Skip to main content

Higher Education: ఐఐటీల్లో మెడిటెక్‌ కోర్సులు... ప్రయోజనాలు..

iit medical, Meditech courses and benefits

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. సంక్షిప్తంగా.. ఐఐటీలు! ఇంజనీరింగ్‌ విద్యలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు! అలాంటి ఐఐటీలు.. ఇప్పుడు సాంకేతిక విద్యకే పరిమితం కాకుండా..మరెన్నో విభాగాల్లోనూ కోర్సులను అందిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లో కోర్సులను బోధిస్తున్న ఐఐటీలు.. తాజాగా మెడికల్, మెడిటెక్‌ అనుబంధ విభాగాల్లోనూ అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో.. మెడికల్, అనుబంధ కోర్సులను అందిస్తున్న ఐఐటీలు, అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్‌లు, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..

  • పలు ఐఐటీల్లో మెడికల్, మెడి టెక్, అనుబంధ కోర్సులు
  • యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో బోధన
  • టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఇతర విభాగాలకు విస్తరణ
  • మల్టీ డిసిప్లినరీ, సోషల్‌ డెవలప్‌మెంట్‌ దృక్పథమే కారణం

ఐఐటీలు తాజాగా వైద్య విద్య విభాగంవైపు దృష్టి పెడుతున్నాయి. మెడికల్, మెడికల్‌ టెక్నాలజీ, బయో మెడికల్‌ తదితర వైద్య అనుబంధ విభాగాల్లోనూ పీజీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. వీటి ద్వారా విద్యార్థులకు ౖవైద్య విద్యకు సంబంధించి కోర్‌ అంశాలతోపాటు, టెక్నాలజీ వినియోగంపైనా అవగాహన కల్పిస్తున్నాయి.

ఆవిష్కరణల దిశగా

ఐఐటీలు.. మెడికల్, మెడి టెక్‌ కోర్సులు ప్రవేశ పెట్టడానికి కారణం.. వైద్య రంగంలో ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని భావించడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు.. కోవిడ్‌ మహమ్మారి సమయంలో.. ఐఐటీ ముంబై, చెన్నై, ఢిల్లీ, కాన్పూర్, హైదరాబాద్‌ తదితర ఐఐటీలు.. ఆర్‌టీపీసీఆర్‌ కిట్స్‌ను, పల్స్‌ఆక్సీ మీటర్స్, తేలికపాటి వెంటిలేటర్స్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి, దశలపై ముందస్తు అంచనాలు సైతం వెల్లడించాయి. ఇందుకు మెడికల్, టెక్నాలజీ రెండు విభాగాల సమన్వయం ఎంతో అవసరం. అందుకే ఐఐటీలు మెడికల్‌ కోర్సుల దిశగా అడుగులు వేస్తున్నాయని చెబుతున్నారు.

చ‌ద‌వండి: ఐఐటీల్లో ఇంజనీరింగ్‌పై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి

మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌

ఐఐటీలు మెడికల్‌ విభాగంలో కోర్సులు ప్రవేశ పెట్టడానికి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌ మరో కారణంగా చెబుతున్నారు. నూతన విద్యా విధానం, యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటూ.. టెక్నికల్‌ ప్రోగ్రామ్స్‌లో సైతం కొన్ని మెడికల్‌ అనుబంధ కోర్సులు అభ్యసించేలా కరిక్యులంలో మార్పులు,చేర్పులు చేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులకు సామాజిక అవసరాలకు ఉపయోగపడే ఆవిష్కరణల్లో సాంకేతికతను వినియోగించే నైపుణ్యం లభిస్తుందని భావిస్తున్నాయి.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ ముందుగా

ఐఐటీ ఖరగ్‌పూర్‌ 2001లోనే స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ తొలుత రీసెర్చ్‌ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యమిచ్చింది. ప్రస్తుతం మెడికల్‌ ఫిజిక్స్, మెడికల్‌ మైక్రోబయాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీపీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. అంతేకాకుండా ఎంబీబీఎస్‌ కోర్సును సైతం అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నత విద్య శాఖకు, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు పంపించింది. యాభై సీట్లతో ప్రారంభించనున్న ఎంబీబీఎస్‌ కోర్సుకు అనుమతి లభించడం ఖాయమని చెబుతున్నారు. ఈ సీట్లను నీట్‌ ర్యాంకు ఆధారంగా కాకుండా.. సొంత ఎంట్రన్స్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

చ‌ద‌వండి: AYUSH Counseling: అందుబాటులో ఉన్న కళాశాలలు, ఫీజుల వివ‌రాలు ఇలా..

ఐఐటీ కాన్పూర్‌తోపాటు మరెన్నో

  • ఇటీవల ఐఐటీ-కాన్పూర్‌.. గాంగ్వాల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ను నెలకొల్పింది. ఇప్పటికే లక్నోకు చెందిన కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీతో కలిసి హెల్త్‌ టెక్నాలజీ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
  • ఐఐటీ-గువహటి.. జ్యోతి అండ్‌ భూపత్‌ స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. ఈ విభాగం ఆధ్వర్యంలో బయోమెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. అదే విధంగా.. అసోం అడ్వాన్స్‌డ్‌ హెల్త్‌కేర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం ఆధారంగా.. మెడికల్‌ పీజీ కోర్సు అందించే ప్రయత్నంలో ఉంది. 
  • ఐఐటీ జోథ్‌పూర్‌ -ఎయిమ్స్‌ జోథ్‌పూర్‌ల ఆధ్వర్యంలో మెడికల్‌ టెక్నాలజీస్‌లో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ-పీహెచ్‌డీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. 
  • ఐఐటీ ఢిల్లీ-ఎయిమ్స్‌ న్యూఢిల్లీలు సంయుక్తంగా.. న్యూక్లియర్‌ మ్యాగ్నటిక్‌ రెసోనెన్స్‌ అండ్‌ న్యూరాలజీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాయి.
  • ఐఐటీ-హైదరాబాద్‌ కూడా బయో డిజైన్‌ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. 
  • ఐఐటీ మండి.. ఎయిమ్స్‌ బిలాస్‌పూర్, అటల్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీతో కలిసి రీసెర్చ్‌ యాక్టివిటీస్‌ కోణంలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

లైఫ్‌ సైన్సెస్‌ ప్రధానంగా

ఐఐటీలు మెడికల్, మెడి టెక్‌ అనుబంధ కోర్సులను అందిస్తున్నప్పటికీ.. వీటి ప్రధాన ఉద్దేశం లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఇంజనీరింగ్, మెడికల్‌ అంశాల కలయికతో కోర్సులను అందించడంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అధిక శాతం కోర్సులు బయోమెడికల్‌ ఇంజనీరింగ్, బయలాజికల్‌ ఇంజనీరింగ్‌ వంటి విభాగాల్లోనే ఉంటున్నాయి.

మెడికల్, మెడ్‌టెక్, లైఫ్‌ సైన్సెస్‌ ప్రోగ్రామ్‌లు

  • ఐఐటీ-ఢిల్లీ: బయో కెమికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బయో టెక్నాలజీలో బీటెక్, బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ; ఎంఎస్‌ రీసెర్చ్, పీహెచ్‌డీ.
  • ఐఐటీ-ముంబై: బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌లో ఎమ్మెస్సీ+పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ; ఎమ్మెస్సీ(బయో టెక్నాలజీ); ఎంటెక్‌(బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌); బయో టెక్నాలజీ, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ.
  • ఐఐటీ-చెన్నై: బయలాజికల్‌ ఇంజనీరింగ్‌లో అయిదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ(బీటెక్‌ +ఎంటెక్‌), బయలాజికల్‌ సైన్సెస్‌లో అయిదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ(బీఎస్‌+ఎంఎస్‌), బయో ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, బయలాజికల్‌ సైన్సెస్, బయలాజికల్‌ ఇంజనీరింగ్, కంప్యుటేషనల్‌ బయాలజీలో ఎంఎస్‌ బై రీసెర్చ్‌.
  • ఐఐటీ-ఖరగ్‌పూర్‌: మెడికల్‌ ఫిజిక్స్, మెడికల్‌ మైక్రోబయాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌లో జాయింట్‌ ఎమ్మెస్సీ+పీహెచ్‌డీ; మాస్టర్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఎంఎంఎస్‌టీ), మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్, మెడికల్, బయో ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ. అర్హత: ఎమ్మెస్సీ కోర్సులకు జామ్‌ ఉతీర్ణత, ఎంఎంఎస్‌టీ కోర్సుకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. పీహెచ్‌డీకి గేట్‌ ఉత్తీర్ణత.
  • ఐఐటీ-కాన్పూర్‌: బయలాజికల్‌ సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజనీరింగ్‌లో బీటెక్, బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ, ఎంటెక్, పీహెచ్‌డీ. అర్హత: బీటెక్, బీటెక్‌+ఎంటెక్‌కు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణత. ఎంటెక్, పీహెచ్‌డీలకు సంబంధిత విభాగాల్లో బీటెక్‌తోపాటు గేట్‌ స్కోర్‌.
  • ఐఐటీ-రూర్కీ: బీటెక్‌బయోటెక్నాలజీ, బయో సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌; ఎమ్మెస్సీ(బయో సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజనీరింగ్‌).
  • ఐఐటీ-గాంధీగనర్‌: బయలాజికల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, పీహెచ్‌డీ. ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
  • ఐఐటీ-గువహటి: బీటెక్‌(బయో సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), ఎంటెక్‌బయో ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బయలాజికల్‌/లైఫ్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ. బీటెక్‌ ప్రోగ్రామ్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు, ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లకు గేట్‌ ర్యాంకు ఆధారంగా సీట్ల భర్తీ చేస్తారు.
  • ఐఐటీ-ఇండోర్‌: ఎమ్మెస్సీబయో టెక్నాలజీ(ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్‌ తర్వాత ఎమ్మెస్సీ+పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు). అర్హత: జామ్‌ ఉత్తీర్ణత; బయో సైన్సెస్‌ అండ్‌ బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ. అర్హత: గేట్‌ ఉత్తీర్ణత.
  • ఐఐటీ-జోథ్‌పూర్‌: బీటెక్‌బయో ఇంజనీరింగ్, బయోసైన్స్‌ అండ్‌ బయో ఇంజనీరింగ్‌లో ఎంటెక్, ఎంటెక్‌+పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ. 
  • ఐఐటీ-హైదరాబాద్‌: బీటెక్‌బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌; ఎంటెక్‌బయో డిజైన్, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీలో పీహెచ్‌డీ.
  • ఐఐటీ-రోపార్‌: బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్, పీహెచ్‌డీ.
  • ఐఐటీ-మండి: బయో ఇంజనీరింగ్‌లో బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ.
  • ఐఐటీ-వారణాసి: బీటెక్‌బయో ఇంజనీరింగ్, ఎంటెక్‌ బయో మెడికల్‌ టెక్నాలజీ; ఎంటెక్‌ బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌; ఇవే విభాగాల్లో పీహెచ్‌డీ.
  • ఐఐటీ-పాలక్కాడ్‌: బయలాజికల్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ.
  • ఐఐటీ-ధర్వాడ్‌: బయో సైన్స్‌ అండ్‌ బయో ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ.

అడ్వాన్స్‌డ్, జామ్, గేట్‌ స్కోర్ల్‌తో

మెడికల్, అనుబంధ కోర్సులను అందిస్తున్న ఐఐటీలు.. బ్యాచిలర్‌ స్థాయి(బీటెక్‌) కోర్సుల్లో జేఈఈఅడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా; ఎమ్మెస్సీ కోర్సుల్లో జామ్‌/గేట్‌ స్కోర్‌ ఆధారంగా; ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సులకు అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌ను ఒక సబ్జెక్ట్‌గా బీటెక్‌ లేదా బీఎస్సీ స్థాయిలో చదివుండాలని నిర్దేశిస్తున్నాయి. ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేసిన వారిని కూడా అర్హులుగా పేర్కొంటున్నాయి. పీహెచ్‌డీ అభ్యర్థులు పీజీ స్థాయిలో సంబంధిత సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్‌గా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

కొత్త ఆవిష్కరణల దిశగా

సామాజిక అభివృద్ధికి ప్రధాన అవసరాల్లో ఒకటైన వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై పరిశోధనలు చేసి.. కొత్త ఆవిష్కరణలు చేయాలనే ఉద్దేశంతో ఐఐటీలు అడుగులు వేస్తున్నాయి. ఈ రంగంలో ఉన్నత స్థానాలు కోరుకునే విద్యార్థులు ఈ కోర్సులపై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుంది.
ప్రొ'' వి.రామ్‌ గోపాలరావు, ఐఐటీఢిల్లీ మాజీ డైరెక్టర్‌

Published date : 08 Sep 2022 05:41PM

Photo Stories