Skip to main content

303 Scientist/Engineer Jobs in ISRO: బీటెక్‌తో.. ఇస్రో సైంటిస్ట్‌ పోస్టులు, అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులకు స్వాగతం పలుకుతోంది. సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ హోదాల్లో.. కొలువుదీరే అవకాశం కల్పిస్తోంది!! గ్రూప్‌–ఎ గెజిటెడ్, నాన్‌–గెజిటెడ్‌ కొలువులతో కెరీర్‌ ప్రారంభించే అవకాశం అందిస్తోంది! ఇందుకోసం ఇస్రో చేపట్టే నియామక ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇటీవల ఇస్రో.. 303 సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇస్రో భర్తీ చేసే సైంటిస్ట్‌ పోస్టులు, అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు..
303 Scientist/Engineer Jobs in ISRO
  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఉద్యోగాలకు ఇస్రో ప్రకటన 
  • బీటెక్‌ మెకానికల్, సీఎస్‌ఈ, ఈసీఈ అర్హతతో అవకాశం
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
  • నెలకు రూ.56,100 కనీస మూల వేతనం

ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తుంటారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా నియామకాలు చేపట్టే పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఇలాంటి అభ్యర్థులకు ఇ­స్రో సైంటిస్ట్‌ జాబ్స్‌ చక్కటి అవకాశంగా చెప్పొచ్చు.
 
ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌

ఇస్రోతోపాటు, అంతరిక్ష శాఖకు చెందిన విభాగాలు, కేంద్రాల్లో సైంటిస్ట్, ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీ కోసం సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ పేరిట ప్రత్యేక నియామక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిస్తే.. సైంటిస్ట్, ఇంజనీర్స్‌గా ఖరారు చేస్తారు. గత ఏడాది వరకు ఈ పోస్ట్‌లకు గేట్‌ స్కోర్‌ ఆధారంగానే నియామక ప్రక్రియ జరిగేది. ఈ ఏడాది తొలిసారి సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో ఇస్రో సొంత నియామక ప్రక్రియ చేపడుతోంది.

చ‌ద‌వండి: NHAI Recruitment 2023: 50 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.39,000 వ‌ర‌కు జీతం..

అయిదు విభాగాలు.. 303 పోస్ట్‌లు

  • తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం అయిదు విభాగాల్లో 303 సైంటిస్ట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు..
  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(ఎలక్ట్రానిక్స్‌)–90 పోస్ట్‌లు: అర్హత: ఈసీఈ బ్రాంచ్‌లో కనీసం 65 శాతం మార్కులు లేదా 6.84 జీపీఏతో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(మెకానికల్‌)–163 పోస్ట్‌లు: అర్హత: మెకానికల్‌ బ్రాంచ్‌లో కనీసం 65 శాతం మార్కులు లేదా 6.84 జీపీఏతో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(కంప్యూటర్‌ సైన్స్‌)–47 పోస్ట్‌లు: అర్హత: సీఎస్‌ఈ బ్రాంచ్‌లో 65 శాతం మార్కులు లేదా 6.84 జీపీఏతో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • పీఆర్‌ఎల్‌లో సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(ఎలక్ట్రానిక్స్‌)–2 పోస్ట్‌లు: అర్హత: ఈసీఈ బ్రాంచ్‌లో 65 శాతం మార్కులతో లేదా 6.84 జీపీఏతో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • పీఆర్‌ఎల్‌లో సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(కంప్యూటర్‌ సైన్స్‌)–1 పోస్ట్‌: అర్హత: సీఎస్‌ఈ బ్రాంచ్‌లో 65 శాతం మార్కులతో లేదా 6.84 జీపీఏతో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. 
  • చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఆగస్ట్‌ 31, 2023 నాటికి సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది.
  • వయసు: జూన్‌ 14, 2023 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలి దశలో రాత పరీక్ష ఉంటుంది. మలి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండింటికీ నిర్దేశిత కటాఫ్‌లు, వెయిటేజీని నిర్దేశించి.. దానికి అనుగుణంగా తుది విజేతల జాబితా రూపొందిస్తారు.

చ‌ద‌వండి: RITES Limited Recruitment 2023: రైట్స్‌ లిమిటెడ్, గురుగావ్‌లో ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

100 మార్కులకు రాత పరీక్ష

  • తొలి దశలో రాత పరీక్షను రెండు విభాగాలుగా 100 మార్కులకు నిర్వహిస్తారు. 
  • పార్ట్‌–ఎలో సంబంధిత సబ్జెక్ట్‌ నుంచి 80 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • పార్ట్‌–బిలో న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, డయాగ్రమెటిక్‌ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్, డిడక్టివ్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి 15 ప్రశ్నలు–20 మార్కులకు ఉంటాయి.
  • పార్ట్‌–ఎ, పార్ట్‌–బి కలిపి మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • పార్ట్‌–ఎలో 1/3వంతు నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.

