Germany To Introduce Job Search Opportunity Card: జర్మనీలో జాబ్ సెర్చ్ ఇక ఈజీ.. ఈ ఒక్క కార్డు చాలు!
జర్మనీలో జాబ్ చేయాలనుకుంటున్నారా.. మీకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు ఉంటే ఈ దేశంలో చట్టబద్ధంగా ఉద్యోగ అవకాశాలను పరిశీలించవచ్చు. ఇందు కోసం ‘ఆపర్చునిటీ కార్డు’ పేరుతో ప్రత్యేక కార్డును ఆ దేశ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులు జర్మనీలో ఉంటూ ఉద్యోగం వెతుక్కునేందుకు వీలుగా జర్మనీ ప్రభుత్వం వచ్చే జూన్ నెల నుంచి ఈ కార్డు'ను జారీ చేయనుంది.
విదేశీయులు తమ విదేశీ అర్హతల పూర్తి గుర్తింపును పొంది 'నైపుణ్యం కలిగిన కార్మికులు'గా పరిగణించబడే వారు ఎటువంటి ప్రత్యేక అవసరాలు లేకుండా ఈ ఆపర్చునిటీ కార్డును పొందవచ్చు. వారు శాశ్వత ఉద్యోగ ఒప్పందానికి సంబంధించిన రుజువును సమర్పించాల్సిన అవసరం లేదు.
ఈ నైపుణ్యాలు అవసరం
అభ్యర్థులు జర్మనీలో ఉద్యోగాలు పొందడాన్ని ఆపర్చునిటీ కార్డ్ సులభతరం చేస్తుంది. ఇది దరఖాస్తుదారులను సుదీర్ఘ గుర్తింపు ప్రక్రియ లేకుండా జర్మనీలో పని చేయడానికి అనుమతిస్తుంది. ఇందు కోసం కనీసం రెండు సంవత్సరాల వృత్తిపరమైన శిక్షణ లేదా విశ్వవిద్యాలయ డిగ్రీ, అలాగే జర్మన్ (A1) లేదా ఇంగ్లిష్‌లో (B2) నైపుణ్యం అవసరం.
ఆపర్చునిటీ కార్డుతో బెనిఫిట్స్
ఆపర్చునిటీ కార్డ్‌లను అభ్యర్థుల అర్హతను బట్టి గరిష్టంగా ఒక సంవత్సరం వరకు వ్యవధితో జారీ చేస్తారు. ఈ కార్డు ఉన్నవారు జర్మనీలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వారానికి గరిష్టంగా 20 గంటల పాటు తాత్కాలిక ఉపాధిని చేపట్టవచ్చు. అక్కడ మంచి ఉద్యోగం దొరికి నివాస హోదా పొందలేని అభ్యర్థుల విషయంలో ఈ ఆపర్చునిటీ కార్డును మరో రెండు సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది.