Skip to main content

Cyber Security: ఆన్‌లైన్ నేరాలు పెరుగుతున్న ఈ తరుణంలో.. సైబర్‌ సెక్యూరిటీకి పెరుగుతున్న అవ‌కాశాలు..!

కరోనా కారణంగా ఎడ్యుకేషన్‌ నుంచి సేవల వరకూ.. అన్ని రంగాలు ఆన్‌లైన్‌ బాట పడుతున్న తరుణంలో.. సైబర్‌ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా నేటి ఇంటర్నెట్‌ యుగంలో ఫిషింగ్, హ్యాకింగ్, మాల్‌వేర్‌ అటాక్‌ వంటి సైబర్‌ దాడులను అరికట్టేందుకు నిపుణుల అవసరం ఏర్పడింది. దాంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో.. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో కెరీర్‌ అవకాశాలు.. అవసరమైన కోర్సులు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం..
cyber security career opportunities
cyber security career opportunities

‘బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌’ నివేదిక ప్రకారం–ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగ వృద్ధి రేటు 2012–2022 మధ్య 37 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీ రంగంలో వేలాది కొలువులు అందుబాటులోకి వస్తున్నందున.. పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, ఇన్‌స్టిట్యూట్‌లు.. డిప్లొమా నుంచి డిగ్రీ వరకు పలు సైబర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

చ‌ద‌వండి: Career Planning: ఒకే ఒక్క నిర్ణయం.. మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది


జాబ్‌ ప్రొఫైల్స్‌..
ఇటీవల నిర్వహించిన ఓ తాజా సర్వే ప్రకారం–సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్‌/ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ/ఐటీ డైరెక్టర్, సైబర్‌ సెక్యూరిటీ మేనేజర్, సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్‌ ఆర్కిటెక్ట్‌/ఇంజనీర్, ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటర్, ఆడిటర్, సిస్టమ్స్‌ ఇంజనీర్, ఇంటిగ్రేటర్‌ వంటి పలు రకాల ఉద్యోగాలు సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌/ఫైనాన్స్‌/ఇన్సూరెన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/మేనేజ్‌మెంట్, గవర్నమెంట్‌(డిఫెన్స్‌/నాన్ డిఫెన్స్‌), కన్సల్టింగ్‌/ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి.

ఐటీ సెక్యూరిటీ కన్సల్టెంట్‌..
చిన్నపాటి ఐటీ కంపెనీలు, ఐటీ ఆధారిత సంస్థలు చాలావరకు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను ప్రత్యేకంగా నియమించుకోవు. ఇలాంటి సంస్థలు తమకు సేవలు అందించేందుకు ఐటీ సెక్యూరిటీ కన్సల్టెంట్స్‌ను సంప్రదిస్తాయి. వారు ఆయా కంపెనీలకు సైబర్‌ భద్రతపరమైన సేవలు అందించి.. అందుకు తగ్గ ఫీజు తీసుకుంటారు. ఇక ఎంఎన్‌సీలు, పెద్ద కంపెనీలు వారి భద్రతాపరమైన సమస్యలకు అత్యవసర పరిస్థితుల్లో ఐటీ సెక్యూరిటీ కన్సల్టెంట్‌ల సేవలు కోరతాయి. సైబర్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా రాణించాలంటే.. కంప్యూటర్‌ సైన్స్‌/సైబర్‌ సెక్యూరిటీలో కనీసం బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. ఐటీ సెక్యూరిటీలో ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.

సెక్యూరిటీ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌..
కంప్యూటర్‌ నెట్‌వర్క్‌తో పనిచేసే కంపెనీలు తమ సమాచార భద్రతకు సెక్యూరిటీ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ను నియమించుకుంటాయి. వీరు సంస్థల్లో సైబర్‌ భద్రతతోపాటు, మౌలిక సదుపాయాలను చూసుకుంటారు. సిస్టమ్స్‌ నిర్వహణ, డేటా, నెట్‌వర్క్‌తో సహా ఐటీ సంబంధిత అన్ని రక్షణ బాధ్యతలు వీరు పర్యవేక్షిస్తారు. దాంతోపాటు ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరిస్తారు. సెక్యూరిటీ సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కొలువు దక్కించుకునేందుకు కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ స్థాయి కోర్సులతోపాటు సంబంధిత నైపుణ్యాలు ఉండాలి.

ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్‌..
రాబోయే సైబర్‌ సమస్యలను ముందే పసిగట్టి నెట్‌వర్క్‌ రక్షణ కోసం నిర్దిష్ట ఏర్పాట్లు చేయడం ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్‌ బాధ్యత. సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా మాల్‌వేర్స్‌ ఉన్నాయా అనేది ట్రాక్‌ చేయడంతోపాటు సెక్యూరిటీ బలహీనతలను గుర్తిస్తారు. ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్‌ పోస్టుల్లో ఇంజనీరింగ్‌ లేదా కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు ఈ రంగంలో కొనేళ్ల అనుభవం ఉన్నవారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

చ‌ద‌వండి: Cyber Security: ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే... జాబ్‌ గ్యారెంటీ!
 

ఎథికల్‌ హ్యాకర్‌..
హ్యాకింగ్‌ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన పదమే. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల వెబ్‌సైట్‌లు హ్యాకింగ్‌ బారిన పడుతూ సంచలనంగా మారడమే! కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి ఎక్కడి నుంచో ప్రవేశించి.. విలువైన సమాచారం తస్కరించడం, సమాచారాన్ని మార్చివేయడం, లేదా వెబ్‌సైట్‌ పనిచేయకుండా చేయడం వంటి చర్యలకు హ్యాకర్లు పాల్పడుతుంటారు. ఇలా వెబ్‌సైట్‌లు, సమాచార వ్యవస్థల అనైతిక హ్యాకింగ్‌ను అడ్డుకునే నిపుణులే.. ఎథికల్‌ హ్యాకర్లు. కంపెనీలు తమ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) వ్యవస్థల్లోని లోపాలను, బలహీనతలను కనిపెట్టేందుకు ఎథికల్‌ హ్యాకర్‌లను నియమించుకుంటాయి. ఈ విభాగంలో పనిచేసే నిపుణు లు కంప్యూటర్‌ వ్యవస్థల్లోని సమస్యలను, హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదాలను ముందుగానే పసిగడతారు. సిస్టమ్స్‌ సమస్యలు, అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ లోపాలు, కాన్ఫిగరేషన్‌ బలహీనతలను గుర్తించి హెచ్చరిస్తారు. వీరు హ్యాకర్‌ దృష్టితో ఆలోచించి.. కంప్యూటర్‌ వ్యవస్థలో ఇతరులు ప్రవేశించి.. నష్టం కలిగించేందుకు ఆస్కారమున్న సమస్యలను గుర్తిస్తారు. ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఎథికల్‌ హ్యాకింగ్‌ సర్టిఫికెట్లతోపాటు సంబంధిత నైపుణ్యాలున్న అభ్యర్థులు ఈ రంగంలో రాణిస్తారు.

ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌/ఇన్వెస్టిగేటర్‌..
ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన డొమైన్స్‌లో ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌/ఇన్వెస్టిగేటర్‌ ముందు వరుసలో నిలుస్తోంది. ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌లు.. నేరాలు/సైబర్‌ క్రైమ్స్‌ పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తారు. వీరు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పనిచేస్తారు. నేరం జరిగిన తీరును లోతుగా పరిశోధన చేసి..కేసు దర్యాప్తులో భాగంగా వాటిని సాక్ష్యాధారాలతో సహా కోర్టులకు అందజేస్తారు. ప్రధానంగా కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, పోర్టబుల్‌ డ్రైవ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలను ఎలా జాగ్రత్త చేయాలి వంటి విషయాలు వీరికి బాగా తెలిసుండాలి. సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌ తర్వాత బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌/ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌గా కెరీర్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌..
సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఉన్నతమైన కొలువు.. చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌. వీరు సంస్థ ఐటీ భద్రతా విభాగాన్ని పర్యవేక్షిస్తుంటారు. సంస్థలో అన్ని ఐటీ ఆధారిత భద్రతా సంబంధిత సమస్యలు, అవసరాలకు వీరే జవాబుదారీగా ఉంటారు. సైబర్‌ సెక్యూరిటీలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీతోపాటు అనుభవం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

చ‌ద‌వండి: New Courses in IIM: ఇక్కడ విద్యనభ్యసించిన వారికి... టాప్‌ కంపెనీల్లో ఉద్యోగం

Published date : 19 Feb 2022 04:35PM

Photo Stories