Skip to main content

AAI Recruitment 2023: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో 364కొలువులు.. రాత పరీక్ష, సిలబస్‌ అంశాలు ఇవే..

దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ప్రకటన విడుదల చేసింది.
airports authority of india recruitment

దీనిలో భాగంగా ఎయిర్‌ కంట్రోల్‌æ విభాగంలోని 364 మేనేజర్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనుంది. సైన్స్, ఇంజనీరింగ్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన పట్టభద్రులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆకర్షణీయ వేతనాలు అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ఒకటి. ఎయిర్‌పోర్టుల సమర్థ నిర్వహణకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అందించే సేవలే కీలకమైనవి. ఈ విభాగంలో ఉద్యోగాలకు ఎంపికైన వారు కార్యాలయాల్లో ఉంటూనే.. విమాన రాకపోకలు పర్యవేక్షిస్తూ, ప్రయాణం క్షేమంగా జరిగేలా చూస్తారు. ఇటీవల గేట్‌ స్కోర్‌ ఆధారంగా 596 పోస్టుల భర్తీకి ప్రకటన చేసిన ఏఏఐ.. ప్రస్తుతం గేట్‌తో సంబంధం లేకుండా మరో 364 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 364
పోస్టులు-అర్హతలు

  •  మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌)-02: అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు హిందీ లేదా ఇంగ్లిష్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పాసై ఉండాలి. లేదా ఏ సబ్జెక్టుతో పీజీ చేసినా.. హిందీ, ఇంగ్లిష్‌లను తప్పనిసరిగా చదివి ఉండాలి. ఇంగ్లిష్‌ నుంచి హిందీ, హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి, ముఖ్యంగా  టెక్నికల్‌ , సైంటిఫిక్‌ అంశాలను అనువదించడంలో అనుభవం ఉండాలి.
  • జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)-356: ఈ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో మూడేళ్ల బీఎస్సీ(సైన్స్‌) రెగ్యులర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. లేదా ఏదైనా ఇంజనీరింగ్‌ డిగ్రీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో పాసవ్వాలి. ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యాలు కలిగి ఉండాలి.
  • జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆఫీషియల్‌ లాంగ్వేజ్‌)-4: హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. వీరు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లిష్‌ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా ఉండి, ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  •  సీనియర్‌ అసిస్టెంట్‌(ఆఫీషియల్‌ లాంగ్వేజ్‌)-2:  హిందీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదవాలి. లేదా ఇంగ్లిష్‌లో పీజీ చేసి డిగ్రీ స్థాయిలో హిందీని ఒక సబ్జెక్టుగా చదివినవారై ఉండాలి. లేదా ఏదైనా సబ్జెక్టుతో పీజీ చేసి.. హిందీ, ఇంగ్లిష్‌ తప్పనిసరిగా చదివి ఉండాలి.
  • డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులైతే పార్ట్‌టైం/కరస్పాండెన్స్‌/దూర విద్య విధానంలో చదివినవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతరులు తప్పనిసరిగా రెగ్యులర్‌ విధానంలో మాత్రమే చదివుండాలి. చివరి ఏడాది/సెమిస్టర్‌ చదువుతున్న వారు కూడా దరఖాస్తుకు అర్హులే. డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ సమయానికి ఫలితాలు వెలువడి,  ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు: 21.01.2023 నాటికి సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 30 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 27 ఏళ్లు, మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, వాయిస్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష ఇలా

  • జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుల రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. రెండు పార్ట్‌లుగా(పార్ట్‌-ఎ, పార్ట్‌-బి) ఇంగ్లిష్, హిందీ  మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. 
  • పార్‌-ఎ: ఈ విభాగంలో 4 సెక్షన్‌లు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 20 ప్రశ్నలకు-20 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌లో 15 ప్రశ్నలకు-15 మార్కులు, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌లో 15 ప్రశ్నలకు15 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌లో 10 ప్రశ్నలకు 10 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు.
  • పార్ట్‌-బి: ఈ విభాగంలో రెండు సెక్షన్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, ఫిజిక్స్‌లో 30 ప్రశ్నలు 30 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు.

