Skip to main content

JEE Main 2023: ప్రిపరేషన్‌ వ్యూహాలు.. సబ్జెక్ట్‌ వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-మెయిన్‌ సంక్షిప్తంగా.. జేఈఈ-మెయిన్‌! ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ-మెయిన్‌ మార్కులు, ర్యాంకులే కీలకం. 2023కు సంబంధించి జేఈఈ-మెయిన్‌ను రెండు సెషన్లలో.. తొలి సెషన్‌ జనవరిలో, మలి సెషన్‌లో ఏప్రిల్‌లో నిర్వహిస్తారనే వార్తలు! త్వరలోనే ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) ఈ పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. ఫిబ్రవరిలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. మార్చిలో ఫైనల్‌ పరీక్షలు!! దీంతో జేఈఈ-మెయిన్‌ లక్ష్యంగా చేసుకున్న విద్యార్థుల్లో ఆందోళన! ఈ నేపథ్యంలో.. జేఈఈ-మెయిన్‌ పరీక్ష తీరుతెన్నులు, ప్రిపరేషన్‌ వ్యూహాలు, రాణించేందుకు సబ్జెక్ట్‌ వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం..
JEE Main Preparation Tips
  • 2023 మెయిన్‌ కూడా రెండు సెషన్లలోనే..
  • తొలి సెషన్‌ జనవరిలో, రెండో సెషన్‌ ఏప్రిల్‌లో జరిగే అవకాశం
  • త్వరలోనే పరీక్ష తేదీలు ప్రకటించనున్న ఎన్‌టీఏ
  • కాన్సెప్ట్‌ ఆధారిత అధ్యయనమే కీలకం 

దేశంలోని టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో బీటెక్‌లో చేరాలనుకునే విద్యార్థులకు జేఈఈ-మెయిన్‌ ఎంతో కీలకం. నిట్‌లో అడ్మిషన్‌తోపాటు, ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించాలన్నా.. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపాల్సిందే! దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 13 లక్షల మంది ఈ పరీక్షకు పోటీ పడుతుంటారు. ఇంటర్మీడియెట్‌(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) సబ్జెక్ట్‌లలో పొందిన నైపుణ్యం ఆధారంగా జేఈఈ-మెయిన్‌లో ర్యాంకు సొంతం చేసుకునేందుకు ఆస్కారం లభిస్తుంది. 

Also Read: JEE Main Previous Papers

ఏకకాలంలో సన్నద్ధత.. ఇలా

ఇంటర్మీడియెట్‌ ఫైనల్‌ విద్యార్థులు ఒకే సమయంలో ఇటు ఇంటర్, అటు జేఈఈ-మెయిన్‌ పరీక్షలకు సన్నద్ధత పొందడం సాధ్యమేనా? అని సందేహిస్తుంటారు. వాస్తవానికి డిసెంబర్‌ రెండో వారం నాటికి విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ను పూర్తి చేసుకుని ఉంటారు. జనవరి సెషన్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. డిసెంబర్‌ నుంచి ఇంటర్మీడియెట్, జేఈఈ-మెయిన్‌లో రెండింటిలో ఉన్న ఉమ్మడి అంశాల పునశ్చరణపై దృష్టిపెట్టాలి. తద్వారా జనవరి సెషన్‌లో మంచి ప్రతిభ చూపేందుకు అవకాశం ఉంటుంది.
ఏప్రిల్‌ సెషన్‌పైనే దృష్టిపెట్టిన విద్యార్థులు.. డిసెంబర్‌లో ఇంటర్‌ సిలబస్‌ పూర్తి చేసుకొని.. ఆ తర్వాత సమయంలో జేఈఈ-మెయిన్‌ పరీక్ష సిలబస్‌ను పరిశీలించి దానికి అనుగుణంగా ఫిబ్రవరి చివరి వారం వరకు ప్రిపరేషన్‌ సాగించాలి. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత.. జేఈఈ-మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ తేదీకి మధ్య ఉన్న వ్యవధిలో.. పూర్తిగా రివిజన్, మాక్‌ టెస్ట్‌ల ప్రాక్టీస్‌కు సమయం కేటాయించాలి. 

అప్లికేషన్‌ ఆధారిత ప్రిపరేషన్‌

ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లను అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ సాగించాలి. ఫలితంగా ఇంటర్‌ సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయి అవగాహనతోపాటు జేఈఈ-మెయిన్‌లోనూ ర్యాంకు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆయా సబ్జెక్ట్‌ల బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాటిని పూర్తిగా అవగాహన చేసుకుంటూ.. వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్‌ను షార్ట్‌ నోట్స్‌గా రాసుకోవాలి. ఇది ఇంటర్, జేఈఈ-మెయిన్‌ రెండు పరీక్షల రివిజన్‌కు ఉపకరిస్తుంది. 
జనవరి సెషన్‌కు హాజరై..ఆశించిన స్థాయిలో మార్కులు సాధించని విద్యార్థులు.. తమ ప్రదర్శనను పరిశీలించుకోవడం ద్వారా.. తాము ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి. 

