Skip to main content

APPSC, TSPSC Groups: ఇంటర్వ్యూలకు స్వస్తి.. ప్రతిభే గీటురాయి

APPSC, TSPSC Groups
A Short Guide to APPSC, TSPSC Written Test: Exam Preparation Tips & Tricks here

గ్రూప్‌–1, 2 సర్వీసులు.. తెలుగు రాష్ట్రాల్లో.. ఉద్యోగార్థులకు అత్యంత క్రేజీ పరీక్షలు! ఈ సర్వీసులు దక్కించుకోవాలని లక్షల మంది ఏళ్ల తరబడి కృషి చేస్తుంటారు. కానీ.. ఎంపిక ప్రక్రియలో సుదీర్ఘ ప్రయాణం! రాత పరీక్షలు, ఆ తర్వాత ఇంటర్వ్యూలో నెగ్గితేనే కొలువు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు దొర్లినా సంవత్సరాల శ్రమ అంతా వృథా!! ముఖ్యంగా రాత పరీక్షలో ఎంతటి ప్రతిభ చూపినా.. చివరి దశలో ఉండే ఇంటర్వ్యూలో.. చిన్నపాటి పొరపాట్లతో అవకాశాలు కోల్పోతున్న వారెందరో! గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేమి లేదా.. ఒత్తిడి కారణంగా.. ప్రతిభ ఉన్నా.. ఇంటర్వ్యూలో సరిగా మాట్లాడలేక బంగారం లాంటి అవకాశాలు చేజార్చుకుంటున్నారు! ఇలాంటి వారందరూ ఇక నిశ్చింతగా ఉండొచ్చు. కారణం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. గ్రూప్‌–1, 2 సర్వీసులకు ఇంటర్వ్యూలకు స్వస్తి పలకాలనే నిర్ణయమే! ఈ నేపథ్యంలో.. గ్రూప్‌1,2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా.. ఇంటర్వ్యూలకు స్వస్తితో ప్రయోజనాలు, రాత పరీక్షలో పాటించాల్సిన ప్రమాణాలపై ప్రత్యేక కథనం...

  • తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2లకు ఇంటర్వ్యూలు ఎత్తివేత
  • రాత పరీక్షలో ప్రతిభే గీటురాయిగా తుది ఎంపిక
  • గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ప్రయోజనం అంటున్న నిపుణులు

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌1, గ్రూప్‌ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేయడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. రెండు రాష్ట్రాల్లోనూ గ్రూప్‌–1, 2 సర్వీసుల నియామకానికి అడుగులు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం లక్షల మందికి ప్రయోజనకరంగా నిలవనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది! వాస్తవానికి గ్రూప్స్‌ సర్వీసులకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రూప్‌–1, 2లకు ఇంటర్వ్యూలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. ఇది వందల సంఖ్యలో ఉండే గ్రూప్‌1,2 పోస్ట్‌లకు పోటీ పడే లక్షల మంది అభ్యర్థులకు ఒక రకంగా ఉపశమనం కల్పించే నిర్ణయమని నిపుణులు పేర్కొంటున్నారు.

చ‌ద‌వండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  

రిటెన్‌లో ఎక్కువే కానీ.. ఇంటర్వ్యూలో తారుమారు

కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు రాత పరీక్షలో మంచి మార్కులు సాధిస్తున్నా.. ఇంటర్వ్యూలో తక్కువ మార్కులతో నిరాశజనక ఫలితాలు ఎదురవుతున్నాయి. అదే విధంగా రాత పరీక్షలో తక్కువ మార్కులు పొందినా.. ఇంటర్వ్యూలో ఎక్కువ స్కోర్‌ సాధించి కొందరు తుది విజేతలుగా నిలుస్తున్నారు. ఇంటర్వ్యూల సమయంలో నెలకొంటున్న కొన్ని పరిస్థితులే దీనికి కారణంగా మారుతున్నాయి. ప్రతి ఒక్క మార్కు కూడా విజయానికి కీలకంగా నిలిచే గ్రూప్స్‌ వంటి పరీక్షల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల ఎందరో ప్రతిభావంతులు నిరాశకు, నిస్పృహకు లోనవుతున్నారు. దీంతో ఇంటర్వ్యూలను తొలగించి పూర్తిగా రాత పరీక్షల్లో మెరిట్‌ ఆధారంగానే తుది ఎంపిక చేపట్టాలనే నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది. ఈ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి కృషి చేసిన వారికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని.. పారదర్శకతకు కూడా మార్గం ఏర్పడుతుందని అంటున్నారు.

ఇంటర్వ్యూ ఉద్దేశం

ఇంటర్వ్యూకు ముందు దశల్లో నిర్వహించే రాత పరీక్షల్లో అభ్యర్థుల్లోని సబ్జెక్ట్‌ నైపుణ్యాలను మాత్రమే పరిశీలించే, పరీక్షించే అవకాశం లభిస్తుంది. కానీ వారిలోని సేవా దృక్పథాన్ని, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని, పరిపాలన దక్షతను, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరిశీలించాలంటే.. ఇంటర్వ్యూలతోనే సాధ్యమనే అభిప్రాయంతో ఈ విధానాన్ని రూపొందించారు. అయితే.. ఇంటర్వ్యూ సమయంలో కొందరు అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు కమ్యూనికేషన్‌ గ్యాప్, ఒత్తిడి వంటి కారణాలతో..వారిలో సర్వీసులకు సరిపడే లక్షణాలున్నా.. వాటిని వ్యక్తపరచలేక నిరాశకు గురవుతున్నారు. ఇంటర్వ్యూలో పొందే మార్కులు కీలకంగా మారుతుండటంతో అవకతవకలకు ఆస్కారముందనే ఆరోపణాలు వచ్చాయి. అంతేకాకుండా ఇంటర్వ్యూ ప్రక్రియకు సుదీర్ఘ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి కారణాలతో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికారనే వాదనే వినిపిస్తోంది.

చ‌ద‌వండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​

ఇకపై.. తుది ఎంపిక ఇలా

  • తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌1, గ్రూప్‌2లకు ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన నేపథ్యంలో.. ఇకపై ఎంపిక ప్రక్రియ కేవలం రాత పరీక్షల్లో చూపిన ప్రతిభ, పొందిన మార్కుల ఆధారంగానే జరగనుంది. 
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 సర్వీసులకు సంబంధించి తొలి దశలో రెండు పేపర్లుగా ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను, రెండో దశలో అయిదు పేపర్లుగా 750 మార్కులకు మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షలో సాధించిన మార్కులే గీటు రాయిగా తుది విజేతలను ఎంపిక చేస్తారు. ఇప్పటి వరకు మెయిన్‌ పరీక్షలతోపాటు 75 మార్కులకు ఇంటర్వ్యూ విధానం కూడా ఉండేది. ఇక నుంచి ఈ ఇంటర్వ్యూ విధానం ఉండదు.
  • ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 సర్వీసులకు సంబంధించి.. తొలి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్‌ టెస్ట్, తర్వాత రెండో దశలో 450 మార్కులకు మెయిన్‌ ఎగ్జామినేషన్, ఆ తర్వాత కొన్ని నిర్దేశిత గెజిటెడ్‌ హోదా పోస్ట్‌లకు 75 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ విధానం అమలవుతోంది. తాజా నిర్ణయంతో కేవలం 450 మార్కులకు నిర్వహించే మెయిన్‌ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక జరగనుంది.
  • టీఎస్‌పీఎస్సీకి సంబంధించి.. గ్రూప్‌–1లో ఇప్పటి వరకు మూడు దశలుగా (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్‌ను అర్హత పరీక్షగా, ఆ తర్వాత రెండో దశలో ఆరు పేపర్లుగా 900 మార్కులకు ఉండే మెయిన్‌ ఎగ్జామినేషన్‌.. చివరగా 100 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇక నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు మాత్రమే జరుగుతాయి. ఇంటర్వ్యూ ఉండదు. 
  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2కి సంబంధించి నాలుగు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. తర్వాత దశలో గెజిటెడ్‌ పోస్ట్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో మరో 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో కేవలం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగానే తుది విజేతలను ఎంపిక చేయనున్నారు. 

