JEE Main Ranker Success Story : కూలీ పని చేస్తూ.. కొడుకుని చదివించాడు.. జేఈఈ తొలి ప్రయత్నంలోనే అదరకొట్టాడిలా..
ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు.. ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశంతో పాటు ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం ఉద్దేశించినదే ఈ అర్హత పరీక్షే.. జేఈఈ–మెయిన్. ఇలాంటీ కీలకమైన పరీక్షలో ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ చూపించాడు. చదువుకు.. వయసు, స్తోమత, స్థాయితో పనేముంది అని నిరూపించాడు. ఈ నేపథ్యంలో.. ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీ మీకోసం..
వీడిక చదువుకు పనికిరాడు అంటూ..
వెల్డింగ్ పనులు చేసుకునే ఓ కూలీ కొడుకు జేఈఈ మెయిన్స్(తొలి రౌండ్).. అదీ మొదటి పయత్నంలోనే 99 శాతం స్కోర్ చేశాడు. ఇప్పుడా ప్రయత్నం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అతని పేరు దీపక్ ప్రజాపతి. ఏడేళ్ల వయసులో సుద్దమొద్దుగా పేరుబడ్డ ఓ పిల్లాడు.. ఇప్పుడు జాతీయ స్థాయి పరీక్షలో 99.93 శాతం స్కోర్ చేయగలడని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించలేదట. రెండో తరగతిలోనే వీడిక చదువుకు పనికిరాడు అంటూ టీచర్లు ఇంటికి పంపిస్తే.. పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాడు.
చదవండి: జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ విధివిధానాలు...
కూలీ పని చేస్తూ..
మధ్యప్రదేశ్ దెవాస్, దీపక్ సొంత ఊరు. దీపక్ తండ్రి రామ్ ఎక్‌బల్ ప్రజాపతి.. వెల్డింగ్ కూలీ. పెద్దగా చదువుకోని ఆయన.. కొడుకును కష్టపడి చదివించి ఉన్నతస్థాయిలో చూడాలనుకున్నాడు. కానీ, కొడుకు మాత్రం చిన్నతనంలో తోటి పిల్లలతో సరదాగా గడపడం పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. దీంతో చదవులో రాణించలేడంటూ ఇంటికి పంపించేశారు. కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆ తండ్రి ఆందోళన చెందాడు. కానీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ఆ చిన్నారి.. ఆ తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. క్రమక్రమంగా చదువులో మెరుగు అవుతూ.. పదో తరగతిలో 96 శాతం మార్కులు సంపాదించాడు. కొందరు టీచర్ల సలహాతో కంప్యూటర్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ) చేయాలనుకున్నాడు. ఐఐటీలో చేరాలని తనకు తానుగా ప్రామిస్ చేసుకున్నాడు.
చదవండి: అన్వయ నైపుణ్యంతో జేఈఈని జయించండిలా..
లాక్‌డౌన్ సమయంలో.. ఆన్‌లైన్ విద్యకు స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో..
దీపక్ ప్రాథమిక విద్య అంతా స్థానికంగా ఒక స్కూల్‌లోనే సాగింది. లాక్‌డౌన్ టైంలో తొమ్మిదవ తరగతి కష్టంగా సాగిందట. కారణం.. స్మార్ట్ ఫోన్ లేకపోవడం. అయితే తండ్రి ఎలాగో కష్టపడి కొడుకు కోసం ఓ ఫోన్ కొన్నాడు. జేఈఈ కోసం ఫ్రీగా కోచింగ్ ఇచ్చిన ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇందుకోసం మధ్యప్రదేశ్ ఎడ్యుకేషన్ హబ్‌గా పేరున్న ఇండోర్‌కు వెళ్లాడు. రోజుకు 13 నుంచి 14 గంటలు కష్టపడ్డాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాకు దూరం ఉండడం అతనికి అలవాటు అయ్యింది. ఒకవేళ బోర్‌గా ఫీలైతే.. బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆడడం లాంటివి చేశాడట.
చదవండి: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్ సొంతం
నా విజయానికి కారణం ఇదే..
కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేవాళ్లకు తన అనుభవపూర్వకంగా దీపక్ ఒక సలహా ఇస్తున్నాడు. తనను తాను నమ్ముకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం తన విజయానికి కారణమని చెప్తున్నాడు దీపక్ ప్రజాపతి. నాలాగే ఎందరో విద్యార్థులు పరిస్థితులు అనుకూలిస్తే చాలు. తమకున్న వనరులకు శ్రమను జోడించి చదువులో అద్భుతాలు సృష్టించగలరన్నారు.
జేఈఈ మెయిన్-2022 మొదటి విడత ఫలితాల కోసం క్లిక్ చేయండి
7.69 లక్షల మంది పరీక్షకు..
తొలివిడత పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షలకు 8,72,432 మంది దరఖాస్తు చేయగా 7,69,589 మంది హాజరయ్యారు. దేశ, విదేశాల్లో 407 పట్టణాల్లోని 588 పరీక్ష కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను కంప్యూటరాధారితంగా నిర్వహించారు. విదేశాల్లో 17 చోట్ల పరీక్ష నిర్వహించారు. ఇంగ్లీషుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఈ పరీక్షను నిర్వహించగా బాలికలు 2,21,719 మంది, బాలురు 5,47,867 మంది పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన విషయం తెలిసిందే.
JEE Main 2022 Cut Off Marks: మెయిన్.. కటాఫ్ ఎంతో తెలుసా..?
ఈ సారి బాలురదే పైచేయి.. కానీ.
ఈ ఫలితాల్లో బాలికల కన్నా బాలురు ఆధిక్యంలో ఉన్నారు. 100 స్కోరు పాయింట్లు సాధించిన 14 మందిలో ఒకేఒక్క బాలిక ఉండగా తక్కిన వారంతా బాలురే. అలాగే, 100 స్కోరు పాయింట్లు సాధించిన ఏపీ అభ్యర్థులందరూ బాలురే. బాలికల్లో టాప్–10 స్కోరర్లలో ఆంధ్రప్రదేశ్ బాలికలు ఇతర రాష్ట్రాల బాలికల కన్నా ముందంజలో ఉన్నారు. 100 స్కోరు సాధించకున్నా తదుపరి టాప్–10లో దర్శిపూడి శరణ్య, భోగి సిరి, జనపతి సాయిచరిత, నక్కా సాయిదీపిక, పిల్లి జలజాక్షి ఉన్నారు.
చదవండి: జేఈఈ మెయిన్ పేపర్-2 విజయానికి వ్యూహం...
ఇక సెకండ్ సెషన్‌పైనే..
మొదటి సెషన్‌లో పరీక్షలు రాసిన విద్యార్థులు తిరిగి సెకండ్ సెషన్ పరీక్షలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసెషన్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి రెండో సెషన్‌కు మళ్లీ రిజిస్ట్రేన్ చేసుకుంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎన్టీఏ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. రెండో సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియను జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తొలుత ప్రకటించింది. ఆ తరువాత విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు జూలై 2 నుంచి మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెల్సిందే. ఇది ఇలా ఉండగా జేఈఈ సెకండ్ సెషన్ పరీక్షలు జులై 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలలో కూడా పాల్గొని తమ మార్కుల స్కోరును పెంచుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఉన్నారు. ఈసారి రెండు సెషన్లలోనే జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తుండడంతో ఇదే తుది అవకాశంగా పట్టుదలతో పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.