Alert: నిరుద్యోగులూ మోసపోకండి.. ఉద్యోగాల ప్రకటన మేమివ్వలేదు
ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ లో 92 ఉద్యోగాలు ఉన్నాయని వాటికి అర్హులైన వారు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ పేరిట కొంతమంది తప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి రావడంతో ఇటువంటి తప్పుడు ఉద్యోగ ప్రకటనలు చేసే మోసగాళ్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆ శాఖ స్పందిసూ్త..ఆ ఉద్యోగ ప్రకటనలను తాము ఇవ్వలేదని, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖాళీలను భర్తీ చేయాలనుకున్నప్పుడు, నియామక ప్రకటన జిల్లా కలెక్టర్ పేరిట మాత్రమే విడుదలవుతుందని ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ఈ ఉద్యోగ ప్రకటనల వెనుక వైద్యాధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎవరు ఈ నియామక ప్రకటన ఇచ్చారనే అంశంపై విచారణ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తప్పుడు ఉద్యోగ ప్రకటనను చూసిన నిరుద్యోగులు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకోవడమే కాకుండా నేరుగా వైద్య ఆరోగ్య శాఖను సంప్రదించడంతో ఈ మోసం వెలుగు చూసింది. చాలామంది నిరుద్యోగులు కొందరు మధ్యవర్తులను సంప్రదించగా...పోస్టులు దక్కాలంటే డబ్బులు ఇవ్వాలని కూడా కోరుతున్నట్లు వైద్య వర్గాల ద్వారా తెలిసింది.