సిలబస్‌ అంశాలు

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌: ఈ విభాగంలో 20 మార్కులకు ప్రశ్నలుంటాయి. రీజనింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, బ్లడ్‌ రిలేషన్స్, పజిల్స్, ఇనీక్వాలిటీస్, ఇన్‌పుట్‌ -అవుట్‌పుట్, కోడింగ్‌-డీకోడింగ్,  డేటా సఫీషియెన్సీ, ఆర్డర్‌ అండ్‌ ర్యాంకింగ్, ఆల్ఫాన్యూమరిక్‌ సిరీస్, డిస్టెన్స్‌ అండ్‌ డైరెక్షన్, వెర్బల్‌-నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగం నుంచి 15 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఇందులో రీడింగ్‌ కాంప్రహెన్షన్, క్లోజ్‌టెస్ట్, డిటెక్షన్‌ ఆఫ్‌ ఎర్రర్స్, ఇంప్రూవింగ్‌ సెంటెన్సెస్‌ అండ్‌ పేరాగ్రాఫ్స్, కంప్లీషన్‌ ఆఫ్‌ పేరాగ్రాఫ్స్, పేరా జంబ్లింగ్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, మోడ్స్‌ ఆఫ్‌ నెరేషన్, ప్రిపొజిషన్స్, వాయిస్‌ ఛేంజ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
  • జనరల్‌ నాలెడ్జ్‌: ఈ విభాగం నుంచి కూడా 15 మార్కులకు ప్రశ్నలను అడుగుతారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, వర్తమానాంశాలు, ముఖ్యమైన సంస్థలు, వాటి ప్రధాన కేంద్రాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, దేశాలు, వాటి రాజధానులు, కరెన్సీలు, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
  • జనరల్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో 10 మార్కులకు ప్రశ్నలుంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఏరియా అండ్‌ వాల్యూమ్, ఎస్‌ఐ అండ్‌ సీఐ, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, పర్సెంటేజెస్, యావరేజెస్, నంబర్స్‌ మొదలైనవి ఉంటాయి.
  • బ్యాంక్‌ క్లర్క్‌ పరీక్షల స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ఐబీపీఎస్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న బీఎస్సీ, బీటెక్‌ పట్టభద్రులు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షలో సులువుగా ఎదర్కోగలుగుతారు. గత ప్రశ్నపత్రాలు సాధన చేయడంతోపాటు పక్కా ప్రణాళికతో ప్రయత్నిస్తే మంచి స్కోర్‌ సాధించవచ్చు.

పార్ట్‌-బి సిలబస్‌
ఈ విభాగంలో అధిక మార్కులు పొందడానికి 11, 12 తరగతి పుస్తకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వీటిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లోని ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టాలి. గత ప్రశ్నపత్రాలు, మాక్‌ టెస్టులను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. దీనిద్వారా ఇన్‌టైంలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలుగుతారు. అంతేకాకుండా ఆయా అంశాల్లో చేసే తప్పులను సరిచేసుకోవడానికి వీలవుతుంది.

వేతనాలు
మేనేజర్‌(ఈ-3) పోస్టులకు ఎంపికైన వారికి ప్రతి నెల రూ. 60,000-1,80,000 వరకు వేతనంగా లభిస్తుంది. అలాగే జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఈ-1) పోస్టులకు ఎంపికైన వారికి రూ.40,000-1,40,000, సీనియర్‌ అసిస్టెంట్‌ (ఎన్‌ఈ-6) వారికి రూ.36,000-1,10,000 వరకు వేతనంగా అందుతుంది.

ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తులకు చివరి తేదీ: 21.01.2023


వెబ్‌సైట్‌: <http://www.aai.aero>

Qualification GRADUATE
Last Date January 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories