Skip to main content

APPSC Group 1: రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్... షేక్‌ అయేషా స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

‘ఓటమి ఎదురైనప్పుడే మరింత శ్రమించడం అలవాటవుతుంది... అప్పుడే విజయం ముంగిటకు వచ్చి వాలుతుంది. పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యమైనా ఇదిగో ఇట్టే మన సొంతమవుతుంది..’ ఇదీ ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 విజేత, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న మదనపల్లెకు చెందిన షేక్‌ ఆయేషా చెప్పిన మాటలు.
Sheikh Ayesha, APPSC Group-1 Topper, Motivational Journey ,Success through Hard Work
రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్... షేక్‌ అయేషా స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

పేదరికంలో పుట్టినా.. కష్టాలు పలకరించినా వెనుదిరగలేదు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలచుకుని డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయేషా విజయప్రస్థానం ఆమె మాటల్లోనే..

అన్నమయ్య: లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకసారి వైఫల్యం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి విజయానైన్నా ఇట్టే సాధించవచ్చు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌, ఇంటర్నెట్‌ లాంటి సాధనాలు అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీకాదు. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ప్రతి రోజు దినపత్రికలు చదివి , కరెంట్‌ ఎఫైర్స్‌ నోట్స్‌ సొంతంగా తయారు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలం. దానికి నేనే ఉదాహరణ.

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story

Ayesha

లక్షసాధనకు ఐదేళ్లు తపస్సు
సివిల్స్‌ నా చిన్ననాటి కల. బీటెక్‌ పూర్తి చేసిన తరువాత పినాకా ఆర్గనైజేషన్‌ నిర్వాహకులు యాదగిరి ,ముంబైలోని ఆర్‌బిఐ గ్రేడ్‌–బి మేనేజర్‌ మిథున్‌ల సూచనలు, సలహాలతో సివిల్స్‌ వైపు దృష్టి సారించా. 2018లో బీటెక్‌ పూర్తి చేసే సమయంలోనే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో, టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఎంపికయ్యా. అయినా నా లక్ష్యం గ్రూప్స్‌ కావడంతో ఉద్యోగంలో చేరలేదు. 2004 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించే పినాకా స్టూటెండ్స్‌ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ వాట్స్‌ప్‌ గ్రూపులో చేరాను. ఇందులో గ్రూప్స్‌కు ప్రిపేర్‌ కావడానికి అవసరమైన మెటీరియల్‌ లభించేది.

ఇవీ చ‌ద‌వండి: APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Success Story 

దీనితో పాటు యాదగిరి పూర్తిగా సహకారం అందించారు. 2018లో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ వెలువడగా దరఖాస్తు చేసుకున్నాను. మొదటి ప్రయత్నంగా 2019లో గ్రూప్‌–1 ప్రిలిమినరీ, 2020లో మెయిన్స్‌ పాసై ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కాని ఎంపిక కాలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలబడి మరింత ప్రోత్సాహాన్ని అందించారు. మరో ప్రయత్నం చేయడానికి మనోధైర్యాన్ని కల్పించారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది. 2022 సెప్టెంబర్‌లో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ జారీ కాగా ఆత్మస్థైర్యంతో మరింత కష్టపడి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాను. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాను. ఐదేళ్ల తపస్సు నెరవేరింది.

Ayesha

సాధారణ విద్యార్థినే..
1 నుంచి 10 వరకు ఆరోగ్యమాత ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలో చదివాను. ప్రాథమిక పాఠశాలలో సాధారణ విద్యార్థిని. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి, హెచ్‌ఎం వాసుదేవరావులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. మూడో తరగతి నుంచి నాకు మంచి ఫౌండేషన్‌ వేశారు. పదిలో 9.8 పాయింట్లు వచ్చాయి. ఇంటర్మీడియట్‌ తిరుపతి ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో చేరాను. కాలేజీలో ఫిజిక్స్‌ అధ్యాపకులు గోవిందరాజులు నన్ను బాగా ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్‌లో 982 మార్కులు సాధించాను. బీటెక్‌ తమిళనాడు తంజావూరులోని శస్త్ర యూనివర్శిటీలో చదివాను. 2018లో బీటెక్‌ పూర్తి చేశాను.

ఇవీ చ‌ద‌వండి: ఇన్ఫోసిస్‌లో ఆఫీసుబాయ్‌... క‌ట్ చేస్తే ఇప్పుడు రెండు కంపెనీల‌కు సీఈఓ... పీఎం మోదీ నుంచి ప్ర‌శంస‌లు.!

సొంతంగా నోట్స్‌ తయారు చేసుకున్నా...
తమిళనాడు తంజావూరు శస్త్ర యూనివర్శిటీలో బిటెక్‌ పూర్తి చేశా. టెక్ట్స్‌ బుక్స్‌, ఎన్‌సీఈఆర్‌టి బుక్స్‌ చదివి సొంతంగానే నోట్స్‌ తయారు చేసుకున్నా. క్రమం తప్పకుండా ప్రతి రోజూ దినపత్రికలు హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, సాక్షి చదవడం అలవాటు చేసుకున్నా. ఆయా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్‌ కాలమ్స్‌,కరెంట్‌ ఎఫైర్స్‌ చదవడం అలవాటుగా మారింది. రోజుకు తొమ్మిది గంటల పాటు చదివాను.

appsc

తల్లిదండ్రులే కొండంత అండ:
గ్రూప్స్‌ ప్రిపరేషన్‌లో తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. నాన్న షేక్‌ అహ్మద్‌బాషా చిరు వ్యాపారి. అమ్మ గౌసియాబేగం సాధారణ గృహిణి. నా సక్సెస్‌లో వారి ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను. ఏ సమయంలోనైనా నేను ఒత్తిడికి గురైతే నన్ను వెన్నుతట్టి నాలో ఆత్మస్థైర్యాన్ని కల్పించేవారు. ఇక స్కూలు రోజుల్లో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి ,వాసు నా చదువులో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

ఇవీ చ‌ద‌వండి: TS TET 2023 Bitbank: చాప్టర్ల వారీగా Perspectives in Education ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

ఐఏఎస్‌ కావాలనేది నా ఆకాంక్ష
ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం. అందుకు శక్తివంచన లేకుండా నా ప్రయత్నాలు చేస్తా. మహిళలను విద్యావంతులు చేయడం, అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం, ఆర్థికంగా ఎదిగే విధంగా తోడ్పాటునందిస్తా. ఎక్కడ పని చేసినా అక్కడ నిరక్షరాస్యత లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతా.

తన కలే మా కల
ఆయిషా చిన్నప్పటి నుంచి సివిల్స్‌లో రాణించడమే లక్ష్యంగా ఎంచుకుంది. అందు కోసం నిరంతరం శ్రమించింది. తన కలను మాకలగా మార్చుకుని అన్ని విధాలుగా ప్రోత్సహించాం. ఈ సుదీర్ఘప్రయాణంలో చదువులో అవసరమైన అన్నింటిని సమకూర్చాం. దీంతో తన స్వప్నం సాకారం కావడం మాకు సంతోషాన్ని కలిగించింది.
– షేక్‌ అహ్మద్‌బాషా, గౌసియాబేగం, తల్లిదండ్రులు

Published date : 23 Aug 2023 01:00PM

Photo Stories