Also Read: JEE Main Model Papers

ప్రాక్టీస్‌ ప్రధానం

ఇంటర్, జేఈఈ-మెయిన్‌ రెండు పరీక్షలకూ ప్రాక్టీస్‌ కీలకమని గుర్తించాలి. ప్రతిరోజు తాము చదివిన సబ్జెక్ట్‌కు సంబంధించి.. అందులోంచి ప్రశ్నలు అడిగే ఆస్కారమున్న అంశాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. వాస్తవానికి జేఈఈ-మెయిన్‌ సిలబస్‌లో అధిక శాతం అంశాలు ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ నుంచే ఉన్నాయి. కాబట్టి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆయా చాప్టర్లకు సంబంధించి మొదటి సంవత్సరం అంశాలను కూడా అవలోకనం చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. మొదటి సంవత్సరం టాపిక్స్‌ను, రెండో సంవత్సరం అంశాలతో అనుసంధానం చేసుకుంటూ.. ప్రిపరేషన్‌ సాగిస్తే సంబంధిత అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. ఫలితంగా ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. 

న్యూమరికల్‌ ప్రశ్నలకు

జేఈఈ-మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌.. ఈ మూడు సబ్జెక్ట్‌ల నుంచీ అయిదు ప్రశ్నలు చొప్పున న్యూమరికల్‌ ఆధారిత ప్రశ్నలు అడగనున్నారు. వీటికోసం విద్యార్థులు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తోపాటు ఆయా సబ్జెక్ట్‌లలో న్యూమరిక్స్‌ ఆధారంగా సమాధానం సాధించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మాక్‌ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్‌ టెస్ట్‌లు

ఇంటర్, జేఈఈ-మెయిన్‌ ఉమ్మడి ప్రిపరేషన్‌లో.. విద్యార్థులు మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం; ఇంటర్‌ ప్రీ-ఫైనల్‌ టెస్ట్‌లు రాసి, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం వంటివి చేయాలి. ముఖ్యంగా ఏప్రిల్‌ సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ వ్యూహాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. జనవరి సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు దాదాపు నెలరోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో వీరు అధిక సమయాన్ని పునశ్చరణతోపాటు వీక్లీ టెస్ట్‌లకు, మాక్‌ టెస్ట్‌లకు కేటాయించాలి. 

Also Read: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

టైమ్‌ మేనేజ్‌మెంట్‌

జేఈఈ మెయిన్‌ విద్యార్థులు టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌కు కనీసం రెండు గంటల సమయం కేటాయించేలా చూసుకోవాలి. తమకు బాగా సులభమైన సబ్జెక్ట్‌కు కొంత తక్కువ సమయం కేటాయించి.. క్లిష్టంగా భావించే వాటికి కొంత ఎక్కువ సమయం కేటాయించడం మేలు. ప్రతిరోజు అంతకుముందు రోజు చదివిన అంశాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ఈ విధంగా నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే ఏకకాలంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది.

జేఈఈ-మెయిన్‌ పేపర్లు.. పరీక్ష స్వరూపం

  • జేఈఈ-మెయిన్‌లో బీఈ/బీటెక్‌ అభ్యర్థులకు పేపర్‌-1, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులకు పేపర్‌-2ఎ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల అభ్యర్థులకు పేపర్‌-2బి నిర్వహిస్తారు. 
  • పేపర్‌-1(బీటెక్‌/బీఈ) ఇలా: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు-300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. 
  • సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.
  • ఛాయిస్‌ విధానం నేపథ్యంలో సెక్షన్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. సెక్షన్‌-ఎలో 0.25 శాతం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.

Also Read: జేఈఈ మెయిన్ పేపర్-2 విజయానికి వ్యూహం...

బీఆర్క్‌ పరీక్ష స్వరూపం

  • నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు హాజరవ్వాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, అప్టిట్యూడ్‌ టెస్ట్, డ్రాయింట్‌ టెస్ట్‌లు 82 ప్రశ్నలు-400 మార్కులకు ఉంటాయి. 
  • మ్యాథమెటిక్స్‌లో 20 ఎంసీక్యూలు, 10 న్యూమరికల్‌ వాల్యూ ప్రశ్నలు అడుగుతారు. ఎంసీక్యూలకు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు; న్యూమరికల్‌ ప్రశ్నలలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి.
  • డ్రాయింగ్‌ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్‌ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు. అప్టిట్యూడ్‌ టెస్ట్‌ 50 ప్రశ్నలు-200 మార్కులకు ఉంటుంది.

మెయిన్‌.. సబ్జెక్ట్‌ల వారీగా కీలకాంశాలు
మ్యాథమెటిక్స్‌

ఈ సబ్జెక్ట్‌లో రెండేళ్ల సిలబస్‌కు సంబంధించి ప్రతి చాప్టర్‌ను చదవడం మేలు. ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు.. 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌. వీటితోపాటు క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, బైనామియల్‌ థీరమ్, లోకస్‌ అంశాలను కనీసం ఒక్కసారైనా పూర్తిచేయాలి. 
-ఆర్‌. కేదారేశ్వర్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు

ఫిజిక్స్‌

న్యూమరికల్‌ అప్లికేషన్‌ అప్రోచ్‌ ప్రధానంగా ఉండే ఫిజిక్స్‌లో ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌పై అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రిపరేషన్‌ సమయంలోనే ఆయా అంశాల ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ ప్రాక్టీస్‌ చేయాలి.
- ఎం.రవీంద్ర, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు

కెమిస్ట్రీ

మిగతా రెండు సబ్జెక్ట్‌లతో పోలిస్తే.. విద్యార్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్‌ కెమిస్ట్రీ. కెమికల్‌ బాండింగ్, పిరియాడిక్‌ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై విద్యార్థి అవగాహనను తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. 
-డి.కె.ఝా, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ నిపుణులు

Published date : 24 Nov 2022 05:39PM

Photo Stories