Success Story : ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. నా సక్సెస్ ప్లాన్ ఇదే..
ఒకసారి ప్రయత్నించి వదిలేస్తే గమ్యాన్ని ఎన్నటికీ చేరుకోలేం. లక్ష్యం ఉన్నతమైంది అయితే ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి సాధించగలం.
ఏదైన ఒక ప్రభుత్వం ఉద్యోగం సాధించడానికి ఏళ్ల తరబడి చదువుతాం. చివరికి జాబ్ కొట్టగానే ఉద్యోగంలో చేరి చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేస్తాం. కానీ ఈ యువకుడు ఒక ఉద్యోగం రాగానే అక్కడితో ఆగలేదు. తాను ఏదో సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలనుకోలేదు. మంచి జీతం, ఉన్నత స్థానం ఉన్న ఉద్యోగం వచ్చేదాకా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ప్రయాణంలో ఆయన ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ఆశ్చర్యపరిచాడు. అయినా కూడా ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈయనే హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన దంటు వెంకట సాయి తేజ. ఈ నేపథ్యంలో సాయి తేజ సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
నేను పుట్టి.. పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. నాన్న రమేష్‌బాబు. ఈయన ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసి రిటైరయ్యారు. అమ్మ సత్యవతి. ఈమె యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే నా భార్య మీనా నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. అమ్మానాన్న, ఇరుగుపొరుగు వారు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేవారు. దాంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకున్నా. బీటెక్ పూర్తికాగానే పోటీ పరీక్షలకు ప్రిపేరవడం ప్రారంభించాను.
APPSC Group 1 & 2 Success Plan : ఈ సూచనలు ఫాలో అయితే గ్రూప్-1&2లో విజేతలు మీరే ..
ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
బీటెక్ పూర్తవగానే.. 2014లో ఐబీపీఎస్-4 పరీక్ష రాసి ఉద్యోగం సాధించాను. అదే విధంగా ఎస్‌బీఐ అసోసియేట్ బ్యాంక్స్ క్లర్క్-2014 పరీక్ష రాసి విజయం సాధించాను. ఎఫ్‌సీఐ గ్రేడ్-3 హెచ్‌ఆర్ అసోసియేట్-2014 పరీక్ష రాయగా అందులోనూ ఉద్యోగం వచ్చింది. ఎస్‌బీఐ, ఎఫ్‌సీఐ ఉద్యోగాలు వేర్వేరు రాష్ట్రాల్లో రావడం వల్ల ఐబీపీస్-4 ద్వారా వచ్చిన క్లర్క్ ఉద్యోగంలో చేరాను. విజయ బ్యాంక్‌లో మూడున్నరేళ్లు పనిచేశాను. 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్), గ్రూప్-4 పరీక్షలకు ప్రిపేర్ అయ్యి రాశాను. గ్రూప్-4(86వ ర్యాంక్), ఎస్‌ఎస్‌సీ రెండింటిలోనూ ఉద్యోగం వచ్చింది. గ్రూప్-4 ద్వారా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది.
గ్రూప్-4 ఉద్యోగానికి రాజీనామా చేసి..
కొవిడ్ కారణంగా 2021 జనవరిలో పోస్టింగ్ ఇచ్చారు. ఎస్‌ఎస్‌సీ ద్వారా కూడా సీజీడీఏ ఆడిటర్‌గా ఉద్యోగం వచ్చినపట్పికీ గ్రూప్-4 పోస్టింగ్ ముందుగా ఇవ్వడం వల్ల జాయిన్ అయ్యాను. జనవరి నుంచి అక్టోబర్ వరకు పనిచేశాను. ఈలోగా ఎస్‌ఎస్‌సీ ద్వారా వచ్చిన సీజీడీఏ ఆడిటర్ ఉద్యోగానికి పోస్టింగ్ ఇచ్చారు. గ్రూప్-4 ఉద్యోగానికి రాజీనామా చేసి సీజీడీఏ ఆడిటర్ ఉద్యోగంలో చేరాను.
ఉద్యోగం చేస్తూనే ఎస్‌ఎస్‌సీ-2022 పరీక్ష రాశాను. అందులోనూ కస్టమ్స్ ఎగ్జామినర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే కస్టమ్స్ ఎగ్జామినర్ పోస్ట్ ఎక్కువ గ్రేడ్ కలిగి ఉంది కాబట్టి త్వరలో రాజీనామా చేసి అందులో చేరతాను.
ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు మాత్రం..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఏదో ఒక పబ్లికేషన్‌కు చెందిన మెటీరియల్‌నే చదవాలి. వివిధ పబ్లికేషన్ల మెటీరియల్స్ చదవడం వల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు ఆర్‌ఎస్ అగర్వాల్స్ మెటీరియల్ ప్రిపేర్ అయ్యాను. అదే విధంగా ఐబీపీఎస్ పరీక్షకు బీఎస్సీ( బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్స్-ఢిల్లీ) పబ్లికేషన్స్ మెటీరియల్ చదివాను. వీటిని చదువుతూనే నిత్యం వార్తా పత్రికలు చదివేవాడిని. ఆన్‌లైన్‌లో అన్ని రకాల మెటీరియల్, ప్రీవియస్ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని తరచూ చూసేవాడిని.
ఒక ప్రశ్న ఇస్తే.. అది ఏ సంవత్సరం, ఏ పరీక్షలో వచ్చిందో..
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి ప్రత్యేకమైన కోచింగ్ ఏం తీసుకోలేదు. ఏ పరీక్షకైనా మార్కెట్‌లో లభించే మెటీరియల్ సమకూర్చుకుని ప్రిపేరవుతున్నా. వాటితో పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించే మాక్‌టెస్ట్‌లు, వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే మాక్‌టెస్ట్‌లకు హాజరయ్యాను. మాక్‌టెస్ట్‌లు ఎంత ఎక్కువ రాస్తే సబ్జెక్ట్ అంత ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల గతంలో ప్రశ్నపత్రం ఏవిధంగా వచ్చిందో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం ఏవిధంగా వస్తుందో అవగాహన కలుగుతుంది. ప్రశ్నల సరళి అవగతమవుతుంది. ఎలా అంటే.. ఒక ప్రశ్న ఇస్తే అది ఏ సంవత్సరం, ఏ పరీక్షలో వచ్చిందో చెప్పగలను. అంతగా ప్రాక్టీస్ చేశాను.
APPSC Group 1 & 2 Syllabus 2023 : ఇవి చదివితే..గ్రూప్ 1 & 2 ఉద్యోగం మీదే..
కోచింగ్ అవసరం లేదు.. కానీ
పోటీ పరీక్షల్లో కోచింగ్ తీసుకుంటేనే నెగ్గుతామని అనుకోవడం సరైన పద్దతి కాదు. పాఠశాల దశ నుంచే మంచి బేసిక్స్ ఉన్నవారు కోచింగ్ తీసుకోకున్నా ఉద్యోగం సాధించవచ్చు. బేసిక్స్ మీద పట్టు లేని వారు కొద్దిరోజులు కోచింగ్ తీసుకుని ఆ తర్వాత సొంతంగా చదువుకోవచ్చు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే మాక్‌టెస్ట్‌లు మాత్రం కచ్చితంగా రాయాలి. ప్రస్తుతం ఆన్‌లైన్ కోచింగ్‌లు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.
ఇలా చదివితే సులభం.. కానీ..
ఏ పోటీ పరీక్షకైన మొదట సిలబస్‌ను అర్థం చేసుకోవాలి. అందులో ఏ టాపిక్స్ ఇస్తున్నారు. వాటిపై మనకు ఎంత మేరకు పట్టు ఉందని అంచనా వేసుకుని చదవడం ప్రారంభించాలి. మనకు రాని టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం మంచిది. అసలే రాని టాపిక్స్‌పై ఎక్కువ సమయం కేటాయించడం కూడా మంచిది కాదు. పరీక్షకు ఉన్న సమయాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి. మనం రాసే పరీక్షలో ఏయే సబ్జెక్టులు ఉన్నాయి. వాటి పరిధి ఎంతమేరకు ఉంటుందో పూర్తిగా అర్థం చేసుకోవాలి. దీంతో చదవడం సులభం అవుతుంది. ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం సులభంగా రాయవచ్చు. ఏకాగ్రతతో ఒక క్రమ పద్ధతిలో టాపిక్స్ వారీగా చదవాలి.
నా ప్రిపరేషన్‌కు డౌట్ సాల్వింగ్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ గ్రూప్‌లో ఉద్యోగార్థులు, నిపుణులు ఉంటారు. ఎవరైనా ఏదైనా ప్రశ్నను గ్రూప్‌లో పెడితే వాటిని సాల్వ్ చేసి తిరిగి గ్రూప్‌లో ఉంచుతారు. వాటిలో ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. ఆ గ్రూప్ ద్వారా అర్థమెటిక్స్‌పై పట్టు సాధించాను. ఈ డౌట్ సాల్వింగ్ గ్రూపులు అభ్యర్థులు వినియోగించుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.
Tags
- Success Stroy
- Competitive Exams Success Stories
- Inspire
- vekata sai teja government jobs success story telugu
- vekata sai teja government jobs news
- motivational story in telugu
- Success Story
- ssc jobs success tips in telugu
- rrb jobs success tips in telugu
- tspsc groups jobs success tips in telugu
- GovernmentJobs
- CareerSuccess
- EmploymentSuccess
- Success Stories
- SelfConfidence
- achievement
- Sakshi Education Success Stories
- Inspiring Story