Skip to main content

NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

జేఈఈ–మెయిన్‌ ర్యాంకు ఆధారంగా... నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు (నిట్‌లు), ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో అడుగుపెట్టొచ్చు!! ఐఐటీలకు దీటుగా బోధన ఉండే ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చేరి కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం అవుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా.. నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్ల భర్తీకి నిర్వహించే.. జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొని.. ప్రాథమ్యాలు పేర్కొనడమే!! 2021–22 సంవత్సరానికి సంబంధించి జోసా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ–మెయిన్‌ ర్యాంకుతో సీటు పొందాలనుకుంటున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. నిట్‌లు.. అందుబాటులో ఉన్న సీట్లు, కౌన్సెలింగ్‌ ప్రక్రియపై ప్రత్యేక కథనం...
JoSAA online registration process dates
JoSAA online registration process dates
  • జేఈఈ–మెయిన్‌ అర్హులకు 
  • ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో అవకాశం
  • జోసా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్, సీట్ల భర్తీ
  • జాతీయ స్థాయిలో 30 వేలకుపైగా సీట్లు

ఇంజనీరింగ్‌ విద్యకు చక్కటి వేదికలు నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర సాంకేతిక విద్యా సంస్థలు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్ల సంఖ్య పరిమితం. గతేడాది గణాంకాల ప్రకారం–మొత్తం 23 ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లు అన్నీ కలిపి అందుబాటులో ఉన్న సీట్లు 16,053. కానీ జేఈఈ–మెయిన్‌ నుంచి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది. అంటే.. అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థుల్లో 6.5 శాతం మందికే ఐఐటీలో ప్రవేశం ఖాయం అవుతుంది. 
 

జేఈఈ–మెయిన్‌తో 30 వేలకు పైగా సీట్లు

  • జేఈఈ–మెయిన్‌ ర్యాంకు ఆధారంగా 30వేలకు పైగా ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
  • జాతీయ స్థాయిలో 31 నిట్‌లలో 23,506 సీట్లు, 26 ట్రిపుట్‌ ఐటీల్లో 5,643 సీట్లు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 29 ఇన్‌స్టిట్యూట్‌లో 5,620 సీట్లల్లో జేఈఈ మెయిన్‌ ర్యాంకుతో ప్రవేశం కల్పిస్తారు. 
  • జేఈఈ–మెయిన్‌–2021ను నాలుగు సెషన్లలో నిర్వహించారు. అన్ని సెషన్లు కలిపి 9,39,008 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 
  • జేఈఈ–మెయిన్‌ ర్యాంకర్లలో అధిక శాతం మందికి నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర జీఎఫ్‌ఐటీలే ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి.


సీట్ల భర్తీ ఇలా

  • జేఈఈ–మెయిన్‌ ర్యాంకు ఆధారంగా నిట్‌లు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో.. జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ(జోసా).. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొని తమకు ఆసక్తి ఉన్న ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్‌ ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థుల ప్రాథమ్యాలు, జేఈఈ–మెయిన్‌ ర్యాంకు, రిజర్వేషన్లు తదితర అంశాల ఆధారంగా సీటు కేటాయింపు జరుగుతుంది.
  • విద్యార్థులు తమకు కేటాయించిన సీటు, ఇన్‌స్టిట్యూట్‌ పరంగా సంతృప్తి చెందితే ఆన్‌లైన్‌లోనే యాక్సప్టెన్స్‌ లెటర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా..యాక్సప్టెన్స్‌ లెటర్‌ ఇచ్చిన విద్యార్థులు నిర్దిష్ట ఫీజును ఆన్‌లైన్‌లో ఈ–చలాన్‌ రూపంలో చెల్లించాలి. ఈ రిసీప్ట్‌ ఆధారంగా తమకు సీటు లభించిన ఇన్‌స్టిట్యూట్‌కు నిర్దేశిత తేదీల్లోపు రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఐఐటీల్లో సీట్లకు కూడా జోసా ద్వారానే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ విధానంలో ప్రవేశం కల్పిస్తారు. జేఈఈ–మెయిన్‌ ర్యాంకర్లకు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌ఐటీలనే తమ ప్రాథమ్యాలుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణులు మాత్రం ఐఐటీలతోసహా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లను ప్రాథమ్యాలుగా పేర్కొనొచ్చు.