ఆ నైపుణ్యాలు గుర్తించడం ఎలా?!

  • అభ్యర్థులకు ప్రజాసేవ పట్ల ఉన్న దృక్పథం, సర్వీసులకు సరిపడే నైపుణ్యాలను (నిర్ణయ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం తదితర) పరీక్షించడం ప్రధాన ఉద్దేశంగా అమలు చేస్తున్న ఇంటర్వ్యూలను తొలగిస్తే.. రాత పరీక్ష ద్వారా ఈ నైపుణ్యాలను గుర్తించడం ఎలా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. దీనికి నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటంటే..
  • ‘గ్రూప్‌–1,2 వంటి సర్వీసులకు ఎంపికైన వారికి నిర్దిష్ట కాల పరిమితిలో శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో ఆయా సర్వీసులకు ఎంపికైన వారికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణనివ్వడం ద్వారా సమస్యను సులభంగా పరిష్కరించొచ్చు. శిక్షణ సమయంలోనే బిహేవియరల్‌ స్కిల్స్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా.. విభిన్న నేపథ్యాల ప్రజలతో మమేకమయ్యేలా తర్ఫీదు ఇచ్చే అవకాశం ఉంది.’


చ‌ద‌వండి: TSPSC & APPSC Groups: గ్రూప్స్‌లో విజయానికి జనరల్ సైన్సే కీలకం.. ఇలా చ‌దివితే..

రాత పరీక్షలోనూ కొద్దిపాటి మార్పులతో

సబ్జెక్ట్‌ సంబంధిత అంశాలతో ఉండే రాత పరీక్షల్లో కొద్దిపాటి మార్పులు చేసి.. అభ్యర్థుల్లోని సర్వీస్‌ ఓరియెంటేషన్‌ను గుర్తించే విధంగా కొన్ని అంశాలను చేర్చడం ద్వారా అభ్యర్థులకు ప్రభుత్వ సర్వీసుల పట్ల ఉన్న ఆసక్తి, దృక్పథం వంటి నైపుణ్యాలను గుర్తించొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షనే ఇందుకు ఉదాహరణగా నిపుణులు పేర్కొంటున్నారు. 

  • సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్ష పేపర్‌–5లో.. ఎథిక్స్, ఇంటెగ్రిటీ, అప్టిట్యూడ్‌ పేరుతో ప్రత్యేకంగా ఒక పేపర్‌ ద్వారా అభ్యర్థుల్లో ప్రజాసేవ పట్ల ఉన్న అంకిత భావం, నిర్ణయాత్మక సామర్థ్యం, పరిపాలన దక్షత, గ్రామీణ–పేద వర్గాల పట్ల వారికున్న దృక్పథం వంటి అంశాలను పరీక్షిస్తున్నారు.
  • ఇదే తరహాలో గ్రూప్‌–1, 2లోనూ కొద్దిపాటి మార్పులతో అభ్యర్థుల్లోని సర్వీస్‌ అప్టిట్యూడ్‌కు సంబంధించి ప్రాథమికంగా అంచనాకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 
  • ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్‌ పేపర్‌–3లో ఎథిక్స్‌ ఇన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ లా విభాగం ద్వారా.. ప్రభుత్వ సర్వీసులకు అవసరమైన నైతిక విలువలకు సంబంధించిన నైపుణ్యాలను అడిగే విధంగా వ్యవహరిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ కూడా ఇలాంటి అంశాలతో సిలబస్‌లో కొద్దిగా మార్పులు చేస్తే అభ్యర్థుల సేవా దృక్పథంపై ప్రాథమిక అంచనాకు రావచ్చని అంటున్నారు.

