Skip to main content

NEET 2022: ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్‌.. మార్పులు, చేర్పులు ఇవే.. సన్నద్ధత ఇలా..

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–అండర్‌ గ్రాడ్యుయేట్‌... నీట్‌–యూజీగా సుపరిచితం! ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత ఆధారంగానే.. ఎంబీబీఎస్, బీడీఎస్‌ సహా.. ఇతర వైద్య విద్య కోర్సుల్లో చేరే అవకాశం లభిస్తుంది! మెడికల్‌ కోర్సులను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు.. ఇంటర్మీడియెట్‌ తొలిరోజు నుంచే.. నీట్‌–యూజీలో విజయానికి కసరత్తు ప్రారంభిస్తారు. ఈ ఏడాది.. నీట్‌–యూజీ–2022 పరీక్ష జూన్‌ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించనున్నట్లు నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ పేర్కొంది. ఈ నెలాఖరులోపే నోటిఫికేషన్‌ కూడా వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్‌–2022లో మార్పులు,చేర్పులు.. విద్యార్థుల సన్నద్ధతకు మార్గాలపై ప్రత్యేక కథనం...
NEET 2022 exam notification
NEET 2022 exam notification
  • ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్‌!
  • జూన్‌ మూడు, లేదా నాలుగో వారంలో పరీక్ష
  • వయో పరిమితి నిబంధన తొలగింపు?
  • గత ఏడాది మాదిరిగానే పరీక్ష విధానం
  • సిలబస్‌ కూడా యథాతథంగానే..

నీట్‌ విద్యార్థులు ఇంకా పరీక్ష షెడ్యూల్‌ వెలువడలేదనే ఆందోళనకు స్వస్తి చెప్పి సన్నద్ధతకు పదును పెట్టుకోవాలి. ఎందుకంటే.. పరీక్ష తేదీకి రెండు, మూడు నెలల ముందు సాగించే ప్రిపరేషన్‌ విజయంలో ఎంతో కీలకం. నీట్‌ నిర్వహణపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో సన్నద్ధత దిశగా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

జూన్‌లో నీట్‌–యూజీ

నిర్వాహక సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటన ప్రకారం–జూన్‌ మూడు లేదా నాలుగో వారంలో నీట్‌–యూజీని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్‌ మెడికల్‌ కమిషన్, ఎన్‌టీఏ వర్గాల సమావేశం కూడా జరిగింది. ఇందులో జూన్‌ మూడు లేదా నాలుగో వారంలో నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనివల్ల నీట్‌ తర్వాత కౌన్సెలింగ్, విద్యా సంవత్సరం ప్రారంభం అన్నీ సకాలంలో జరుగుతాయనే అంచనాకు వచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌ 12న నీట్‌–యూజీని నిర్వహించగా.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొంత ఆలస్యమైన సంగతి తెలిసిందే.

చ‌ద‌వండి: NEET Guidance

గరిష్ట వయోపరిమితి తొలగింపు?

ఈ ఏడాది నీట్‌లో గరిష్ట వయో పరిమితి నిబంధనను తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. నీట్‌–యూజీకి ఎలాంటి గరిష్ట వయో పరిమితిని పేర్కొనొద్దని ఎన్‌టీఏకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ లేఖ రాసింది. వాస్తవానికి గత ఏడాది వరకు ఓపెన్‌ కేటగిరీలో 25ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ తదితర రిజర్వ్‌డ్‌ కేటగిరీల్లో 30 ఏళ్లుగా గరిష్ట వయో పరిమితి ఉంది.
 
పరీక్ష గతేడాది మాదిరిగానే

నీట్‌ పరీక్ష విధానం గత ఏడాది మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఛాయిస్‌ ఆధారిత ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. 2021–22 విద్యా సంవత్సరంలో కూడా కోవిడ్‌ మూడో వేవ్‌ కారణంగా ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌ కలయికగా విద్యాబోధన జరిగింది. దాంతో ఈ ఏడాది కూడా ఛాయిస్‌ ఆధారిత పేపర్‌తోనే పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ పరీక్ష విధానం

  • గత ఏడాది మొత్తం 180 ప్రశ్నలకు నీట్‌ నిర్వహించారు. ఇందులో బోటనీ, జువాలజీలను రెండు వేర్వేరు సెక్షన్లుగా పేర్కొంటూ.. ఒక్కో విభాగానికి 45 ప్రశ్నలు అడిగారు. అంటే.. 2020 వరకు మూడు సెక్షన్లుగా జరిగిన నీట్‌.. గతేడాది నాలుగు సెక్షన్లలో నిర్వహించారు. ప్రశ్నల విధానంలోనూ మార్పులు జరిగాయి. 
  • మొత్తం నాలుగు సబ్జెక్ట్‌లలో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) పరీక్ష జరిగింది.
  • ఒక్కో సబ్జెక్ట్‌ ఒక్కో విభాగంగా పరిగణించారు.
  • ప్రతి విభాగంలోనూ సెక్షన్‌–ఎ, సెక్షన్‌–బి పేరుతో రెండు ఉప విభాగాలుగా ప్రశ్నలు అడిగారు.
  • ప్రతి విభాగంలోనూ సెక్షన్‌–ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్‌–బి నుంచి 15 ప్రశ్నలు వచ్చాయి.
  • సెక్షన్‌–బిలోని 15 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా వదిలేసి.. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. 
  • ప్రతి సబ్జెక్ట్‌ నుంచి ప్రతి విభాగంలోనూ మొత్తంగా 45 ప్రశ్నలు చొప్పున సమాధానాలు గుర్తించాల్సి వచ్చింది. 
  • ఇలా.. మొత్తం నాలుగు విభాగాల నుంచి 180 ప్రశ్నలు,ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు పరీక్ష నిర్వహించారు. 
  • ప్రతి సెక్షన్‌(సబ్జెక్ట్‌) నుంచి 50ప్రశ్నలు అడిగినా.. సెక్షన్‌–బిలో కల్పించిన ఛాయిస్‌ విధానం వల్ల 45 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. 
  • నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ప్రకారం–ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
  • ఇదే విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


చ‌ద‌వండి: MBBS: రెండో దశ సీట్ల కేటాయింపు.. రిపోర్టింగ్ కు చివ‌రి తేదీ ఇదే..


పదమూడు భాషల్లో

ఈ సంవత్సరం కూడా నీట్‌ను ఇంగ్లిష్, హిందీతో పాటు మరో పదకొండు భాషల్లో అంటే మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ∙అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. గత గణాంకాలను పరిశీలిస్తే తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది.

ప్రతి విభాగంలో 140కి పైగా మార్కులు పొందేలా

  • నీట్‌ అభ్యర్థులు ప్రస్తుతం ప్రతి సబ్జెక్ట్‌లోనూ 180 మార్కులకుగాను 140 మార్కులు సాధించేలా సిలబస్‌ అంశాలను ఔపోసన పట్టాలి. 
  • ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని.. ఆ సమయంలో ఆయా సబ్జెక్ట్‌లను అభ్యసనం చేయాలి. 
  • ఇంటర్మీడియెట్‌ పరీక్షల ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు ఇంటర్, నీట్‌ సిలబస్‌లను సమన్వయం చేసుకుంటూ చదవాలి.
  • ఇంటర్‌ పరీక్షల తర్వాత.. నీట్‌ సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లకు టైమ్‌ పరంగా వెయిటేజీ కల్పిస్తూ విభజించుకోవాలి. 
  • ఈ సమయంలో అభ్యర్థులంతా స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి.
  • వీలైనంత మేరకు రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి.
  • ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. 
  • ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. 
  • ప్రతి రోజు మాక్‌ టెస్టులకు హాజరవ్వాలి. మోడల్‌ కొశ్చన్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. 
  • డైరెక్ట్‌ కొశ్చన్స్‌ కంటే ఇన్‌ డైరెక్ట్‌ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్‌ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. 
  • ప్రిపరేషన్‌ సమయంలోనే షార్ట్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. ఇది రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.


చ‌ద‌వండి: Telangana: మెడిక‌ల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. భారీగా పెర‌గ‌నున్న‌ సీట్లు..?


నీట్‌–యూజీ 2022–ముఖ్య సమాచారం

  • మార్చి నెలాఖరులోపు నోటిఫికేషన్‌
  • జూన్‌ మూడు లేదా నాలుగో ఆదివారం పరీక్ష
  • పెన్‌ పేపర్‌ విధానంలో మూడు గంటల వ్యవధిలో పరీక్ష
  • అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు బైపీసీ గ్రూప్‌ సబ్జెక్ట్‌లలో కనీసం 50శాతం మార్కులు పొంది ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి.
  • ఈ ఏడాది గరిష్ట వయో పరిమితి నిబంధనను తొలగించే అవకాశం ఉంది.

నీట్‌–యూజీ– గత ఏడాది పరీక్ష విధానం

సబ్జెక్ట్‌ సెక్షన్‌ వారీ ప్రశ్నల సంఖ్య మార్కులు
ఫిజిక్స్‌ సెక్షన్‌–ఎ ప్రశ్నలు 35 140
  సెక్షన్‌–బి ప్రశ్నలు 15 40
కెమిస్ట్రీ సెక్షన్‌–ఎ ప్రశ్నలు 35 140
  సెక్షన్‌–బి ప్రశ్నలు 15 40
బోటనీ సెక్షన్‌–ఎ ప్రశ్నలు 35 140
  సెక్షన్‌–బి ప్రశ్నలు 15 40
జువాలజీ సెక్షన్‌–ఎ ప్రశ్నలు 35 140
  సెక్షన్‌–బి ప్రశ్నలు 15 40
మొత్తం మార్కులు      720
  • ప్రతి సబ్జెక్ట్‌లోనూ సెక్షన్‌–బిలో 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం 180 ప్రశ్నలకు 720 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. 

విజయానికి సన్నద్ధత ఇలా

బోటనీ.. కాన్సెప్ట్‌లపై పట్టు

బోటనీకి సంబంధించి.. ఫిజియాలజీ ఆఫ్‌ ప్లాంట్స్‌ అండ్‌ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్, సెల్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్‌ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్‌ అండ్‌ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్‌ ఇష్యూస్‌ పాఠ్యాంశాలపై ఫోకస్‌ చేయడం లాభిస్తుంది. ప్లాంట్‌ ఫిజియాలజీలో ప్లాంట్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ ప్లాంట్స్, మినరల్‌ న్యూట్రిషన్‌ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్స్‌లో కణవిభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్‌ నుంచి కంటెంట్‌ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్‌ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టిపెట్టాలి. నీట్‌లో ఇంటర్‌ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి.
–బి.రాజేంద్ర, బోటనీ ఫ్యాకల్టీ

జువాలజీ.. ప్రీవియస్, మోడల్‌ పేపర్స్‌

జువాలజీ విషయంలో హ్యూమన్‌ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్‌ టాపిక్స్‌పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఆర్‌టీతోపాటు ఇంటర్‌ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్‌ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్‌ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
–కె.శ్రీనివాసులు, జువాలజీ ఫ్యాకల్టీ

ఫిజిక్స్‌.. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం

ఫిజిక్స్‌ విభాగం విషయంలో.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మోడరన్‌ ఫిజిక్స్‌ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి.ఇంటర్‌ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్‌ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
–రవీంద్ర, ఫిజిక్స్‌ ఫ్యాకల్టీ

కెమిస్ట్రీ.. రివిజన్‌ ప్రధానంగా

కెమిస్ట్రీ విషయంలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, మోల్‌ కాన్సెప్ట్, కెమికల్‌ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్‌ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్‌ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్‌ కెమిస్ట్రీ; ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మరిచిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు రివిజన్‌ చేస్తుండాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలను.. వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో.. ఫార్ములాలతో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. పీరియాడిక్‌ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. 
–కృష్ణ, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ

చ‌ద‌వండి: 

Telangana: మెడిక‌ల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. భారీగా పెర‌గ‌నున్న‌ సీట్లు..?

మెడికల్ సీట్లు సాధించిన 17 మంది గురుకుల విద్యార్థులు 

​​​​​​​ప్రతి విద్యార్థి చదువుకు ప్రభుత్వ సహకారం

త్వ‌ర‌లోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సహకరిస్తాం: సీఎం

 

Published date : 22 Mar 2022 06:19PM

Photo Stories