DSP Success Story : నాలుగు నెలలు.. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించానిలా.. అయినా కూడా నా లక్ష్యం మాత్రం ఇదే..
మంచి ప్యాకేజీతో వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదనుకున్నాడు. ప్రభుత్వ రంగంలో ప్రజాసేవతో వీలున్న కొలువు కావాలనుకున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ధిక్కరించాడు. లక్ష్య సాధనకు పరాక్రమించాడు.
అయినా కూడా ఏ దశలోనూ నిరాశను దరి చేరనీయరాదనుకున్నాడు. ఆత్మవిశ్వాసమే మార్గమని విశ్వసించాడు. ఫలితంగా ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు గ్రూప్–1 ద్వారా డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చుక్కల సూర్యకుమార్. అయినప్పటికీ అంతిమ లక్ష్యం.. సివిల్స్‌పై గురి వీడలేదు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ సక్సెస్ స్టోరీ మీకోసం
కుటుంబ నేపథ్యం :
మాది మధ్య తరగతి కుటుంబం. సొంత ఊరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ. నాన్న వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు గోవిందరాజు, అక్క స్వాతి ఉన్నారు. తమ్ముడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నాడు.
ఎడ్యుకేషన్ :
నాకు టెన్త్‌లో మంచి మార్కులొచ్చాయి. స్టేట్‌లో ఆరో ర్యాంకు వచ్చింది. ఆ మార్కులు ఆధారంగా 2008లో నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ నా చదువుకు గట్టి పునాది పడింది. ఇంటర్‌లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ టెన్‌లో ఒకడిగా నిలిచాను.
రూ.కోటిన్నర వచ్చేది..
2014లో బీటెక్ అయ్యాక ఇన్ఫోసిస్ ఉద్యోగానికి క్యాంపస్‌లో సెలక్టయ్యాను. అప్పట్లోనే నాకు వార్షిక జీతం రూ.35 లక్షలు. అందులో కొనసాగి ఉంటే ఇప్పుడు రూ.కోటిన్నరకు చేరేవాడిని. ఎక్కువ జీతం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అయిన కూడా నాకు సంతృప్తి కలిగించలేదు. అందులో సంతోషంతో ఇమడలేకపోయాను. రెండేళ్లు పని చేశాను.
నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో..
కానీ పబ్లిక్ సర్వీసుతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయాన్ని నాన్నతో చెప్పాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఇది ఇబ్బందికరమైనా నాన్న నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగ్‌ను జాయినయ్యాను. 2017–20 మధ్య నాలుగుసార్లు రాశాను. ఇంటర్వ్యూ దశకు చేరుకోలేకపోయాను. ఇదే సమయంలో ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాను.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల్లో తుది జాబితాలో మిస్సయ్యాను. 2020 గ్రూప్–2లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అవకాశం పోయింది. అదే ఏడాది గ్రూప్–1 మెయిన్‌కు అర్హత సాధించినా ఇంటర్వ్యూ పోయింది. ఎస్సెస్సీ సీజీల్, నాబార్డు, ఆర్‌బీఐ.. ఇలా నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో విజయం దూరమయ్యేది. ఈ దశలో మానసిక దృఢత్వం కోల్పోతానేమోనని సంశయించాను. అయినా పట్టుదలతో కష్టపడేవాడిని. నిరాశ చెందేవాడిని కాదు.
ఎప్పటికైన నా లక్ష్యం ఇదే..
2023 ఈ ఏడాది నా జీవితంపై చాలా మంచి ప్రభావం చూపించింది. వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించేలా చేసింది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దేవదాయ శాఖలో ఈఓ పోస్టుకు ఎంపికయ్యాను. కాగ్ అకౌంటెంటుగా సెలక్టయ్యాను. సరదాగా రాసిన గ్రూప్–4 ఉద్యోగమూ వచ్చింది. గ్రూప్–1లో విజేతగా నిలిచాను. జైల్స్ డీఎస్పీగా ఎంపికయ్యాను. ప్రస్తుతానికి దేవదాయ శాఖలో ఈఓ శిక్షణ పొందుతున్నా.. వచ్చే జనవరిలో డీఎస్పీ ట్రైనింగ్ ఆర్డర్ రాగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డీఎస్పీ అయినా నా జీవిత లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలన్నదే. ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది.
ఇలా ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం.. : చుక్కల సూర్యకుమార్
జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో మన సామర్థ్యానికి అనుగుణంగా ముందుగానే లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఏదైనా సాధించాలంటే కష్టం తప్ప మరో మార్గం ఉండదని తెలుసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనా ఏ సమయంలోనూ ఆత్మ విశ్వాసాన్ని దూరం చేసుకోకూడదు. నేనైతే ఈ పరీక్షల ప్రిపరేషనులో అన్ని సరదాలు, షికారులు వదులుకున్నాను. ఫెయిల్యూర్స్ వస్తున్నా నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం.
పేరు : చుక్కల సూర్యకుమార్
తండ్రి : వెంకటరమణ,హెడ్ కానిస్టేబుల్
తల్లి : లక్ష్మి, గృహిణి
చదువు : బీటెక్ (ట్రిపుల్ ఐటీ, నూజివీడు)
ఎంపిక : గ్రూప్–1లో డీఎస్పీ (జైళ్లు)
ప్రస్తుతం ఉంటున్నది : వేమగిరి (తూర్పు గోదావరి)
లక్ష్యం నిర్ణయించుకుని శ్రమించాలి
Tags
- surya kumar dsp success story
- dsp success stories andhra pradesh
- Competitive Exams Success Stories
- APPSC
- four government jobs
- Government Jobs
- Inspire
- Success Stories
- motivational story in telugu
- police success story in telugu ap
- surya kumar yadav
- surya kumar dsp kakinada success story
- surya kumar dsp kakinada success story in telugu
- Sakshi Education Success Stories
- GovernmentJobs
- JobCompetition
- JobOffers
- JobHunt