Skip to main content

After Inter MPC Best Courses & Job Opportunities : ఇంటర్‌ 'MPC' పూరైన త‌ర్వాత బెస్ట్ కోర్సులు- ఉద్యోగాలు ఇవే..!

ఇటీవ‌లే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కెరీర్‌కు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిది. విద్య, ఉద్యోగం దిశగా అందుబాటులో ఉన్న అవకాశాలేంటి? వాటిలో దేన్ని ఎంపిక చేసుకుంటే వృత్తి జీవితం బాగుంటుంది? వంటి వాటిని విశ్లేషించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ విశ్లేషణకు ఉపయోగపడే విధంగా ఇంటర్ ఎంపీసీ, బైపీసీ తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు- ఉద్యోగాల‌పై ప్ర‌త్యేక స్టోరీ మీకోసం..
After Inter MPC Best Courses and Job Opportunities

ఇంటర్ ఎంపీసీ తర్వాత బెస్ట్‌ కోర్సులు-అవకాశాలు ఇవే..
ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులో చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. దీనికోసం ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షలపై దృష్టిసారిస్తారు. ఎంసెట్ రాసి, సీటు పొందడం తేలికే అయినా, జేఈఈలో ప్రతిభ కనబరిచి, ఉన్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడం కష్టమే. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటం, పోటీ లక్షల్లో ఉండటమే దీనికి కారణం. అయితే వీటికి దీటుగా మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. విద్యతో పాటు ఉపాధిని పొందే మార్గాలూ ఉన్నాయి. లక్ష్యం ఇంజనీరింగ్.. గమ్యం సుస్థిర కెరీర్. ఈ రెండిటికీ మార్గం వేసేలా ఇటు బీటెక్ పట్టా.. అటు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలున్నాయి.

College Predictor -2024 AP EAPCET TS EAMCET

ఎన్‌డీఏ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ : 
త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్ స్థాయి ఉద్యోగం పొందేందుకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (నేవల్ అకాడమీ) ఎగ్జామినేషన్ వీలుకల్పిస్తోంది. ఇంటర్మీడియెట్ అర్హతతో యూపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. దీని ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలకు ఎంపికైన వారికి నిర్ణీత వ్యవధిలో శిక్షణ ఇస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే నేవల్ అకాడమీ విద్యార్థులకు నేవల్ ఆర్కిటెక్చర్‌లో బీటెక్ డిగ్రీ కూడా లభిస్తుంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఔత్సాహికులకు బీఎస్సీ, బీఏ సర్టిఫికెట్లు అందిస్తారు. యూపీఎస్సీ ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది.
వెబ్‌సైట్: www.upsc.gov.in

స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ :
భారతీయ రైల్వే మెకానికల్ విభాగంలో ఇంజనీర్ ఉద్యోగం పొందడానికి ఇది ఉత్తమ మార్గం. దీనికి ముందుగా బిట్స్-మెస్రా నుంచి బీటెక్ (మెకానికల్) సర్టిఫికెట్ సొంతం చేసుకునేందుకు స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ వీలుకల్పిస్తుంది. ఈ పరీక్షకు అర్హత 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. గతేడాది వరకు ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహించేది. కానీ, ఈ ఏడాది నుంచి ఎస్‌సీఆర్‌ఏ నిర్వహణ తమకు కష్టమని యూపీఎస్సీ పేర్కొంది. దీంతో పరీక్షను స్వయంగా రైల్వే శాఖ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రాత పరీక్షలో మూడు పేపర్లు (జనరల్ నాలెడ్జ్/సైకాలజీ టెస్ట్; ఫిజికల్ సెన్సైస్; మ్యాథమెటిక్స్) ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.

ఆర్మీ.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం :
ఇండియన్ ఆర్మీలో ఉద్యోగంతో పాటు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో బీటెక్ పట్టా పొందేందుకు మార్గం ఇండియన్ ఆర్మీ.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం. ఇంటర్ ఎంపీసీలో 70 శాతం మార్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఉండదు. నేరుగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్), ఇండియన్ మిలిటరీ కాలేజీలు (పుణె, సికింద్రాబాద్)ల్లో శిక్షణ ఇస్తారు. దీన్ని పూర్తిచేసిన వారికి సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ సర్టిఫికెట్‌తో పాటు లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీలో ఉద్యోగం ఇస్తారు.
వెబ్‌సైట్: www.indarmy.nic

ఇండియన్ నేవీ.. 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీం : 
బీటెక్ పట్టాను అందించడంతో పాటు నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో కెరీర్‌ను సుస్థిరం చేసేందుకు ఇండియన్ నేవీ.. 10+2 క్యాడెట్(బీటెక్) ఎంట్రీ స్కీం వీలుకల్పిస్తోంది. దీనికి ఇంటర్ ఎంపీసీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ(ఎజిమల)లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/మెకానికల్/ నేవల్ ఆర్కిటెక్చర్/ మెరైన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేశాక సబ్ లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ సొంతమవుతుంది.
వెబ్‌సైట్: www.nausenabharti.nic.in

ఇంటర్ ఎంపీసీ తర్వాత ప్రవేశ పరీక్షలు ఇవే..:
ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ :
సైన్స్ విభాగంలో ఉన్నత కెరీర్‌ను ఆశించే వారికి సమున్నత వేదిక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్). దీనికి దేశవ్యాప్తంగా ఏడు క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఐఎస్‌ఈఆర్‌లో ఎంపీసీ, బైపీసీ అర్హతతో అయిదేళ్ల బీఎస్-ఎంఎస్ కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు లేదా కేవైపీవైలో ఉత్తీర్ణత లేదా ఐఐఎస్‌ఈఆర్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించి కోర్సులో ప్రవేశం పొందితే రీసెర్చ్ పరంగా ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
వెబ్‌సైట్: www.iiseradmissions.in

☛ Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

నాటా :
నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పరిధిలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఇతర అనుబంధ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. 
వెబ్‌సైట్: www.nata.in

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ :
ఎంపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా అందుబాటులో ఉన్న అద్భుత ప్రత్యామ్నాయం బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బి.ఎఫ్‌టెక్). నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) క్యాంపస్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఔత్సాహిక అభ్యర్థులు నిఫ్ట్-అడ్మిషన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.nift.ac.in

బిట్‌శాట్ :
బీటెక్ చేయాలనుకునే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మరో చక్కటి ప్రత్యామ్నాయం బిట్‌శాట్. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్స్)కు చెందిన మూడు క్యాంపస్‌ల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి బిట్‌శాట్ నిర్వహిస్తారు. పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో కెమికల్, సివిల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచ్‌ల్లో బీటెక్ చేయొచ్చు. బీటెక్ పూర్తయ్యాక ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌ల్లో ఎంటెక్ చేసేందుకు ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.bitsadmission.com

ఎంపీసీ అంటే ఇంజనీరింగ్‌కు మాత్రమే కాదు.. ఇంకా..:
ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ కోర్సు కోసమే అనే భావనను విద్యార్థులు, తల్లిదండ్రులు వీడాలి. ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఎంపీసీ అనేది ఒక అర్హత మాత్రమే అని గుర్తించాలి. ఇప్పుడు సంప్రదాయ బీఎస్సీలోనూ ఆధునికత సంతరించుకుంటోంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వినూత్న కాంబినేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిపై దృష్టి సారించాలి. సైన్స్‌లో కెరీర్ అంటే చాలా కాలం వేచిచూడాలనే భావన అపోహ మాత్రమే. పీజీ పూర్తిచేసి సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, సెట్ వంటి వాటిలో ఉత్తీర్ణత సాధిస్తే బీఎస్సీలో అడుగు పెట్టిన నాటి నుంచి అయిదారేళ్లలో కెరీర్‌లో స్థిరపడొచ్చు.
- ప్రొఫెసర్ బి.లక్ష్మయ్య, ఓయూ కాలేజ్ ఆఫ్ సైన్స్.


ఇతర కోర్సులు ఇలా.. :
బీ ఫార్మసీ : 

బైపీసీ విద్యార్థులకే కాకుండా ఎంపీసీ విద్యార్థులకు కూడా ఫార్మాస్యూటికల్ రంగంలో కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవకాశముంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బీ ఫార్మసీ సీట్లలో 50 శాతం సీట్లను ఎంపీసీ అర్హతతో, ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఉన్నత విద్య, కెరీర్ పరంగా చూస్తే బీ ఫార్మసీకి ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. ఫార్మా రంగంలో ఎఫ్‌డీఐలు వస్తుండటం, స్వదేశీ ఫార్మాస్యూటికల్ సంస్థల విస్తరణతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్య కోణంలో చూస్తే పీజీ స్థాయిలో ఫార్మకోగ్నసీ, ఫార్మా మేనేజ్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే, ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఉన్నత హోదాలు అందుకోవచ్చు.

