Skip to main content

NIACL Recruitment 2023: 450 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏఓ) పోస్ట్‌లు.. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

ప్రభుత్వరంగ బీమా సంస్థల్లో ఒకటైన న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీ.. జనరల్, స్పెషలిస్ట్‌ విభాగాల్లో.. 450 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఏవో) పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఇందులో విజయం సాధించి నియామకం ఖరారు చేసుకుంటే.. ప్రారంభంలోనే రూ.80వేల వరకూ వేతనం అందుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీ ఏవో పోస్టుల, అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు..
niacl ao notification 2023 and exam pattern
  • జనరలిస్ట్, స్పెషలిస్ట్‌ కేడర్‌లో 450 ఉద్యోగాలు
  • న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీ నోటిఫికేషన్‌ 
  • మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
  • ఎంపికైతే నెలకు రూ.80వేల వేతనం

మొత్తం 450 ఏవో పోస్ట్‌లు

న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీ తాజా నియామక ప్రక్రియ ద్వారా జనరలిస్ట్‌ కేడర్‌తోపాటు మరో ఏడు స్పెషలిస్ట్‌ కేడర్లలో 450 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఏవో) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఇందులో జనరలిస్ట్‌ 120 పోస్టులు, రిస్క్‌ ఇంజనీర్స్‌ 36, ఆటోమొబైల్‌ ఇంజనీర్స్‌ 96, లీగల్‌ 70, అకౌంట్స్‌–30, హెల్త్‌–75, ఐటీ–23 పోస్టులు ఉన్నాయి.

చ‌ద‌వండి: Bank Exam Preparation Tips for IBPS PO: 3,049 పోస్ట్‌ల వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

అర్హతలు

  • జనరలిస్ట్‌ ఏఓ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణత ఉండాలి. 
  • రిస్క్‌ ఇంజనీర్స్‌: 60 శాతం మార్కులతో బీటెక్‌/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
  • ఆటోమొబైల్‌ ఇంజనీర్‌: ఆటోమొబైల్‌ బ్రాంచ్‌తో 60 శాతం మార్కులతో బీటెక్‌/ ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించాలి.
  • లీగల్‌ ఆఫీసర్స్‌: 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణత ఉండాలి.
  • అకౌంట్స్‌ ఏఓ: బ్యాచిలర్‌ డిగ్రీ లేదా పీజీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ) కోర్సు పాసవ్వాలి.
  • హెల్త్‌ ఏఓ: ఎంబీబీఎస్‌/ఎండీ/మెడికల్‌ పీజీ/బీడీఎస్‌/ఎండీఎస్‌/బీఏఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌ల­లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 
  • ఐటీ స్పెషలిస్ట్‌: కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ బ్రాంచ్‌తో 60 శాతం మార్కులతో బీటెక్‌ లేదా ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. లేదా ఎంసీఏలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • అన్ని పోస్ట్‌లకు సంబంధించి రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు సంబంధిత కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
  • వయసు: ఆగస్ట్‌ 1, 2023 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఆకర్షణీయ వేతనం

ఏఓగా పూర్తి స్థాయిలో కొలువుదీరిన వారికి ఆకర్షణీయ వేతనం లభిస్తుంది. స్కేల్‌–1 ఆఫీసర్‌ హోదాలో రూ.50,925–రూ.96,765 వేతన శ్రేణితో ప్రారంభ వేతనం ఉంటుంది. స్థూల వేతనం నెలకు రూ .80 వేలుగా ఉంటుంది. 

మూడు దశల ఎంపిక ప్రక్రియ

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్‌ రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ.

చ‌ద‌వండి: Study Material

ప్రిలిమినరీ.. 100 మార్కులు

ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ రాత పరీక్ష మూడు విభాగాల్లో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పరీక్ష నిర్వహిస్తారు.పరీక్ష సమయం ఒక గంట.

రెండో దశ మెయిన్‌ ఎగ్జామ్‌

ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. రెండో దశ మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 15 మందిని చొప్పున మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షను జనరలిస్ట్‌ కేడర్, స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్ట్‌లకు వేర్వేరుగా నిర్వహిస్తారు.

జనరలిస్ట్‌ ఏఓ మెయిన్‌

జనరలిస్ట్‌ ఏఓ మెయిన్‌ పరీక్ష నాలుగు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్, టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి 50 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

స్పెషలిస్ట్‌ ఏఓ మెయిన్‌ పరీక్ష

స్పెషలిస్ట్‌ కేడర్‌ పోస్ట్‌లకు నిర్వహించే మెయిన్‌ ఎగ్జామ్‌ అయిదు విభాగాల్లో 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్‌ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.

డిస్క్రిప్టివ్‌ పరీక్ష

  • జనరలిస్ట్, స్పెషలిస్ట్‌ ఏఓ పోస్ట్‌లకు సంబంధించి మెయిన్‌ ఎగ్జామ్‌లో భాగంగానే ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌తోపాటు మరో 30 మార్కులకు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు.
  • డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో అభ్యర్థులు లెటర్‌ రైటింగ్‌(10 మార్కులు), ఎస్సే రైటింగ్‌(20 మార్కులు) రాయాల్సి ఉంటుంది. 
  • పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో 30 నిమిషాల వ్యవధిలో ఉండే ఈ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో అభ్యర్థులు కంప్యూటర్‌ ద్వారా లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.

పర్సనల్‌ ఇంటర్వ్యూ

మెయిన్‌ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికైన వారికి చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులకు బీమా రంగంతోపాటు తాజా పరిణామాలపై అవగాహనను పరిశీలిస్తారు. దీంతోపాటు వారు దరఖాస్తు చేసుకున్న పోస్ట్, అర్హతలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.

చ‌ద‌వండి: Bitbank

వెయిటేజీ విధానం

మూడు దశల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వా­త నియామకాలు ఖరారు చేసే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు.మెయిన్‌ ఎగ్జామ్‌లో పొందిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కేటాయిస్తారు. అభ్యర్థులు పొందిన మార్కులను ఈ వెయిటేజీకి అనుగుణంగా క్రోడీకరించి.. తుది జాబితా రూపొందించి నియామకం ఖరారు చేస్తారు.

ఏడాది ప్రొబేషన్‌

  • ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ప్రొబేషన్‌ పిరియడ్‌ ఉంటుంది. వీరు ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే నాన్‌–లైఫ్‌ లైసెన్సియేట్‌ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రొబేషన్‌ పూర్తయినట్లుగా పరిగణిస్తారు. లేదంటే మరో ఆరు నెలలు పొడిగిస్తారు.
  • నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులు కనీసం నాలుగేళ్ల పాటు సంస్థలోనే పని చేస్తామని సర్వీస్‌ బాండ్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 

ఉన్నత హోదాలు

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించిన వారు భవిష్యత్తులో ఆయా విభాగాల్లో ఉన్నత హోదాలకు చేరుకునే అవకాశముంది. తొలుత అయిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నాక.. పదోన్నతికి అర్హత లభిస్తుంది. అసిస్టెంట్‌ మేనేజర్‌/బ్రాంచ్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌/డివిజనల్‌ మేనేజర్‌; సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్, రీజనల్‌ మేనేజర్‌; డీజీఎం, జీఎం వంటి హోదాలకు చేరుకోవచ్చు. 

విజయం సాధించాలంటే
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే ఇంగ్లిష్‌ ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్‌ కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లు చదవడం, ఎడిటోరియల్‌ లెటర్స్‌ చదవడం మేలు చేస్తుంది.

రీజనింగ్‌

ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో కీలకమైన రీజనింగ్‌ కోసం అభ్యర్థులు పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. సిరీస్,అనాలజీ, కోడింగ్‌–డీ కో­డింగ్,డైరెక్షన్స్,బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్,సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు నంబర్‌ సిరీస్, డేటా అనాలిసిస్‌ విభాగాలను సాధన చేయాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగం కోసం అభ్యర్థులు మరింత ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ఇన్సూరెన్స్, ఆర్థిక రంగంలో మార్పులు, తాజా పథకాల గురించి తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మ్యూచువల్‌ ఫండ్స్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి. 

సబ్జెక్ట్, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌

మెయిన్‌ పరీక్షలో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ విభాగంలో మంచి స్కోర్‌ కోసం అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించి బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 21.08.2023.
  • ప్రిలిమినరీ(ఫేజ్‌–1) రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 9, 2023.
  • మెయిన్‌(ఫేజ్‌–2) రాత పరీక్ష తేదీ: అక్టోబర్‌ 8, 2023.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.newindia.co.in/portal/readMore/Recruitment
Qualification GRADUATE
Last Date August 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories