ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సహకరిస్తాం: సీఎం
వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారి సమస్యకు పరిష్కారాలను అన్వేషించాలని, ఎలాంటి అవసరమున్నా వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వారి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మార్చి 21న శాసన సభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అక్కడ పడ్డ ఇబ్బందులను సీఎంకు వివరించారు. తమను రాష్ట్రానికి తీసుకురావడంలో విశేష కృషి చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
మీ బాగోగులు మా బాధ్యత
మీరంతా రాష్ట్రానికి చెందిన పిల్లలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం తమ బాధ్యత అని సీఎం జగన్ విద్యార్థులతో అన్నారు. ‘ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించాను. నా ఆదేశాలను అందుకున్న వెంటనే వారంతా రంగంలోకి దిగారు. మిమ్మల్ని సురక్షితంగా తీసుకొస్తూ చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు నాకు నివేదించారు. మీ బాగోగులు చూసుకొనే బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించారు’ అని సీఎం చెప్పారు. ఈ విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించిన అధికారులను సీఎం అభినందించారు. విద్యార్థులతో సీఎం వివిధ అంశాలపై మాట్లాడారు. వారి చదువుల గురించి ఆరా తీశారు. కోర్సులను ఎంతవరకు పూర్తిచేశారు, వాటిని కొనసాగించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను తెలుసుకున్నారు.
వీవీఐపీల్లా చూసుకున్నారు : విద్యార్థులు
ఉక్రెయిన్ నుంచి తమను తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని విద్యార్థులు సీఎంకు వివరించారు. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్ని రకాల చర్యలు తీసుకుందని చెప్పారు. ఉక్రెయిన్ సమీప దేశాలకు చేరుకున్న దగ్గర నుంచి ఆహారం, వసతి, దేశంలోని విమానాశ్రయాల్లో తమకు స్వాగతం పలకడం, అక్కడి నుంచి ఫ్లైట్ టికెట్లు, వసతి వంటి అన్ని సదుపాయాలు కల్పించారని చెప్పారు. తమను వీవీఐపీల్లా చూసుకున్నారని తెలిపారు. చేసిన పనిని చెప్పుకోకుండా వెనుక ఉండి యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నడిపిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ తరహా చర్యలు తీసుకున్నప్పుడు సహజంగానే విపరీత ప్రచారం చేసుకుంటారని, అలాంటి పోకడలకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం, అధికారులు దూరంగా ఉండటం, చిత్తశుద్ధితో పని చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. తమకు అండగా నిలిచినందుకు వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తమకందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. డాక్టర్ వైఎస్సార్ స్ఫూర్తితో వైద్య విద్యను ఛాలెంజ్‌గా తీసుకున్నానని కడపకు చెందిన ఓ విద్యార్థిని సీఎంకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉక్రెయిన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, ఏపీఎన్ ఆర్‌టీఎస్ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, సీఈవో కె.దినేష్ కుమార్, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు అహ్మద్ బాబు, నార్త్ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, యూకేలో ప్రత్యేక ప్రతినిధి రవి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి:
Alert: నిరుద్యోగులూ మోసపోకండి.. ఉద్యోగాల ప్రకటన మేమివ్వలేదు
వైద్య, ఆరోగ్యశాఖలో 20 వేల ఖాళీలు
మెడికల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న సీట్లు..?