక్రమం క్రమేణా సత్ఫలితానిస్తోంది.
పెన్ పాల్ ద్వారా ఇక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అమెరికాలోని Nebraska ప్రాంతంలో ఉన్న రీగాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కమ్యూనికేట్ అవుతున్నారు. దీంతో మన విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. విద్యార్థులు తమ దినచర్య, పండుగలు, సెలవులు, తాము చదువుకునే పాఠాలు ఇలా.. ప్రతీ ఒక్కదాన్ని అమెరికాలోని తమ మిత్రులతో పంచుకుంటున్నారు.
ఇవీ చదవండి: రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్... షేక్ అయేషా సక్సెస్ జర్నీ సాగిందిలా..!
తొమ్మిదో తరగతి చదువుతున్న కె.రాగనందిని మాట్లాడుతూ "ఒకసారి నేను అమెరికా జెండాను చూడలేదని నా పెన్ స్నేహితుడితో చెప్పాను. అతను మాకు ఆ దేశ జెండాలను పంపాడు. అలాగే స్థానికంగా లభించే చాక్లెట్లు, టీ-షర్టులు పంపించాడు. వారికి నేను భారత జెండాలు, బిస్కెట్లు, ఇతర వస్తువులను పంపించా' అని తన అనుభవాన్ని పంచుకుంది.
అమెరికా టు బాపట్లకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఖర్చుతో కూడుకున్నవి. విద్యార్థులు రాసే ఉత్తరాలను కొరియర్ ద్వారా పంపడానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతోందని.. ఈ మొత్తాన్ని తానే పెట్టుకుంటున్నట్లు హరికృష్ణ చెబుతున్నాడు. ప్రతీ ఏటా మూడు దఫాలుగా ఉత్తరాలను పంపిస్తున్నారు.
పెన్ పాల్ ప్రోగ్రామ్‌తో పాటు మన విద్యార్థులు యుఎస్, కెనడా, మెక్సికో, స్వీడన్, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, పోలాండ్, ట్యునీషియా, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్, చిలీ, టర్కీతో సహా 60 దేశాలలోని సుమారు 300 పాఠశాలల విద్యార్థులతో స్కైప్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు. స్పేస్ సైన్స్, సోషల్ స్టడీస్ గురించి విద్యార్థులు చర్చించుకుంటారని ఉపాధ్యాయుడు హరికృష్ణ చెబుతున్నారు.
ఇవీ చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫస్ట్ ర్యాంకర్.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష.. సక్సెస్ స్టోరీ..
ఇలా ఇప్పటివరకు స్కైప్ ద్వారా నాసా ప్లానెటరీ సైన్స్ విభాగంలో ప్రోగ్రామ్ సైంటిస్ట్ హెన్రీ థ్రోప్, నాసా చీఫ్ టెక్నాలజిస్ట్ జేమ్స్ ఆడమ్స్, ఎక్స్‌ఫ్లోర్ మార్స్ ప్రెసిడెంట్ జానెట్ ఐవీ, స్విట్జర్లాండ్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త క్లెయిర్ లీలతో విద్యార్థులు సంభాషించారు.
ఫేస్‌బుక్‌ను ప్రధాన సాధనంగా ఉపయోగించుకుని, తాను ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు హరికృష్ణ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపి, వారి అనుమతితో పెన్ పాల్ ఏర్పాటు చేశానని పేర్కొంటున్నాడు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం కోసమే తాను ఈ వినూత్న పద్ధతిని రూపొందించినట్లు చెప్పారు. తాను రూపొందించిన కార్యక్రమం వల్ల విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగయ్యాయని, స్నేహితులతో తమ భావాలను చక్కగా వ్యక్తీకరించుకోగలుగుతున్నారని... ఒక ఉపాధ్యాయుడిగా తనకు ఇతకంటే ఏంకావాలని అంటున్నారు హరికృష్ణ.