హోటల్ మేనేజ్‌మెంట్ : 
కెరీర్ పరంగా మరో ఉన్నత విభాగం హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లలో ఈ కోర్సు చేస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. దీనికోసం ఏటా జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు.

న్యాయశాస్త్రంలో అవకాశాలు : 
ఒకప్పుడు న్యాయ శాస్త్రం అంటే హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకే అనుకూలం అనే భావన ఉండేది. కానీ, పరిస్థితులు మారాయి. అన్ని విద్యా నేపథ్యాల విద్యార్థులకు కెరీర్ పరంగా న్యాయశాస్త్రం అద్భుత వేదికగా నిలుస్తోంది. లా కోర్సులు పూర్తిచేసిన వారికి కార్పొరేట్ కొలువులు లభిస్తున్నాయి. ఈ అవకాశాలను ఎంపీసీ విద్యార్థులు సైతం ఒడిసిపట్టుకోవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతో అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. దీనికోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే లాసెట్‌లో ర్యాంకు సాధించాలి. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, నేషనల్ లా యూనివర్సిటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశం పొందాలంటే జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ప్రతిభ చూపాలి.
వెబ్‌సైట్: www.clat.ac.in

భిన్న రూపులో బీఎస్సీ కోర్సులు..
ఎంపీసీ విద్యార్థులకు బ్యాచిలర్ డిగ్రీస్థాయిలో సంప్రదాయ కోర్సుగా గుర్తింపు పొందిన బీఎస్సీ(ఎంపీసీ)లోనూ ఆధునిక అవసరాలకు తగిన విధంగా కొత్త కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పేరుతో సరికొత్త కోర్సు అందిస్తున్నారు. అదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీల్లో బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ వంటి కొత్త కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు పోటీపడే అవకాశం లభిస్తుంది. ఉన్నత విద్య పరంగానూ మంచి అవకాశాలు ఉన్నాయి.

☛ TS EAMCET Results 2024 Release Date : TS EAPCET ఫ‌లితాల విడుద‌ల మే 25 లేదా 27 తేదీల్లో.. కానీ.. !

ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఇలా.. :
ఎంపీసీ అర్హతతో విద్యార్థులు ఒకే సమయంలో బ్యాచిలర్, పీజీ డిగ్రీలో ప్రవేశం పొందేలా వివిధ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అయిదేళ్ల వ్యవధిలో ఉండే ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ కింద పరిగణిస్తారు. తర్వాత రెండేళ్లు పీజీ కోర్సుగా ఉంటుంది. ప్రస్తుతం పీజీ స్థాయిలో పలు విభిన్న స్పెషలైజేషన్లు (జియో ఫిజిక్స్, జియాలజీ, మెరైన్ బయాలజీ తదితర) కోర్సులు ఆవిష్కృతమవుతున్నాయి. వీటిలో ప్రవేశించాలంటే ఔత్సాహికులు ఆయా యూనివర్సిటీలు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించాలి.

ఇంజనీరింగ్‌కు దీటుగా మరెన్నో అవకాశాలు..
ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌కు దీటుగా మరెన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైందల్లా వారి ఆలోచనలో మార్పు మాత్రమే. వ్యక్తిగతంగా సృజనాత్మకత, సూక్ష్మ పరిశీలన ఉన్న వారు ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులు పూర్తిచేసి, మంచి కెరీర్ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఇటీవల కాలంలో లా కోర్సులకు కూడా ఎంపీసీ విద్యార్థుల నుంచి ఆదరణ పెరుగుతుందన్న మాట వాస్తవమే. కారణం వీటి ద్వారా లభిస్తున్న అవకాశాలే. ఇలా ఎంపీసీ విద్యార్థులు విస్తృత దృష్టితో ఆలోచించి సరికొత్త కెరీర్ అవకాశాల గురించి అన్వేషించాలి. అంతేతప్ప.. ఒకే లక్ష్యం పెట్టుకుని అది చేజారితే నిరుత్సాహానికి గురి కాకూడదు.
 - ప్రొఫెసర్ డి.వి.మోహన్ రావు, ఎస్‌పీఏ-విజయవాడ.

☛ EAMCET Top Rankers Web Options 2023 : ఎంసెట్ రాంక‌ర్లు అంతా.. ఈ కాలేజీల వైపే.. అలాగే చాలా మంది చూపు ఈ కోర్సు వైపే..

Published date : 15 May 2024 07:07PM

Photo Stories