Medical jobs: వైద్య, ఆరోగ్యశాఖలో 20 వేల ఖాళీలు
- ∙అసెంబ్లీలో మంత్రి హరీశ్ వెల్లడి
- ∙ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 20 వేల ఖాళీలను గుర్తించామని, త్వరలో భర్తీ ప్రక్రియ చేపడతామని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సోమ వారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రమోషన్ల ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిందని, దేశంలో 171 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే, తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. ఆయా మెడికల్ కాలేజీలకు ఒక్కోదానికి రూ. 200 కోట్లు మంజూరు చేసిందని, మనకు మాత్రం మొండిచేయి చూ పిందన్నారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని ఉమ్మడి ఏపీలో ఈ ప్రాంతంలో 3 మెడికల్ కాలేజీలుండగా, ఇప్పుడు 33కి పెంచుకుంటున్నామన్నారు. ఈ ఏడాది 8 కాలేజీలు అందుబాటులోకి వస్తాయని మంత్రి అన్నారు. తెలంగాణ వచ్చే నాటికి 700 ఎంబీబీఎస్ సీట్లే ఉండగా, వచ్చే విద్యాసంత్సరానికి అవి 2,850కు చేరకుంటాయని చెప్పారు. బస్తీ దవాఖానాలు గొప్పగా సేవలు అందిస్తున్నాయని, మొత్తం 350 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం 259 సేవలు అందిస్తున్నాయని, త్వరలో మిగతా చోట్ల అందుబాటులోకి వస్తాయని తెలిపారు. బస్తీ దవాఖానాల నుంచి టెలి మెడిసిన్ సేవలు సైతం అందిస్తున్నామని, గాం«దీ, ఉస్మానియా, నిమ్స్ వైద్యులు ఈ విధానం ద్వారా అవసరమైన సేవలు అందిస్తున్నారని హరీశ్ చెప్పారు. నిజామాబాద్‌లోనూ బస్తీ దవాఖానాలు మంజూరు చేస్తామని, హైదరాబాద్‌లో నాలుగు కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటుచేస్తున్నామన్నారు.
Also read: Half day schools: నేటి నుంచి ఒంటిపూట బడులు
డెడ్‌బాడీలు దొరకడం లేదు...
మెడికల్ కాలేజీల్లో ప్రయోగార్థం హోంశాఖతో చర్చించి గుర్తు తెలియని మృతదేహాలను ఇవ్వడానికి చట్టసవరణ చేస్తామని హరీశ్ అన్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పీఆర్వో పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో నెలకొల్పబోయే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. మంత్రిని సభ్యులు చందర్, జనార్దన్‌రెడ్డి, ఎం.సంజయ్, కిశోర్, వివేకానంద, గణేష్ గుప్తా, రమేశ్, హరిప్రియ ప్రశ్నలు అడిగారు.