గ్రూప్స్‌ పరీక్షల కొత్త విధానం విడుదల 

గ్రూప్‌ ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూల(మౌఖిక పరీక్షలు)ను తొలగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలుండేవి. ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో జరిగే మార్పులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.  దీని ప్రకారం–గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ 150 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పరీక్ష ఉంటుంది. ముందుగా ప్రిలిమినరీ టెస్ట్‌లో అర్హత సాధించిన వారు మెయిన్‌  పరీక్షకు ఎంపికవుతారు. 900మార్కులతో గ్రూప్‌–1 మెయిన్‌ రాత పరీక్ష ఉంటుంది. మెయిన్‌లో ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు. అలాగే గ్రూప్‌–2 పరీక్షలు నాలుగు పేపర్లు ఒక్కోటి 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

గ్రామీణ విద్యార్థులకు మేలుగా

ఇంటర్వ్యూలకు స్వస్తి పలికే నిర్ణయం గ్రామీణ విద్యార్థులకు మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కొంత తక్కువగా ఉంటాయని.. పర్యవసానంగా వారికి రిటెన్‌ స్కిల్స్‌ ఉన్నా.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడం వల్ల ఇంటర్వ్యూల్లో నెగ్గలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదే కారణంగా పలువురు అవకాశాలు చేజార్చుకున్న పరిస్థితులు కూడా గత నియామకాల్లో కనిపించాయని పేర్కొంటున్నారు. తాజా నిర్ణయం గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చే విషయంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీరికి సర్వీస్‌కు ఎంపికైన తర్వాత ఇచ్చే శిక్షణలో ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన శిక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇంటర్వ్యూలు ఎత్తివేసే నిర్ణయంపై అభ్యర్థుల నుంచి అధికశాతం సానుకూల అభిప్రాయమే వ్యక్తమవుతోంది.

మేలు చేసే నిర్ణయం

ఇంటర్వ్యూల విధానానికి స్వస్తి పలకాలనే నిర్ణయం హర్షణీయం. దీనివల్ల పారదర్శకతకు పెద్దపీట వేసినట్లే. మౌఖిక పరీక్షలో పొందే మార్కులతో తుది విజేతలుగా నిలుస్తున్న వారు ఎందరో ఉన్నారు. దీనికి కారణం.. ఇంటర్వ్యూల సమయంలో జరిగే పొరపాట్లే. తాజా నిర్ణయంతో ఈ పొరపాట్లకు, అవకతవకలకు తెరదించినట్లవుతుంది. నిజమైన ప్రతిభను గుర్తించి.. వారికి అవకాశం కల్పించేందుకు మార్గం ఏర్పడుతుంది.
–ప్రొ‘‘ వై.వెంకటరామిరెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్, యూపీఎస్సీ మాజీ సభ్యులు

రాత పరీక్షలోనే గుర్తించేలా

గ్రూప్స్‌ సర్వీసెస్‌కు ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలు ఎత్తివేసినా.. ఇంటర్వ్యూ ద్వారా పరిశీలించే లక్షణాలను రాత పరీక్షలోనే గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. దీనివల్ల అభ్యర్థులకు ఉన్న అప్టిట్యూడ్, అటిట్యూడ్‌లను గుర్తించే అవకాశం లభిస్తుంది. ఎంఎన్‌సీ సంస్థల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో ఇలాంటి విధానం ఇప్పటికే అమలవుతోంది. డెసిషన్‌ మేకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ వంటి నైపుణ్యాలను రాత పరీక్షలోనే పరిశీలించే విధంగా అవి చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే తరహాలో గ్రూప్స్‌ రాత పరీక్షల్లోనూ కొద్దిపాటి మార్పులు చేయొచ్చు.
– వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్‌ ట్రీ ఐఏఎస్‌ అకాడమీ

స్పష్టత ఇస్తే బాగుంటుంది

ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ.. అందులోని అంశాలను రాత పరీక్షలోనే కలుపుతారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. దీని వల్ల అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధత పొందే విషయంలో అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా గ్రూప్‌–1, 2 పరీక్షల నిర్వహణ తేదీల మధ్య కొంత వ్యవధి ఉండేలా చూడాలని కోరుతున్నాం.
–ఎం.వీరేశం, టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ అభ్యర్థి
 

చ‌ద‌వండి: Science & Technology Preparation: సబ్జెక్ట్‌ ఒకటే అయినప్పటికి.. అడిగే ప్రశ్నల తీరులో భేదం...

Published date : 26 Apr 2022 04:55PM

Photo Stories