మలి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూ

రాత పరీక్షలో చూపిన ప్రతిభ, ఆయా విభాగాల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్‌కు అయిదుగురిని(1:5 నిష్పత్తి) చొప్పున పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయిస్తారు.

వెయిటేజీ విధానం

  • రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్‌ సెలక్షన్‌ ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభకు 50 శాతం; ఇంటర్వ్యూ మార్కులకు 50 శాతం వెయిటేజీని గణించి.. దాని ఆధారంగా తుది విజేతలను ఖరారు చేస్తారు.
  • ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు రాత పరీక్షలో రెండు విభాగాల్లో కలిపి 50 శాతం మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూలో 50 శాతం మార్కులు.. మొత్తంగా 60 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. 
  • రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూలలో 40 శాతం చొప్పున.. రెండూ కలిపి సగటున 50 శాతం మార్కులు స్కోర్‌ చేయాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: Intelligence Bureau Recruitment 2023: ఐబీలో 797 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ప్రారంభ వేతనం రూ.56,100

ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిచి కొలువులో చేరిన వారికి పే లెవల్‌–10తో సైంటిస్ట్‌/ఇంజనీర్‌గా నియామకం ఖరారు చేస్తారు. ప్రారంభ వేతనం నెలకు రూ.56,100గా ఉంటుంది. వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ వంటి ఇతర అలవెన్స్‌లు సైతం అందిస్తారు. నియామకం ఖరారు చేసుకున్న వారు ఇస్రో, అంతరిక్ష శాఖకు చెందిన విభాగాలు, కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్‌ హోదాకు

ఇస్రోలో సైంటిస్ట్‌/ఇంజనీర్‌గా కొలువుదీరిన అభ్యర్థులు భవిష్యత్తులో విశిష్ట శాస్త్రవేత్త స్థాయికి(డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్‌) చేరుకునే అవకాశం ఉంది. సర్వీస్‌లో చేరిన నాలుగేళ్లకు సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌డిగా.. ఆ తర్వాత నాలుగేళ్లకు సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌ఈగా.. అనంతరం మరో నాలుగేళ్లకు సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌ఎఫ్‌గా పదోన్నతులు లభిస్తాయి. ఆ తర్వాత మరో అయిదేళ్లకు సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌జీ, మరో అయిదేళ్ల్లకు.. సైంటిస్ట్‌ జి హోదా లభిస్తుంది. సైంటిస్ట్‌ జి హోదాలో ఆరేళ్లు పూర్తి చేసుకుంటే.. ఔట్‌ స్టాండింగ్‌ సైంటిస్ట్‌ హోదా, మరో రెండేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకుంటే.. డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్‌గా పదోన్నతి లభిస్తుంది.

విజయం సాధించాలంటే

  • పార్ట్‌–ఎ: ఈ విభాగంలో పూర్తిగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్‌ నుంచే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బీటెక్‌ స్థాయిలో సంబంధిత సబ్జెక్ట్‌ పుస్తకాలను ఎక్కువగా చదవాలి. ఆయా అంశాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్, గేట్‌ తదితర పరీక్షల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం కూడా లాభిస్తుంది. 
  • పార్ట్‌–బి: ఈ విభాగంలో 15 ప్రశ్నలు అడుగుతారు. కానీ ఇందులోనూ కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో..అభ్యర్థులు డయాగ్రమెటిక్‌ రీజనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి వెన్‌ డయాగ్రమ్స్, లాజికల్‌ ఇమేజ్‌ సీక్వెన్సెస్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌కు సంబంధించి ప్యాట్రన్స్, కాలమ్స్, రోస్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. న్యూమరికల్, వెర్బల్‌ రీజనింగ్‌లకు సంబంధించి.. బేసిక్‌ అర్థమెటిక్, నంబర్‌ సిరీస్, అనాలజీ, సిలాజిమ్, కోడింగ్, డీ–కోడింగ్‌ తదితర అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 14, 2023
  • రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.isro.gov.in/ICRB_Recruitment7.html
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://apps.ursc.gov.in/CentralBE-2023/advt.jsp
Qualification GRADUATE
Last Date June 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories