Skip to main content

Private Sector: ఉపాధి అవకాశాలు పుష్కలం

employment opportunities in private sector

గ్రాడ్యుయేట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో నూరు శాతం ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో కోర్సు డిమాండ్‌ కొనసాగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన మత్స్యశాఖ, నేషనల్‌ బ్యాంకుల్లో స్పెషల్‌ ఆఫీసర్లు (ఫిషరీస్‌), నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌లో బీఎఫ్‌ఎస్‌సీ విద్యార్థులకు నూరు శాతం అవకాశాలున్నాయి. ఈ విద్యార్హత ఆధారంగానే మత్స్యశాఖలోని ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు (ఎఫ్‌డీఓ), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌(ఏడీఎఫ్‌), విలేజ్‌ అసిస్టెంట్‌(ఫిషరీస్‌), నేషనల్‌ సెంట్రల్‌ మైరెన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఎఫ్‌ఆర్‌ఐ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌(సీఐవీఏ), సెంట్రల్‌ ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఐఎఫ్‌ఆర్‌ఐ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ(సీఐఎఫ్‌టీ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(సీఐఎఫ్‌ఈ), సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రెష్‌ వాటర్‌ ఆక్వా కల్చర్‌(సీఐఎఫ్‌ఎ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐఎఫ్‌ఓ), నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. పీహెచ్‌డీ చేసిన వారికి విశ్వవిద్యాలయంలోనే అవకాశాలున్నాయి. హేచరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఆక్వా లేబొరేటరీలు, ఆక్వా ఉత్పత్తు కేంద్రాల్లో ఆకర్షణీయ జీతంతో కూడిన ఉపాధి అవకాశాలున్నాయి.

ఫిషరీస్‌ కోర్సులకు క్రేజ్‌
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. గత రెండు దశాబ్దాలుగా ఆక్వా రంగంలో పూర్తి స్థాయిలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో రూ.వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 15కు పైగా దేశాలకు ఏటా భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి ఆక్వా రంగాన్ని నిపుణుల కొరత వెంటాడుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించేలా రాష్ట్ర ప్రభుత్వం ఫిషరీస్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులతో రాష్ట్రంలోనే మొదటిది, దేశంలోనే మూడో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం నర్సాపురంలో ఏర్పాటు చేశారు. ఫిషరీస్‌ గ్రాడ్యుయేషన్‌కు కోర్సుకు గత ఆరేళ్లుగా అత్యధిక డిమాండ్‌ ఉంది. నూరు శాతం ఉపాధి అవకాశాలు ఉండటం, అత్యధిక శాతం ప్రభుత్వ ఉద్యోగానికి ఆస్కారం ఉండటంతో బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు వైపు దృష్టి సారిస్తున్నారు.

చదవండి: Jobs: 32 పోస్టులు.. 424 దరఖాస్తులు!

వెంటాడుతున్న నిపుణుల కొరత
అపార అవకాశాలున్న ఆక్వా రంగంలో సుస్థిర అభివృద్ధి, మెరుగైన సాంకేతికత సాధించడానికి ప్రొఫెషనల్‌ మ్యాన్‌ పవర్‌ అత్యధికంగా ఉంది. ప్రొఫెషనల్‌ మ్యాన్‌ పవర్‌ ఉంటే ఈ రంగంలో నష్టాలు కొంతమేరకై నా తగ్గించవచ్చు. సాంకేతికత కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే ఆక్వా కోర్సులకు ప్రాధాన్యం ఇచ్చి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. ఆక్వా రంగాన్ని నిపుణుల కొరత వెంటాడుతుంది. అంచనా ప్రకారం ఆక్వా సుస్థిర అభివృద్ధి కోసం ప్రస్తుత టర్నోవర్‌కు అనుగుణంగా 11,901 మంది పాలిటెక్నిక్‌ డిప్లమో హోల్డర్లు అవసరం ఉండగా కేవలం 600 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. 6,118 మంది బీఎఫ్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్లు అవసరం ఉండగా 700 మంది అందుబాటులో ఉన్నారు. 2,541 మంది ఎంఎఫ్‌ఎస్‌సీ పోస్టు గ్రాడ్యుయేట్‌లు అవసరం ఉండగా 80–100 మాత్రమే ఉన్నారు.

60 సీట్లతో నర్సాపురంలో వర్సిటీ ప్రారంభం
నర్సాపురంలోని సరిపల్లి– లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.303 కోట్ల వ్యయంతో మత్స్య విశ్వవిద్యాలయ పనులు మొదలయ్యాయి. మొదటి దశలో రూ.100 కోట్లు కేటాయించడంతో ప్రస్తుత నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో విశ్వవిద్యాలయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులో కాలేజీ ఆఫ్‌ ఫిషరీస్‌లో 45 గ్రాడ్యుయేషన్‌ సీట్లు , కృష్ణాజిల్లాలోని భావదేవరపల్లిలో ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, కాకినాడ, ఉండి బలభద్రపురంలో రీసెర్చ్‌ స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా నర్సాపురంలో ఫిషరీస్‌ యూనివర్సిటీ 60 సీట్లతో ఈ ఏడాది ప్రారంభం కానుంది.

చదవండి:Job Mela: 5న కాటారంలో జాబ్‌మేళా

ఫిషరీస్‌లో మూడు కోర్సులు
1. ఫిషరీస్‌లో మూడు కేటగిరీ కోర్సులున్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణత తరువాత ఫిషరీస్‌ డిప్లమో కోర్సు భావదేవరపల్లిలో ఉంది. దీనిలో 55 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇది రెండేళ్ల కాలపరిమితితో కూడిన కోర్సు.
2. ఫిషరీస్‌ గ్రాడ్యుయేషన్‌లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ (బీఎఫ్‌ఎస్‌సీ) నాలుగేళ్ల కాలపరిమితితో కూడిన కోర్సు. ముత్తుకూరు, నర్సాపురంలో మొత్తం 105 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
3. ముత్తుకూరు కళాశాలలో సుమారు 8–10 పీజీ సీట్లు, 5–7 పీహెచ్‌డీ సీట్లు అందుబాటులో ఉంటాయి. రెండేళ్ళ కాలపరిమితి ఉన్న పీజీలో ప్రస్తుతం 5 విభాగాల్లో ఉన్నాయి.

Published date : 30 Aug 2023 06:12PM

Photo Stories