ఐఐటీల తర్వాత నిట్‌లే
ఇంజనీరింగ్‌ విద్య అనగానే.. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీలు)ల తర్వాత టక్కున గుర్తొచ్చేది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలే. అందుకే విద్యార్థులు నిట్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. టిపుల్‌ ఐటీలకు కూడా మెరుగైన ఇన్‌స్టిట్యూట్‌లుగా పేరుంది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు పేరున్న ఇన్‌స్టిట్యూట్‌ల్లోనూ చేరే వీలుంది. 


95 శాతం భర్తీ

  • ఇటీవల కాలంలో నిట్‌ల్లో చేరాలనుకుంటున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాది నిట్‌ల్లోని మొత్తం సీట్లలో దాదాపు 95 శాతం సీట్లు భర్తీ అవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. 
  • ఈ ఏడాది జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. గత ఏడాది మాదిరిగానే ఆరు రౌండ్లలో కౌన్సెలింగ్‌ జరుగనుంది.
  • మొదటి రౌండ్‌లో వచ్చిన సీటు పట్ల ఆసక్తి లేని విద్యార్థులు.. ఫ్లోట్‌ అనే ఆప్షన్‌ ఎంచుకుంటే రెండో రౌండ్‌లో పాల్గొనొచ్చు. ఇలా ఫ్లోట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియలోని చివరి రౌండ్‌ మినహా మిగతా అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 


సీఎస్‌ఏబీ కౌన్సెలింగ్‌
జోసా అన్ని దశలు పూర్తయిన తర్వాత కూడా ఎన్‌ఐటీల్లో సీట్లు మిగిలితే.. వాటి భర్తీ కోసం ప్రత్యేకంగా ఎన్‌ఐటీ ప్లస్‌ సిస్టమ్‌ పేరుతో సీఎస్‌ఏబీ(సెంట్రల్‌ సీట్‌ అలొకేషన్‌ బోర్డ్‌) ఆధ్వర్యంలో.. మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో ఉంటుంది. దీనికోసం విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


హోమ్‌ స్టేట్‌ కోటా
నిట్‌ల్లో సీట్ల భర్తీలో హోమ్‌ స్టేట్‌ కోటా విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం– నిట్‌ ఏర్పాటైన రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లను కేటాయిస్తారు. ఉదాహరణకు.. నిట్‌–వరంగల్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఇందులో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇలా దేశంలోని మొత్తం 31 నిట్‌లలోనూ ఈ విధానంతో సంబంధిత రాష్ట్రాల విద్యార్థులు సీట్లు సొంతం చేసుకునే అవకాశముంది. 


తెలుగు రాష్ట్రాల్లోని నిట్‌లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు నిట్‌లు ఉన్నాయి. అవి.. ఎన్‌ఐటీ–వరంగల్‌ (తెలంగాణ), ఎన్‌ఐటీ–ఆంధ్రప్రదేశ్‌(తాడేపల్లిగూడెం). వీటిలో గత ఏడాది గణాంకాల ప్రకారం–ఎన్‌ఐటీ వరంగల్‌లో మొత్తం 945 సీట్లు, అదే విధంగా నిట్‌–ఆంధ్రప్రదేశ్‌లో 603 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
మన విద్యార్థుల ఆసక్తి
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హోమ్‌ స్టేట్‌ కోటా ప్రకారం–నిట్‌ వరంగల్‌(తెలంగాణ), ఆంధ్రప్రదేశ్‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత తెలుగు విద్యార్థులు ఎక్కువగా నాగ్‌పూర్, కురుక్షేత్ర, జలంధర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి నిట్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో మౌలిక సదుపాయాలు, బోధన మెరుగ్గా ఉండటమే కాకుండా.. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు వంటివి కూడా కారణంగా నిలుస్తున్నాయి.


ఫీజులు.. రాయితీలు

  • నిట్‌ల్లో ట్యూషన్‌ ఫీజు సెమిస్టర్‌కు రూ.62,500 చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. సంవత్సరానికి రూ.1.25 లక్షలు కేవలం ట్యూషన్‌ ఫీజుకే చెల్లించాల్సిన పరిస్థితి. దీనికి అదనంగా..అడ్మిషన్‌ ఫీజు, ఇన్‌స్టిట్యూట్‌ ఫీజు, లేబొరేటరీ ఫీజు, ఇన్సూరెన్స్‌ వంటి ఫీజులు కూడా ఉంటాయి. ప్రస్తుతం విద్యార్థులకు వారి సామాజిక వర్గాలు, కుటుంబ ఆదాయం ఆధారంగా ట్యూషన్‌ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చే విధానం అమలవుతోంది. 
  • కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న విద్యార్థులకు, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు ట్యూషన్‌ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తున్నారు.
  • కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష నుంచి రూ.అయిదు లక్షల లోపు ఉన్న విద్యార్థులకు మొత్తం ట్యూషన్‌ ఫీజులో మూడింట రెండొంతుల ఫీజును మినహాయిస్తున్నారు.
  • ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు మినహాయింపు లభిస్తోంది. 
  • ఈ మినహాయింపులు కోరుకునే అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాల్ని అందజేయాల్సి ఉంటుంది.


జోసాకు సన్నద్ధంగా

  • అధికార వర్గాల సమాచారం ప్రకారం–ఈ సంవత్సరం జోసా–2021 ప్రక్రియ అక్టోబర్‌ 16న ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపుగానే అభ్యర్థులు నిర్దేశిత డాక్యుమెంట్లు  సిద్ధం చేసుకోవాలి. 
  • నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం–జేఈఈ–మెయిన్‌ ర్యాంకర్లు తమ జేఈఈ–మెయిన్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్, అడ్మిట్‌ కార్డ్‌ ఆధారంగా లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత నిర్ణీత తేదీలను అనుసరించి ఆన్‌లైన్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌కు ఉపక్రమించాలి. 


అవసరమైన పత్రాలు

  • మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోగ్రాఫ్స్, ఫొటో ఐడెంటిటీ కార్డ్, జేఈఈ–మెయిన్‌ అడ్మిట్‌ కార్డ్, జేఈఈ–మెయిన్‌ స్కోర్‌ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రం(పదో తరగతి మార్క్‌ షీట్‌), ఇంటర్మీడియెట్‌ మార్క్‌ షీట్, మెడికల్‌ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం అవసరమవుతాయి.
  • వీటితోపాటు సీటు పొందిన అభ్యర్థులు రిపోర్టింగ్‌ సెంటర్‌లో ప్రొవిజనల్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ లెటర్, జోసా వెబ్‌సైట్‌లో నిర్దేశించిన ఫార్మ్స్‌ను పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సీట్‌ యాక్సప్టెన్స్‌ పేమెంట్‌ రశీదు(ఈ–చలాన్‌)ను రిపోర్టింగ్‌ సెంటర్‌లో అందజేయడం తప్పనిసరి.


నిట్‌ అడ్మిషన్‌ ప్రక్రియ – ముఖ్యాంశాలు

  • జాతీయ స్థాయిలో 31 నిట్‌ క్యాంపస్‌లు–23,506 సీట్లు.
  • 26 ట్రిపుల్‌ ఐటీల్లో 5,643 సీట్లు.
  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 29 ఇన్‌స్టిట్యూట్‌లో 5,620 సీట్లు. 
  • జోసా ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ విధానంలో కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ.
  • కుటుంబ వార్షికాదాయం ఆధారంగా ట్యూషన్‌ ఫీజు నుంచి మినహాయింపు.
  • అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానున్న జోసా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ.


చ‌ద‌వండి: For More Details Click Here

Published date : 11 Oct 2021 06:27PM

Photo Stories