Skip to main content

JEE Advanced 2022: జేఈఈ–అడ్వాన్స్‌డ్‌.. జయం ఇలా!

JEE Advanced 2022 Special article on the latest changes and ways to success
JEE Advanced 2022 Special article on the latest changes and ways to success

జేఈఈ–అడ్వాన్స్‌డ్‌.. ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీలపై ఉత్కంఠ కొనసాగింది! పరీక్ష ఎప్పుడు ఉంటుందో.. మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటాయా.. అనే ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమైంది. వీటన్నింటికీ ఇప్పుడు ఫుల్‌స్టాప్‌ పెట్టేయొచ్చు. ఎందుకంటే..జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ తేదీలపై ఉత్కంఠకు తెరపడింది! నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌.. ఐఐటీ–ముంబై.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2022 క్యాలెండర్‌ను విడుదల చేసింది! జూలై 3న పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా నెలకొన్న కరోనా సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. అటెంప్ట్‌ల విషయంలోనూ కొన్ని వెసులుబాట్లు కల్పిస్త్నునట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌2022లో తాజా మార్పులు, విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం... 

  • జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ తేదీలు ఖరారు; జూలై 3న పరీక్ష
  • జూన్‌ 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • 2021, 2020 అభ్యర్థులకూ హాజరయ్యే అవకాశం
  • మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల అనుసంధానంతో విజయం

జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ తేదీ విషయంలో స్పష్టతనిస్తూ నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌.. ఐఐటీ–ముంబై అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాబట్టి విద్యార్థులు తమ ప్రిపరేషన్‌కు మెరుగులుదిద్దుకోవాలని..ప్రణాళికబద్ధంగా సన్నద్ధత కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.


చ‌ద‌వండి: JEE Advanced 2022: ఇంటర్‌తోపాటు అటు అడ్వాన్స్‌డ్‌కూ... నిపుణుల సలహాలు, సూచనలు....

మార్పులు, చేర్పులు

జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ 2022 విషయంలో మార్పులు, చేర్పుల విషయానికొస్తే.. పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటి మాదిరిగానే యథాతథంగా రెండు పేపర్లుగా పరీక్ష జరగనుంది. అదే విధంగా ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహించనున్నారు. 

అటెంప్ట్‌ల నిబంధనల్లో సడలింపులు

  • జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ 2022లో ప్రధాన మార్పు.. పరీక్షకు అటెంప్ట్‌ల విషయంలో సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించడం. 2021, 2020లలో అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్‌ చేసుకుని.. హాజరు కాని విద్యార్థులు నేరుగా పరీక్ష రాసేలా ఈసారి వెసులుబాట్లు కల్పించారు. 
  • 2021లో రెండు పేపర్లకూ హాజరుకాని అభ్యర్థులు జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2022కు నేరుగా హాజరు కావచ్చు. వీరు ఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • 2021లో ఒక పేపర్‌కు హాజరై.. మరో పేపర్‌కు హాజరు కాని విద్యార్థులు జేఈఈ–మెయిన్‌–2022లో విజయం సాధించి..ఆ తర్వాత నిబంధనల ప్రకారం అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావచ్చు.
  • 2021లో ఇంటర్మీడియెట్, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. అడ్వాన్స్‌డ్‌కు హాజరుకాని విద్యార్థులు ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌కు హాజరవ్వచ్చు.
  • 2020 అక్టోబర్‌ 15లోపు బోర్డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి..2020,2021లో అడ్వాన్స్‌డ్‌కు హాజరు కాని విద్యార్థులు కూడా ఈసారి పరీక్ష రాసేందుకు అర్హులే. 
  • అదే విధంగా 2020 అక్టోబర్‌ 15లోపు బోర్డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. 2021లో జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు తొలిసారి హాజరైన అభ్యర్థులు కూడా అడ్వాన్స్‌డ్‌–2022కు అర్హులే.
  • అక్టోబర్‌ 15, 2020లోపు బోర్డ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. 2020లో అడ్వాన్స్‌డ్‌కు హాజరై, 2021లో హాజరవ్వని విద్యార్థులు కూడా అడ్వాన్స్‌డ్‌–2022కు హాజరవ్వచ్చు.
  • 2021లో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకొని జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్‌ చేసుకుని కూడా పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు.. 
  • ఈ ఏడాది జేఈఈ–మెయిన్‌(జేఈఈ–మెయిన్‌–2022)కు హాజరు కాకుండానే.. గత ఉత్తీర్ణత ఆధారంగా నేరుగా జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2022కు హాజరు కావచ్చు. 
  • 2020 బోర్డ్‌ పరీక్షల ఉత్తీర్ణులు మాత్రం ఈ ఏడాది జేఈఈ–మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది.
  • బోర్డ్‌ పరీక్షల విషయంలో 2020లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. 2020 లేదా 2021 ఈ రెండు సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరై ఉండాలి. ఒకవేళ రెండు సంవత్సరాల్లోనూ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన విద్యార్థులకు జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2022కు నేరుగా హాజరయ్యే అవకాశం ఉండదు. జేఈఈ–మెయిన్‌ 2022లో ఉతీర్ణత సాధించాల్సి ఉంటుంది. 

జేఈఈ–మెయిన్‌ నిబంధన యథాతథం

  • జేఈఈ–మెయిన్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అభ్యర్థుల ఎంపికకు అనుసరిస్తున్న నిబంధనను ఈ ఏడాది కూడా యథాతథంగా కొనసాగించనున్నారు. 
  • జేఈఈ–మెయిన్‌ నుంచి టాప్‌–2.5 లక్షల మందిని ఎంపిక చేసే విధానాన్నే కొనసాగిస్తారు. అదే విధంగా సీట్ల కేటాయింపు, తుది ఎంపికలో టాప్‌–20 పర్సంటైల్‌ నిబంధన కూడా యధావిధిగా కొనసాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
  • ఇంటర్‌లో 75శాతం మార్కులు సాధించి ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు.

సమన్వయం చేసుకుంటూ

  • ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రస్తుత సమయంలో బోర్డ్‌ వార్షిక పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ పరీక్ష సిలబస్‌ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ.. ప్రిపరేషన్‌ సాగించాలి.
  • బోర్డ్‌ పరీక్షలకు కనీసం 30 రోజుల ముందు నుంచి పూర్తిగా వాటికే సమయం కేటాయించాలి. 
  • బోర్డ్‌ పరీక్షలు ముగిశాక దాదాపు 40 రోజుల నుంచి 50రోజుల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో అడ్వాన్స్‌డ్‌కు ప్రిపరేషన్‌కు పూర్తిగా సమయం కేటాయించుకోవాలి. 

సిలబస్‌ బేరీజు వేసుకుంటూ

ప్రస్తుత సమయంలో విద్యార్థులు బోర్డ్, అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌లను సరిచూసుకుంటూ ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి. అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో సిలబస్‌ను అందుబాటులో ఉంచారు. దాన్ని పరిశీలించి.. బోర్డ్‌ సిలబస్‌లో ఉన్న అంశాలతో సమన్వయం చేసుకుంటూ చదవాలి. 


చ‌ద‌వండి: JEE Advanced: కొత్త సిలబస్‌

జేఈఈ–మెయిన్స్‌తో కలిసి సాగేలా

  • అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులు జేఈఈ–మెయిన్‌తో కలిసి ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగించేలాని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ–మెయిన్‌ తేదీలు కూడా ఖరారరైన నేపథ్యంలో ఈ వ్యూహం ఎంతో ప్రధానమని పేర్కొంటున్నారు. 
  • జేఈఈ–మెయిన్‌ తొలి సెషన్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21వరకు; రెండో సెషన్‌ మే 24 నుంచి 29 వరకు జరగనున్నాయి. దీంతో బోర్డ్‌ పరీక్షల విద్యార్థులంతా రెండో సెషన్‌కే హాజరవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
  • మే 24న మొదలయ్యే జేఈఈ–మెయిన్‌ రెండో సెషన్‌కు ప్రిపరేషన్‌ సాగించే సమయంలోనే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు కూడా ఉమ్మడిగా వ్యూహం అనుసరించాలి. 
  • రెండో సెషన్‌ ముగిశాక అంటే మే 29వ తేదీ తర్వాత జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు నెల రోజుల సమయం అందుబాటులో ఉంటుంది.
  • ఈ సమయంలో ఉమ్మడి ప్రిపరేషన్‌లో చదవడం వీలుకాని అంశాలు, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు మాత్రమే పేర్కొన్న అంశాలపై పట్టు సాధించాలి.

సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్‌ 

మ్యాథమెటిక్స్‌

కోఆర్డినేట్‌ జామెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, మాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌పై దృష్టిపెట్టాలి. అంతేకాకుండా 3–డి జామెట్రీ; కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌; క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌; థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌; బైనామియల్‌ థీరమ్‌; లోకస్‌ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి.

ఫిజిక్స్‌

ఎలక్ట్రో డైనమిక్స్‌; మెకానిక్స్‌; హీట్‌ అండ్‌ థర్మో డైనమిక్స్‌పై ఫోకస్‌ చేయాలి. ఎలక్ట్రో డైనమిక్స్,హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే.. మంచి స్కోర్‌ సొంతం చేసుకునే వీలుంటుంది. 

కెమిస్ట్రీ

కెమికల్‌ బాండింగ్, ఆల్కైల్‌ హలైడ్‌;ఆల్కహాల్‌ అండ్‌ ఈథర్, కార్బొనైల్‌ కాంపౌడ్స్, అటామిక్‌ స్ట్రక్చర్‌ అండ్‌ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, థర్మొడైనమిక్స్‌ అండ్‌ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్,పి–బ్లాక్‌ ఎలిమెంట్స్,అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.

అంచెల వారీగా సమస్య సాధన

అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలోనే ఒక ప్రాబ్లమ్‌ లేదా ప్రశ్నకు అంచెల వారీ సాధనపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది పరీక్షలో మూడు సబ్జెక్ట్‌ల నుంచి మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతోపాటు, ఇంటిగ్రల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. కాబట్టి కేవలం బిట్స్‌ సాధనకు పరిమితం కాకుండా.. ఒక ప్రాబ్లమ్‌ను స్టెప్‌ వైజ్‌గా పరిష్కరించే విధంగా కృషి చేయాలంటున్నారు. ఇలా ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్‌ సాగిస్తే.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.


జేఈఈ–అడ్వాన్స్‌డ్‌–2022 ముఖ్య సమాచారం

  • అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ: జూలై 3, 2022
  • పరీక్ష సమయం: పేపర్‌–1 ఉదయం 9:00–12:00; పేపర్‌–2 మధ్యాహ్నం 2:30–5:30 వరకు
  • దరఖాస్తు తేదీలు: జూన్‌ 8నుంచి జూన్‌ 15 వరకు
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: జూన్‌ 27–జూలై3,2022
  • ఫలితాల వెల్లడి: జూలై 18, 2022
  • జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభం: జూలై 19,2022
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://jeeadv.ac.in

ఒత్తిడికి గురి కాకుండా

జేఈఈ–మెయిన్‌ తొలి సెషన్‌ సమయంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జరుగుతుంటాయి. దీంతో జేఈఈ–మెయిన్‌ రెండో సెషన్‌కే ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు జేఈఈ–మెయిన్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌కు ప్రిపరేషన్‌ సాగించేలా ఉమ్మడి అంశాలపై దృష్టిపెట్టాలి. జేఈఈ–మెయిన్‌ ముగిశాక అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. తులనాత్మక అధ్యయనం చేయాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రాథమిక భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రాక్టీస్‌ సమయంలోనే అప్లికేషన్‌ అప్రోచ్‌తో సాధన చేయాలి. 
–ఆర్‌.కేదారేశ్వర్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు


చ‌ద‌వండి: Engineering‌ Entrance‌‌: బెస్ట్‌ ఇంజనీరింగ్‌కు.. బిట్‌శాట్‌

Published date : 29 Mar 2022 03:50PM

Photo Stories