Skip to main content

జేఈఈ మెయిన్ పేపర్-2 విజయానికి వ్యూహం...

దేశంలోని తొమ్మిది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు; ఐదు కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు; మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పేపర్-2 ఉత్తీర్ణత తప్పనిసరి. ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు ఇటీవలి కాలంలో పోటీ పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా గతేడాది ఈ పరీక్షకు లక్షా ఇరవై వేల మందికిపైగా హాజరయ్యారు. జేఈఈ మెయిన్ విధానం అమల్లోకి వచ్చిన 2013 నుంచి ఏటా సగటున లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తుండటం విశేషం. విద్యార్థులు ఆర్కిటెక్చర్ కోర్సు చదవాలనే ఆసక్తితో పాటు ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో పరీక్ష తీరుతెన్నులు, విజయానికి దృష్టి సారించాల్సిన అంశాలపై విశ్లేషణ..

మూడు విభాగాలు..
జేఈఈ మెయిన్ పేపర్-2ని మూడు విభాగాల్లో నిర్వహిస్తారు. ఒకటి.. మ్యాథమెటిక్స్. రెండు.. ఆప్టిట్యూడ్ టెస్ట్. మూడు.. డ్రాయింగ్ టెస్ట్. ఈ విభాగాల నుంచి అడిగే ప్రశ్నల సంఖ్య ఏటా మారుతున్నా గత రెండేళ్లుగా ఒకే విధానంలో నిర్వహిస్తున్నారు.

ఈసారీ అంతే !
మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు; ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు, డ్రాయింగ్ నుంచి రెండు ప్రశ్నలు అడుగుతారు. మొదటి రెండు విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. మూడో విభాగంలోని రెండు ప్రశ్నలకు 70 మార్కులు. ఇలా మొత్తం 390 మార్కులకు పేపర్-2 నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇలాగే నిర్వహించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఊహాశక్తికి పరీక్ష :
ఆప్టిట్యూడ్ టెస్ట్‌లోని ప్రశ్నలు అభ్యర్థుల ఊహాశక్తిని పరీక్షించేలా ఉంటున్నాయి. ఒక బొమ్మనిచ్చి దాని ఫ్రంట్, టాప్ వ్యూస్‌ను కనుక్కోమనడం వంటి ప్రశ్నలే అధికంగా ఉంటున్నాయి. వీటికి సరైన సమాధానం గుర్తించాలంటే అభ్యర్థులు ప్రిపరేషన్‌లో దృష్టి సారించాల్సిన ముఖ్యాంశాలు.. స్కేల్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, భవంతుల నిర్మాణ శైలులు, రొటేషన్, జనరేషన్ ఆఫ్ ప్లాన్, త్రీడీ వ్యూస్, సబ్ స్ట్రాక్షన్, కలర్ టెక్చర్, జామెట్రికల్ డ్రాయింగ్ అండ్ డిజైన్.

ప్రాక్టీస్..
గతంలో అడిగిన ప్రశ్నల తీరును పరిశీలిస్తే పేపర్-2లో విజయానికి అభ్యర్థులు పూర్తిగా ప్రాక్టీస్‌కే ప్రాధాన్యమివ్వాలి. ప్రిపరేషన్ సమయంలో ఏదైనా ఒక ఆకృతిని మనసులో ఊహించుకొని దాన్ని పేపర్‌పై చిత్రంగా రూపొందించాలి.

డ్రాయింగ్ టెస్ట్ :
ఇందులో సాధారణంగా ఏదైనా ఒక సందర్భం, ప్రదేశం గురించి పేర్కొని (ఉదాహరణకు బస్టాప్) దాని ఆధారంగా డ్రాయింగ్ వేయమంటారు. అభ్యర్థులు బస్టాప్ పరిసరాలు ఎలా ఉంటాయో మనసులో ఊహించుకొని డ్రాయింగ్ వేయాలి. ఊహా నైపుణ్యం తో పాటు కలర్ టెక్చర్‌పైనా అవగాహన పెంచుకోవడం మేలు చేస్తుంది.

వివిధ కోణాల్లో ప్రశ్నలు...
పేపర్-2లో విజయం సాధించాలంటే అభ్యర్థులు ముఖ్య కట్టడాలు, ప్రదేశాల గురించి; వాటిని నిర్మించినవారి గురించీ తెలుసుకోవాలి. పేపర్-2లో ఇలాంటి ప్రశ్నలూ వస్తాయి. గతేడాది ‘ఎల్లోరా ఆలయాలను వేటితో నిర్మించారు?’, ‘బులంద్ దర్వాజా ఎక్కడ ఉంది?’ వంటి ప్రశ్నలు అడిగారు.

మ్యాథ్స్ కోసం..: పేపర్-2కి హాజరయ్యే అభ్యర్థులందరూ పేపర్-1కు హాజరవడం సహజం. ఈ నేపథ్యంలో పేపర్-2లో పేర్కొన్న మ్యాథ్స్ విషయంలో ఆందోళన చెందక్కర్లేదు. సిలబస్‌ను అనుసరించి పేపర్-2లో మ్యాథ్స్ పరంగా దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశాలు.. ఇంటిగ్రేషన్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, డెరివేటివ్స్, లిమిట్స్, కంటిన్యూయిటీ, పారాబోలా అండ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్, త్రీడీ జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ నంబర్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్.

సమన్వయంతో సన్నద్ధమవ్వాలి...
పేపర్-1, 2 రెండూ రాసే అభ్యర్థులకు ప్రిపరేషన్ పరంగా కొంత ఇబ్బంది సహజం. ముఖ్యంగా సమయం విషయంలో ఈ సమస్య తలెత్తుతుంది. రెండు పేపర్లకూ హాజరయ్యే అభ్యర్థులు పేపర్-2లోని పార్ట్-2, 3 కోసం టైమ్ ప్లాన్‌లో ప్రత్యేకంగా రెండు గంటలు కేటాయించుకోవాలి. రెండు పేపర్లకూ పరీక్ష ఒకే రోజు ఉంటుంది. అందువల్ల పేపర్-1ను ఆన్‌లైన్‌లో రాసేలా ప్రణాళిక వేసుకుంటే ‘ఒకే రోజు రెండు పరీక్షలు’ అనే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

బీఆర్క్ కోర్సును అందిస్తున్న ఎన్‌ఐటీలు, వాటిలోని సీట్ల సంఖ్య: భోపాల్ ఎన్‌ఐటీలో 80, కాలికట్‌లో 47, హమీర్‌పూర్‌లో 46, జైపూర్‌లో 62, నాగ్‌పూర్‌లో 62, పాట్నాలో 62, రాయ్‌పూర్‌లో 62, రూర్కెలాలో 20, త్రిచీలో 46.

జేఈఈ మెయిన్ పేపర్-2తో బీఆర్క్ కోర్సులను అందిస్తున్న ఇతర ప్రముఖ సంస్థలు: బిట్ మెర్సా (రాంచీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మిజోరాం యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (భోపాల్, ఢిల్లీ, విజయవాడ).

Published date : 16 Aug 2021 05:36PM

Photo Stories