Skip to main content

IB ACIO Exam Pattern 2024: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 995 ఏసీఐఓ ఉద్యోగాలు.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ తదితర వివరాలు..

దేశ భద్రతలో పాల్పంచుకోవాలని కోరుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 995 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2/ఎగ్జిక్యూటివ్‌ (ఏసీఐఓ గ్రేడ్‌-2) పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.ఈ పోస్టులకు ఎంపికైతే కేంద్ర హోంశాఖ పరిధిలో కీలక విధుల నిర్వహణకు అవకాశం లభిస్తుంది. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో ఈ పోస్ట్‌లకు పోటీ పడొచ్చు. ఈ నేపథ్యంలో.. ఐబీలో ఏసీఐఓ గ్రేడ్‌-2 ఉద్యోగాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ తదితర వివరాలు..
IB ACIO Syllabus 2024 and Exam Pattern for Grade II Executives  Intelligence Bureau Recruitment
  • ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఏసీఐఓ ఉద్యోగాలు
  • 995 పోస్ట్‌లతో ఏసీఐఓ-గ్రేడ్‌ 2 నోటిఫికేషన్‌ 
  • వేతనం: పే లెవల్‌-7(రూ.44,900-రూ.1,42,400 )
  • మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా నియామకం

ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ).. కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఎంతో కీలకమైన విభాగం. ఈ విభా­గం ఇచ్చే నివేదికల ఆధారంగానే శాంతి భద్రతలు, ఇతర భద్రతా అంశాలపై హోంశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో.. పలు స్థాయిల్లో అధికారులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఎంట్రీ లెవల్‌లో కీలకమైన హోదా.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2. తాజాగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

చ‌ద‌వండి: APPSC Group 1 Notification: గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

మొత్తం 995 పోస్ట్‌లు
తాజా నోటిఫికేషన్‌ ద్వారా ఐబీలో 995 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2/ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిలో 377 పోస్ట్‌లను ఓపెన్‌ కేటగిరీలో, 129 పోస్ట్‌లు ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో, 222 పోస్ట్‌లను ఓబీసీ కేటగిరీలో, 134 పోస్ట్‌లను ఎస్‌సీ కేటగిరీలో, 133 పోస్ట్‌లను ఎస్‌టీ కేటగిరీలో రిజర్వ్‌ చేశారు.

అర్హతలు

  • డిసెంబర్‌ 15, 2023 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.కంప్యూటర్‌ పరిజ్ఞానం అభిలషణీయం.
  • వయసు: డిసెంబర్‌ 15, 2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులకు అ­యిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

ప్రారంభ వేతనం
నియామకం ఖరారు చేసుకున్న వారికి గ్రూప్‌-సి (నాన్‌-గెజిటెడ్‌) ర్యాంకుతో పే లెవల్‌-7తో ప్రారంభ వేతన శ్రేణి ఉంటుంది. రూ.44,900-రూ.1,42,400 వేతన శ్రేణి లభిస్తుంది. మూల వేతనాన్ని రూ.44,900గా నిర్ధారించగా.. వీటికి అదనంగా డీఏ, ఎస్‌ఎస్‌ఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, ఎన్‌పీఎస్‌ వంటి భత్యాలు కూడా అందిస్తారు. దీంతో నికరంగా నెలకు రూ.లక్ష వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియ
ఏసీఐఓ గ్రేడ్‌-2 పోస్ట్‌ల నియామకానికి మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అవి.. టైర్‌-1 రాత పరీక్ష, టైర్‌-2 రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ. ఈ మూడింటిలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు.

చ‌ద‌వండి: SSC Constable GD Notification: 26,146 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ ఇదే.. ఈ టిప్స్ ఫాలో అయితే జాబ్ మీదే !!

టైర్‌-1 రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో తొలిదశ (టైర్‌-1) రాత పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం అయిదు విభాగాల(కరెంట్‌ అఫైర్స్,జనరల్‌ స్టడీస్, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌/లాజికల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలు చొప్పున మొత్తం 100 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు కేటాయించిన సమయం ఒక గంట. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కును తగ్గిస్తారు.

టైర్‌-2.. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌
టైర్‌-1 పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున (1:10 నిష్పత్తిలో) టైర్‌-2 పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. 30 మార్కులకు ఎస్సే రైటింగ్, మరో 20 మార్కులకు ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ ప్రెసిస్‌ రైటింగ్‌ విభాగాలు ఉంటాయి. ఇలా మొత్తం 50 మార్కులకు ఒక గంట వ్యవధిలో టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ
రెండు దశల రాత పరీక్ష(టైర్‌-1, టైర్‌-2)ల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు అయిదుగురిని చొప్పున (1:5 నిష్పత్తి) చివరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థుల సునిశిత పరిశీలన, విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షిస్తారు. కొన్ని సందర్భాల్లో సైకోమెట్రిక్‌/ఆప్టిట్యూట్‌ టెస్ట్‌లను కూడా నిర్వహిస్తారు.

జేడీడీ స్థాయికి చేరుకోవచ్చు
అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 హోదాలో కొలువు సొంతం చేసుకున్న వారు భవిష్యత్తులో జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఏసీఐఓ-1గా, ఆ తర్వాత డిప్యూటీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్, జాయింట్‌ డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్‌ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్‌ వంటి హోదాలు ఉంటాయి. సర్వీస్‌ నియమావళి ప్రకారం-కనీసం నాలుగు, గరిష్టంగా ఆరు పదోన్నతులు పొందొచ్చు. ఏసీఐఓ-గ్రేడ్‌ 2 హోదాలో నియమితులైన వారు జాయింట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ హోదాకు చేరుకోవచ్చు.

రాత పరీక్షలో రాణించేలా
కరెంట్‌ అఫైర్స్‌
సమకాలీన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న సంఘ విద్రోహ ఘటనలు, సైనిక చర్యలు, శాస్త్ర సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా.. అంతర్గత భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు.. ఇతర దేశాలతో ద్వైపాక్షిక భద్రత ఒప్పందాలపై అవగాహన కూడా ఉపయుక్తంగా ఉంటుంది. వీటితోపాటు సాధారణ సమకాలీన అంశాలపై దృష్టి సారించాలి.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

జనరల్‌ స్టడీస్‌
భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకోవాలి.

న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌
ప్యూర్‌ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై పట్టు పెంచుకోవాలి. డెసిమల్స్,ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, అల్జీబ్రా, లీనియర్‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.

రీజనింగ్‌/లాజికల్‌ ఆప్టిట్యూడ్‌
ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. స్పేస్‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అనాలిసిస్, విజువల్‌ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌ సిరిస్, కోడింగ్‌-డీకోడింగ్, నంబర్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వర్డ్‌ బిల్డింగ్, వెన్‌ డయాగ్రమ్స్‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
ఇంగ్లిష్‌ విభాగంలో స్కోర్‌ కోసం బేసిక్‌ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌-స్పెల్ట్‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌కు ప్రత్యేకంగా
ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ కోసం వొకాబ్యులరీ పెంచుకోవాలి. అదే విధంగా సెంటెన్స్‌ ఫార్మేషన్, సెంటెన్స్‌ కరెక్షన్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. ఇందుకోసం దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, అదే విధంగా ఆ­యా పోటీ పరీక్షలకు సంబంధించి డిస్క్రిప్టివ్‌ ఆన్సర్స్‌ను ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్‌ 15, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/en, https://www.ncs.gov.in/
Qualification GRADUATE
Last Date December 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories