Admissions in KVS: కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకత, విద్యాబోధన, ప్రవేశ విధానం.. ముఖ్య వివరాలు ఇవే..
- కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం
- ప్రాథమిక స్థాయి నుంచే వినూత్న విధానంలో బోధన
- యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం
కేంద్రీయ విద్యాలయాలు వినూత్న బోధనకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దశాబ్దాల క్రితమే కేవీలు ఏర్పాటయ్యాయి. ప్రారంభంలో వీటిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, త్రివిధ దళాల ఉద్యోగుల పిల్లలకు మాత్రమే ఉద్దేశించినప్పటికీ.. తర్వాత కాలంలో సామాన్య పౌరుల పిల్లలకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు. మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా బోధనలో మార్పులుచేస్తూ.. నాణ్యమైన విద్యకు నిలయంగా నిలుస్తున్నాయి కేంద్రీయ విద్యాలయాలు.
చదవండి: Admissions in KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలు..
ఎన్‌ఈపీ మేరకు వయో పరిమితి
కేవీల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో నూతన విద్యా విధానానికి అనుగుణంగానే వయోపరిమితి నిబంధనలు పేర్కొన్నారు. అన్ని తరగతులకు సంబంధించి వయో పరిమితికి మార్చి 31వ తేదీని గడువు తేదీగా పరిగణిస్తారు. ఉదాహరణకు..ఒకటో తరగతిలో చేరాలనుకుంటే.. మార్చి 31 నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ల మధ్యలో ఉండాలి. అదేవిధంగా రెండు, మూడో తరగతుల్లో ప్రవేశానికి 7–9ఏళ్లు, ఐదో తరగతి 9–11ఏళ్లు, ఆరో తరగతికి 10–12 ఏళ్లు, ఏడో తరగతికి 11–13ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12–14ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13–15ఏళ్లు, పదో తరగతికి 14–16ఏళ్ల మద్య వయసు ఉండాలి.
విభిన్న కేటగిరీలకు ప్రాధాన్యతలు
- కేవీల్లో ప్రవేశాల ఖరారుకు విభిన్న కేటగిరీల ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటూ.. నిర్దిష్ట ప్రాధాన్యత క్రమాన్ని అనుసరిస్తున్నారు.
- కేటగిరీ–1: బదిలీౖయెన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు.
- కేటగిరీ–2: కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఆఫ్ ది ఇండియన్ గవర్న్‌మెంట్‌కు సంబంధించి బదిలీౖయెన, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
- కేటగిరీ–3: బదిలీౖయెన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
- కేటగిరీ–4: రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, రాష్ట్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సంబంధించి బదిలీౖయెన, సాధారణ ఉద్యోగుల పిల్లలు.
- కేటగిరీ–5: పై కేటగిరీలకు చెందని ఇతర వర్గాలకు చెందిన పిల్లలు.
ఆర్‌టీఈ ప్రకారం–25 సీట్లు
విద్యార్థులకు సీట్లు కేటాయించే క్రమంలో విద్యా హక్కు చట్టం నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక పాఠశాలలోని మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను ఆర్‌టీఈ విధానంలో కేటాయిస్తారు. అదే విధంగా 15 శాతం సీట్లను ఎస్‌సీ కేటగిరీ విద్యార్థులకు, 7.5 శాతం సీట్లను ఎస్‌టీ కేటగిరీ విద్యార్థులకు, 27 శాతం సీట్లను ఓబీసీ–నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ విద్యార్థులకు కేటాయిస్తారు. అన్ని రిజర్వేషన్ కేటగిరీ వర్గాలకు అందుబాటులో ఉన్న సీట్లలో 3 శాతం సీట్లను ఆ వర్గాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు కేటాయిస్తారు.
చదవండి: ఏపీ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు
లాటరీ విధానంలో ఎంపిక
- ఎంపిక ప్రక్రియలో ఆయా కేటగిరీలు,రిజర్వేషన్లను అనుసరించి లాటరీ విధానంలో నిర్దిష్ట క్రమంలో సీట్ల కేటాయింపు చేస్తారు. మొదట ఆర్‌టీఈ విధానంలో, తర్వాత అన్ని వర్గాల దివ్యాంగ విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.
- ఈ రెండు దశలు పూర్తయిన తర్వాత కేటగిరీ–1, కేటగిరీ–2, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, కేటగిరీ–3, కేటగిరీ–4 కేటగిరీ–5, కేటగిరీ–6, సింగిల్ గర్ల్ చైల్డ్ విద్యార్థులను వరుస క్రమంలో ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా గరిష్టంగా మూడు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పూర్తిగా లాటరీ విధానంలో సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ లాటరీ విధానంలో సైతం ప్రాధాన్యతలను అనుసరిస్తారు. ఇది కూడా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది.
