Skip to main content

Physical Education Jobs 2023: ఫిజికల్‌ ఎడ్యుకేషన్ పొందిన వారికి ఉద్యోగాలు...

ఎన్నో ఉద్యోగ రంగాల్లోని ఒక రంగం ఫిజిక‌ల్ గ్రాడ్జువేట్స్. ఈ రంగంలోకి వెళ్ళే వాళ్ళు త‌క్కువైనా ఎంతో మంది ఈ రంగంలో ఉద్యోగ ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇటువంటి రంగాల్లో ముందుకు సాగాల‌నుకునే వాళ్ళకు ఇది ఒక గొప్ప అవ‌కాశం.
teaching jobs for physical graduates ,Opportunity for Excellence, Competitive Field
teaching jobs for physical graduates

సాక్షి ఎడ్యుకేష‌న్: చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం అంటే చాలామంది ఇంజినీర్‌లో, డాక్టర్‌లో, టీచర్‌లో లేక బ్యాంకు ఉద్యోగాలనే అనుకుంటారు. అయితే, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసిన వారికి కూడా మంచి ఉద్యోగావకాశాలున్నాయి. డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చదివిన వారు అంతటితో ఆగిపోకుండా మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంపీఈడీ) పూర్తి చేస్తే ప్రస్తుతం అనేక ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ఈ కోర్సు పూర్తి చేసిన వారు బీపీఈడీ కళాశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలల్లో అధ్యాపకులుగా, రాష్ట్రంలోని వివిధ స్టేడియాల్లో శిక్షకులుగా, ఫిట్‌నెస్‌, జిమ్‌ ట్రైనర్లుగా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ (సాప్), స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌)లో వివిధ క్రీడలకు సంబంధించి కోచ్‌లుగా స్థిరపడవచ్చు. అయితే సరైన అవగాహన లేక ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు ముందుకు రావడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీఈడీ కోర్సు చదవాలనుకునే విద్యార్థులకు రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఆచార్య బృందంతో చక్కని అవకాశం కల్పిస్తోంది.

మన ప్రాంత విద్యార్థుల కోసం..
నన్నయ యూనివర్సిటీలో 2017–18 విద్యా సంవత్సరం నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు నిర్వహిస్తున్నారు. దీనిని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీఈడీ కోర్సు కోసం నాటి ఈ ప్రాంత విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందనే ఉద్దేశంతో.. వారికి మేలు చేసే లక్ష్యంతో నన్నయ వర్సిటీ అప్పటి ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు హయాంలో ఈ కోర్సును ప్రారంభించారు. దీని ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులకు మేలు చేకూరుతోంది. ఇప్పటి వరకూ 5 బ్యాచ్‌లలో విద్యార్థులు ఎంపీఈడీ కోర్సు పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థిరపడ్డారు.

యూనివర్సిటీలో ఎంపీఈడీ చదువుతున్న విద్యార్థులకు వివిధ క్రీడలు, క్రీడా పోటీల నిర్వహణ పరిజ్ఞానంతో పాటు ఫస్ట్‌ ఎయిడ్‌, ఫిజియోథెరపీలో కూడా వర్సిటీ సమీప ఆస్పత్రుల్లో ప్రాథమిక శిక్షణ అందిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి సెమినార్లు, వివిధ యూనివర్సిటీల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే యూనివర్సిటీ జట్లకు మేనేజర్లుగా హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ కార్యదర్శి రామ్‌గోపాల్‌ ఆధ్వర్యాన వివిధ జాతీయ, అంతర్‌ విశ్వవిద్యాలయాల స్థాయి పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికల నిర్వహణలో ఎంపీఈడీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా వారికి ప్రాక్టికల్‌ నాలెడ్జి అందిస్తున్నారు. కోర్సు కో ఆర్డినేటర్‌గా కె.బాలసత్యనారాయణ వ్యవహరిస్తున్నారు.

TS Medical Jobs 2023: ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగుల క్రమబద్ధీకరణ

40 సీట్లు.. పూర్తి సౌకర్యాలు
నన్నయ యూనివర్సిటీలో మొత్తం 40 ఎంపీఈడీ సీట్లు ఉన్నాయి. కోర్సు కాల పరిమితి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లుగా నిర్వహిస్తారు. రెండేళ్ల బీపీఈడీ కోర్సు పూర్తి చేసి, పీజీ సెట్‌లో అర్హత సాధించిన వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంపీఈడీ విద్యార్థులకు శిక్షణ అందించేందుకు వర్సిటీలో అథ్లెటిక్స్‌ ట్రాక్‌, ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌, క్రికెట్‌ నెట్స్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులు, ఆర్చరీ, రైఫిల్‌ షూటింగ్‌, చెస్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖో–ఖో కోర్టులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్తులకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ ప్రాక్టికల్‌ శిక్షణ, 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ థియరీ క్లాసులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం స్థానిక ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో వ్యాయామ అధ్యాపకులు, ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేసుకోవచ్చు. ఎంపీఈడీ విభాగంలో ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, కోచ్‌లు–4 ఉన్నారు.

రూ.8.5 కోట్లతో ఇండోర్‌, స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు
ఇప్పటికే ఉన్న సౌకర్యాలకు తోడుగా రూ.8.5 కోట్లతో నన్నయ వర్సిటీకి ఆధునిక ఇండోర్‌ స్టేడియం, 50 మీటర్ల స్విమ్మింగ్‌ పూల్‌ మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సహకారంతో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ కృషితో ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఈ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ పనులను వర్సిటీ ఉప కులపతి ఆచార్య కె.పద్మరాజు, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ పర్యవేక్షిస్తున్నారు. కొద్ది నెలల్లోనే ఈ సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.

ఉజ్వల భవిష్యత్తు
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంపీఈడీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అనుభవజ్ఞులైన ఆచార్యులు, అధ్యాపకులు, కోచ్‌ల ఆధ్వర్యాన డిజిటల్‌ తరగతి గదుల్లో క్లాసులు జరుపుతున్నాం. వివిధ క్రీడలు, యోగాలో ప్రాక్టికల్‌ క్లాసులు వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నాం. వర్సిటీ పరిధిలో 388 అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలున్నాయి. ఎంపీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు వ్యాయామ అధ్యాపకులుగా పని చేసే అవకాశాలను ఈ కళాశాలలు కల్పిస్తున్నాయి.
– ఆచార్య జి.సుధాకర్‌, రిజిస్ట్రార్‌, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం

Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

Published date : 28 Aug 2023 05:55PM

Photo Stories