Skip to main content

Jobs: పారదర్శకంగా కొలువుల భర్తీ.. విరి మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు

సాక్షి, హైదరాబాద్‌/ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపడుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
Jobs in Health Department in telangana

ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మధ్యవర్తులు చెప్పే మాటలను నిరుద్యోగులు నమ్మవద్దని సూచించారు. అలాంటి వ్యక్తులను గుర్తించి తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

న‌వంబ‌ర్‌ 17న ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో 7 వేలకు పైబడి ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మరిన్ని ఖాళీలకు కూడా అతి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

చదవండి: Side Effect of Medicines: దుష్ప్రభావాలు రాయడం కుదరదు: సుప్రీంకోర్టు

మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ ఘటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ర్యాగింగ్‌ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కాలేజీల్లో ర్యాగింగ్‌ నిరోధక చట్టంపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జూనియర్లతో సీనియర్‌ విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉండాలని, ర్యాగింగ్‌ పేరిట వారిని భయాందోళనకు గురి చేయొద్దని హితవు పలికారు. 

పోలీస్‌ కమిషన్‌ర్‌ సీరియస్‌.. 

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థికి గుండుకొట్టించిన ఘటనను ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.రాజేశ్వరరావుకు సూచించారు. పూర్తి వివరాలు అందజేయాలని కోరారు.

ఈ ఘటనపై డీఎంఈ నుంచి కూడా ప్రిన్సిపాల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తిస్థాయి విచారణ చేపట్టి తక్షణమే నివేదిక అందజేయాలని పై అధికారులు ఆదేశించినట్లు ప్రిన్సిపాల్‌ రాజేశ్వరరావు తెలిపారు.    

Published date : 18 Nov 2024 11:34AM

Photo Stories