పదకొండో తరగతి
కేంద్రీయ విద్యాలయాల్లో పదకొండో తరగతిలో వయో పరిమితి నిబంధనలు లేకుండానే ప్రవేశాలు కల్పించే విధానం అమలవుతోంది. అయితే విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరంలోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ ప్రథమ సంవత్సరం తర్వాత బ్రేక్ లేని వారికే ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్ష ఆధారంగా తొమ్మిదో తరగతి
- కేంద్రీయ విద్యాలయాల్లో ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉండవు. మెరిట్, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. తొమ్మిదో తరగతిలో అడ్మిషన్‌కు మాత్రం పరీక్ష నిర్వహిస్తున్నారు.
- హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్‌సైన్స్, సైన్స్ సబ్జెక్ట్‌లలో వంద మార్కులకు మూడు గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి.
- ఈ పరీక్షలో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు మెరిట్ జాబితా రూపొందించి.. పైన పేర్కొన్న కేటగిరీల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రవేశాలు కల్పిస్తారు.
పదకొండో తరగతి.. మూడు గ్రూప్స్
కేంద్రీయ విద్యాలయాల్లో పదకొండో తరగతిలో మూడు స్ట్రీమ్స్(సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్) అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు, వారు దరఖాస్తు చేసుకున్న స్ట్రీమ్‌లో అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం కల్పిస్తారు. పదకొండో తరగతిలో ప్రవేశం పొందిన అన్ని స్ట్రీమ్‌ల విద్యార్థులు ఇన్ఫర్మాటిక్ ప్రాక్టీసెస్‌ను ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. సంబంధిత కేంద్రీయ విద్యాలయంలో అందుబాటులో ఉన్న ఎలక్టివ్స్ ఆధారంగా.. కంప్యూటర్ సైన్స్/బయో టెక్నాలజీలను సైన్స్ స్ట్రీమ్ అభ్యర్థులు ఎలక్టివ్‌గా ఎంచుకోవచ్చు. వీటితోపాటు మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్ టెక్నాలజీ, సబ్జెక్ట్‌లను కూడా ఎలక్టివ్‌గా అన్ని స్ట్రీమ్‌ల విద్యార్థులు ఎంచుకోవచ్చు.
బోధన.. ఆహ్లాదకరం
పిల్లలు ఉత్సాహంగా çస్కూల్‌కు వెళ్లే విధంగా కేంద్రీయ విద్యాలయాల్లో విద్యా విధానం అమలవుతోంది. ముఖ్యంగా కొత్తగా చేరే పిల్లలు ఇంటి నుంచి స్కూల్ వాతావరణానికి అలవాటుపడేలా చేసేందుకు ఆరు వారాల వ్యవధితో ‘స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్’ను రూపొందించాయి. ఈ ప్రోగ్రామ్ అనంతరం పరిసరాలను అర్థం చేసుకోవడం, ఆత్మవిశ్వాసం, పరిశీలన, పరస్పర సంబంధాలు, వర్గీకరణ , అనుకరణ, భావ వ్యక్తీకరణ, అవగాహన, క్రియేటివ్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు.
ఫీజులు నామ మాత్రంగా
- కేంద్రీయ విద్యాలయాల్లో ఫీజులు నామమాత్రంగా ఉంటాయి. అడ్మిషన్ ఫీజు రూ.25. విద్యాలయ వికాస నిధి(రూ.500), ట్యూషన్ ఫీజు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ తదితర ఫీజులు ఉంటాయి. ఒకటి నుంచి అయిదో తరగతి విద్యార్థులకు అన్నిరకాల ఫీజులు కలిపి నెలకు రూ.500–600, ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1000లోపు అవుతుంది. బాలికలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.
- పదకొండో తరగతిలో కంప్యూటర్ సైన్స్ ఎలక్టివ్‌గా తీసుకున్న విద్యార్థులు రూ.150, పదకొండు, పన్నెండు తరగతులకు కామర్స్, హ్యుమానిటీస్ స్ట్రీమ్ విద్యార్థులు రూ.300; సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం
- ఒకటో తరగతికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 17, 2023
- 2వ తరగతి, ఆపై తరగతులకు(ఇంటర్ ఫస్టియర్ మినహా) దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 3 – ఏప్రిల్ 12, 2023
- పదకొండో తరగతి రిజిస్ట్రేషన్: పదో తరగతి ఫలితాలు వెల్లడైన పది రోజుల నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://kvsonlineadmission.kvs.gov.in/index.html
- ఒకటో తరగతి ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://kvsonlineadmission.kvs.gov.in/index.html