JOSSA 2024:జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ తొలిదశ సీట్లు కేటాయింపు పూర్తి
హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఈ ఏడాది భారీ మార్పు కన్పిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం తొలిదశ సీట్లు కేటాయించింది. అయితే ఈసారి ఐఐటీల్లో 900 సీట్లు అదనంగా పెరిగాయి. దీంతో సీట్ల కేటాయింపు కటాఫ్ పెరిగింది. ముంబై ఐఐటీలో బాలికల విభాగంలో గత ఏడాది 305 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 421వ ర్యాంకు కూడా సీటు వచ్చింది. హైదరాబాద్ ఐఐటీలో బాలుర విభాగంలో 585 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 649 ర్యాంకు వరకూ సీటు వచ్చింది.
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. వరంగల్ నిట్‌లో బాలుర విభాగంలో 1664 ర్యాంకుకు గత ఏడాది సీటొస్తే, ఈసారి 2698 ర్యాంకుకు సీటు వచ్చింది. బాలికల విభాగంలో పోయినసారి 3593 ర్యాంకుకు సీటొస్తే, ఈసారి 4625 ర్యాంకుకు కూడా సీటు వచ్చింది. ఇక ఏపీ నిట్‌లో బాలికల విభాగంలో గత ఏడాది 17873 కటాఫ్ ఉంటే, ఈసారి ఇది 23130కి పెరిగింది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఐఐటీలు మినహా అన్ని జాతీయ కాలేజీల్లో ర్యాంకును బట్టి సీటు కేటాయిస్తారు. ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు ఇస్తారు. జోసా మొత్తం ఐడు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.
Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏం చెప్పారు?
ముంబై ఐఐటీలోనే టాపర్లు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ముంబై ఐఐటీకే ప్రాధాన్యమిచ్చారు. టాపర్లంతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపారు. ఓపెన్ కేటగిరీలో ముంబై ఐఐటీలో తొలి ర్యాంకు మొదలుకుని 68వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. బాలికల విభాగంలోనూ 7వ ర్యాంకు సహా 421వ ర్యాంకు వరకూ సీట్లు పొందారు. తర్వాత స్థానంలో ఢిల్లీ ఐఐటీ ఉంది. ఇక్కడ 116లోపు ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. కాన్పూర్ ఐఐటీలోనూ పోటీ ఎక్కువగానే ఉంది. ఓపెన్ కేటగిరీలో 226 ర్యాంకుతో ప్రారంభమై 414 ర్యాంకుతో ముగిసింది. హైదరాబాద్ ఐఐటీలో సీఎస్‌సీ ఓపెన్ కేటగిరీలో 431వ ర్యాంకుతో మొదలై 649వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి.
చివరి కౌన్సెలింగ్ వరకు చూడాలి
గత కొన్నేళ్ళతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కటాఫ్ ఊహించని విధంగా పెరిగింది. సీట్లు పెరగడమే దీనికి కారణం. విద్యార్థులు చివరి కౌన్సెలింగ్ వరకూ వేచి చూస్తే తప్పకుండా మంచి అవకాశాలు రావచ్చు. రెండో దశ కౌన్సెలింగ్ నుంచి ఆప్షన్లు ఇచ్చే ముందు సీట్ల కేటాయింపుపై కొంత కసరత్తు చేయాలి.
– ఎంఎన్ రావు (గణిత శాస్త్ర నిపుణులు)
Tags
- JOSSA 2024
- josaa counselling 2024 News
- Joint Seat Allocation Authority 2024 counselling
- Joint Seat Allocation Authority 2024
- josaa counselling 2024
- Education News
- EngineeringSeats
- Hyderabad
- national level
- Central Government institutions
- CentralGovernment
- cutoff increase
- IITs
- NITs
- triple ITs
- first-phase seats
- SakshiEducationUpdates