Skip to main content

JEE Advanced Exam 2023 Preparation & Strategy: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయానికి మెలకువలు..

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో.. బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! జేఈఈ-మెయిన్‌ స్కోర్‌ ఆధారంగా..అడ్వాన్స్‌డ్‌కు అభ్యర్థులను ఎంపికచేస్తారు! ఇటీవల జేఈఈ-మెయిన్‌-2023 ఫలితాల ద్వారా 2,50,255 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందారు. వీరంతా ఐఐటీల్లో అందుబాటులో ఉన్న దాదాపు 16వేల సీట్లకు పోటీపడతారు. ఇందుకోసం జూన్‌ 4న దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయానికి మెలకువలు..
JEE Advanced Exam 2023 Preparation & Strategy
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2,50,255 మంది ఎంపిక
  • జూన్‌ 4న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణ
  • రివిజన్, ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌ అంటున్న నిపుణులు

దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో అందుబాటులో ఉన్న సీట్లు 16,598 మాత్రమే. అంటే..అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థుల్లో ఐఐటీ అవకాశం లభించేది కేవలం ఆరున్నర శాతం మందికే!! అయితే జేఈఈ మెయిన్‌కు ఎంపికైన విద్యార్థులు పూర్తి అంకితభావంతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

చ‌ద‌వండి: JEE (Adv.) Previous Papers

పునశ్చరణకు ప్రాధాన్యం

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు ముఖ్యమైన అంశాల పునశ్చరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే తాము రాసుకున్న నోట్స్‌ లేదా రెడీ రెకనర్స్‌ను అనుసరిస్తూ..అందులోని అంశాలను పదే పదే చదవాలి. 
అలా రివిజన్‌ చేస్తున్నప్పుడే సంబంధిత ప్రాథమిక భావనలు, సూత్రాలతోపాటు అన్వయ దృక్పథంపై దృష్టిపెట్టాలి. వెయిటేజీ ఆధారంగా ఆయా అంశాల రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి.

అవగాహన ముఖ్యం

అడ్వాన్స్‌డ్‌కు ప్రిపరేషన్‌లో భాగంగా విద్యార్థులు ప్రధానంగా ప్రశ్నల సరళి,మార్కింగ్‌ విధానాన్ని కూ­డా పరిగణనలోకి తీసుకోవాలి. సింగిల్‌ కరెక్ట్‌ కొ­శ్చ­న్స్‌;మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌;పేరాగ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. వీటిలో రాణించాలంటే.. కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ కొనసాగించాలి. ప్రస్తుత సమయంలో ప్రశ్నల సాధనకు సమయం కేటాయించాలి.

నమూనా పరీక్షలు

విద్యార్థులు కనీసం వారానికి ఒక గ్రాండ్‌ టెస్ట్‌ రాసే విధంగా సమయం కేటాయించుకోవాలి. ఆ పరీక్ష ఫలితం విశ్లేషించుకుని..తాము చేస్తున్న పొరపాట్లపై అవగాహన పెంచుకోవాలి. వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గత నాలుగేళ్లకు సంబంధించిన ప్రశ్న పత్రాల్లో కనీసం రెండు ప్రశ్న పత్రాలను సాధన చేయాలి.

చ‌ద‌వండి: Guidance

పరీక్ష ప్యాట్రన్‌

అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ప్యాట్రన్‌పై పూర్తి అవగాహన ఉండాలి. గత ఏడాది మొత్తం రెండు పేపర్లుగా 360 మార్కులకు పరీక్ష జరిగింది. పేపర్‌-1లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 18 ప్రశ్నలు చొప్పున మొత్తం 54 ప్రశ్న­లు అడిగారు. పేపర్‌-2లో కూడా ఇదే విధంగా 54 ప్రశ్నలు అడిగారు. ఇంటీజర్స్, న్యూమరికల్‌ టైప్‌ ప్రశ్నలకు 2, 4 మార్కులు చొప్పున కేటాయించారు.

సిలబస్‌ మార్పులకు అనుగుణంగా

ఇప్పటి వరకు జేఈఈ-మెయిన్స్‌ దృష్టితో ప్రిపరేషన్‌ సాగించిన విద్యార్థులు..ఇప్పుడు పూర్తిగా అడ్వాన్స్‌డ్‌కే సమయం కేటాయించాలి. ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌లో మార్పులు చేసిన విషయాన్ని గు­ర్తించాలి. మారిన సిలబస్‌ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రిపరేషన్, రివిజన్‌ కొనసాగించాలి. 

ఒత్తిడికి దూరంగా

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యం. అనవసరపు ఒత్తిడికి గురి కాకుండా.. ప్రశాంతంగా పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్‌ సాగించాలి. ఆయా సిలబస్‌ టాపిక్స్‌ను విశ్లేషించుకుంటూ.. నిర్దిష్ట సమయ పాలన పాటిస్తూ ప్రాక్టీస్‌ చేయాలి.

చ‌ద‌వండి: JEE (Adv.) Syllabus

సిలబస్‌ ముఖ్యాంశాలు
మ్యాథమెటిక్స్‌

కోఆర్డినేట్‌ జామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, మాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌; 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌; థియరీ ఆఫ్‌ ఈక్వేష­న్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌; బైనామియల్‌ థీరమ్‌; లోకస్‌ అంశాలపై పూర్తి పట్టు సాధించాలి

ఫిజిక్స్‌

ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌పై లోతైన అవగాహన పెంచుకుంటే.. మెరుగైన స్కోర్‌కు అవకాశం ఉంటుంది.

కెమిస్ట్రీ

కెమికల్‌ బాండింగ్, ఆల్కైల్‌ హలైడ్‌; ఆల్కహారల్‌ అండ్‌ ఈథర్, కార్బొనైల్‌ కాంపౌడ్స్, అటామిక్‌ స్ట్రక్చర్‌ అండ్‌ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్‌ అండ్‌ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. 

పరీక్ష హాల్లో ఇలా

పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం పూర్తిగా చదివేందుకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు కేటాయించాలి.
దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి.
వీలైతే పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలు సమాధానాల రివ్యూకు కేటాయించాలి. 
సమాధానాలు ఇచ్చే సమయంలో ఏమైనా సందిగ్ధత ఉంటే మార్క్‌ ఫర్‌ రివ్యూ బటన్‌పై క్లిక్‌ చేసి.. చివరలో నిశ్చితాభిప్రాయానికి వచ్చి సదరు సమాధానాన్ని సేవ్‌ చేయాలి. 
పరీక్ష హాల్లో.. కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపించే కౌంట్‌డౌన్‌ టైమర్‌ను చూసుకుంటూ ఉండాలి. 
ఇలా ప్రతి విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగితే.. మెరుగైన ఫలితం ఆశించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

అడ్వాన్స్‌డ్‌.. ముఖ్యాంశాలు

  • ప్రస్తుతం వీలైనంత ఎక్కువ సమయాన్ని రివిజన్‌కే కేటాయించాలి. 
  • ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌ కొశ్చన్స్‌ సాధన చేయాలి. 
  • ఇంటీజర్స్, ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  కనీసం నాలుగు మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. 
  • అన్ని సబ్జెక్ట్‌లలో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. 
  • పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి.

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌-2023 ముఖ్య తేదీలు

  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే 29-జూన్‌ 4, 2023
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ: జూన్‌ 4(ఉదయం 9 నుంచి 12 వరకు; మధ్యాహ్నం 2:30 నుంచి 5 :30 వరకు).
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://jeeadv.ac.in/

 

Published date : 10 May 2023 07:25PM

Photo Stories